జాత్యహంకారం సోకుతోందా?
విదేశీ పర్యాటకులను రా, రమ్మని పిలిచే భారత దేశవు ‘స్వర్గ సీమ’ గోవా ఒక దౌత్య సంక్షోభానికి కేంద్రమైంది. వారం క్రితం జరిగిన ఒక నైజీరియన్ హత్యపై పోలీసులు ‘ఒక నల్లవాడి చావు’తో వ్యవహరించాల్సిన విధంగానే వ్యవహరించారు. బాధ్యతారాహిత్యంతోపాటూ, వీసా గడువుకు మించి ఉన్న దాదాపు 150 మంది నైజీరియన్లను వెనక్కు పంపేయాలని నిర్ణయించారు. మాదకద్రవ్య ముఠాలకు వ్యతిరేకంగా చేపట్టిన పోరులో భాగమే ఇది అనడం నమ్మశక్యం కాదు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మాదకద్రవ్యాల విని యోగం, అక్రమ వ్యాపారం అక్కడా పెరుగుతున్నాయి. పైగా వీసాల గడుపు దాటిన నైజీరియన్లను మాత్రమే పంపేయాలని నిర్ణయించడమంటే వారు మాత్రమే మాదకద్రవ్య ముఠాలకు చెందినవారని చెప్పడమే. నైజీరియన్లు ‘క్రూర జంతువులు’ ‘క్యాన్సర్ కురుపులు’ అని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ మంత్రి వర్గ సహచరుడు ఒకరు అననే అన్నారు. పుండు మీద కారం జల్లినట్టున్న ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా గోవాలోని నైజీరియన్లు ఆందోళనకు దిగారు, హద్దు మీరి ఉంటే ఉండొచ్చు. పోలీ సులు అంటున్నట్టు ఆ హత్య మాదకద్రవ్య ముఠాల మధ్య తగాదాలతో ముడిపడినదే అయినా కావొచ్చు.
గోవా ఘటనపై నైజీరియన్ రాయబార కార్యాలయం తీవ్రంగానే స్పందించింది. నైజీరియన్లపై వివక్ష చూపి బహిష్కరించడం తమ దేశంలోని లక్ష మందికి పైగా భారతీయులపై దాడులకు దారి తీయవచ్చని హెచ్చరించింది. మన దేశంలోని నైజీరియన్ల సంఖ్య 40 వేల వరకు ఉంటుంది. నైజీరియాకు మనమిచ్చేంత ప్రాధాన్యం అది మనకు ఇవ్వనవసరం లేదు. గోవా పోలీసులు, ప్రభుత్వం నేరస్తుల దేశంగా ముద్రవేస్తున్న నైజీరియా చమురు సంపన్న దేశం. చమురు ఉత్పత్తిలో దానిది పన్నెండో స్థానం, ఎగుమతులలో ఎనిమిదో స్థానం. చమురు ఎగుమతులలో 40 శాతం అమెరికాకే. పైగా దేశం పొడవునా ప్రవహించే నైజిర్ నది ఉంది. అది నైజిర్ డెల్టాను సస్యశ్యామలంగా మార్చింది. బొగ్గు, రాగి, బాక్సైటు తదితర ఖనిజాల నిక్షేపాలు కూడా ఆ డెల్టా ప్రాంతంలోనే ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టయింది నైజీరి యన్ల పరిస్థితి. స్థూల జాతీయోత్పత్తి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 36వ స్థానంలో ఉన్న ఆ దేశం మానవాభివృద్ధి సూచికలో 154వ స్థానంలో ఉంది!
గోవా దౌత్య దూమారం రేగుతుండగా హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’... బహుళ జాతి సంస్థ ‘షెల్’ నైజీరియాలో చము రు పైపుల లీకేజీని అనుమతిస్తోందని ఆరోపించింది. లేకపోతే ఒక్క ఏడాదిలో 340 సార్లు చమురు లీకు కాదని స్పష్టం చేసింది. దశాబ్దాల క్రితం నాటి చిల్లులు పడ్డ పైపులతోనే పెట్రో కంపెనీలు చమురును రవాణా చేస్తున్నాయి. దీంతో డెల్టా ప్రాంతమంతా రుద్ర భూమిగా మారిపోతోంది. మంచినీటి వనరులు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఖనిజ సంపదను అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో తరలించుకు పోవడమే వారికి ముఖ్యం. పంటపొలాలు, హరితారణ్యాలు గడ్డిపరక మొలవని మృత్యు భూమిగా మారిపోతే ఎవరికి కావాలి? పైగా అవి ‘చమురు దొంగల’ సాయుధ ముఠాలను సైతం ప్రోత్సహించి అస్థిరతను సృష్టిస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ చమురు లీకేజీలతో ఊళ్లకు ఊళ్లే వల్ల కాళ్లుగా మారిపోతున్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో నైజీరియాకు మరో అరుదైన ఘనత కూడా దక్కింది. ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోనే భూ దురాక్రమణలు సాగుతున్నాయి. భూ బకాసురులు అతిగా పేట్రేగిపోతున్న దేశాల్లో ద్వితీయ స్థానం నైజీరియాదే. ఆఫ్రికన్లందరినీ చిన్నచూపు చూసి, జాత్యహంకార వైఖరిని ప్రదర్శించే భారత సంస్థలు ఆఫ్రికాలో సాగుతున్న భూఆక్రమణల్లో ముఖ్య పాత్రధారులుగా ఉన్నాయి. లాగోస్ రాష్ట్రంలో ని భారతీయులు అలాంటి ‘రైతులు’, వారి ఉద్యోగులు, వివిధ ప్రాజెక్టులలో పని చేస్తున్న వారు. ఆఫ్రికా దేశాల సంపదలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పాశ్చాత్య దేశాలతో పాటూ మన దేశంలో కూడా నల్లజాతి వ్యతిరేకత ప్రబలడం ప్రమాదకరం. మొగ్గలోనే తుంచడం శ్రేయస్కరం.
-పి. గౌతమ్