
కీవ్/హెల్సింకీ: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ నుంచి రష్యా బలగాలు వెనక్కు మళ్లుతున్నాయి. ఉక్రెయిన్ ప్రతిఘటనను తట్టుకోలేకే రష్యా వెనుకడుగు వేస్తున్నట్లు ఇంగ్లండ్ పేర్కొంది. ఖర్కీవ్‌లో ఉక్రెయిన్‌దే పై చేయి అని చెప్పింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఆరు పట్టణాలను, గ్రామాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. యుద్ధ ఫలితం యూరప్, మిత్రదేశాల మద్దతుపై ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికా రిపబ్లికన్ నేత మిచ్ మెక్‌కానెల్ నేతృత్వంలో సెనేట్ సభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌లో హోరాహోరీ పోరు జరుగుతోంది.
‘నాటో’కు దరఖాస్తు చేస్తాం: ఫిన్లండ్
నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయాలని నిర్ణయించినట్టు ఫిన్లండ్ అధ్యక్షుడు సౌలీ నీనిస్టో స్పష్టం చేశారు. శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్లో ఈ విషయం చెప్పారు. స్వీడన్ కూడా నాటోలో చేరాలని నిర్ణయించుకోవడం తెలిసిందే.
పుతిన్‌కు ఆగస్టులో పదవీ గండం!: పుతిన్‌ను గద్దె దించడానికి రష్యాలో ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్టు ఉక్రెయిన్ నిఘా విభాగం చీఫ్ మేజర్ జనరల్ కైరిలో బడానోవ్ చెప్పారు. ఆయనపై తిరుగుబాటు జరుగనుందన్నారు. యుద్ధంలో ఈ ఏడాది ఆఖరుకల్లా రష్యా ఓడిపోతుందన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పుతిన్ తీవ్రమైన అనారోగ్యం పాలైనట్టు రష్యా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆయన పార్కిన్సన్‌తోనూ బాధపడుతున్నట్లు వార్తలొచ్చాయి.