డేవిడ్ కామెరాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ | David cameron is not written diary | Sakshi
Sakshi News home page

డేవిడ్ కామెరాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ

Published Sun, Jul 17 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

డేవిడ్ కామెరాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ

డేవిడ్ కామెరాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ

టెన్ డౌనింగ్ స్ట్రీట్ నుంచి సామానుతో బయట పడ్డాం. స్ట్రీట్ నుంచి బయట పడినట్టు లేదు. స్ట్రీట్ మీదకు వచ్చి పడినట్టు ఉంది! ‘‘ఎక్కడికి వెళుతున్నాం డాడీ’’.. చిన్నది ఫ్లారెన్స్ అడిగింది. ఐదేళ్లు దానికి. వీడ్కోలు ప్రెస్ మీట్‌లో వాళ్ల అమ్మ స్కర్ట్‌ని గట్టిగా రెండు పిడికిళ్లతో పట్టుకుని నిలబడింది. ఎల్వెన్ కాస్త దిటవుగా ఉన్నాడు. పదేళ్లు వాడికి. వాడికన్నా రెండేళ్లు పెద్ద నాన్సీ. పిల్లలు ముగ్గుర్నీ దగ్గరకు చేర్చుకుని నిలబడి ఉంది శామ్.. నా పక్కనే.  
 
 ఒక ఫ్యామిలీకి ఒక దేశం ఇస్తున్న వీడ్కోలులా ఉంది ఆ ప్రెస్ మీట్! మాట్లాడ్డం అయ్యాక, వెళ్లి కార్లో కూర్చున్నాం. అప్పుడు అడిగింది ఫ్లారెన్స్.. ‘‘ఎక్కడికి వెళుతున్నాం డాడీ’’ అని. ‘‘కొత్త ఇంట్లోకి’’ అన్నాను... తన కళ్లలోకి నవ్వుతూ చూస్తూ. తను నవ్వలేదు! శామ్ తనను ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వేళ్లతో బుగ్గలు నిమిరింది. తల్లి చేతిని మృదువుగా తోసేసింది ఫ్లారెన్స్. ‘‘ఆ ఇల్లు ఈ ఇంటి కన్నా చాలా బాగుంటుంది’’... చెల్లికి చెబుతోంది నాన్సీ.
 
 ఎల్వెన్ ఈ ప్రపంచంలో లేడు. విండోలోంచి బయటికి చూస్తున్నాడు. వెనక్కి పోతున్న దారిని వెతుక్కుంటున్నాడా? ఎదురొస్తున్న దారిని కనుక్కుంటున్నాడా? భుజం చుట్టూ చేతులు వేసి వాడిని నా దగ్గరికి లాక్కున్నాను. కదల్లేదు! కనీసం విండోలోంచి తల తప్పి కూడా చూడలేదు. దగ్గరికి తీసుకోగానే ఎప్పటిలా వాడు నాలోకి ఒదిగిపోతా డనుకున్నాను. ఎప్పటిలా తన ముక్కుతో నా ఛాతీని అదుముతాడని అనుకున్నాను. అలా ఏం కాలేదు!  ఏం జరుగుతోంది ఎల్వెన్‌లో? శామ్ మధ్యమధ్యలో నా కళ్లలోకి చూస్తోంది. డౌనింగ్ స్ట్రీట్‌లోని ఇంటి గడపను దాటి వచ్చినప్పటి నుంచీ ఆ కళ్లు నిశ్శబ్దంగా నన్ను.. అడిగిన ప్రశ్నే అడుగుతున్నాయి.. ‘‘ఆర్యూ ఓకే డేవిడ్?’’ అని.  కారు మమ్మల్ని కాకుండా, మా ఫీలింగ్స్‌ని మోసుకెళు తున్నట్లుగా ఉంది. కళ్లలో ఫీలింగ్స్, కడుపులో ఫీలింగ్స్, వెనుక బ్యాగేజీల నిండా ఫీలింగ్స్.
 
 ఫ్లారెన్స్ ఈసారి ప్రశ్న మార్చింది. ‘‘ఎక్కడికి వెళుతున్నాం’’ అని అడగలేదు. ‘‘ఎందుకు వెళుతున్నాం?’’ అని అడిగింది! నాన్సీ తనని తల్లి చేతుల్లోంచి తీసుకుంది. ‘‘చెప్పాను కదా.. డార్లింగ్, ఆ కొత్త ఇల్లు ఇంకా బాగుంటుందని’’ అంది, చెల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి. ఫ్లారెన్స్ కన్విన్స్ అయినట్టు లేదు. కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని.. ‘‘నాకు ఇష్టం లేదు... నాకు ఇష్టం లేదు’’ అనడం మొదలుపెట్టింది. ‘‘ఓహ్.. మై లిటిల్ ఫ్లారెన్స్’’ అంటోంది వాళ్ల అమ్మ.

ఒక్కసారిగా  ఏడ్చేసింది ఫ్లారెన్స్. ‘‘వెళ్లిపోవడం బాగుండదు.. వెళ్లిపోవడం బాగుండదు..’’ అంటూ ఏడ్చేస్తోంది. నాన్సీ కూడా తల్లి దగ్గరికి చేరింది. ఎల్వెన్ తలతిప్పి చూశాడు!  ‘‘మనందరం వచ్చేస్తే మన ఇంటికి ఎవరు తోడుంటారు?’’... వెక్కి వెక్కి ఏడుస్తోంది ఫ్లారెన్స్. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి వచ్చినప్పుడు బెంగ పెట్టుకున్న బ్రిటన్ పౌరురాలిలా అనిపించింది.. మై ఏంజల్ కిడ్.. ఫ్లారెన్స్.. నాకా క్షణంలో!
 - మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement