కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఖేర్సన్ దక్షిణ ప్రాంతం, జపోరిజియా పరిధిలో రష్యా సేనలు స్వీయ రక్షణలో పడ్డాయని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇరాన్ తయారీ షాహీద్ డ్రోన్లు, క్షిపణులు, శతఘ్ని, మోర్టార్ దాడులు పెరిగాయని ఉక్రెయిన్ తెలిపింది. పలు చోట్ల జరిగిన దాడుల్లో శనివారం నలుగురు మరణించారని వెల్లడించింది. ఒడెసాలోని నౌకాశ్రయం వద్ద జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడ్డారు.
20కిపైగా షాహీద్ డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్‌కేంద్రం జపోరిజియా న్యూక్లియర్‌పవర్ ప్లాంట్‌లో చివరి రియాక్టర్‌ను అధికారులు షట్‌డౌన్ చేశారు. ప్లాంట్ సమీపంలో బాంబుదాడుల బెడద ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్ అణుఇంథన సంస్థ ఎనర్జియాటమ్ తెలిపింది. కేంద్రక విచ్ఛిత్తి చర్య, అత్యధిక ఉష్ణోద్భవం, పీడనాలను ఆపేందుకు ఆరింటిలో చిట్టచివరిదైన ఐదో రియాక్టర్‌లో కూలింగ్ రాడ్లను కోర్‌లోకి దింపేశామని తెలిపింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది.
ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థకు సరఫరా చేసే విద్యుత్ లైన్లు దాడుల కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్లాంట్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా అసాధ్యం. రియాక్టర్ షట్‌డౌన్‌కు ఇదీ ఒక కారణమేనని ఎనర్జియాటమ్ వివరించింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించాక ప్లాంట్ నిర్వహణ బాధ్యత రష్యా చేతికొచ్చింది. మరోవైపు కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో వరదమయమైన ఖేర్సన్‌లో ఇంకా నీరు 4.5 మీటర్ల ఎత్తులో నిలిచే ఉంది. ఈ వారంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముంపు ప్రజలకు సహాయక చర్యలకు విఘాతం కలగొచ్చని ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ హెచ్చరించారు. దాదాపు 7 లక్షల మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం అధిపతి మార్టిన్ ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment