చైనాలో మగాడిగా పుట్టడం కంటే... | China's Growing Problem Of Too Many Single Men | Sakshi
Sakshi News home page

చైనాలో మగాడిగా పుట్టడం కంటే...

Published Fri, Jan 17 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

చైనాలో మగాడిగా పుట్టడం కంటే...

చైనాలో మగాడిగా పుట్టడం కంటే...

చైనాలో ప్రస్తుతం మూడు కోట్ల మంది నలభైకి చేరువవుతున్న పెళ్లి కాని మగాళ్లున్నారు. 2030 నాటికి ప్రతి నలుగురు మగాళ్లలో ఒకరు అలాంటి వారే. పదేళ్ల ఆదాయాన్ని కన్యాశుల్కంగా చెల్లిస్తే గాని ప్రస్తుతం సగటు మగాడికి పెళ్లి కావడం లేదు.
 
 చైనాలోని బీజింగ్, షాంఘైలాంటి నగరాల్లో ధగధగలాడే భారీ హోర్డింగ్‌లపై మెరిసే మగరాయుళ్లంతా మోడల్స్ అని భ్రమపడకండి. వధువులను ఆకర్షించాలని తాపత్రయపడే ‘డైమండ్’, ‘గోల్డెన్’ పెళ్లి కొడుకులు కూడా ఉంటారు. చైనాలో ప్రస్తుతం 3 కోట్ల మంది మగాళ్లు ఎప్పటికీ పెళ్లి కాదేమోననే భయంతో బతుకుతున్నారు. కోటీశ్వరుల నుంచి గ్రామీణ పేదల దాకా అన్ని వర్గాల్లోనూ ‘షెంగ్నాన్’ల (మిగిలిపోయిన మగాళ్లు) సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుత జననాల రేటు ప్రతి 100 మంది ఆడపిల్లలకు 120 మంది మగ పిల్లలుగా ఉంది. 2030 నాటికి మగ జనాభాలో 25 శాతం నలభైకి చేరువవుతున్నా పెళ్లికి నోచుకోని మగాళ్లు అవుతారని అంచనా. ఈ వైపరీత్యానికి ఆ దేశ ‘ఒకే బిడ్డ విధానం’ మూల కారణమనేది నిజమే. అలా అని ఈ సమస్య సప్లయి, డిమాండు సూత్రాలకు ఒడిగేది కాదు.
 
  ఎందుకంటే కోటీశ్వరులు కూడా పెళ్లికాని మగాళ్లుగానే మిగిలిపోతున్నారు. పదేళ్ల ఆదాయానికి సరిపడా పోగేస్తేకానీ కన్యాశుల్కం లేదా కట్నాన్ని చెల్లించలేని దుస్థితి మగాడిది. అతి సామాన్యుడికైనా కనీసం 10 వేల డాలర్ల కట్నం పోయందే పెళ్లి కూతురు రాదు. అగ్రరాజ్యంగా అమెరికా సరసన నిలవాలని పరుగులు తీస్తున్న చైనాలో ఆధునికత సరసనే కాలం చెల్లిన సంప్రదాయాలు, కట్టుబాట్లు చెక్కుచెదరకుండా నిలిచాయి. కాబట్టే ఆధునిక మైన స్వీయ ఎంపిక గాక జీవిత భాగస్వాములను తల్లిదండ్రులే నిర్ణయించే పద్ధతి కొనసాగుతోంది. ఆడాళ్ల కొరత తీవ్రంగా ఉన్న ఆ దేశంలో ‘షెంగ్నిన్’ల  (పెళ్లికాని ఆడవాళ్లు) సమస్య కూడా తీవ్రంగా ఉండటం విచి త్రం. రాజధాని బీజింగ్‌లోనే నలభైకి చేరువవుతున్న ఐదు లక్షల మంది ‘షెంగ్నిన్’లున్నట్టు అంచనా.
 
 చైనా ప్రధాన నగరాలన్నిటిలోనూ ఇప్పుడు పెళ్లిళ్ల ‘పార్టీలు’ జోరుగా సాగుతున్నాయి. అర్హతలను బట్టి ఆడా, మగలకు ఏ, బి, సి, డి గ్రేడులను నిర్ణయిస్తారు. ఆడవాళ్లలో ఏ- గ్రేడ్‌కు చెందినవారు, మగాళ్లలో డి-గ్రేడుకు చెందినవారు ఎక్కువగా పెళ్లికాని వారిగా మిగిలిపోతున్నారు. అందచందాలతోపాటూ మంచి చదువు, ఉద్యోగం ఉన్న ఏ-గ్రేడు ఆడాళ్లు తమకంటే ఎక్కువ స్థాయి వారి కోసం అన్వేషిస్తూ పెళ్లి కాకుండా మిగిలిపోతుంటే... ఏ-గ్రేడు మగాళ్లు తమ వ్యాపారాన్ని జోడు గుర్రాలపై స్వారీ చేయించగల భాగస్వామి కోసం అన్వేషణలో మధ్యవయస్కులైపోతున్నారు. కనీసం 16.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు గల వరుల కోసం నిర్వహించే విలాసవంతమైన ‘పార్టీ’ లలో ‘వలంటీర్లు’గా అన్ని వర్గాల ఆడవారూ పాల్గొనవచ్చు. ‘వలంటీర్లు’ తమ ఒడ్డు, పొడవు, కుటుంబ వారసత్వం, చదువులు, హాబీలను ఏకరువు పెట్టాల్సి ఉంటుంది. కన్యత్వ పరీక్ష సర్టిఫికెట్ అదనపు అర్హత అవుతుంది. ‘కమ్యూనిస్టు’ చైనాలో సంపన్నులు ఆడాళ్లను కొనుక్కోవడమేమిటి? అనే విమర్శలు లేకపోలేదు. ‘వలంటీర్లు’ ధనిక, పేద తేడాల్లేకుండా ‘స్వయంవరం’లో పొల్గొని సంపన్నులను కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇదీ ఆర్థిక సమానతకు మార్గమేనని సమర్థన.
 
 ఆస్తులు, హోదా, పెద్ద చదువులు ఏమీ లేని డి-గ్రేడు మగాళ్ల  మొహం చూసే ఆడాళ్లెవరు? పట్టణ పేద, దిగువ మధ్యతరగతుల్లో, గ్రామీణ జనాభాలో పెళ్లికాని మగాళ్లు అత్యధికంగా ఉంటున్నారు. ఉత్తర కొరియా సరిహద్దు గ్రామాల్లో రైతులు కారు చౌకకు వధువులను కొనుక్కోగలుగుతున్నారు. కూలైనా చేసుకు బతకవచ్చని చైనాలోకి ప్రవేశించే ఉత్తర కొరియా ఆడపిల్లలను బానిసల్లాగా అమ్ముతున్నారు. 15 ఏళ్ల బాలిక ధర  500 నుంచి 1500 డాలర్లు. ఇటీవలి కాలంలో కనీసం రెండు లక్షల మంది చైనాలోకి పారిపోయి రాగా వారిలో 80 శాతం ఆడవాళ్లే. ఒకే బిడ్డ విధానం నుంచి 2030 నాటికి తలెత్తబోతున్న వృద్ధుల సమస్యను పట్టించుకున్నట్టుగా... జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు పెళ్లికాక నిరాశా నిస్పృహలతో బతకడం వల్ల కలగనున్న సమస్యలను గురించి పట్టించుకోవడం లేదు.
 
 ఇప్పటికే మగాళ్లు తమకంటే 10, 20, 30 ఏళ్లు చిన్న ఆడపిల్లలను పెళ్లాడటం జరుగుతోంది. అప్పటికి అదే సర్వసాధారణంగా మారిపోతుందని అంటున్నారు. జనాభాలో నాల్గవ వంతు పెళ్లికాని మగాళ్ల ఆగ్రహం సామాజిక అశాంతిగా చైనాను ముంచెత్తుతుందన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. చైనాలో అభాగ్య వర్గాలు చారిత్రకంగా అత్యంత సహనశీలురని, కాబట్టి అక్కడి సామాజిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని కమ్యూనిస్టు పార్టీ వర్గాలు సెలవిస్తున్నాయి!
 పి. గౌతమ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement