P. gowtham
-
కలహం ముద్దు... ఐక్యతే ముప్పు
రెండు పాలస్తీనా సంస్థలైన ‘హమస్,’ ‘ఫతా’ల మధ్య ఐక్యతా ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్ శాంతి చర్చల నుంచి వైదొలగింది. అప్రతిష్ట పాలైన ఫతా నేత అబ్బాసీకి ఇజ్రాయెల్‌కు మధ్య సయోధ్యను సాధించడమే పాలస్తీనా ఐక్యతకు విరుగుడని అమెరికా భావిస్తోంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చడమే లోక రీతి. ఆ రీతిని, మార్జాల నీతిని తప్పితే పశ్చిమ ఆసియా ‘శాంతి’ భగ్నమౌతుంది. గత నెల 23న జరిగిన ఓ హఠాత్పరిణామం... ఇజ్రాయెల్, అమెరికాలే కాదు, పశ్చిమ ఆసియా వ్యవహారాల నిపుణులంతా నోళ్లు తెరిచేలా చేసింది. ఎప్పుడూ కీచులాటలతో తన్నుకు చావాల్సిన రెండు పాలస్తీనా సంస్థలు ‘హమస్’, ‘ఫతా’ గత నెల 23న గాజాలో ఐక్యతా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాలస్తీనా అథారిటీగా (పీఏ) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఫతా అధికారంలో ఉన్న వెస్ట్‌బ్యాంక్, హమస్ అధికారంలో ఉన్న గాజాలలో కొత్తగా ఎన్నికలను నిర్వహించడానికి అంగీకరించాయి. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే ఈ చర్చలు జరగడం విశేషం. ఈ పరిణా మం పాలస్తీనీయుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలలో ఐక్యత ప్రదర్శనలు, సంబరాలు సాగాయి. కాగా, అర్ధ శతాబ్దికి పైగా రగులుతున్న పాలస్తీనా సమస్యను తేల్చి పారే యడానికి కంకణం కట్టుకున్న బరాక్ ఒబామా ప్రభుత్వం మాత్రం... ‘దిగ్భ్రాంతికి గురైంది,’ ‘నిరుత్సాహపడింది,’ ‘శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతుందని ఆందోళన చెందింది.’ పీఏ అధ్యక్షునిగా, పాలస్తీనీ యులందరి ఏకైక ప్రతినిధిగా గుర్తింపును పొందుతున్న మొ హ్మద్ అబ్బాసీ చేసిన ‘ద్రోహాన్ని’ ఇజ్రాయెల్ ఖండించింది. ‘హమస్ ఉగ్రవాదాన్ని ఎంచుకున్నవారికి శాంతి అక్కర్లేద’ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ శాంతి చర్చలకు స్వస్తి పలికారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల పన్నుల్లోం చి ఇజ్రాయెల్ వేసే బిచ్చంపై బతకాల్సిన పీఏ, దాని అధినేత అబ్బాసీల ధిక్కారాన్ని నెతన్యాహూ సహించలేకపోవడం సహజమే. ఆయన ఆగ్రహానికి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ భీతావహులై పరుగులు తీయడమే విశేషం. తిమ్మిని బమ్మిని చేసైనా పశ్చిమ ఆసియాలో ‘సుస్థిర శాంతి’ని నెలకొల్పాలని ఒబామా ప్రభుత్వం తెగ ఆరాటపడిపోతోంది. గల్ఫ్ నుంచి ఆసియా, మధ్య ఆసియాలకు తన సైనిక బలగాలను తరలించి చైనా, రష్యాల పనిపట్టేయాలని చూస్తోంది. అందుకే కెర్రీ, నెతన్యాహూతో కాళ్ల బేరానికి దిగా రు. అమెరికా ప్రభుత్వ రహస్యాలను ఇజ్రాయెల్‌కు చేరవేస్తూ పట్టుబడ్డ ‘మొసాద్’ ఏజెంట్ జనాథన్ పోల్లార్డ్ను వి డుదల చేస్తామని ఆశ చూపారు. బందీల విడుదలపై అబ్బాసీతో కుదుర్చుకున్న ఒక్క ఒప్పందాన్నయినా మన్నించి 400 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయించాలని ప్రయత్నించారు. ఇదంతా హమస్, ఫతాల మధ్య మిత్ర భేదం కో సమేనని చెప్పక్కర్లేదు. ఎట్టకేలకు నెతన్యాహూ 25 మందిని విడుదల చేయడానికి అంగీకరించారు. వారంతా విడుదలై బయట ఉన్నవారే. ఖచ్చితమైన గడువుతో స్థూలంగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా ఆయనను ఒత్తిడి చేస్తోంది. ఇజ్రాయెల్ ఏకాకి అవుతుందని హెచ్చరిస్తోంది. గతానికి భిన్నంగా అమెరికా నేడు... 1997 ఓస్లో ఒప్పందా లు అమలు కాకపోవడానికి ఇజ్రాయెలే కారణమని అంటోం ది. పూర్తిగా అప్రతిష్ట పాలైన అబ్బాసీ పరువు దక్కేట్టు చేసి, హమస్‌కు దూరం చేయాలని కెర్రీ తంటాలు పడుతున్నారు. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసి తగువు తెగకుండా, ముడిపడకుండా చేసి లబ్ధిని పొందే దౌత్య విద్యలో ఆరితేరిన నెతన్యాహూకు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించే ఉద్దేశం లేనే లేదు. పైకి ఏమి చెప్పినా... ఆయనది పాలస్తీనా అస్తిత్వాన్ని నిరాకరించే ‘ఒక్క దేశం సిద్ధాంతం.’ హమస్ది అదే సిద్ధాంతమని ఆయన ఆరోపణ. ఓస్లో ఒప్పందాల ప్రకా రం రెండు దేశాలు ఒకేసారి ఒకదాని మరొకటి గుర్తించాలి. హమస్ది అదే వైఖరి. పాలస్తీనాను గుర్తించే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించేది లేదని అది అంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలు, అవి తానా అంటే తందానా అనే ‘అంతర్జాతీయ సమాజం’ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసిన హమస్... 2006 ఎన్నికల్లో పాలస్తీనియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ప్రజల తీర్పును నిరాకరించి, అధికారాన్ని హమస్‌కు అప్పగించకుండా నిరాకరించేలా అబ్బాస్‌ను ‘ఒప్పించినది’ ఎవరు? ప్రపంచం నలుమూలలా డేగ కళ్లతో, కాళ్లతో ప్రజాస్వామ్యానికి కావలి కాచే అమెరికా. పాలస్తీనాకు దేశంగా గుర్తింపు లభిస్తుందని, ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి అప్పజెప్పుతారని, దురాక్రమణ కారణంగా దేశ విదేశాల్లో శరణార్థులుగా బతుకుతున్న వారు తిరిగి తమ స్వస్థలాలకు చేరే అవకాశం లభిస్తుందనే భ్రమల్లో పాలస్తీనీయులను ఉంచడానికి... ఎంత అప్రతిష్ట పాలైనా అబ్బాసీ ప్రభుత్వమే మేలు. నెతన్యాహూ అది అర్థం చేసుకోవడం లేదనేదే కెర్రీ బాధ. - పి. గౌతమ్ -
పగటి కల... చేదు నిజం!
ప్రపంచం సంక్షోభం నుంచి బయటపడి కోలుకునే దశలో ఉన్నదని, త్వరలోనే పూర్వ పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. కానీ అమెరికాసహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలలో కోలుకునే దశ ఉద్యోగాలు లేనిదిగానే ఉంది. ‘కూచ్ సర్ఫింగ్’ అనే మాట విన్నారా? తెలుగులో ‘మంచం కోసం వేట’ అనాలేమో. అమెరికన్ సెనేట్ మెజారిటీ నేత డెమోక్రాట్ హారీ రీడ్‌కు కూడా నిన్నటి దాకా అలాంటి పద ప్రయో గం ఉన్నదని తెలీదు. ‘‘ఇంటి అద్దె చెల్లించలేక ‘మంచం కోసం వేట’లో మిత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, రాత్రికో చోట తలదాచుకోలేక ఇప్పటికే చస్తున్నాను. నిరుద్యోగ బీమాకు మంగళం పలికేసి మరింత నరకం చూపకండి’’ అని మొరపెట్టుకుంటూ ఒక నెవడా మహిళ రీడ్‌కు లేఖ రాసింది. గత గురువారం ఆయన దాన్ని సెనేట్‌కు వినిపించారు. అభాగ్యుల విలాపాలను వినరాదని ఎరిగిన సెనేట్ నిరుద్యోగ బీమా పొడింపు బిల్లును చెత్తబుట్టకు (58-40) పంపింది. పని కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆరు నెలల నిరుద్యోగ భృతి, తదితర సదుపాయాలను కల్పిస్తుంది. వాటి కొనసాగింపునకు 2008లో ‘అత్యవసర నిరుద్యోగ పరిహార పథకా’న్ని ప్రారంభించారు. దాని గడువు గత డిసెంబర్ 28తో ముగిసిపోయింది. మరుక్షణమే 13 లక్షల మంది బికార్లయ్యారు. మార్చికి మరో 22 లక్షల మంది వారిలో కలుస్తారు. 2009 చివరికే ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి గట్టెక్కి కోలుకునే దశకు చేరిందని ప్రభుత్వం సెలవిస్తోంది. కాబట్టి ఆరు నెలలు పైబడి నిరుద్యోగులుగా ఉన్న వారంతా సోమరిపోతులేనని తేల్చేశారు. ‘మంచం వేట’ మాని తక్షణమే పని చేసుకోమని నెవడా మహిళకు ఉచిత సలహాను పారేశారు. ఆమెలాటి ‘సోమరిపోతులు’ దేశంలో 37 లక్షల మందున్నారు! గత పది రోజులుగా ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లోనేగాక జపాన్‌లో సైతం జోరుగా సాగుతున్నవి నియామకాలు కావు... ఉద్వాసనలు (లే-ఆఫ్‌లు)! ఉద్యోగాలపై కత్తి ఎత్తిన యాభైకి పైగా బహుళ జాతి సంస్థల్లో మనకు బాగా తెలిసినవి మచ్చుకి... కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ‘డెల్’ కనీసం 15 వేల మందికి, ‘వోల్వో’ వాహనాల సంస్థ 4,400 మందికి, ‘నోవార్టిస్.’ ‘ఆస్త్రాజెనెకా’ ఫార్మా సంస్థలు ఒక్కొక్కటి ఐదు వేల మందికి, ‘సోనీ’ 5,000 మందికి ఉద్వాసన పలుకుతున్నాయి. 2008 సంక్షోభానికి ముందు రెండు దశాబ్దాలూ ఉద్యోగాలు లేని వృద్ధి దశ. అలాగే నేటి కోలుకునే దశ కూడా ఉద్యోగాలు లేనిదే. ప్రపంచ ఉద్యోగితపై అంతర్జాతీయ కార్మిక సంస్థ జనవరిలో విడుదల చేసిన తాజా నివేదిక పేరు ‘ఉద్యోగాలులేని కోలుకునే దశ?’ అమెరికా నిపుణులు గత ఏడాదిలో నెలకు రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. గత డిసెంబర్లో కల్పించిన ఉద్యోగాలు 74 వేలు! నిరుద్యోగం 10 శాతం (2009) నుంచి 6.7 శాతానికి తగ్గిందంటున్నా... పూర్తికాలం పని కోరే పార్ట్టైమర్లు మొత్తం ఉద్యోగులలో 13.1 శాతం ఉన్నారు. 2014 మొదటికి జనాభాలో ఉపాధిని కలిగిన వారి వాటా 1983 తర్వాత అతి కనిష్ట స్థాయికి, 59 శాతానికి దిగజారింది. కొత్త ఉద్యోగాల్లో అత్యధికం నాసిరకం అల్ప వేతన ఉద్యోగాలు, ఏ ప్రయోజనాలు లేని పార్ట్ టైం ఉద్యోగాలే. ఒకప్పుడు వస్తు తయారీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి వెన్నెముక. గత దశాబ్దిగా ఆ రంగం 26 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. నేడు కూడా నిరుద్యోగులుగా మారుతున్నవారే తప్ప కొత్త నియామకాలు లేవు. గత ఏడాది కొత్త ఉద్యోగాల్లో అత్యధికం (8 లక్షలకు పైగా) ఏడాదికి 25 వేల డాలర్ల కంటే తక్కువ వేతనాన్ని ఇచ్చే అల్ప వేతన రంగాలవే. ప్రైవేటు సగటు వేతనం గంటకు 20.04 డాలర్లలో 80 శాతం లేదా అంత కంటే తక్కువ వేతనాలను అల్ప వేతనాలుగా నిర్వచించారు. 2008 సంక్షోభం తదుపరి కల్పించిన ఉద్యోగాల్లో 60 శాతం అవే. 4.7 కోట్ల అల్పవేతన జీవులంతా ఆహార కూపన్ల బతుకుల పేదలే. వారిలో ఫాస్ట్‌ఫుడ్ వర్కర్లు, దుకాణాల్లో బట్టలు మడతపెట్టడం, గిన్నెలు కడగ డం వంటి పనులకు గంటకు 10 డాలర్ల కంటే తక్కువ వే తనమే. ఈ అత్యల్ప వేతన జీవులు 25 శాతంపైనే. అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆర్భాటపు ‘కనీస వేతనాల పెంపుదల’ బిల్లు (గంటకు 7.25 నుంచి 10.10 డాలర్లు) కూడా సెనేట్‌లో బోర్లాపడక తప్పేట్టు లేదు. నేడు ప్రతి ఐదు అమెరికన్ కుటుంబాల్లో ఒకటి (20 శాతం) ఆహార కూపన్లపై ఆధారపడుతున్నాయి. ఆహార కూపన్ల బతుకుల సంఖ్య 2009-2013 మధ్య 51.3 శాతం పెరిగింది. పోర్ట్‌లాండ్‌లో వారానికి రెండుసార్లు ఏకధాటిగా 18 గంటల షిప్టులో వికలాంగ పెద్దలకు సంరక్షకునిగా బట్టలు ఉతకడం, స్నానాలు చేయించడం వంటి పనులు చేసే హెచ్ డెర్ (37) వంటి వారు... ‘ఎక్కడ ఈ పని పోగొట్టుకొని నా కుటుంబం ఆకలితో మాడేట్టు చేస్తానోనని నిర ంతరం బీతావహు’లవుతూ బతుకుతున్నారు. ఇక ‘హలో క్లాస్, మీ ప్రొఫెసర్ ఆహార కూపన్లపై బతుకుతోంది’ అనే కథనంతో ‘హఫింగ్టన్ పోస్ట్’లో తన గోడును వెళ్లబోసుకున్న కేతే క్విక్... ఆహార కూపన్లకు అనుమతి వస్తే ఆకాశం దిగొచ్చినంతగా సంబరపడింది. కాలంతో పాటే మాటలకు అర్థాలూ మారుతున్నట్టుంది. ఆర్థిక వ్యవస్థ ‘కోలుకోవడం’ అంటే పేదరిక ం పెరగడమని అర్థం గామోసు! - పి. గౌతమ్ -
ఫారో మార్కు ప్రజాస్వామ్యం
ఈజిప్ట్ సైనిక నియంత అల్ సిసీ అధ్యక్ష ఎన్నికల్లో నిలవబోతున్నారు. ప్రత్యర్థులే లేని ఆ ఎన్నికల్లో ఆయన గెలుపు తథ్యం. ప్రజాస్వామ్య పరివర్తనకు నాంది పలుకుతానంటున్న సిసీ భావప్రకటనా స్వేచ్ఛపై పంజా విసిరారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య తేడా ఎంత? దుస్తులు మార్చుకున్నంత. ఈజిప్టు ‘దుస్తులు’ మార్చుకోబోతోంది. సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ అబ్దెల్ అల్ ఫతా అల్ సిసీ ఏప్రిల్‌లో పౌర దుస్తులు ధరించడంతో ఈజిప్టు ప్రజాస్వామ్య దేశంగా మారిపోతుంది. సంశయజీవులు మయన్మార్ నిన్నగాక మొన్న దుస్తులు మార్చి ప్రజాస్వామ్య పరివర్తనను సాధించిన వైనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే సరి. నాటకీయత లేని రాజకీయాలు రక్తి కట్టవు. ‘అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ప్రజాభీష్టాన్ని తిరస్కరించజాలను’ అని సిసీ బుధవారం కువైట్ పత్రిక ‘అల్ సియాసా’తో అన్నారు. అలా అయన అన్నా, దాని అర్థం ఆ పత్రిక ప్రచారం చేసినట్టు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పినట్టు కాదని ఆయన ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనరని చెప్పలేదు. ఏప్రిల్ మధ్యలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల్లో సిసీ పోటీ చేయాలని అత్యున్నత సైనిక మండలి గత నెల 27న తీర్మానించింది. దాన్ని ఆయన శిరసావహించక తప్పదు. మండలి అధిపతి ఆయనే. రాజకీయ ప్రవేశానికి మొదటి అర్హత... అన్నది అనలేదంటూ పాత్రికేయులను అబ ద్దాలకోర్లుగా రుజువు చేయడం. సిసీ ఆ అర్హతను సాధించారు. గత నెల 19న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో సిసీ మార్కు రాజ్యాంగం 98.1 శాతం ఓట్లతో ఆమోదం పొందింది. మూడు కోట్లకు పైబడిన ఓటర్లలో 38.6 శాతమే ఓటింగ్‌లో పాల్గొన్నారనేది, 60 శాతం ఓటర్లయిన 18-40ల మధ్య వయస్కులు పోలింగ్ బూత్‌ల మొహం చూడలేదనేది వాస్తవమే. అంత మాత్రాన అది ‘ప్రజామోదం’ కాకపోదు. ఆ రాజ్యాంగం ప్రకారం సిసీ సైనిక మండలి అధ్యక్ష పదవిని, రక్షణమంత్రి పదవిని వదులుకోకుండానే సింహాసనం ఎక్కేయవచ్చు. ప్రజాస్వామ్యం దుస్తులు మార్చడం అయిన చోట ఎన్నికలు తప్పనిసరి తద్ధినం కాక మరేమవుతాయి? ఇదంతా ఒక ప్రహసనమని నిషిద్ధ ‘ఉగ్రవాద సంస్థ’ ముస్లిం బ్రదర్ హుడ్ హేళన చేసినంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాకుండా పోదు. బ్రదర్హుడ్ నేత, మాజీ అధ్యక్షుడు, తాజా ‘ఉగ్రవాది’ మొహ్మద్ ముర్సీ 2012లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 33 శాతం ఓటర్లే పాల్గొన్నారు. వారిలో 64 శాతం మాత్రమే ఆయన రాజ్యాంగానికి అవునన్నారు! అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటి వాడు విప్లవం మొదట్లోనే హోస్నీ ముబారక్ పాలనను ‘అరబ్బు తరహా ప్రజాస్వామ్యం’గా అభివర్ణించారు. సరిగ్గా మూడేళ్లకు ఈజిప్ట్ అక్కడికే చేరిందంటే అది ఆయన చాణక్యమే. నాటి విప్లవంలో ప్రజాస్వామ్య యువత, వామపక్ష ట్రేడ్యూనియన్లతో భుజం కలిపి సాగిన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను వారి నుంచి వేరు చేసినది అమెరికాయే. అధికారం ఆశజూపి లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య పక్షాలన్నీ బహిష్కరించిన పార్లమెంటు ఎన్నికల్లో ముర్సీ పాల్గొనేలా చేశారు. సైనిక మండలికి అధికారాలను కట్టబెట్టి అమెరికా నాడు మొహ్మద్ హుస్సేన్ తంత్వానీకి పగ్గాలను అప్పగించింది. నామమాత్రపు అధికారాలే ఉన్న ముర్సీ తంత్వానీని తొలగించి, ఏరికోరి (2012) సిసీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఓటర్లలో మూడింట ఒక వంతు మద్దతే ఉన్న బ్రదర్‌హుడ్‌కు రాజకీయ గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించారు. సిసీనే నమ్ముకున్నారు. ‘బ్రదర్హుడ్ ఫీల్డ్ మార్షల్’ సిసీ... ముర్సీనే కటకటాల పాలుచేసి, బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 20 వేల మందిని నిర్బంధించారు. అమెరికా మిత్రభేదం ఫలించింది. ఇతర పక్షాలేవీ మాట్లాడలేదు. పైగా నాడు సిసీని ‘హీరో’గా భావించాయి. నాటి లౌకికవాద హీరో ఇప్పుడు ‘ఉగ్రవాద వ్యతిరేక హీరో’గా రూపాంతరం చెందారు. అల్ సియాసాతో మాట్లాడుతూ ఆయన... గల్ఫ్ సహకార మండలి ఉగ్రవాదాన్ని (బ్లాక్ టై) నిర్మూలించడానికి సహకరించాలని కోరారు. ఆయన అడగకుండానే సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల కోట్ల నిధులను కుమ్మరించాయి. ‘ఉగ్రవాదం’పై పోరుకు ముందు షరతు ఎప్పుడూ ‘పంచమాంగ దళమే’... అంటే పత్రికలే. సిసీ అధికారంలోకి వచ్చినవెంటనే తమకు తామే కళ్లూ, చెవులు, నోళ్లు మూసేసుకోవడం స్థానిక పత్రికలు అలవరుచుకున్నాయి. ‘అల్‌జజీరా’కు ఆ ఇంగితం లేకపోయింది. ఫలితం అనుభవిస్తోంది. నలుగురు విదేశీయులు సహా 20 మంది పాత్రికేయులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘అన్సర్ అల్ మక్దిన్’ అనే అల్‌కాయిదా అనుబంధ సంస్థ గత పదిహేను రోజుల్లోనే కైరోలో కారుబాంబు పేలుడుకు, సినాయ్‌లో ఒక సైనిక హెలికాప్టర్ కూల్చివేతకు, ఒక పోలీస్ జనరల్ హత్యకు పాల్పడింది. ఆ సంస్థకు సౌదీ మద్దతున్నది కాబట్టి అది ఉగ్రవాద సంస్థ కాదు, దానిది ఉగ్రవాదం కాదు. అభినవ ఫారో ప్రజాస్వామ్యంతో పీనుగుల పిరమిడ్లను నిర్మించనున్నారు. - పి. గౌతమ్ -
అంకెల గారడీలో అందరూ అందరే!
ప్రణాళికా సంఘం పేదరిక రేఖను తక్కువగా నిర్ణయించిందంటూ యూపీఏను తప్పు పట్టిన బీజేపీ గుజరాత్లో దాన్ని అంతకంటే తక్కువగా నిర్ణయించడంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. పేదల ఓట్ల కోసం రెండు ప్రధాన జాతీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ‘పేదరికం అత్యంత క్రూర హింసా రూపం’. దుర్భర దారి ద్య్రం చాలదన్నట్టు పేదరికాన్ని పుట్‌బాల్ బంతిలా ఎదుటి పక్షం గోల్ పోస్టులోకి తన్నాలని కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న అంకెల క్రీడను చూడగలిగితే... పేదరికాన్ని మించిన క్రూర హింస ఉంటుందని గాంధీ సైతం అంగీకరించక తప్పదు. అధికారానికి కావలసింది అంకెలే... అంకెలుగా లెక్కకొచ్చే ఓటర్లే. నిర్ణయాత్మకమైన అంకె పేదలదేనని అందరికంటే ఎక్కువ కాంగ్రెస్, బీజేపీలకే తెలుసు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలో గుజరాత్లో పేదరికం తగ్గిపోయిందని చూపడానికి పేదరిక రేఖను తక్కువగా చూపారంటూ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కత్తులు దూశారు. గుజరాత్ ఆహార, పౌర సరఫరాల శాఖ పట్టణ ప్రాంతాల్లో రోజుకు తలసరి వ్యయం రూ.16.70 కంటే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10.80 కంటే తక్కువగా ఉన్నవారు పేదలని నిర్వచించింది. 2012లో కేంద్ర ప్రణాళికా సంఘం పేదరిక రేఖను రూ.32, రూ.27గా చూపినప్పుడు నానా రభస చేసిన బీజేపీ అంతకంటే తక్కువగా పేదరిక రేఖను ఎలా నిర్ణయించిందని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఆ నిర్వచనంతోనే యూపీఏ పేదరికం 22 శాతానికి (2011-12) తగ్గిపోయిందని చెప్పుకున్నారు. వృద్ధి వాపుతో పాటే యూపీఏ ప్రతిష్ట కూడా దిగజారుతుండగా నాడు కాంగ్రెస్ ఇదే గారడీని ప్రదర్శించింది. మోడీ అంటే అభివృద్ధని, గుజరాత్ ఆదర్శ రాష్ట్రమని అదే పనిగా సాగుతున్న ప్రచారానికి ప్రభావితమవుతున్న మధ్య తరగతి విద్యావంతులకు పేదల సంఖ్య కూడా పడుతుంది. మోడీ మార్కు వట్టణ వృద్ధితో వేగంగా వృద్ధి చెందిన మూడువేల గుజ రాత్ మురికివాడలు దేశంలోనే అధ్వానమైనవిగా పేరు మోశాయి. ఇది ఎవరికైనా కనిపించే వాస్తవం. కాబట్టే మోడీ మార్కు వృద్ధిని సర్వరోగ నివారిణిగా చూపాలంటే అంకెల ఇంద్రజాలం ప్రదర్శించడం అవసరం. మాకెన్‌లు భూతద్దాలతో వేచిచూస్తున్న సమయంలో మోడీ వీర భక్తులెవరో ఈ అంకెల గారడీకి సాహసించి ఉండాలి. బీజేపీ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. మోడీకి వచ్చే నష్టం లేదు. పేదలకు ఒరిగేది అంతకంటే ఏమీ లేదు. అసలు ఈ చర్చే అర్థరహితమైనది. గుజరాత్ పౌర సరఫరాల శాఖ తన సర్క్యులర్ అమలు పరచడానికి ఉద్దేశించినది కాదని సెలవిచ్చింది. నిన్న మన్మోహన్ సైతం ప్రణాళికా సంఘం గీసిన గీతకు ఆహార భద్రతకు, ఉపాధి హామీకి లంకె లేదని చెప్పారు. మరి ఎందుకు గీస్తున్నట్లు? నేడు సాగుతున్న పేదరికంపై చర్చ గత ఏడాది ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు అమర్త్యసేన్, జగదీశ్ భగవతిల మధ్య సాగిం ది. అప్పట్లో అది కాంగ్రెస్, బీజేపీల ఆర్థిక విధానపరమైన మౌలిక చర్చగా ప్రచారంలోకి వచ్చింది. పేదరిక నిర్మూలనకు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చురుగ్గా యత్నించడం ద్వారానే సుస్థిర వృద్ధి సాధ్యమని సేన్ వాదన. అందుకే ఆయన యూపీఏ ప్రభుత్వ గ్రామీణ ఉపాధి, ఆహార భద్రత పథకాలను సమర్థించారు. కాగా ప్రభుత్వ సంక్షేమ వ్యయాలు, సబ్సిడీలలో కోతలు విధించి, ప్రభుత్వం పాత్రను తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం ద్వారానే వృద్ధి సాధ్యమని భగవతి తర్కం. సమాజం పైపొరలకు అందే వృద్ధి ఫలాలు క్రమంగా వాటికవే అడుగు, అట్టడుగు పొరలకు చేరి పేదరికం, నిరుద్యోగం వాటికవే మటుమామవుతాయని ఆయన వాదన. ఆ వాదనలను సమర్థించడానికి బీజేపీ జంకింది. భగవతి చెప్పినదాన్ని ఆయన చెప్పకముందే మోడీ అమలులోకి తెచ్చారు. అందుకే ఆయన ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి పథకాల పట్ల బహిరంగంగానే వ్యతిరేకతను ప్రకటించారు. ప్రజాస్వామ్యం అంటూ ఒకటి ఉన్నాక పేదల ఓట్ల కోసం పాట్లు తప్పవు. ఇప్పుడు గీస్తున్న గీతలు ఎన్నికల తర్వాత అమల్లోకి రానున్న పేదరిక రేఖలని అంతరార్థం. మోడీ ప్రధాని పీఠమెక్కితే రూ.16 పేదరిక రేఖతో పేదరికం ఏ పదిహేను శాతానికో పడిపోతుందని అనుకోవాలి. ఈ పేదరికం మ్యాచ్ ఫిక్సింగ్‌ను పక్కన పెట్టి కనీస వేతనాల స్థాయిని బట్టి ప్రపంచంలో మనం ఎక్కడున్నామో చూస్తే పేదరికం నిజస్వరూపం అవగతమవుతుంది. ఆస్ట్రేలియాలో అత్యధికంగా గంటకు 16.88 డాలరు ్లగా ఉన్న కనీస వేతనాలు అమెరికాలో 7.25 డాలర్లు. ఇది వివిధ దేశాల కొనుగోలుశక్తిని సరిపోల్చి కొలిచిన వేతనాల కొలబద్ధ. కారుచౌక శ్రమ దోపిడీకి మారు పేరుగా పిలిచే చైనాలో కనీస వేతనాలు గంటకు 0.80 డాలర్లు. కాగా, మన దేశం స్థాయి 0.28 డాలర్లు. అఫ్ఘానిస్థాన్ మనకంటే నయం 0.57 డాలర్లు. ఇంతకూ కనీస వేతనాలు అంటే బతకడానికి సరిపడే జీవన వేతనాలు కావు. మన దేశంలో బతకడానికి కావాల్సిన జీవన వేతనంలో మన కనీస వేతనం 26 శాతం. ఆ కనీస వేతనం కంటే తక్కువ కూలికి పని చేసే దరిద్రనారాయణులకు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు గెలి చినా ‘స్వర్గం’ చూపించడం ఖాయం. - పి. గౌతమ్ -
చైనాలో మగాడిగా పుట్టడం కంటే...
చైనాలో ప్రస్తుతం మూడు కోట్ల మంది నలభైకి చేరువవుతున్న పెళ్లి కాని మగాళ్లున్నారు. 2030 నాటికి ప్రతి నలుగురు మగాళ్లలో ఒకరు అలాంటి వారే. పదేళ్ల ఆదాయాన్ని కన్యాశుల్కంగా చెల్లిస్తే గాని ప్రస్తుతం సగటు మగాడికి పెళ్లి కావడం లేదు. చైనాలోని బీజింగ్, షాంఘైలాంటి నగరాల్లో ధగధగలాడే భారీ హోర్డింగ్‌లపై మెరిసే మగరాయుళ్లంతా మోడల్స్ అని భ్రమపడకండి. వధువులను ఆకర్షించాలని తాపత్రయపడే ‘డైమండ్’, ‘గోల్డెన్’ పెళ్లి కొడుకులు కూడా ఉంటారు. చైనాలో ప్రస్తుతం 3 కోట్ల మంది మగాళ్లు ఎప్పటికీ పెళ్లి కాదేమోననే భయంతో బతుకుతున్నారు. కోటీశ్వరుల నుంచి గ్రామీణ పేదల దాకా అన్ని వర్గాల్లోనూ ‘షెంగ్నాన్’ల (మిగిలిపోయిన మగాళ్లు) సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుత జననాల రేటు ప్రతి 100 మంది ఆడపిల్లలకు 120 మంది మగ పిల్లలుగా ఉంది. 2030 నాటికి మగ జనాభాలో 25 శాతం నలభైకి చేరువవుతున్నా పెళ్లికి నోచుకోని మగాళ్లు అవుతారని అంచనా. ఈ వైపరీత్యానికి ఆ దేశ ‘ఒకే బిడ్డ విధానం’ మూల కారణమనేది నిజమే. అలా అని ఈ సమస్య సప్లయి, డిమాండు సూత్రాలకు ఒడిగేది కాదు. ఎందుకంటే కోటీశ్వరులు కూడా పెళ్లికాని మగాళ్లుగానే మిగిలిపోతున్నారు. పదేళ్ల ఆదాయానికి సరిపడా పోగేస్తేకానీ కన్యాశుల్కం లేదా కట్నాన్ని చెల్లించలేని దుస్థితి మగాడిది. అతి సామాన్యుడికైనా కనీసం 10 వేల డాలర్ల కట్నం పోయందే పెళ్లి కూతురు రాదు. అగ్రరాజ్యంగా అమెరికా సరసన నిలవాలని పరుగులు తీస్తున్న చైనాలో ఆధునికత సరసనే కాలం చెల్లిన సంప్రదాయాలు, కట్టుబాట్లు చెక్కుచెదరకుండా నిలిచాయి. కాబట్టే ఆధునిక మైన స్వీయ ఎంపిక గాక జీవిత భాగస్వాములను తల్లిదండ్రులే నిర్ణయించే పద్ధతి కొనసాగుతోంది. ఆడాళ్ల కొరత తీవ్రంగా ఉన్న ఆ దేశంలో ‘షెంగ్నిన్’ల (పెళ్లికాని ఆడవాళ్లు) సమస్య కూడా తీవ్రంగా ఉండటం విచి త్రం. రాజధాని బీజింగ్‌లోనే నలభైకి చేరువవుతున్న ఐదు లక్షల మంది ‘షెంగ్నిన్’లున్నట్టు అంచనా. చైనా ప్రధాన నగరాలన్నిటిలోనూ ఇప్పుడు పెళ్లిళ్ల ‘పార్టీలు’ జోరుగా సాగుతున్నాయి. అర్హతలను బట్టి ఆడా, మగలకు ఏ, బి, సి, డి గ్రేడులను నిర్ణయిస్తారు. ఆడవాళ్లలో ఏ- గ్రేడ్‌కు చెందినవారు, మగాళ్లలో డి-గ్రేడుకు చెందినవారు ఎక్కువగా పెళ్లికాని వారిగా మిగిలిపోతున్నారు. అందచందాలతోపాటూ మంచి చదువు, ఉద్యోగం ఉన్న ఏ-గ్రేడు ఆడాళ్లు తమకంటే ఎక్కువ స్థాయి వారి కోసం అన్వేషిస్తూ పెళ్లి కాకుండా మిగిలిపోతుంటే... ఏ-గ్రేడు మగాళ్లు తమ వ్యాపారాన్ని జోడు గుర్రాలపై స్వారీ చేయించగల భాగస్వామి కోసం అన్వేషణలో మధ్యవయస్కులైపోతున్నారు. కనీసం 16.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు గల వరుల కోసం నిర్వహించే విలాసవంతమైన ‘పార్టీ’ లలో ‘వలంటీర్లు’గా అన్ని వర్గాల ఆడవారూ పాల్గొనవచ్చు. ‘వలంటీర్లు’ తమ ఒడ్డు, పొడవు, కుటుంబ వారసత్వం, చదువులు, హాబీలను ఏకరువు పెట్టాల్సి ఉంటుంది. కన్యత్వ పరీక్ష సర్టిఫికెట్ అదనపు అర్హత అవుతుంది. ‘కమ్యూనిస్టు’ చైనాలో సంపన్నులు ఆడాళ్లను కొనుక్కోవడమేమిటి? అనే విమర్శలు లేకపోలేదు. ‘వలంటీర్లు’ ధనిక, పేద తేడాల్లేకుండా ‘స్వయంవరం’లో పొల్గొని సంపన్నులను కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇదీ ఆర్థిక సమానతకు మార్గమేనని సమర్థన. ఆస్తులు, హోదా, పెద్ద చదువులు ఏమీ లేని డి-గ్రేడు మగాళ్ల మొహం చూసే ఆడాళ్లెవరు? పట్టణ పేద, దిగువ మధ్యతరగతుల్లో, గ్రామీణ జనాభాలో పెళ్లికాని మగాళ్లు అత్యధికంగా ఉంటున్నారు. ఉత్తర కొరియా సరిహద్దు గ్రామాల్లో రైతులు కారు చౌకకు వధువులను కొనుక్కోగలుగుతున్నారు. కూలైనా చేసుకు బతకవచ్చని చైనాలోకి ప్రవేశించే ఉత్తర కొరియా ఆడపిల్లలను బానిసల్లాగా అమ్ముతున్నారు. 15 ఏళ్ల బాలిక ధర 500 నుంచి 1500 డాలర్లు. ఇటీవలి కాలంలో కనీసం రెండు లక్షల మంది చైనాలోకి పారిపోయి రాగా వారిలో 80 శాతం ఆడవాళ్లే. ఒకే బిడ్డ విధానం నుంచి 2030 నాటికి తలెత్తబోతున్న వృద్ధుల సమస్యను పట్టించుకున్నట్టుగా... జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు పెళ్లికాక నిరాశా నిస్పృహలతో బతకడం వల్ల కలగనున్న సమస్యలను గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మగాళ్లు తమకంటే 10, 20, 30 ఏళ్లు చిన్న ఆడపిల్లలను పెళ్లాడటం జరుగుతోంది. అప్పటికి అదే సర్వసాధారణంగా మారిపోతుందని అంటున్నారు. జనాభాలో నాల్గవ వంతు పెళ్లికాని మగాళ్ల ఆగ్రహం సామాజిక అశాంతిగా చైనాను ముంచెత్తుతుందన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. చైనాలో అభాగ్య వర్గాలు చారిత్రకంగా అత్యంత సహనశీలురని, కాబట్టి అక్కడి సామాజిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని కమ్యూనిస్టు పార్టీ వర్గాలు సెలవిస్తున్నాయి! పి. గౌతమ్ -
జాత్యహంకారం సోకుతోందా?
విదేశీ పర్యాటకులను రా, రమ్మని పిలిచే భారత దేశవు ‘స్వర్గ సీమ’ గోవా ఒక దౌత్య సంక్షోభానికి కేంద్రమైంది. వారం క్రితం జరిగిన ఒక నైజీరియన్ హత్యపై పోలీసులు ‘ఒక నల్లవాడి చావు’తో వ్యవహరించాల్సిన విధంగానే వ్యవహరించారు. బాధ్యతారాహిత్యంతోపాటూ, వీసా గడువుకు మించి ఉన్న దాదాపు 150 మంది నైజీరియన్లను వెనక్కు పంపేయాలని నిర్ణయించారు. మాదకద్రవ్య ముఠాలకు వ్యతిరేకంగా చేపట్టిన పోరులో భాగమే ఇది అనడం నమ్మశక్యం కాదు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మాదకద్రవ్యాల విని యోగం, అక్రమ వ్యాపారం అక్కడా పెరుగుతున్నాయి. పైగా వీసాల గడుపు దాటిన నైజీరియన్లను మాత్రమే పంపేయాలని నిర్ణయించడమంటే వారు మాత్రమే మాదకద్రవ్య ముఠాలకు చెందినవారని చెప్పడమే. నైజీరియన్లు ‘క్రూర జంతువులు’ ‘క్యాన్సర్ కురుపులు’ అని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ మంత్రి వర్గ సహచరుడు ఒకరు అననే అన్నారు. పుండు మీద కారం జల్లినట్టున్న ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా గోవాలోని నైజీరియన్లు ఆందోళనకు దిగారు, హద్దు మీరి ఉంటే ఉండొచ్చు. పోలీ సులు అంటున్నట్టు ఆ హత్య మాదకద్రవ్య ముఠాల మధ్య తగాదాలతో ముడిపడినదే అయినా కావొచ్చు. గోవా ఘటనపై నైజీరియన్ రాయబార కార్యాలయం తీవ్రంగానే స్పందించింది. నైజీరియన్లపై వివక్ష చూపి బహిష్కరించడం తమ దేశంలోని లక్ష మందికి పైగా భారతీయులపై దాడులకు దారి తీయవచ్చని హెచ్చరించింది. మన దేశంలోని నైజీరియన్ల సంఖ్య 40 వేల వరకు ఉంటుంది. నైజీరియాకు మనమిచ్చేంత ప్రాధాన్యం అది మనకు ఇవ్వనవసరం లేదు. గోవా పోలీసులు, ప్రభుత్వం నేరస్తుల దేశంగా ముద్రవేస్తున్న నైజీరియా చమురు సంపన్న దేశం. చమురు ఉత్పత్తిలో దానిది పన్నెండో స్థానం, ఎగుమతులలో ఎనిమిదో స్థానం. చమురు ఎగుమతులలో 40 శాతం అమెరికాకే. పైగా దేశం పొడవునా ప్రవహించే నైజిర్ నది ఉంది. అది నైజిర్ డెల్టాను సస్యశ్యామలంగా మార్చింది. బొగ్గు, రాగి, బాక్సైటు తదితర ఖనిజాల నిక్షేపాలు కూడా ఆ డెల్టా ప్రాంతంలోనే ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టయింది నైజీరి యన్ల పరిస్థితి. స్థూల జాతీయోత్పత్తి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 36వ స్థానంలో ఉన్న ఆ దేశం మానవాభివృద్ధి సూచికలో 154వ స్థానంలో ఉంది! గోవా దౌత్య దూమారం రేగుతుండగా హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’... బహుళ జాతి సంస్థ ‘షెల్’ నైజీరియాలో చము రు పైపుల లీకేజీని అనుమతిస్తోందని ఆరోపించింది. లేకపోతే ఒక్క ఏడాదిలో 340 సార్లు చమురు లీకు కాదని స్పష్టం చేసింది. దశాబ్దాల క్రితం నాటి చిల్లులు పడ్డ పైపులతోనే పెట్రో కంపెనీలు చమురును రవాణా చేస్తున్నాయి. దీంతో డెల్టా ప్రాంతమంతా రుద్ర భూమిగా మారిపోతోంది. మంచినీటి వనరులు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఖనిజ సంపదను అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో తరలించుకు పోవడమే వారికి ముఖ్యం. పంటపొలాలు, హరితారణ్యాలు గడ్డిపరక మొలవని మృత్యు భూమిగా మారిపోతే ఎవరికి కావాలి? పైగా అవి ‘చమురు దొంగల’ సాయుధ ముఠాలను సైతం ప్రోత్సహించి అస్థిరతను సృష్టిస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ చమురు లీకేజీలతో ఊళ్లకు ఊళ్లే వల్ల కాళ్లుగా మారిపోతున్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో నైజీరియాకు మరో అరుదైన ఘనత కూడా దక్కింది. ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోనే భూ దురాక్రమణలు సాగుతున్నాయి. భూ బకాసురులు అతిగా పేట్రేగిపోతున్న దేశాల్లో ద్వితీయ స్థానం నైజీరియాదే. ఆఫ్రికన్లందరినీ చిన్నచూపు చూసి, జాత్యహంకార వైఖరిని ప్రదర్శించే భారత సంస్థలు ఆఫ్రికాలో సాగుతున్న భూఆక్రమణల్లో ముఖ్య పాత్రధారులుగా ఉన్నాయి. లాగోస్ రాష్ట్రంలో ని భారతీయులు అలాంటి ‘రైతులు’, వారి ఉద్యోగులు, వివిధ ప్రాజెక్టులలో పని చేస్తున్న వారు. ఆఫ్రికా దేశాల సంపదలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పాశ్చాత్య దేశాలతో పాటూ మన దేశంలో కూడా నల్లజాతి వ్యతిరేకత ప్రబలడం ప్రమాదకరం. మొగ్గలోనే తుంచడం శ్రేయస్కరం. -పి. గౌతమ్ -
బ్రహ్మచారుల దేశం!
నేడు జపాన్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న అంటువ్యాధి... బ్రహ్మచర్యం! గత దశాబ్ద కాలంగా జపాన్ జనాభా క్షీణించిపోతోంది. నేడు 12.6 కోట్లుగా ఉన్న జనాభాలో కనీసం 5 కోట్ల మంది 2050 నాటికి గల్లంతవుతారని అంచనా. జపాన్ అంతరించిపోనున్నాదా? ఈ సందేహాన్ని వ్యక్తం చేసినది సాక్షాత్తూ జపాన్ ఫామిలీ ప్లానింగ్ అసోసియేషన్ (జేఎఫ్పీఏ) అధిపతి కునియో కిటమొర. నేడు జపాన్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న అంటువ్యాధి... ఘోటక బ్రహ్మచర్యం! ప్రకృతి ధర్మానికి అపవాదంలాగా ఆడామగా తేడా లేకుండా అంతా ప్రేమంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పెళ్లీ, శృంగారం, పిల్లలు అంటే గుండెపోటు తెచ్చేసుకుంటున్నారు. పోనీ ప్రేమ, పెళ్లీ బాదరబంది లేని శృంగారమో? మహా పాతకం! 40 ఏళ్ల లోపు వయస్కులను పట్టిపీడిస్తున్న ఈ వ్యాధికి ‘సెలిబసీ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. నవ యువతలో... స్త్రీలల్లో 40 శాతం, పురుషుల్లో 35 శాతం శృంగార జీవితమంటే విముఖత చూపుతున్నారు. ఉద్వేగభరితమైన ప్రేమానురాగ బంధమంటే భయంతో వణుకుతున్నారు. యువతీ యువకులు ఏ పార్కుల్లోనో కలిసినా... మాట కలపలేక క్షణమొక నరకంగా గడపాల్సి వస్తోంది. వెంటనే ఈ స్నేహానికి సైతం గుడ్‌బై చెప్పేసి. ప్రాణహాని తప్పినట్లు నిట్టూరుస్తున్నారు. ప్రేమిద్దామనుకున్నా... చేయి తాకితే షాక్ కొట్టినట్లయి ఒకరికొకరు దూరంగా పారిపోతున్నారు. స్త్రీపురుషుల మధ్య మానసిక, శారీరక సాన్నిహిత్యమే ఊహింపశక్యం కాని దిగా మారిపోతోంది. నలభైకి చేరువైనా తల్లిదండ్రులతో బతకడమే సుఖమని భావిస్తున్నారు. జననాల రేటు అతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన జపాన్ జనాభా గత దశాబ్ద కాలంగా క్షీణించిపోతోంది. నేడు 12.6 కోట్లుగా ఉన్న జనాభాలో కనీసం 5 కోట్ల మంది 2050 నాటికి గల్లంతవుతారని అంచనా. జపాన్ అంతరించిపోతుందేమోనని కిటమొర ఊరికే ఆందోళన చెందడం లేదు. ఈ ‘సెలిబసీ సిండ్రోమ్’కు మూల కారణాలు ఆర్థికమైనవి, సామాజికమైనవి కావడమే విశేషం. టోక్యోలో మానవ వనరుల అధికారిణిగా ఉన్న ఎరి టొమిటా (32) ప్రేమాయణం ఈ రోగాన్ని అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది: ‘ఒక బాయ్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నానంటూ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పెళ్లి కోసం మంచి ఉద్యోగాన్ని వదులుకోలేకపోయాను. ప్రేమ, పెళ్లి భ్రమలు తొలగిపోయాయి.’ కార్పొరేట్ సంస్థలు పెళ్లి మాట ఎత్తితే చాలు ఉద్యోగినులకు ఉద్వాసన చెబుతాయి. ఇతర చోట్ల ఉద్యోగాలు ఊడకున్నా పెళ్లితో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిలిచిపోతాయి. వివాహిత ఉద్యోగినులను ‘దయ్యం పెళ్లాలు’గా పరిగణిస్తారు. ‘వరల్డ్ ఎకనామిక్ పోరం’ ఏటా మహిళల పట్ల లైంగిక వివక్షలో జపాన్‌కు అగ్రతాంబూలం ఇస్తోంది. పెళ్లికాని యువతులకు మంచి ఉద్యోగాల తాపత్రయం. ఉద్యోగినులకు ఉద్యోగాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం. ఇక ప్రేమ, పెళ్లి, శృంగారం ఎవరికి కావాలి? భర్త కుటుంబాన్ని పోషించడం, భార్య గృహిణిగా ఇల్లు చక్కదిద్దుకోవడం సంప్రదాయం. జపాన్‌లో సంప్రదాయక కుటుంబ విలువలు మారలేదు. ఇక స్థిరమైన కొలువులు అంతరించిపోయి చాలా కాలమైంది. ఆడైనా, మగైనా అనుక్షణం పోటీపడాల్సిందే. లేకపోతే ఉద్యోగమూ ఉండదు, పైకి ఎగబాకడమూ ఉండదు. రెండు దశాబ్దాలుగా ఆర్థిక వృద్ధిలో వెనుకబడిపోయిన జపాన్‌లో ఒక ఉద్యోగంతో కుటుంబం గడవని స్థితి నెలకొంది. 40 ఏళ్లకు చేరుతున్నా పురుషలు ‘వివాహ అర్హత’ను సంపాదించలేపోతున్నారు. ‘ప్రేమకు, పెళ్లికి కావాల్సినంత భారీ ఆదాయం కాదు నాది. ఉద్వేగభరిమైన ప్రేమ, శృంగారం లేకండా బతకడం అలవాటైపోయింది’ అని సతోరు కిషినో (31) లాంటివాళ్లు తేల్చేస్తున్నారు. ఈ ‘అలవాటు’ సామూ హిక మానసిక రుగ్మత గా ముదిరిపోయింది. ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలను వేస్తూనే ఉనాయి. కానీ ఆర్థిక, సామాజిక మూలాల జోలికిగానీ, సంప్రదాయక కుటుంబ విలువల్లో మార్పును తేవడానికి గానీ కృషి చేయడం లేదు. మరి బ్రహ్మచర్యం మహమ్మారి చెలరేగిపోదా? - పి.గౌతమ్ -
‘5+1’ చరిత్ర సృష్టిస్తుందా?
ఊగిసలాటకు మారుపేరైన ఒబామా ఇరాన్ అణు సమస్యపై తన నూతన వైఖరికి కట్టుబడితే అణు సంక్షోభం మటుమాయమై పోతుంది. ఆయన ఆ సాహసం చేయగలిగితే మధ్యప్రాచ్యంలోని బలాబలాల సమతూకంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టినవారవుతారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించడం చిత్తభ్రాంతి. అలా కనిపించేట్టు చేయడం కనికట్టు. జెనీవాలో మంగళ, బుధవారాల్లో జరిగిన ఇరాన్ అణు చర్చలపై పాశ్చాత్య మీడియా కథనాలను చూస్తుంటే... అది చిత్తభ్రాంతికి గురయ్యిందా? లేక కనికట్టును ప్రదర్శిస్తోందా? అని అనుమానం రాక మానదు. జర్మనీగాక ఐదు భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు (5+1) ఇరాన్‌తో జరిపిన చర్చలు ఆశావహంగా జరిగిన మాట నిజమే. కాకపోతే ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రొహానీ చొరవ అందుకు కారణమనడమే ఈ అనుమనాన్ని రేకెత్తిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావెద్ జారిఫ్ ‘వినూత్న’ ప్రతిపాదనలను (జారిఫ్ ప్యాకేజీ) బహిరంగపరచలేదు. అవే ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని సుసాధ్యం చేస్తున్నాయని మీడియా అంటోంది. ‘దుష్టరాజ్యం’ ఇరాన్‌తో అమెరికా ‘స్నేహ బంధానికి’ అవకాశాలను సైతం కొందరు విశ్లేషకులు చూస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్లు చర్చల్లో గొప్ప పురోగతిని చూస్తుంటే... ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి! మూడు దశాబ్దాలకు పైగా అమలవుతున్న దుర్మార్గమైన ‘ఆంక్షలను పూర్తిగా వినియోగించుకోకుండానే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించకముందే సడలింపులకు అంగీకరించడం చారిత్రక తప్పిదం’ అని మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఆ ‘చారిత్రక తప్పిదం’ చేయడానికి అమెరికా సిద్ధపడింది కాబట్టే జెనీవా చర్చల్లో పురోగతి సాధ్యమైంది! అంతర్జాతీయ అణుశక్తి సంఘం నిబంధనలకు లోబడి ఇరాన్ అణు కర్మాగారాలలో జరిగే తనిఖీలతో పాటూ ఆ దేశంపై అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేయడం కూడా జరగాలనేది ‘జారిఫ్ ప్యాకేజీ’లోని ప్రధానాంశం. ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఇజ్రాయెల్ డిమాండునే ముందు షరతుగా పెట్టి అమెరికా గత ఏడు దఫాల చర్చలు విఫలం కావడానికి కారణమైంది. ఆ షరతును నేడు అమెరికా ఉపసంహరించింది. ఫలితంగా వచ్చే నెలలో జరగనున్న చర్చల్లో అమెరికా ఇరాన్‌కు ఉన్న ‘అనుల్లంఘనీయమైన అణు హక్కులను’ గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఒబామా అందుకు సిద్ధమే. చర్చలకు ముందే ఇరాన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తమ ‘రెడ్ లైన్’ అదేనని స్పష్టం చేశారు. నిజానికి నేటి ప్రతిపాదనలన్నీ ఇరాన్ 2001 నుంచి చేస్తున్నవే. సుప్రీంనేత ఆయతుల్లా ఖమేనీ మధ్యప్రాచ్యంలో పూర్తి అణ్వస్త్ర నిషేధాన్ని ప్రతిపాదించారు! నిజంగానే అణు బాంబులున్న ఇజ్రాయెల్ కోసం అమెరికా అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఇరాన్ తమ అణు హక్కుల గుర్తింపునకు బదులుగా అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని విరమించుకోడానికి సిద్ధంగా ఉంది. ‘నిరర్థకమైన ఇరాన్ సంక్షోభానికి’ ఇకనైనా స్వస్తి పలికి, ‘అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఇరాన్ అణు హక్కులను గుర్తించి’ సమస్యను పరిష్కరించాలనేది ఒబామా నూతన వైఖరి. ఊగిసలాటకు మారుపేరైన ఒబామా ఈ నూతన వైఖరికి కట్టుబడితే ఇరాన్ అణు సంక్షోభం మటుమా యమైపోతుంది. ఆయన ఆ సాహసం చేయగలిగితే మధ్యప్రాచ్యంలోని బలాబలాల సమతూకంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టినవారవుతారు. ఇజ్రాయెల్, సౌదీల వంటి పాత ‘నమ్మకమైన’ మిత్రులను దూరం చేసుకోవాల్సి రావచ్చు. ఇంతవరకు ఆ ప్రాంతంలో అమెరికా విధానానికి ఇజ్రాయెల్, సౌదీలే ప్రధాన ఆధారం. సౌదీ కాబోయే రాజుగా భావిస్తున్న బందర్ బిన్ చర్చల్లో తమకు స్థానం కల్పించనందుకు గుర్రుగా ఉన్నారు. ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతంటే అరబ్బు ప్రపంచంలో తమ ప్రాబల్యం అంతరించిపోవడమేనని భావిస్తున్నారు. ప్రాం తీయ శక్తిగా ఇజ్రాయెల్ స్థానానికి ముప్పు తప్పదని నెతన్యాహూ ఆందోళన. ఇరాన్‌తో సయోధ్య ఇంధన సమస్యకు పరిష్కారం కాగలదని ఈయూ దేశాల ఆశ. ఏకైక అగ్రరాజ్యం తన మధ్యప్రాచ్య విధానాన్ని సమూలంగా మార్చుకునే చారిత్రక సన్నివేశం కోసం రష్యా, చైనాలు వేచి చూస్తున్నాయి. సిరియాపై యుద్ధాన్ని విరమించి ఇప్పటికే ఇజ్రాయెల్, సౌదీల ఆగ్రహాన్ని చవిచూస్తున్న ఒబామా అడుగు వెనక్కు వేయకుండా ఉంటారా? - పి. గౌతమ్