ఉత్తరాంధ్ర రాజకీయ శిఖరం ద్రోణంరాజు
రాజకీయరంగంలో గెలుపోటములతో పని లేకుండా ప్రతి సందర్భంలోనూ క్రియాశీలంగా వ్యవహరిస్తూ సమకాలీన రాజ కీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేసిన రాజకీయ వ్యూహ దురంధరుడు ద్రోణంరాజు సత్యనారాయణ (1933-2006). 1983లో, 85లో తెలుగుదేశం ప్రభంజనంలో కాంగ్రెస్ శ్రేణులు కకావికలై, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చేయిచ్చి, తెలుగుదేశంలో చేరిన విపత్కర పరిస్థితుల్లో కూడా పార్టీని వదలకుండా, పట్టుదల చూపిన నేత ద్రోణంరాజు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల విశ్వాసంతో, కార్యకర్తలు, దిగువ శ్రేణి నేతలు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం ఘోరపరాజయం ఎదురైన సందర్భాల్లో కూడా పార్టీ పునరుత్తేజానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.
1933 డిసెంబర్ 19న విశాఖ జిల్లా జుత్తాడలో ద్రోణంరాజు జన్మిం చారు. మొదట వంశపారంపర్యంగా వచ్చిన కరిణీకం చేపట్టినా తరువా త రాజకీయాలలోకి వచ్చారు. చినముషిడివాడ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి, 1952లో తెన్నేటి విశ్వనాథం గెలుపు కోసం శ్రమించారు. 1977లో మళ్లీ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి రాజకీయ దిగ్గజం, గురుతుల్యుడైన తెన్నేటిని ఓడించారు. పెందుర్తి అసెంబ్లీ సభ్యునిగా (1980-83), జిల్లా పరిషత్ చైర్మన్‌గా (1981-84) పని చేసి ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. విశాఖ జిల్లా, రాష్ట్ర గ్రామోద్యోగుల సంఘం నేతగా ఆయన స్థానం స్మరణీయమైనది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార యం త్రాంగంతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి.
1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై ద్రోణంరాజు నడిపిన వ్యాజ్యంతో ఆయన ఖ్యాతి దేశవ్యాప్తమైంది. దీనితో నాటి కాంగ్రెస్ నేత రాజీవ్‌గాంధీ దృష్టిని ఆకర్షించి 1988లో రాజ్యసభకు ఎంపికయ్యారు. కాంగ్రెస్‌లోనే రకరకాల శిబిరాలలో ఉంటూ 1993లో మళ్లీ పీవీ హయాంలో రాజ్యసభ సభ్యులయ్యారు. ద్రోణంరాజు పేరు వినగానే ఆయన రాజకీయ చతురతతోపాటు, కాంగ్రెస్ వాదిగా ఆయన నిబద్ధత కూడా గుర్తుకు వస్తాయి. ఆయన వైభవంలోనే కాదు, కష్టకాలంలో సయితం ఉత్తరాంధ్రలో కాంగ్రెస్‌పార్టీకి అండగా ఉన్నారు. ఎందరో నాయకులను తయారు చేసిన ఘనత ఆయనది. 1978లో కాంగ్రెస్ చీలిక సమయంలో ఇందిరాగాంధీ పక్షం వహించారు. ఈ సేవలకు గుర్తింపుగానే ఈ నెల 19న విశాఖపట్నంలో పసుపులేటి బాలరాజు ద్రోణంరాజు 82వ జయంతిని నిర్వహిస్తున్నారు. దీనిని బాలరాజు కాంగ్రెస్ ప్లీనరీగా అభివర్ణించడం సమంజసమే.
- బీవీ అప్పారావు విశాఖపట్నం
(రేపు ద్రోణంరాజు 82వ జయంతి సందర్భంగా)