‘5+1’ చరిత్ర సృష్టిస్తుందా?
ఊగిసలాటకు మారుపేరైన ఒబామా ఇరాన్ అణు సమస్యపై తన నూతన వైఖరికి కట్టుబడితే అణు సంక్షోభం మటుమాయమై పోతుంది. ఆయన ఆ సాహసం చేయగలిగితే మధ్యప్రాచ్యంలోని బలాబలాల సమతూకంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టినవారవుతారు.
ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించడం చిత్తభ్రాంతి. అలా కనిపించేట్టు చేయడం కనికట్టు. జెనీవాలో మంగళ, బుధవారాల్లో జరిగిన ఇరాన్ అణు చర్చలపై పాశ్చాత్య మీడియా కథనాలను చూస్తుంటే... అది చిత్తభ్రాంతికి గురయ్యిందా? లేక కనికట్టును ప్రదర్శిస్తోందా? అని అనుమానం రాక మానదు. జర్మనీగాక ఐదు భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు (5+1) ఇరాన్‌తో జరిపిన చర్చలు ఆశావహంగా జరిగిన మాట నిజమే. కాకపోతే ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రొహానీ చొరవ అందుకు కారణమనడమే ఈ అనుమనాన్ని రేకెత్తిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావెద్ జారిఫ్ ‘వినూత్న’ ప్రతిపాదనలను (జారిఫ్ ప్యాకేజీ) బహిరంగపరచలేదు. అవే ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని సుసాధ్యం చేస్తున్నాయని మీడియా అంటోంది.
‘దుష్టరాజ్యం’ ఇరాన్‌తో అమెరికా ‘స్నేహ బంధానికి’ అవకాశాలను సైతం కొందరు విశ్లేషకులు చూస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్లు చర్చల్లో గొప్ప పురోగతిని చూస్తుంటే... ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి! మూడు దశాబ్దాలకు పైగా అమలవుతున్న దుర్మార్గమైన ‘ఆంక్షలను పూర్తిగా వినియోగించుకోకుండానే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించకముందే సడలింపులకు అంగీకరించడం చారిత్రక తప్పిదం’ అని మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఆ ‘చారిత్రక తప్పిదం’ చేయడానికి అమెరికా సిద్ధపడింది కాబట్టే జెనీవా చర్చల్లో పురోగతి సాధ్యమైంది!
అంతర్జాతీయ అణుశక్తి సంఘం నిబంధనలకు లోబడి ఇరాన్ అణు కర్మాగారాలలో జరిగే తనిఖీలతో పాటూ ఆ దేశంపై అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేయడం కూడా జరగాలనేది ‘జారిఫ్ ప్యాకేజీ’లోని ప్రధానాంశం. ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఇజ్రాయెల్ డిమాండునే ముందు షరతుగా పెట్టి అమెరికా గత ఏడు దఫాల చర్చలు విఫలం కావడానికి కారణమైంది. ఆ షరతును నేడు అమెరికా ఉపసంహరించింది. ఫలితంగా వచ్చే నెలలో జరగనున్న చర్చల్లో అమెరికా ఇరాన్‌కు ఉన్న ‘అనుల్లంఘనీయమైన అణు హక్కులను’ గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఒబామా అందుకు సిద్ధమే.
చర్చలకు ముందే ఇరాన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అబ్బాస్ అరాగ్‌చీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తమ ‘రెడ్ లైన్’ అదేనని స్పష్టం చేశారు. నిజానికి నేటి ప్రతిపాదనలన్నీ ఇరాన్ 2001 నుంచి చేస్తున్నవే. సుప్రీంనేత ఆయతుల్లా ఖమేనీ మధ్యప్రాచ్యంలో పూర్తి అణ్వస్త్ర నిషేధాన్ని ప్రతిపాదించారు! నిజంగానే అణు బాంబులున్న ఇజ్రాయెల్ కోసం అమెరికా అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఇరాన్ తమ అణు హక్కుల గుర్తింపునకు బదులుగా అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని విరమించుకోడానికి సిద్ధంగా ఉంది. ‘నిరర్థకమైన ఇరాన్ సంక్షోభానికి’ ఇకనైనా స్వస్తి పలికి, ‘అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఇరాన్ అణు హక్కులను గుర్తించి’ సమస్యను పరిష్కరించాలనేది ఒబామా నూతన వైఖరి.
ఊగిసలాటకు మారుపేరైన ఒబామా ఈ నూతన వైఖరికి కట్టుబడితే ఇరాన్ అణు సంక్షోభం మటుమా యమైపోతుంది. ఆయన ఆ సాహసం చేయగలిగితే మధ్యప్రాచ్యంలోని బలాబలాల సమతూకంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టినవారవుతారు. ఇజ్రాయెల్, సౌదీల వంటి పాత ‘నమ్మకమైన’ మిత్రులను దూరం చేసుకోవాల్సి రావచ్చు. ఇంతవరకు ఆ ప్రాంతంలో అమెరికా విధానానికి ఇజ్రాయెల్, సౌదీలే ప్రధాన ఆధారం. సౌదీ కాబోయే రాజుగా భావిస్తున్న బందర్ బిన్ చర్చల్లో తమకు స్థానం కల్పించనందుకు గుర్రుగా ఉన్నారు. ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతంటే అరబ్బు ప్రపంచంలో తమ ప్రాబల్యం అంతరించిపోవడమేనని భావిస్తున్నారు. ప్రాం తీయ శక్తిగా ఇజ్రాయెల్ స్థానానికి ముప్పు తప్పదని నెతన్యాహూ ఆందోళన. ఇరాన్‌తో సయోధ్య ఇంధన సమస్యకు పరిష్కారం కాగలదని ఈయూ దేశాల ఆశ. ఏకైక అగ్రరాజ్యం తన మధ్యప్రాచ్య విధానాన్ని సమూలంగా మార్చుకునే చారిత్రక సన్నివేశం కోసం రష్యా, చైనాలు వేచి చూస్తున్నాయి. సిరియాపై యుద్ధాన్ని విరమించి ఇప్పటికే ఇజ్రాయెల్, సౌదీల ఆగ్రహాన్ని చవిచూస్తున్న ఒబామా అడుగు వెనక్కు వేయకుండా ఉంటారా?
- పి. గౌతమ్