రేలాపువ్వుల అరుణోదయం... | Editor Arun sagar passes away | Sakshi
Sakshi News home page

రేలాపువ్వుల అరుణోదయం...

Published Sat, Feb 13 2016 1:05 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM

రేలాపువ్వుల అరుణోదయం... - Sakshi

రేలాపువ్వుల అరుణోదయం...

అతని వాక్యం నిర్మొహమాటంగా మనలని వాటేసుకుంటుంది. అప్పుడే వికసించిన పువ్వు లాంటి వాక్యం యెక్కడ రాయాలో, అప్పుడే ఓవెన్ లోంచి తీసిన నిండు కాఫీ కప్ లాంటి వాక్యం యెక్కడ రాయాలో అతనికి బాగా తెలుసు. ఒక చీకటిమయ ప్రపంచపు లోలోపల తిరుగాడుతున్న క్రిమిపై అతని వాక్యం లేజర్ కిరణంలా ప్రసరించి మనలని అలెర్ట్ చేస్తుంది.
 
 సూర్యోదయానికి, సూర్యాస్తమయా నికి అతనులేడు. అరుణ్ సాగర్ కనిపిం చగానే రేలా పాటవలే అతని నవ్వు వినిపిస్తుంది. అరుణ్ సాగర్ యెదుర వ్వగానే తుమ్మెదరెక్కల కళ్ళల్లోంచి నవ్వు కాంతుల జలపాతమై మనలని పలకరిస్తుంది. నిత్యం పొంచి వున్న ఆపదను తనలోనే మోసుకు తిరుగుతున్నా ప్రతినిత్యం జీవితోత్సాహంతో చెంగుచెంగున దుమికే పసితారంగం.  వుదయంవుదయమే అనేక రింగ్ టోన్స్‌తో అనేక సెల్ ఫోన్స్ మోగుతుంటే అంతా వొక తత్తరపాటుతో మేల్కొన్నారు. వింటున్న మాటలు, మాటల్లో వినిపిస్తున్న పేరు వింటూ సరిగ్గా విన్నామా అనే వొక సందేహం.
 
 తిరిగితిరిగి వొకరికొకరు ఫోన్స్. హడావుడిగా టీవీ పెట్టేవాళ్ళు, ఫేస్‌బుక్ తెరిచేవాళ్ళు నిజమా కాదా తేల్చుకోడానికి అందుబాటులో వున్న అన్ని మాధ్యమాలని తిప్పు తూనే ఉన్నారెందరో. నిజమా నిజమా అని యెక్కడెక్కడి నుంచో అందరూ అందర్నీ అపనమ్మకంగా అడుగుతుండగానే అతను బేనరై కనిపించారు. అవును మన అరుణే... మన అరుణ్ సాగరే... అపనమ్మకం నిదానంగా నమ్మకమైంది. ఆ బ్రేకింగ్ న్యూస్ అసత్యమైతే బాగుండునని కోరుకోని హృదయం లేదా సమ యంలో. కాని అతను మన హృదయాలని వినదల్చుకోలేదు. ‘ఇది నిజమే బాస్’ తనదైన నవ్వుతో అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆ వార్త నిజమని పోల్చుకున్న నిశ్శబ్దం అంతటా. పూర్ణ అశ్రు ధారలైనారు. రెప్పపాటులో అతను జ్ఞాపకాల కలనేతైనాడు.
 
 ఒకటా రెండా.. ‘సుప్రభాతం’ నుంచి ఇప్పటి టీవీ5 సీఈఓ వరకు పాత్రికేయ వృత్తిలో అతను వొక కొత్త వొరవడి. ఎప్పటి కప్పుడు కొత్త మాట. కొత్త వాక్యం. కొత్తదనం. అతని వాక్యం నిర్మొహమాటంగా మనలని వాటేసుకుంటుంది. అప్పుడే వికసించిన పువ్వు లాంటి వాక్యం యెక్కడ రాయాలో, అప్పుడే ఓవెన్ లోంచి తీసిన నిండు కాఫీ కప్ లాంటి వాక్యం ఎక్కడ రాయాలో అతనికి బాగా తెలుసు. వొక చీకటిమయ ప్రపంచపు లోలోపల తిరుగాడుతున్న క్రిమిపై అతని వాక్యం లేజర్ కిరణంలా ప్రసరించి మనలని అలర్ట్ చేస్తుంది. అంతే కాదు అతను టీవీ9 లో అనేక కథనాలకి గొంతై ఏమరుపాటున సైతం అలర్ట్ చేసేవారు. అదే స్వరం ఒక వాత్సల్య సుగంధంతో మనలోని దుర్గంధాన్ని తరిమేస్తుంది.

 అరుణ్‌కి పాటలంటే ప్రాణం. మైఖేల్ జాక్సన్ అన్నామ నుకోండి అరుణ్ మూన్ వాక్ అవుతాడు. బాబ్ డిలాన్ అంటూండ గానే వొక వొత్తై నల్లని మేఘ ధ్వనిలా ప్రతిధ్వనిస్తాడు. గోదా వరిని నిత్యం తన లోలోపల ప్రవహింప చెయ్యాలనుకునే అరుణ్, విశాఖ సముద్ర కెరటాల వొంపులోని సూర్య కిరణాలని, చంద్ర కిరణాలని యెంత తదేకంగా చూస్తారో నక్షత్రాలతో మాత్రమే మిణుకుమిణుకు మంటున్న ఆకాశం కింద ఉన్న యెగిసే సముద్రపు వాలులోని నల్లని నలుపుని అంతే ఆసక్తిగా చూస్తారు. యెంతైనా andromeda’  ని ప్రేమించిన వారు కదా. అతని పుస్తకాలని ‘andromeda’ ప్రచురణలుగా ప్రచురించారు.
 
 అరుణ్ సమకాలీన విషయాలకి స్పందించే రచనలు భలే భిన్నమైనవి. పైపై మెరుగులు దిద్ది అంతా బాగుందనే భ్రమలు కలిపించే ఏ శక్తిని అతను పోనీలే అనుకోలేదు. హైదరాబాద్ అభివృద్ధి అని రాజకీయ నాయకులు తమ ఖాతాలో వేసుకుంటున్న  మాటలని ధనవంతుల ఇళ్లలోంచి వచ్చే వాటర్ ఫౌంటైన్‌ల నుంచి వారి ప్రహారీ గోడలు దాటి వచ్చే నీటి తుంపరని చెప్పేసి చాల మందిని వొప్పించేశారు. అత్యుత్తమ బాహు వులని నిలువెత్తు పొగిడే సినిమా కావచ్చు, టీవీ టీఆర్‌పీ మాయాజాలం సంపన్నులు కాని పల్లె స్త్రీల జీవితాలని యెలా పట్టించుకోదో చెప్పటం కావొచ్చు. విషయం యేదైనా కావొచ్చు.. అతను యెల్లప్పుడు సామాన్యుల పక్షాన్నే.
 
 స్త్రీ వాదాన్ని బలంగా నమ్ముతూ రాస్తున్న నాకు తన పురుష దృక్పధపు మగవాని ఫీలింగ్స్ రాసి ఆ పుస్తకం నా చేతిలో వుంచి, తానెలా పరీక్ష రాసానో స్పష్టంగా స్టూడెంట్‌లా నా ముఖంలోకి తన నిశితమైన చూపుని సారించి నిలబడిన అరుణ్‌ని చూసి ఆ రోజెంత నవ్వానో. మృదు స్వభావి హృదయమంతా స్నేహం నింపుకొన్న అరుణ్.. అదీ కాక బాబ్ మార్లే ‘నో ఉమన్ నో క్రై ’ పాటని ఇష్టపడే అరుణ్ మమ్మల్ని నొప్పిస్తారా... మనకి మేల్ కొలుపు జీటజీజజ్టిజఠ మగవాడి దృక్కోణం కావాలి కదా అంటూ వొప్పిస్తారు కాస్త సహనంతోనో మరింత మృదువు గానో. బెస్సీ స్మిత్ బ్యాక్ వాటర్ బ్లూస్‌ని హమ్ చేస్తే చాలు అరుణ్ సాగర్‌లాంటి జీవితాలని అలా యెలా ముంచేస్తారు అనేవారు. అరుణ్ లాంటి సున్నిత మనస్కులని మనం చాల అరుదుగా చూస్తాం ఇప్పటి సమాజంలో.
 
 అరుణ్ సాగర్ పోయిన నెల ఆవిష్కరించిన ‘మ్యూజిక్ డైస్’ అత్యంత విలువైన కవిత్వ సంకలనం. పోలవరం ప్రాజెక్ట్ కడతామన్నప్పటి నుంచి అతను ఆ వనాల వానైనాడు. ఆకుపచ్చని నీడైనాడు. వెదురుపొదల పుప్పొడి అయినాడు . పుట్టతేనె తీయ్యని గాలైనాడు. విప్పపూల నిషా అయ్యాడు. ఆదివాసీ ప్రశ్నైనాడు. ఆదివాసీ ఊపిరైనాడు. ఆదివాసీ హృదయమైనాడు. అతనే ఆది వాసి అయ్యాడు. వొక విలువైన కవితా సంకలనమే కాదది. ఒక ముఖ్యమైన జీవన పోరాటం మన ముందుంచారు సాగర్. ప్రకృతి విధ్వంసం, జాతుల సంస్కృతుల ముంపు, పర్యావరణ కాలుష్యం మనం వెంటనే మాట్లాడాల్సిన విషయాలని యెందుకు మాట్లా డాలో కూడా సుస్పష్టంగా రాసిన కవిత్వమది. మనలని కదిలి స్తుంది. మనలని ఆలోచింపచేస్తుంది. మనలని మైమరపిస్తుంది. ఒక సౌందర్యవంతమైన జీవనాన్ని విధ్వంసపు లోయగా మారుస్తూ అభివృద్ధి అని గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళని మనం ప్రశ్నించటమే కాదు.. మనం ఆ జీవితాలని హృదయమంతటితో పదిలపరచు కోవాలనిపిస్త్తుంది ఆ కవిత్వం చదివితే.
 
అందమైన అరుణ్ సాగర్.. సోగ్గాడు శోభన్‌బాబు గారిని పరవశంతో తన రచనలో ఆవిష్కరించే అరుణ్ సాగర్ చక్కని సౌందర్యారాధకుడు. స్వతహాగా స్వాప్నికుడు.  మంచి చదువరి చక్కని రచయితా, చురుకైన జర్నలిస్ట్, లలితమైన పలకరింపు, ప్రేమించటం మాత్రమే వచ్చిన అరుణ్ సాగర్ని ప్రేమించకుండా ఉండలేం.  అరుణ్ నవ్వితే సాగరం మెరుస్తుంది... మరి యిప్పుడు...
 (అరుణ్‌సాగర్‌కు నివాళి)
 - కుప్పిలి పద్మ
 వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి  మొబైల్: 9866316174

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement