అంకెల గారడీలో అందరూ అందరే!
ప్రణాళికా సంఘం పేదరిక రేఖను తక్కువగా నిర్ణయించిందంటూ యూపీఏను తప్పు పట్టిన బీజేపీ గుజరాత్‌లో దాన్ని అంతకంటే తక్కువగా నిర్ణయించడంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. పేదల ఓట్ల కోసం రెండు ప్రధాన జాతీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి.
‘పేదరికం అత్యంత క్రూర హింసా రూపం’. దుర్భర దారి ద్య్రం చాలదన్నట్టు పేదరికాన్ని పుట్‌బాల్ బంతిలా ఎదుటి పక్షం గోల్ పోస్టులోకి తన్నాలని కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న అంకెల క్రీడను చూడగలిగితే... పేదరికాన్ని మించిన క్రూర హింస ఉంటుందని గాంధీ సైతం అంగీకరించక తప్పదు. అధికారానికి కావలసింది అంకెలే... అంకెలుగా లెక్కకొచ్చే ఓటర్లే. నిర్ణయాత్మకమైన అంకె పేదలదేనని అందరికంటే ఎక్కువ కాంగ్రెస్, బీజేపీలకే తెలుసు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలో గుజరాత్‌లో పేదరికం తగ్గిపోయిందని చూపడానికి పేదరిక రేఖను తక్కువగా చూపారంటూ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కత్తులు దూశారు. గుజరాత్ ఆహార, పౌర సరఫరాల శాఖ పట్టణ ప్రాంతాల్లో రోజుకు తలసరి వ్యయం రూ.16.70 కంటే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10.80 కంటే తక్కువగా ఉన్నవారు పేదలని నిర్వచించింది. 2012లో కేంద్ర ప్రణాళికా సంఘం పేదరిక రేఖను రూ.32, రూ.27గా చూపినప్పుడు నానా రభస చేసిన బీజేపీ అంతకంటే తక్కువగా పేదరిక రేఖను ఎలా నిర్ణయించిందని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఆ నిర్వచనంతోనే యూపీఏ పేదరికం 22 శాతానికి (2011-12) తగ్గిపోయిందని చెప్పుకున్నారు. వృద్ధి వాపుతో పాటే యూపీఏ ప్రతిష్ట కూడా దిగజారుతుండగా నాడు కాంగ్రెస్ ఇదే గారడీని ప్రదర్శించింది.
మోడీ అంటే అభివృద్ధని, గుజరాత్ ఆదర్శ రాష్ట్రమని అదే పనిగా సాగుతున్న ప్రచారానికి ప్రభావితమవుతున్న మధ్య తరగతి విద్యావంతులకు పేదల సంఖ్య కూడా పడుతుంది. మోడీ మార్కు వట్టణ వృద్ధితో వేగంగా వృద్ధి చెందిన మూడువేల గుజ రాత్ మురికివాడలు దేశంలోనే అధ్వానమైనవిగా పేరు మోశాయి. ఇది ఎవరికైనా కనిపించే వాస్తవం. కాబట్టే మోడీ మార్కు వృద్ధిని సర్వరోగ నివారిణిగా చూపాలంటే అంకెల ఇంద్రజాలం ప్రదర్శించడం అవసరం. మాకెన్‌లు భూతద్దాలతో వేచిచూస్తున్న సమయంలో మోడీ వీర భక్తులెవరో ఈ అంకెల గారడీకి సాహసించి ఉండాలి. బీజేపీ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. మోడీకి వచ్చే నష్టం లేదు. పేదలకు ఒరిగేది అంతకంటే ఏమీ లేదు. అసలు ఈ చర్చే అర్థరహితమైనది. గుజరాత్ పౌర సరఫరాల శాఖ తన సర్క్యులర్ అమలు పరచడానికి ఉద్దేశించినది కాదని సెలవిచ్చింది. నిన్న మన్మోహన్ సైతం ప్రణాళికా సంఘం గీసిన గీతకు ఆహార భద్రతకు, ఉపాధి హామీకి లంకె లేదని చెప్పారు. మరి ఎందుకు గీస్తున్నట్లు?
నేడు సాగుతున్న పేదరికంపై చర్చ గత ఏడాది ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు అమర్త్యసేన్, జగదీశ్ భగవతిల మధ్య సాగిం ది. అప్పట్లో అది కాంగ్రెస్, బీజేపీల ఆర్థిక విధానపరమైన మౌలిక చర్చగా ప్రచారంలోకి వచ్చింది. పేదరిక నిర్మూలనకు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చురుగ్గా యత్నించడం ద్వారానే సుస్థిర వృద్ధి సాధ్యమని సేన్ వాదన. అందుకే ఆయన యూపీఏ ప్రభుత్వ గ్రామీణ ఉపాధి, ఆహార భద్రత పథకాలను సమర్థించారు. కాగా ప్రభుత్వ సంక్షేమ వ్యయాలు, సబ్సిడీలలో కోతలు విధించి, ప్రభుత్వం పాత్రను తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం ద్వారానే వృద్ధి సాధ్యమని భగవతి తర్కం. సమాజం పైపొరలకు అందే వృద్ధి ఫలాలు క్రమంగా వాటికవే అడుగు, అట్టడుగు పొరలకు చేరి పేదరికం, నిరుద్యోగం వాటికవే మటుమామవుతాయని ఆయన వాదన. ఆ వాదనలను సమర్థించడానికి బీజేపీ జంకింది. భగవతి చెప్పినదాన్ని ఆయన చెప్పకముందే మోడీ అమలులోకి తెచ్చారు. అందుకే ఆయన ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి పథకాల పట్ల బహిరంగంగానే వ్యతిరేకతను ప్రకటించారు. ప్రజాస్వామ్యం అంటూ ఒకటి ఉన్నాక పేదల ఓట్ల కోసం పాట్లు తప్పవు. ఇప్పుడు గీస్తున్న గీతలు ఎన్నికల తర్వాత అమల్లోకి రానున్న పేదరిక రేఖలని అంతరార్థం.
మోడీ ప్రధాని పీఠమెక్కితే రూ.16 పేదరిక రేఖతో పేదరికం ఏ పదిహేను శాతానికో పడిపోతుందని అనుకోవాలి. ఈ పేదరికం మ్యాచ్ ఫిక్సింగ్‌ను పక్కన పెట్టి కనీస వేతనాల స్థాయిని బట్టి ప్రపంచంలో మనం ఎక్కడున్నామో చూస్తే పేదరికం నిజస్వరూపం అవగతమవుతుంది. ఆస్ట్రేలియాలో అత్యధికంగా గంటకు 16.88 డాలరు ్లగా ఉన్న కనీస వేతనాలు అమెరికాలో 7.25 డాలర్లు. ఇది వివిధ దేశాల కొనుగోలుశక్తిని సరిపోల్చి కొలిచిన వేతనాల కొలబద్ధ. కారుచౌక శ్రమ దోపిడీకి మారు పేరుగా పిలిచే చైనాలో కనీస వేతనాలు గంటకు 0.80 డాలర్లు. కాగా, మన దేశం స్థాయి 0.28 డాలర్లు. అఫ్ఘానిస్థాన్ మనకంటే నయం 0.57 డాలర్లు. ఇంతకూ కనీస వేతనాలు అంటే బతకడానికి సరిపడే జీవన వేతనాలు కావు. మన దేశంలో బతకడానికి కావాల్సిన జీవన వేతనంలో మన కనీస వేతనం 26 శాతం. ఆ కనీస వేతనం కంటే తక్కువ కూలికి పని చేసే దరిద్రనారాయణులకు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు గెలి చినా ‘స్వర్గం’ చూపించడం ఖాయం.
- పి. గౌతమ్