
రైతు రుణమాఫీపై ఇంత ఈసడింపా?
దేశవ్యాప్తంగా ఇంతవరకు 3.50 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, తెలంగాణలో 1995 నుండి నేటివరకు 25 వేల మందికి పైగా రైతులు జీవితాలను కోల్పోయారు. మనకు తెలిసినంతవరకు మానవ చరిత్రలోనే ఇదొక ఘోరమైన విషాదం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాల మాఫీపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇటీవల మీడి యాలో చేసిన ఒక ప్రకటన తీవ్ర అభ్యంతరకరమైంది.‘గత సంవత్సరం పైలీన్ తుపాను వల్ల పంట నష్టం పెద్దగా కలగ లేదు కదా, రుణమాఫీ ప్రకటించేంత స్థాయిలో రైతులు ఏమంత కష్టాలు పడ్డారం’టూ ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటన ఏరకంగా చూసినా ఖండించదగింది. ఒక కీలకమైన పదవిలో ఉంటున్న అధికారిగా ఆయనకు వ్యవసాయ సమాజ సంక్షేమం పట్లా, రైతుల పట్లా ఎలాంటి బాధ్యతా, నిబద్ధతా ఉండకపోవచ్చు. అయినప్పటికీ భారతీయ రైతుల దుస్థితిపట్లా, గత రెండు దశాబ్దాలుగా పాలకులు ధ్వంసం చేసిన వారి ఆర్థిక పరిస్థితి పట్లా ఆయనకు ఎంతో కొంత అవగాహన ఉంటే బాగుండేది.
ప్రత్యేకించి, పైలీన్ తుపాను కారణంగా తెలంగాణ రైతుల పంటలు గత సంవత్సరం దారుణంగా దెబ్బతి న్నాయి. 2013 అక్టోబర్‌లో తుపాను సమయంలో, ఆ తర్వాత నిరంతరం కురిసిన వర్షాల కారణంగా తెలంగాణలో వరి, జొన్నతో సహా అన్ని రకాల పంటలను 50 శాతం కంటే ఎక్కువగానే రైతులు నష్టపోయారు. తెలంగాణలో మొత్తం 16.19 లక్షల హెక్టార్లలోని పత్తి పంట, 5.60 లక్షల హెక్టార్ల లోని జొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. అవిభక్త ఆంధ్రప్ర దేశ్‌లో 76 శాతం పత్తి పంట, 90 శాతం జొన్న పంట తెలం గాణ జిల్లాల్లోనే పండేది. కానీ పాలక కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల పంటల నష్టాలను అధికారులు సరిగా నమోదు చేయ లేదు. దీంతో లక్షలాదిమంది రైతులు వ్యవసాయ పెట్టుబడు లపై రాయితీకి అర్హులు కాలేకపోయారు. పంటల బీమా పథ కం కింద ఎలాంటి నష్టపరిహారాన్ని పొందలేకపోయారు.
రుణమాఫీ అనేది వ్యవసాయరంగంలోని సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న అనేక చర్యల్లో ఒకటి మాత్రమే. కేవలం రుణమాఫీ అనే ఒక్క చర్యే వ్యవ సాయరంగ సమస్యలను పరిష్కరిస్తుందనే ఆలోచన ఎవరికీ లేదు. గత 20 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతూ వచ్చిన వ్యవసాయ విధానాల ఫలితంగానే అవి భక్త ఆంధప్రదేశ్‌లో వ్యవసాయరంగం కునారిల్లిపోయింది. అలాంటిది.. గత సంవత్సరం పంటల దిగుబడిని ప్రాతిప దికగా తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు లేవని, కాబట్టి రైతు రుణాల రీషెడ్యూల్ సాధ్యం కాదని ఆర్బీఐ పేర్కొనడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉంది.
ఇప్పుడు రైతులను రెండు అంశాలు వెంటాడుతు న్నాయి అవేమంటే 1. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేలా దిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూంటే గతంలోని యూపీఏ ప్రభుత్వం లాగే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? రైతులు ఇకపై ఆత్మహత్య చేసు కోకుండా అన్ని చర్యలూ చేపట్టడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదా? రైతుల ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కోసం కేంద్రం స్వచ్ఛందంగా రైతుల పంట రుణాలు, ప్రైవేట్ రుణాలను మాఫీ చేయడానికి ఎందుకు ముందుకు రావటం లేదు? 2. రాష్ట్ర ప్రభుత్వాలు పంట రుణాల మాఫీ ద్వారా రైతులకు కనీస ఉపశమనం కల్గించడానికి ప్రయత్నాలు చేస్తూ, రైతు రుణాల రీషెడ్యూల్ మాత్రమే చెయ్యాలని ఆర్బీఐకి ప్రతిపా దిస్తున్నాయి. అయితే ఆర్బీఐ క్షేత్రస్థాయిలో వాస్తవాలను అర్థం చేసుకోకుండా పంట రుణాల రీషెడ్యూల్ ప్రతిపా దనను పదే పదే వ్యతిరేకిస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభు త్వం ప్రేక్షక పాత్ర పోషించడం సరైందేనా?
వ్యవసాయ రంగం లాభసాటి కానందునే, అనేకమంది రైతుల జీవనం ఛిన్నాభిన్నమై ప్రతి ఏటా ఆత్మహత్యల బారిన పడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఇంతవరకు 3.50 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, తెలంగాణ ప్రాంతంలో 1995 నుండి నేటివరకు 25 వేలమందికి పైగా రైతులు జీవితాలను బలిపెట్టారు. మనకు తెలిసినంతవరకు మానవ చరిత్రలోనే ఇదొక ఘోరమైన విషాదం. ఆత్మహ త్యలు చేసుకోవాలనే కుతూహలం రైతుల్లో లేదు. కానీ కేంద్రప్రభుత్వాల నిర్వాకం వల్లే, బాధ్యతారహిత వైఖరివల్లే రైతులు బలవన్మరణాల పాలవుతున్నారు. భారతీయ వ్యవ సాయ విధానాన్ని సమూలంగా సమీక్షించి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో స్పష్టమైన ప్రతిపాదనలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపవలసిన సమయం ఆసన్నమైంది. రైతులు ఆత్మహ త్యలు చేసుకోకుండా ఉండాలంటే, తక్షణ చర్యగా వ్యవ సాయ రుణాలను మాఫీ చేయాలి. రైతు ఆత్మహత్య జాతికే అవమానం. ఏ నాగరిక సమాజమైనా సరే ఆత్మహత్యలను ఆపడానికి ప్రతి చర్యనూ చేపట్టాల్సిందే. ఈ కోణంలో రైతు రుణాల మాఫీ న్యాయసమ్మతమైందే.
పాకాల శ్రీహరిరావు (వ్యాసకర్త తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు)