బాబు గీత పెరగదు రామోజీ రాత మారదు
*ఎన్నికల ముందు అదేపనిగా విషప్రచారం
*జగన్ సంస్థల్లో హెటెరో, అరబిందో పెట్టుబడులపై అబద్ధపు రాతలు
*ఎవరైనా రూ.16 కోట్ల లబ్ధికి 32 కోట్లు పెట్టుబడి పెడతారా?
*ఎకరా రూ.15 లక్షలకు అమ్మాలని చెప్పినపుడు రూ.7 లక్షలకు లీజుకిస్తే తప్పా?
*ఇండియా సిమెంట్స్‌కు భారతిలో పెట్టుబడిపై లాభం వచ్చిన మాట నిజం కాదా?
*అయినా సిమెంటు ప్లాంటుకు నీరిచ్చినందుకే పెట్టుబడులు పెట్టేస్తారా?
*అలా పెట్టారంటే... దానిపై లాభం పొందారంటే దానర్థమేంటి?
*ఇతర సంస్థల్లో మాదిరే జగన్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేశారని తెలియటం లేదా?
*రూ. 100 కోట్లు పెట్టినా యాజమాన్య హక్కులు లేవంటూ పిచ్చిరాతలేల?
*మీ సంస్థల్లో రూ. 2,400 కోట్లు పెట్టుబడి పెట్టిన రిలయన్స్‌కు ఏ హక్కులిచ్చారు?
*కనీసం ఆ సంస్థల నుంచి డెరైక్టరు కూడా ‘ఈనాడు’లో లేకపోవటం అబద్ధమా?
*ఆరేళ్ల పాటు రూ. 2,400 కోట్లపై పైసా కూడా రాబడి లేకపోవటం అవాస్తవమా?
*చివరికి పనికిమాలిన చానళ్లను తీసుకుని రిలయన్స్ ఎందుకు బయటపడింది?
*కాకినాడ సెజ్‌కు టెంకాయ కొట్టింది చంద్రబాబు కాదా?
*ఆ సెజ్ కాకినాడ పోర్టు యజమానిదేగా? ఆయన బాబు బినామీయేగా?
*పోర్టును కర్నాటికి కట్టబెట్టింది, మలేసియా కంపెనీని దించింది బాబేగా?
*జగన్ ఆస్తులపైనా అంత పచ్చి అబద్ధపు రాతలేల?
*2004లో ఆయన చూపించిన రూ. 1.7 కోట్లు ఆయన ఆదాయం
*ఇపుడు అఫిడవిట్‌లో చూపించింది ఆయన ఆస్తి
*ఆస్తికి, ఆదాయానికి తేడా తెలియదా రామోజీ?
ఏది నిజం?
ఆరు రోజులుగా అవే రాతలు!! అసలిప్పుడు ఎందుకు రాస్తున్నారంటే... ఒకటే జవాబు! ఎన్నికలొస్తున్నాయి కనుక!! జగన్‌మోహన్‌రెడ్డిని తగ్గించి, చంద్రబాబును పెంచే ఎజెండాలో భాగంగా ఇలాంటివన్నీ రాయాలి కనుక. ఈ రాతల్లో రోత శాతమెంతో మీరే చూడండి...
జడ్చర్ల సెజ్‌లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రెండు కంపెనీలకు భూములు కేటాయించారట! అందుకు ప్రతిగా ఆ రెండు కంపెనీలూ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయట!! రామోజీరావు ఇదంతా రాస్తారు తప్పితే... అసలు జడ్చర్ల సెజ్‌కు టెంకాయ కొట్టి స్థానికుల్ని నిరాశ్రయుల్ని చేసింది తమ చంద్రబాబేనని, ఆ బాబు హయాంలో ఏ కంపెనీ రాకపోయేసరికి వైఎస్సార్ వచ్చాక కంపెనీలకు ప్రోత్సాహకాలిచ్చి పిలిచారని మాత్రం రాయరు!! ఎందుకంటే అలా రాస్తే వైఎస్సార్ చేసింది తప్పుకాదని తెలుస్తుంది కనక!!
వైఎస్ హయాంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం పెరిగిపోయిందంటూ రాసిన రాతలు గానీ... వీళ్లా మన అభ్యర్థులంటూ పనిగట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డిని, పెట్టుబడుల వ్యవహారంలో ఆరోపణలెదుర్కొంటున్న వారిని విమర్శించటం గానీ... హార్డ్ డిస్క్ చెప్పిందంటూ జగన్ సంస్థల్లో ‘ఇండియా సిమెంట్స్’ పెట్టుబడుల గురించి రాసిన రాతలు గానీ... అన్నీ ఈ కోవలోనివేనని చెప్పాలి. అయినా ప్రతిదానికీ కమిటీలంటూ, ఆ కమిటీల్లోని వ్యక్తులు తెలుగుదేశం వారై ఉండాలనే నిబంధన పెట్టి గ్రామ వాతావరణాన్ని కలుషితం చేసింది చంద్రబాబునాయుడు కాదా? ఉద్యోగుల్ని అపనమ్మకంతో చూసి, వారిని నానా ఇక్కట్లూ పెట్టి ప్రభుత్వ వ్యవస్థల్ని నాశనం చేసింది బాబు కాదా? ఇవన్నీ రామోజీ రాయరెందుకు? జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని... వీళ్లా మన అభ్యర్థులు? అంటూ ప్రశ్నించిన రామోజీ... టీడీపీ నేతలు ఎదుర్కొంటున్న కేసులనెందుకు ప్రస్తావించరు? ఆ పార్టీలోని నేరచరితుల ఊసు ఎత్తరెందుకు? ఏం! బాబుకు అమ్ముడుపోయినందుకా? ఈ రోత రాతల్ని పక్కనబెడితే... అరబిందో, హెటెరో ఫార్మాల గురించి... ఇండియా సిమెంట్స్ పెట్టుబడుల గురించి రాసిన రాతల్లోని మర్మం చూద్దాం.
జడ్చర్ల సెజ్‌లో జరిగిందిదీ...
జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 954 ఎకరాల భూమిని సేకరించింది చంద్రబాబునాయుడు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందే ఈ భూ సేకరణ పూర్తయింది. దీనికి ఎకరాకు రూ. 75 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించారు బాబు. అయితే భూ సేకరణ పూర్తయిన మూడేళ్ల దాకా ఒక్క పరిశ్రమా రాలేదు. దీంతో 2006లో అప్పటి ఏపీఐఐసీ ఎండీ బి.పి.ఆచార్య రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో కేంద్రానికి ఒక ప్రతిపాదన చేశారు. 954 ఎకరాల్లో 250 ఎకరాల్ని సెజ్‌గా ప్రకటిస్తే పరిశ్రమలు ముందుకు రావచ్చని, అవి యాంకర్ యూనిట్లుగా నిలిస్తే ఇతర పరిశ్రమలు వస్తాయని సూచించారు. 2006 అక్టోబర్లో కేంద్రం దీనికి సరేనంది.
యాంకర్ యూనిట్లకు ఈ సెజ్‌లో ఎకరాకు రూ.15 లక్షలు వసూలు చేయాలని ధరల నిర్ణయ కమిటీ నిర్ణయించింది. 2006 డిసెంబర్ 31 లోగా ఈ ధర కు భూమినివ్వాలని, లేనిపక్షంలో 50 ఎకరాలను కేటాయించాలని... వీటిలో ఏది ముందైతే అది చేయాలని సూచించింది. అంటే 50 ఎకరాలను కేటాయించిన పక్షంలో ఈ ధర వర్తించదన్న మాట.
నవంబర్లోనే దరఖాస్తులు...
2006 నవంబర్లో హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలు ఏపీఐఐసీకి లేఖలు రాశాయి. తమకు సెజ్‌లో తలా 75 ఎకరాలివ్వాలని కోరాయి. ఏపీఐఐసీ అధికారులు వీటిని చూసి ఎండీ బి.పి. ఆచార్యకు పంపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఆచార్య
రూ. 7 లక్షల ధరకు సరేనన్నారన్నది ‘ఈనాడు’ రాతల సారాంశం.
అది అమ్మకం... ఇచ్చింది లీజుకు!
ఇక్కడ ‘ఈనాడు’గానీ, రామోజీగానీ కావాలని విస్మరించిన విషయం ఒకటుంది. అది... ఎకరాకు రూ. 15 లక్షల ధరను నిర్ణయించింది ఏకమొత్తంగా విక్రయించడానికి. కానీ రూ. 7 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది లీజుకు. ఆ ధరలో ఏటా ఒక శాతం చొప్పున... ముందుగానే రూ. 7 లక్షలూ చెల్లించేలా హెటెరో, అరబిందోలతో ఏపీఐఐసీ ఒప్పందం చేసుకుంది. దీనివల్ల ఎకరాకు రూ. 7 లక్షల చొప్పున ముందే ఏపీఐఐసీ చేతికొచ్చింది. ఇక లీజు గడువు ముగిశాక భూమి ఎలాగూ ఏపీఐఐసీకే వస్తుంది. ఇది తప్పా? అసలు వైఎస్సార్ ప్రభుత్వం లీజుకు కేటాయించిందన్న విషయం రామోజీ రాయరేం? ఇంకెన్నాళ్లు ఈ దగుల్బాజీ రాతలు?
ఇవన్నీ రాయరెందుకు?
ఏపీఐఐసీ ధరల కమిటీ నిర్ణయించిన ధర మామూలు కేటాయింపులకు వర్తిస్తుంది. అంటే చుట్టూ కాంపౌండ్ వేసి... మధ్యలో రోడ్లు వేశాకే ఏపీఐఐసీ తన పారిశ్రామికవాడల్లో ప్లాట్లు కేటాయిస్తుంది. కానీ జడ్చర్ల సెజ్‌కు అలాంటివేమీ చేయలేదు. కంచె, మధ్యలో రోడ్లు, వీధి లైట్ల వంటి సౌకర్యాలన్నీ ఆ భూమిని తీసుకున్న హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలే కల్పించుకున్నాయి. మరి అభివృద్ధి చేసిన భూమిని ఎకరా రూ. 15 లక్షలకు ఏకమొత్తంగా విక్రయించాలని అనుకున్నపుడు... అభివృద్ధి చేయని భూమిని ఎకరా రూ. 7 లక్షలకు, అది కూడా లీజుకు కేటాయించటం తప్పెలా అవుతుంది రామోజీ? ఇవన్నీ మీ పాఠకులకు ఎందుకు చెప్పరు? మీ రాతల్లోని దివాలాకోరుతనం బయటపడుతుందనా? ‘ఈనాడు’ చదవాలంటేనే భయపడతారనా?
పారిశ్రామికులకు తగ్గించరా?
ప్రభుత్వం మామూలుగా తన భూమికి ఎక్కువ ధరను నిర్ణయించటం... తరవాత దాన్ని తగ్గించి పారిశ్రామికవేత్తలకు కేటాయించటం కొత్తేమీ కాదు. ఎందుకంటే తమకు భారీగా తగ్గింపు లభించిందని భావిస్తే పారిశ్రామికవేత్తలు త్వరగా ముందుకొస్తారు. అన్నిచోట్లా అనుసరించే సూత్రమే ఇది. దీన్ని కూడా విస్మరించి... ఆ రెండు కంపెనీలకు ప్రభుత్వం రూ. 12 కోట్లు లబ్ధి చేకూర్చిందని చెప్పటాన్ని ఏమనుకోవాలి? ఇది రామోజీ కుట్ర అనటానికి ఇంకా ఏం కావాలి?
ట్రైడెంట్ విషయంలోనూ అంతే!
మెదక్ జిల్లా పాశమైలారంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. దీన్లో అరబిందో ఫార్మాకు భూమి కేటాయించటంతో 2003 నాటికే అదొక యూనిట్‌ను (యూనిట్ నంబర్-4) ఏర్పాటు చేసింది. 2005లో విస్తరణ నిమిత్తం భూమి కోసం దరఖాస్తు చేయటంతో ఏపీఐఐసీ దానికి రెండు విడతలుగా 27.46 ఎకరాలు, 2.87 ఎకరాల చొప్పున కేటాయించింది. నాటి కమిటీ నిర్ణయించిన ప్రకారం చదరపు మీటరుకు రూ. 150 చొప్పున వసూలు చేశారు. అంటే ఎకరాకు రూ. 6,07,029 చొప్పున. ఈ సంస్థ సదరు భూమిని 2006లో తన అనుబంధ సంస్థ ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించాలనుకుంది. అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి అల్లుడు శరత్‌చంద్రరెడ్డి సంస్థ ఇది.
ఈయన అరబిందో చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి తనయుడు కూడా. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం ఒక కంపెనీకి స్థలమిస్తే దాన్లో పరిశ్రమ పెట్టకుండా వేరొకరికి బదలాయించకూడదు. అరబిందో బదలాయించాలనుకున్నది తన అనుబంధ సంస్థకే. ఇది ఆ తరవాత అరబిందోలో పూర్తిగా విలీనమైపోయింది కూడా. అరబిందో స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంస్థ కనుక... అనుబంధ కంపెనీకి ఏ ఆస్తినిచ్చినా అది పేరెంట్ సంస్థ చేతిలో ఉన్నట్టే. అందుకే బదలాయింపు ఫీజులో మినహాయింపునివ్వాలని ఏపీఐఐసీని కోరింది. మామూలుగా బదలాయిస్తే 10 శాతం చొప్పున, అనుబంధ సంస్థలకైతే 2 శాతం చొప్పున ఏపీఐఐసీకి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. (రిజిస్ట్రేషన్ చార్జీల మాదిరే. బయటివారికి విక్రయిస్తే ఎక్కువ, గిఫ్ట్‌గా కుటుంబీకులకు ఇస్తే తక్కువ). అనుబంధ సంస్థే కాబట్టి 2 శాతం చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలని ఏపీఐఐసీ అనుమతిచ్చింది.
ఇదీ ‘ఈనాడు’ వాదన...
‘‘అప్పట్లో అక్కడ ఏపీఐఐసీ ధర చదరపు మీటరు రూ. 500 ఉంది. కానీ రూ. 150 చొప్పున అరబిందో కొని, ట్రైడెంట్‌కు బదలాయించింది. అలాకాక చదరపు మీటరు రూ. 500 పెట్టి నేరుగా ఏపీఐఐసీ నుంచి ట్రైడెంట్ కొని ఉంటే ప్రభుత్వానికి రూ. 4.3 కోట్లు అదనంగా దక్కేది’’ అని రామోజీ వాదిస్తున్నారు. తనకు అప్పటికే అక్కడ కావలసిన భూమి అందుబాటులో ఉన్నపుడు మళ్లీ కొత్తగా కొనుక్కోవాలని ఎవరైనా అనుకుంటారా? తన పేరెంట్ సంస్థకు భూమి ఉన్నపుడు తాను కొత్తగా కొనాలని ఏ అనుబంధ సంస్థయినా అనుకుంటుందా? ఇది రామోజీకి తెలియదా? తెలిసీ ఈ రోత రాతలేల? సీబీఐ చార్జిషీటుల్ని పదేపదే వేయటంలో ఉద్దేశమేంటి? జనాన్ని నమ్మించాలనా?
ఎవరైనా రెట్టింపు పెట్టుబడి పెడతారా?
భూమి కొనుగోలులో రూ. 12 కోట్లు, బదలాయింపు వల్ల రూ. 4.3 కోట్లు కలసి మొత్తమ్మీద హెటెరో, అరబిందోలకు రూ. 16.3 కోట్ల లాభం చేకూరిందని, అందుకే అవి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో రూ. 32 కోట్లు పెట్టుబడిగా పెట్టాయన్నది రామోజీ రాతల సారాంశం. మరి రూ. 16 కోట్ల లబ్ధికి ప్రతిగా రూ. 32 కోట్ల పెట్టుబడి ఎవరైనా పెడతారా? పెట్టారంటే దానర్థమేంటి? వారు ఆ కంపెనీల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేసినట్టు కాదా? ఈ రెండుచోట్లా ఆ కంపెనీల ప్లాంట్లు వచ్చి... 6 వేల మందికి పైగా ఉపాధి పొందుతుండటం అబద్ధమా? రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నది నిజం కాదా? ఇవన్నీ రాయకుండా... అక్కడ భూములు కోల్పోయిన వారికి ఉపాధి లేదంటూ... కంపెనీలేవీ రాలేనట్లుగా రాయటంలో మర్మమేంటి? ఈ నిజాలన్నీ రామోజీకి ఎప్పుడు అర్థమవుతాయి?
యాజమాన్య హక్కులిస్తారా రామోజీ?
‘‘గుట్టు విప్పిన బెంగళూరు హార్డ్ డిస్క్... కొట్టింది రూ.140 కోట్లు’’ అంటూ ఈ నెల 15న రామోజీ వండేసిన కథనంలో ఆయన ఆక్రోశమంతా ఒక్కటే. భారతి సిమెంట్‌లో రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఇండియా సిమెంట్స్‌కు యాజమాన్య హక్కులేవీ లేవని, దాని తరఫున భారతిలో ఒక డెరైక్టర్ కూడా లే రని. కాబట్టి ఇదంతా ముడుపులుగా ఇచ్చిన సొమ్మేనని!!?
రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఇండియా సిమెంట్స్ సంస్థకు యాజమాన్య హక్కులివ్వలేదట! మరి మీ నష్టజాతక కంపెనీల్లో రూ.2,400 కోట్లు పెట్టుబడి పెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఏం యాజమాన్య హక్కులిచ్చారు రామోజీ? 2008లో పెట్టుబడి పెట్టిన రిలయన్స్‌కు 2013 వరకూ వడ్డీ, డివిడెండ్ కాదు కదా... ఒక్క పైసా కూడా ఆదాయం వచ్చింది లేదు. పోనీ రిలయన్స్ నుంచి రామోజీ కంపెనీల్లో డెరైక్టర్లుగా ఎవరైనా ఉన్నారా అంటే... అదీ లేదు. ఎందుకని? ఈ మకిలి చరిత్రను జనానికి చెప్పరెందుకని? ఆఖరికి 2013లో కూడా... రామోజీకి చెందిన పనికిమాలిన ఇతర భాషా చానళ్లను తీసుకుని, విలువైన ‘ఈనాడు’లో మాత్రం వాటా వదులుకున్నారు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ. మరి దీన్నేమనాలి? ఇది లంచం సొమ్ము కాదా? ఆ చానళ్లను అంబానీ చివరికి టీవీ-18 సంస్థకు కట్టబెట్టేసి, ప్రతిగా దాన్లో వాటానుమాత్రం తీసుకున్నారు. అంటే మొత్తమ్మీద రామోజీ కంపెనీల్లోకి రిలయన్స్ పంపిన 2400 కోట్ల రూపాయలపై ఇప్పటిదాకా పైసా రాబడి లేదు. చివరికి టీవీ-18లో వాటా మాత్రం మిగిలింది.
రెండురోజుల కిందట టీవీ-18 సంస్థ సీఈఓ ఓ బిజినెస్ డైలీకి ఇంటర్వ్యూ ఇస్తూ... రామోజీ చానళ్ల విలువను తాము అతిగా అంచనా వేశామని, వాస్తవానికి వాటికి అంత సీను లేదని, వాటిని బాగు చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు. మరి దీనర్థమేంటి? రామోజీ చేసింది ఎంత మోసం?
ఇండియా సిమెంట్స్‌కు లాభాలు..
ఇండియా సిమెంట్స్ కథ ఇలాంటిది కాదు. ఆ సంస్థ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన భారతి సిమెంట్‌లో పెట్టిన పెట్టుబడికి లాభం కూడా అందుకుంది. ఆ షేర్లను లాభానికి విక్రయించింది కూడా. మరి దీన్నేమనాలి? ఎవరిది మోసం? రామోజీదా... లేక జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలదా?
వైఎస్సార్ కడప జిల్లా ఏమంత అభివృద్ధి చెందినది కాదన్నది ఆంధ్రప్రదేశ్‌లో గడప గడపకూ తెలుసు. వ్యవసాయం గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. వర్షాలూ తక్కువే. ఒక్క కడప అనే కాదు. రాయలసీమంతటా కూడా పడితే ఒక వర్షం... ఒక పంట. లేదంటే ఏడాదంతా ఖాళీ. అలాంటిచోట సిమెంట్ కంపెనీ వస్తే స్థానికులకు లాభం కాదా? అయినా ఇండియా సిమెంట్స్ సంస్థ భారతిలో పెట్టిన పెట్టుబడికి మూడేళ్లు తిరక్కుండా దాదాపు 40 శాతం లాభం వచ్చింది. రూ.95 కోట్లకు కొన్న షేర్లను ఫ్రాన్స్‌కు చెందిన వికా సంస్థకు విక్రయించినపుడు రూ.125 కోట్ల మేర ఇండియా సిమెంట్స్‌కు దక్కాయి. ఒకవేళ నిజంగా ఇండియా సిమెంట్స్ ముడుపులుగా ఆ సొమ్ము ఇచ్చినట్లయితే లాభాలెందుకు వస్తాయి? ముడుపులిస్తే వాటికి షేర్లెందుకు ఇస్తారు? వాటిపై లాభాలెలా వస్తాయి? ఇవన్నీ రామోజీ ఏనాడూ పాఠకులకు చెప్పరు. ఎందుకంటే చెబితే తన కుట్ర బయటపడుతుందని.
కాకినాడ సెజ్ కథా అంతే! సెజ్ కోసం పచ్చని భూములు సేకరించారని రాస్తారు తప్ప దానికి జెండా ఊపిందెవరు? అలా సేకరించిన కంపెనీ ఎవరి బినామీ? కాకినాడ పోర్టు ఎవరిచ్చారు? మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ కొడుకును సైతం భాగస్వామిగా తెచ్చి కట్టబెట్టిందెవరు? కాకినాడ పోర్టును తన బినామీ కర్నాటి వెంకటేశ్వరరావుకు బాబు కట్టబెట్టడం నిజం కాదా? ఆ కేవీ రావు కంపెనీయే కదా... కాకినాడ సెజ్ యాజ మాన్య సంస్థ. దీనర్థమేంటి? దీన్లో బాబు వాటా ఎంత? వీటిలో ఏ ఒక్క విషయాన్నీ రాయరేం!!
ఇక జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల విషయంలోనూ అంతే! పదేళ్ల కిందట ఆస్తులు రూ. 1.7 కోట్ల మేర ఉండగా ఇపుడవి రూ. 341 కోట్లకు చేరాయన్నది రామోజీ రాత. నిజానికి పదేళ్ల క్రితం రూ. 1.7 కోట్లుగా పేర్కొన్నది జగన్ ఆస్తి కాదు. ఆదాయం. మరి పదేళ్ల కిందటే ఏడాదికి రూ. 1.7 కోట్ల ఆదాయం వస్తుంటే అప్పుడు ఆస్తులెంత ఉండాలి? ఆ ఆస్తులు ఇపుడు రూ. 341 కోట్లకు చేరితే తప్పేంటి? ఈ విషయాన్ని గతంలో పలుమార్లు ‘సాక్షి’ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు కూడా. అయినా రామోజీ వినిపించుకోరు!! కారణం... అలా రాస్తే జనం తీసిపారేస్తారు కాబట్టి!!
ఈ ప్రశ్నలకు బదులుందా రామోజీ..?
ఇండియా సిమెంట్స్‌కు వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేకూర్చిన ప్రయోజనాలంటూ ‘ఈనాడు’ రాసిన అంశాలు చూస్తే... ఆ రాతల్లోని డొల్లతనం అర్థం కాకమానదు.
* కడప జిల్లా చౌడూరులో ఇండియా సిమెంట్స్‌కు 2.60 ఎకరాల భూమి ఉంది. దీన్ని నీటి నిల్వ కోసం వాడుకుంటున్నారు. దాన్ని 20 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. ఆ లీజు గడువు 2003లోనే ముగియటంతో పొడిగింపు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఈ లీజును మరో 25 ఏళ్లకు పొడిగించారు.
ఇదండీ రామోజీ రాత. అంతకు ముందు ప్రభుత్వం 20 ఏళ్లకు లీజుకిస్తేనే కదా... వైఎస్ ప్రభుత్వం దాన్ని పొడిగించింది. అయినా 2 ఎకరాల భూమి లీజును... అది కూడా నీటికోసం వాడుకుంటున్న భూమి లీజును పొడిగిస్తే తప్పా? ఇలా చేసినందుకే రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేస్తారా? దీన్నెవరైనా నమ్ముతారా? ఒకవేళ లీజు పొడిగించకపోతే చెరువులా మారిపోయిన ఆ భూమి దేనికి పనికొస్తుంది?
* విశాఖ సిమెంట్స్‌కు రంగారెడ్డి జిల్లాలోని కాగ్నా నుంచి 10 ఎంసీల (0.00001 టీఎంసీల) నీటి కేటాయింపులున్నాయి. విశాఖ సిమెంట్స్‌ను ఇండియా సిమెంట్స్ స్వాధీనం చేసుకున్నాక... దాన్ని 13 ఎంసీలకు (0.000013 టీఎంసీల) పెంచడానికి వైఎస్ ప్రభుత్వం అనుమతించింది. ఇదీ కథ.
అసలు విశాఖ సిమెంట్స్‌కు 10 ఎంసీల నీటిని కేటాయించింది చంద్రబాబేనన్న సంగతి రామోజీ ఎందుకు రాయరు? 10 ఎంసీల నీటిని 13 ఎంసీలకు పెంచినందుకే జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో ఇండియా సిమెంట్స్ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టి ఉంటే... మరి 10 ఎంసీల నీటిని కేటాయించినందుకు చంద్రబాబుకు ఏ స్థాయిలో ముడుపులు ఇచ్చి ఉండాలి? అయినా బుద్ధి లేని రాతలు గానీ... నీటిని కే టాయిస్తే కంపెనీలు ముడుపులిస్తాయా? నీరు లేకుండా అవి నడిచేదెలా? ఒక కంపెనీ వచ్చాక దానికి నీరు, విద్యుత్ ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా? బాబు హయాంలో ఇలా కరెంటుకు, నీళ్లకు, రోడ్లకు అన్నిటికీ కంపెనీల నుంచి వసూళ్లు చేశారు కనకే రామోజీ వంటి బాబు బినామీలు బాగుపడ్డారా? అలా దండుకున్న ముఠాకు మిగిలిన వారి హయాంలోనూ అన్నీ అలాగే కనిపిస్తున్నాయా?
* నల్లగొండలోని రాశి సిమెంట్స్‌ను 1998లో ఇండియా సిమెంట్స్ స్వాధీనం చేసుకుంది. దానికి కృష్ణా నుంచి 3 లక్షల గ్యాలన్ల నీటికి అనుమతి ఉండగా... దాన్ని వైఎస్ హయాంలో 7 లక్షల గ్యాలన్లకు పెంచారు. ఇదీ విషయం.
ఇలాంటి అంశాలపై ఈనాడు అధిపతి రామోజీరావు రాతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక కంపెనీ వచ్చాక దానికి నీటి కేటాయింపులు చేయటమూ అక్రమమేనని వాదించే ఈ పత్రికాధిపతి... తాను మాత్రం ఫిలింసిటీలో అసైన్డ్ భూముల్ని సైతం ఆక్రమించుకుని కట్టడాలు కట్టడం కరక్టేనంటుంటారు!!! ఆ అసైన్డ్ భూముల్ని వైఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతే... దానిపై కోర్టుకెళ్లి వక్ర మార్గాల్లో స్టే కూడా తెచ్చుకున్న ఘనుడీయన. పేదలకు చెందాల్సిన అసైన్డ్ భూముల్ని ఆక్రమించటమే తప్పయితే... దానిపై కోర్టుల్లో పోరాటానికి సైతం వెనకాడని ఈ రాజగురివిందను ఏమనుకోవాలి? ఈయన రాసే రాతల్ని ఏమనుకోవాలి? ఎన్నేళ్లు వస్తున్నా ఈయన మారరా?
‘సాక్షి’ డమ్మీ సంస్థ కాదే..?
రామోజీ గమనించాల్సిందొక్కటే. అరబిందో ఫార్మా కావచ్చు, హెటెరో డ్రగ్స్ కావచ్చు, ఇండియా సిమెంట్స్ కావచ్చు. భారతి సిమెంట్‌లో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పటికే తమ షేర్లు విక్రయించుకున్నారు. వారికి లాభాలు కూడా వచ్చాయి. ఇక జగతి పబ్లికేషన్స్... అంటే ‘సాక్షి’లో ఎవరు పెట్టుబడులు పెట్టినా... వారికి ఇప్పటికీ ‘సాక్షి’లో వాటాలున్నాయి. సాక్షి పత్రిక సర్క్యులేషన్ సైతం అంతకంతకూ పెరుగుతూ... కొత్త కొత్త ప్రయోగాలతో జనాదరణలో దూసుకుపోతోంది. ఆ వాటాల విలువ కళ్లముందు కనిపిస్తూనే ఉంది. భవిష్యత్తులో ఎప్పుడు ‘సాక్షి’ పబ్లిక్ ఇష్యూకు వెళ్లినా ఇన్వెస్టర్లు అందరికీ లాభాలొస్తాయి.
మరి వారెక్కడ నష్టపోయినట్లు? వారు పెట్టుబడి పెట్టినదేమీ రామోజీకి చెందిన నష్టజాతక కంపెనీల్లో కాదుగా? రిలయన్స్ పెట్టిన డబ్బా కంపెనీల్లో కాదుగా? వై.ఎస్.జగన్‌మోహన్‌రెడి ్డని చూసినా... ‘సాక్షి’లో ఆయన ఎన్నడూ రూపాయి జీతం తీసుకున్నది లేదు. రాష్ట్రంలో ప్రజలకు రెండో కోణం కూడా తెలియాలని, సమాచారంపై ‘ఈనాడు’ గుత్తాధిపత్యానికి తెరపడాలనే ఆశయంతో, కొందరు భావసారూప్యత కలిగిన వ్యక్తులు ఆరంభించిన పత్రిక ఇది. అందులోని పెట్టుబడి పెట్టినవారు కూడా జగన్‌మోహన్‌రెడ్డి సమర్థ్ధతపై విశ్వాసం ఉన్నవారే. లాభాల కోసం పెట్టుబడి పెట్టినపుడు ముడుపులనే ప్రశ్నే తలెత్తదన్న సంగతి రామోజీకి తెలియనిది కాదు. కాకుంటే అమావాస్య, పౌర్ణమి మాదిరిగానే ఎల్లో వైరస్‌కిది ఎన్నికల సీజన్. పోలింగ్ వరకూ ఇది విజృంభిస్తూనే ఉంటుంది. దానికి మందు వేసేది ఈ రాష్ట్ర ప్రజలే.