
దళితులకు ‘చేత’బడి
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
‘‘భారతదేశంలో కాంగ్రెస్ అ త్యంత సంపన్నవంతమైన ధనికపార్టీ. డబ్బుతో అది ఏ పని చే యడానికైనా సిద్ధం! అవినీతి, ఆశ్రీతపక్షపాతం, బ్లాక్ మార్కె ట్టు మాత్రమే కాంగ్రెస్ పరిపాల నలో బలపడ్డ పరిశ్రమలు! ఈ చెడులన్నీ భారీ ఎత్తున పేట్రేగి పోయాయి. కనుకనే ధనిక వర్గానికి, పేద ప్రజలకూ మధ్య అంతరాలు, అసమానతలూ పెరిగిపోయాయి’’
- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్ణేత, దళితవర్గ అగ్రేసర నాయకుడు
భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన తదుపరి 21 మాసాలకే కాంగ్రెస్ పాలన వల్ల ‘అవి నీతి, ఆశ్రీతపక్షపాతం, బ్లాక్ మార్కెట్టు’ ఎంత విస్తృతస్థాయిలో అల్లుకుపోయి, సామాజిక అసమానతలకు అంకురార్పణ జరిగిందో డాక్టర్ అంబేద్కర్ గుర్తించారు. గుర్తించడమే కాదు, దోపిడీ, అసమానతలకు తావివ్వని నవ స మాజ వ్యవస్థను స్థాపించుకోడానికి దేశంలోని యావన్మం ది పేద, దళిత బహుజనులంతా అవినీతికర రాజకీయపక్షాలకు దూరంగా ఒక్కతాటిపైన ఎందుకు ఐక్యమై తీరాలో ఆయన 1951 అక్టోబర్ 29 నాటి పాటియాలా సభలోనే స్పషం చేశారు! 63 ఏళ్ల తర్వాత కూడా ఆయన తీవ్ర విమర్శ అక్షర సత్యంగా వర్తిస్తుంది. ఎందుకంటే, ఇన్నేళ్లుగానూ కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారం చెలాయిస్తున్న ధనిక వర్గ రాజకీయ పక్షాలు పేద, దళిత బహుజన వర్గాలను ఎన్నికలకు ముడి సరుకుగా ఉపయోగించుకుని, అందలం ఎక్కిన తరవాత ‘అసంట’నే ఉండమంటూ వస్తున్నాయి! కాంగ్రెస్, బీజేపీ లాంటి ధనిక వర్గ పార్టీలకు, వాటి మధ్య దూరి తామూ ఎన్నో కొన్ని ఓట్లూ, సీట్లూ ‘బావుకుందామని’ ఎన్నికల జూదంలోకి దిగుతూ వస్తున్న కొన్ని వామపక్షాలకూ నచ్చక పోయినా ఇది అక్షర సత్యం. ఎన్ని లోపాలున్నా, బ్రిటిష్ పాలకులు తమ స్వార్థం కోసమే రూపొందించుకున్నదే అయినా 1935 నాటి ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు’ లేకపోతే జనాభా ప్రాతిపదికన దళిత వర్గాలకు ఆ మాత్రపు రిజర్వేషన్లు, సీట్లూ కూడా దక్కి ఉండేవి కావు! అంబేద్కర్ నాయకత్వంలో ‘మహర్ ఉద్యమం’ జరగకపోయి ఉంటే అగ్రవర్ణాల దోపిడీ దురహంకారం నుంచి దళిత బహుజన వర్గాలకు ఆ మాత్రపు వెసులుబాటు కూడా వచ్చి ఉండేది కాదు. స్వాతంత్య్రానంతరం దళిత, ఆదివాసీ ప్రజా బాహుళ్యం ప్రయోజనాల కోసం ఉద్దేశించినట్టు కనిపిం చిన ఎస్సీ, ఎస్టీ చట్టాలు నేటికీ ఎవరికి కొమ్ము కాస్తున్నాయో నిత్యం అనేకచోట్ల అవమాన భారాన్ని మోస్తున్న వారికే తెలుసు!
దళితులకు కాంగీ గాలం
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తెలుగుజాతిని చీల్చి, ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ అధిష్టానం, దాని నాయకురాలు సోనియా, రేపటి ‘ప్రధాని’ రాహుల్‌గాంధీ, ప్రజలు తిరస్కరించిన ఇతర నేతలూ కలిసి విభజన బిల్లుతో తగలబడిపోతున్న రాష్ట్రంలో ‘బొగ్గులు’ ఏరుకోవడానికి, మరోసారి దళిత బహుజనులను మోసగించడానికి వ్యూహం పన్నారు! తెలుగుజాతిని విభజించి రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాలను దక్కించుకోడం కోసం పడుతున్న పాట్లలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర దళిత నాయకుల్ని, దళితుల్ని సమీకరించడానికి తాజాగా (5-1-2014) ఓ పెద్ద ప్రయత్నం చే సింది. ఏఐసీసీ వారి ‘షెడ్యూల్డ్ కులాల’ విభాగానికి అధ్యక్షుడైన కె. రాజు అనే వ్యక్తి సాక్షాత్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తరఫున హైదరాబాద్‌లో వాలారు! ఎప్పటి మాదిరే జనరల్ ఎన్నికల ముందు ‘పార్టీని బలోపేతం చేసుకోవడానికి అనుసరించదగిన పద్ధతులు, మార్గాలను’ గురించి రాష్ట్ర దళిత నాయకులతో చర్చించడం కోసం గాంధీ భవన్‌కు వేంచేశారు! ఇంతకూ ఆ సమావేశానికి ఎంతమంది ‘కాంగ్రెస్ దళిత’ నాయకులొచ్చారు? మల్లు భట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య, ఆరేపల్లి మోహన్‌లు తప్ప ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా ఇతర దళిత ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొననే లేదు. గత పదేళ్లుగా తమను పట్టించుకున్న నాథుడే లేడని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభ్యులు రాజుతో మొరపెట్టుకోవలసి వచ్చింది! ఏఐసీసీ బ్యురాక్రాట్ ‘రాజు’ రాష్ట్రంలో కొన్ని ‘సంక్షేమ పధకాలు’ పెట్టించడానికి కారకుడు కూడా. అయినా ఎందుకింతగా దళిత నాయకుల వ్యతిరేకతను చూరగొనవలసి వచ్చింది? పదేళ్లుగా విస్మరించిన దళిత నాయకులు ఎన్నికలకు ముందే ఎందుకు గుర్తుకు రావాల్సివచ్చింది? పార్టీ ‘కార్యక్రమాల’ను గ్రామ గ్రామానికి తీసుకుపోవడానికి ప్రతి గ్రామంలోనూ ముగ్గురు-నలుగురు ‘చురుకైన కార్యకర్తల’ను ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల శాఖ గుర్తించాలని, తద్వారా పార్టీలో ‘దళిత గొంతులు’ అధికంగా వినిపించేటట్టు చూడాలని రాహుల్ తనకు పురమాయించాడని రాజు చెప్పుకున్నారు!
రాజకీయ స్వాతంత్య్రమే చాలదు
ఇంతకూ అసలు ప్రశ్నకు - అదే డాక్టర్ అంబేద్కర్ వేలెత్తి చూపిన సామాజిక, ఆర్థిక అసమానతలకు, అవమానాలకు కారకులెవరన్న ప్రశ్నకు నేటికీ సూటైన సమాధానం లేదు! ఒక్క రాజకీయ స్వాతంత్య్రమే చాలదు, సామాజిక - ఆర్థికరంగాలలో విప్లవాత్మకమైన మార్పులు రానిదే నవ్యభారత నిర్మాణం జరగదని హెచ్చరిస్తూ వచ్చినవాడు అంబేద్కర్. ఈ పని జరగకపోతే త్యాగాలతో రూపొందిం చుకున్న స్వాతంత్య్రమనే సుందరమైన ‘భవంతి’ని కూడాప్రజలు లెక్కచేయరన్నాడు! హైందవ సమాజంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న దళిత బహుజనులను అస్పృశ్యత పేరుతో ‘వెలివాడల’కు బందీలుగా చేసినంత కాలం అది పౌర స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు పెద్ద అపవాదన్నవాడు అంబేద్కర్. స్త్రీలు కూడా ఈ వర్గ సమాజంలో దళితులేనని ఆయన చాటాడు! ఎన్ని చట్టాలున్నా అవి దళిత బహుజన వర్గాల ప్రయోజనాలకు తగిన స్థాయిలో రక్షణగా నిలవలేకపోతున్నాయి. ఇటీవల సంవత్సరాలలోనే రాష్ట్రంలో చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ, కంచికచర్ల, చలకుర్తి, మహబూబ్‌నగర్, కరీంనగర్, మక్తా కొత్తగూడెం, తాళ్ల ఊకల్లు, గొప్పారం వగైరా ప్రాంతాల్లో విచ్చలవిడిగా దళితులపై జరిగిన దాడులూ, అత్యాచారాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు! ఇలాంటి ఘట్టాలను అంబేద్కర్ తన చిన్న నాట అనుభవించి ఉన్నందుననే, స్వాతంత్య్రానంతరం కూడా హైందవ సమాజంలో అదే పరిస్థితి కొనసాగుతున్నందున ‘పూనా సంధులు’ ఎన్ని వచ్చినా... దళిత బహుజనుల ప్రయోజనాల రక్షణలో తాను విఫలమయ్యానన్న మానసిక బాధకు గురయ్యారు. చివరికి 1956, అక్టోబర్ 14న చరిత్రాత్మక నాగపూర్ పట్నంలో ఆరు లక్షల మంది దళితుల మధ్య ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాల్సివచ్చింది! రాజ్యాంగాన్ని ప్రసాదించిన చేతులనే ‘హైం దవ’ సమాజం పరోక్షంగా నరికివేసినట్టయింది! దళితులకు దేవాలయ ప్రవేశం కలిగించినంత మాత్రాన వారి శ్రమైక జీవన సౌందర్యానికి విలువ లభించదని, కుల వ్యవస్థ నుంచి పారుతున్న మురికి నీటి వల్ల అది వృధా అయిపోతుందని అన్నాడు అంబేద్కర్. దున్నేవాడికే భూమి హక్కు చెందాలనీ, భూములు లేని నిరుపేదలైన దళిత బహుజనులకు కౌల్దారీ చట్టాల ద్వారా కాకుండా సమష్టి వ్యవసాయ క్షేత్రాల వల్ల మాత్రమే ప్రయోజనాలు దక్కుతాయని చెప్పిన వాడూ అంబేద్కరే! కుల పిచ్చి దేశ ఆర్థిక ప్రగతికే పరమ చేటని, సమష్టి కృషికి హానికరమని ఆయన అన్నాడు!
దళిత బహుజనుల ‘ఏకతార’
తీరా మనం ఇప్పుడు ఏ స్థితికి దిగజారిపోయాం? ఈ ధనిక వర్గ సమాజంలో ఇప్పటికీ భారీ ఎత్తున సాగుతున్న ‘క్లాస్ వార్’ ముగింపునకు రాకుండానే ‘గ్లాస్‌వార్’ (హోటళ్లలో, కఫిటేరియాలలో కుల పిచ్చి మనిషి చేత్తో పుచ్చుకునే ‘గ్లాసుల’ వరకూ) కొనసాగుతోంది! ఈ పూర్వరంగంలో ఓట్ల కోసం రాజకీయులు వేసే గాలానికి చిక్కకుండా స్వతంత్ర శక్తితో దళిత బహుజనులంతా ఏకం కాగలిగితేనే, అటు తెలుగు జాతి విభజననూ, ఇటు ఎన్నికల పేరిట దళిత వర్గాలను చీల్చి పబ్బం గడుపుకొనజూచే రాజకీయ పక్షాల ఆటనూ కట్టడి చేయగలుగుతారు. మహా కవి జాషువా కోరుకున్నట్టు దళిత బహుజన వర్గాలలోని చిల్లర మల్లర అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి చెప్పి ఏక తాటిపై నిలబడితేనే ‘ఏకతార’ను జయప్రదంగా మీటగలుగుతారు! రాజ్యాధికార పగ్గ్గాలు పట్టుకోగల శుభముహూర్తానికి మరింత దగ్గర కాగలుగుతారు! అప్పుడు మాత్రమే దళిత బహుజనులు -
‘‘కాకతీరిన డప్పు మీద /శబ్ద తరంగం వికసించిన ట్లు /కత్తులకు సానపెట్టే /చక్రం మీద నిప్పుల పువ్వుల్ని’’ పూయించగలుగుతారు! అంతవరకూ దళిత ముసుగులోనే ఉన్న స్వకీయ వర్గ తైనాతీలకు పేద, దళిత వర్గాలు చోటు ఇవ్వరాదు, మరోసారి మోసపోరాదు! మోసాలకు దూరంగా రోషంతో మరో చరిత్ర సృష్టించండి! ఇదే దళిత బహుజనుల రేపటి మానిఫెస్టో!