పగటి కల... చేదు నిజం! | Reid: Republicans Don't Care About The Unemployed | Sakshi
Sakshi News home page

పగటి కల... చేదు నిజం!

Published Fri, Feb 14 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

పగటి కల... చేదు నిజం!

పగటి కల... చేదు నిజం!

ప్రపంచం సంక్షోభం నుంచి బయటపడి కోలుకునే దశలో ఉన్నదని, త్వరలోనే పూర్వ పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. కానీ అమెరికాసహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలలో కోలుకునే దశ ఉద్యోగాలు లేనిదిగానే ఉంది.
 
 ‘కూచ్ సర్ఫింగ్’ అనే మాట విన్నారా? తెలుగులో ‘మంచం కోసం వేట’ అనాలేమో. అమెరికన్ సెనేట్ మెజారిటీ నేత డెమోక్రాట్ హారీ రీడ్‌కు కూడా నిన్నటి దాకా అలాంటి పద ప్రయో గం ఉన్నదని తెలీదు. ‘‘ఇంటి అద్దె చెల్లించలేక ‘మంచం కోసం వేట’లో మిత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, రాత్రికో చోట తలదాచుకోలేక ఇప్పటికే చస్తున్నాను. నిరుద్యోగ బీమాకు మంగళం పలికేసి మరింత నరకం చూపకండి’’ అని మొరపెట్టుకుంటూ ఒక నెవడా మహిళ రీడ్‌కు లేఖ రాసింది. గత గురువారం ఆయన దాన్ని సెనేట్‌కు వినిపించారు. అభాగ్యుల విలాపాలను వినరాదని ఎరిగిన సెనేట్ నిరుద్యోగ బీమా పొడింపు బిల్లును చెత్తబుట్టకు (58-40) పంపింది. పని కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆరు నెలల నిరుద్యోగ భృతి, తదితర సదుపాయాలను కల్పిస్తుంది.
 
 వాటి కొనసాగింపునకు 2008లో ‘అత్యవసర నిరుద్యోగ పరిహార పథకా’న్ని ప్రారంభించారు. దాని గడువు గత డిసెంబర్ 28తో ముగిసిపోయింది. మరుక్షణమే 13 లక్షల మంది బికార్లయ్యారు. మార్చికి మరో 22 లక్షల మంది వారిలో కలుస్తారు. 2009 చివరికే ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి గట్టెక్కి కోలుకునే దశకు చేరిందని ప్రభుత్వం సెలవిస్తోంది. కాబట్టి ఆరు నెలలు పైబడి నిరుద్యోగులుగా ఉన్న వారంతా సోమరిపోతులేనని తేల్చేశారు. ‘మంచం వేట’ మాని తక్షణమే పని చేసుకోమని నెవడా మహిళకు ఉచిత సలహాను పారేశారు. ఆమెలాటి ‘సోమరిపోతులు’ దేశంలో 37 లక్షల మందున్నారు!
 గత పది రోజులుగా ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లోనేగాక జపాన్‌లో సైతం జోరుగా సాగుతున్నవి నియామకాలు కావు... ఉద్వాసనలు (లే-ఆఫ్‌లు)! ఉద్యోగాలపై కత్తి ఎత్తిన యాభైకి పైగా బహుళ జాతి సంస్థల్లో మనకు బాగా తెలిసినవి మచ్చుకి... కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ‘డెల్’ కనీసం 15 వేల మందికి, ‘వోల్వో’ వాహనాల సంస్థ 4,400 మందికి, ‘నోవార్టిస్.’ ‘ఆస్త్రాజెనెకా’ ఫార్మా సంస్థలు ఒక్కొక్కటి ఐదు వేల మందికి, ‘సోనీ’ 5,000 మందికి ఉద్వాసన పలుకుతున్నాయి. 2008 సంక్షోభానికి ముందు రెండు దశాబ్దాలూ ఉద్యోగాలు లేని వృద్ధి దశ.
 
 అలాగే నేటి కోలుకునే దశ కూడా ఉద్యోగాలు లేనిదే. ప్రపంచ ఉద్యోగితపై అంతర్జాతీయ కార్మిక సంస్థ జనవరిలో విడుదల చేసిన తాజా నివేదిక పేరు ‘ఉద్యోగాలులేని కోలుకునే దశ?’ అమెరికా నిపుణులు గత ఏడాదిలో నెలకు రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. గత డిసెంబర్‌లో కల్పించిన ఉద్యోగాలు 74 వేలు! నిరుద్యోగం 10 శాతం (2009) నుంచి 6.7 శాతానికి తగ్గిందంటున్నా... పూర్తికాలం పని కోరే పార్ట్‌టైమర్లు మొత్తం ఉద్యోగులలో 13.1 శాతం ఉన్నారు. 2014 మొదటికి జనాభాలో ఉపాధిని కలిగిన వారి వాటా 1983 తర్వాత అతి కనిష్ట స్థాయికి, 59 శాతానికి దిగజారింది. కొత్త ఉద్యోగాల్లో అత్యధికం నాసిరకం అల్ప వేతన ఉద్యోగాలు, ఏ ప్రయోజనాలు లేని పార్ట్ టైం ఉద్యోగాలే.
 
 ఒకప్పుడు వస్తు తయారీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి వెన్నెముక. గత దశాబ్దిగా ఆ రంగం 26 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. నేడు కూడా నిరుద్యోగులుగా మారుతున్నవారే తప్ప కొత్త నియామకాలు లేవు. గత ఏడాది కొత్త ఉద్యోగాల్లో అత్యధికం (8 లక్షలకు పైగా) ఏడాదికి 25 వేల డాలర్ల కంటే తక్కువ వేతనాన్ని ఇచ్చే అల్ప వేతన రంగాలవే. ప్రైవేటు సగటు వేతనం గంటకు 20.04 డాలర్లలో 80 శాతం లేదా అంత కంటే తక్కువ వేతనాలను అల్ప వేతనాలుగా నిర్వచించారు. 2008 సంక్షోభం తదుపరి కల్పించిన ఉద్యోగాల్లో 60 శాతం అవే. 4.7 కోట్ల అల్పవేతన జీవులంతా ఆహార కూపన్ల బతుకుల పేదలే. వారిలో ఫాస్ట్‌ఫుడ్ వర్కర్లు, దుకాణాల్లో బట్టలు మడతపెట్టడం, గిన్నెలు కడగ డం వంటి పనులకు గంటకు 10 డాలర్ల కంటే తక్కువ వే తనమే.
 
 ఈ అత్యల్ప వేతన జీవులు 25 శాతంపైనే. అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆర్భాటపు ‘కనీస వేతనాల పెంపుదల’ బిల్లు (గంటకు 7.25 నుంచి 10.10 డాలర్లు) కూడా సెనేట్‌లో బోర్లాపడక తప్పేట్టు లేదు. నేడు ప్రతి ఐదు అమెరికన్ కుటుంబాల్లో ఒకటి (20 శాతం) ఆహార కూపన్లపై ఆధారపడుతున్నాయి. ఆహార కూపన్ల బతుకుల సంఖ్య 2009-2013 మధ్య 51.3 శాతం పెరిగింది. పోర్ట్‌లాండ్‌లో వారానికి రెండుసార్లు ఏకధాటిగా 18 గంటల షిప్టులో వికలాంగ పెద్దలకు సంరక్షకునిగా బట్టలు ఉతకడం, స్నానాలు చేయించడం వంటి పనులు చేసే హెచ్ డెర్ (37) వంటి వారు... ‘ఎక్కడ ఈ పని పోగొట్టుకొని నా కుటుంబం ఆకలితో మాడేట్టు చేస్తానోనని నిర ంతరం బీతావహు’లవుతూ బతుకుతున్నారు. ఇక ‘హలో క్లాస్, మీ ప్రొఫెసర్ ఆహార కూపన్లపై బతుకుతోంది’ అనే కథనంతో ‘హఫింగ్‌టన్ పోస్ట్’లో తన గోడును వెళ్లబోసుకున్న కేతే క్విక్... ఆహార కూపన్లకు అనుమతి వస్తే ఆకాశం దిగొచ్చినంతగా సంబరపడింది. కాలంతో పాటే మాటలకు అర్థాలూ మారుతున్నట్టుంది. ఆర్థిక వ్యవస్థ ‘కోలుకోవడం’ అంటే పేదరిక ం పెరగడమని అర్థం గామోసు!
 - పి. గౌతమ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement