నిత్య సంక్షోభంలో సాగుబడి | farmers are under survival | Sakshi
Sakshi News home page

నిత్య సంక్షోభంలో సాగుబడి

Published Wed, Aug 17 2016 1:14 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

నిత్య సంక్షోభంలో సాగుబడి - Sakshi

నిత్య సంక్షోభంలో సాగుబడి

దేశంలో రైతు ఆత్మహత్యలకు, వ్యవసాయ సంక్షోభానికి.. ప్రభుత్వ విధానాల అమలు లోపమే ప్రధాన కారణం అంటున్నారు పాలగుమ్మి సాయినాథ్. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి స్వామినాథన్ కమిటీ చేసిన విలువైన సూచనలను కూడా పక్కనబెట్టారనీ, ప్రభుత్వాలు వ్యవసాయాన్ని మరింతగా ప్రైవేటీకరించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయం పరిష్కారం కాని సంక్షోభంగానే మిగిలి పోనున్నదని ఆయన హెచ్చరిస్తున్నారు. సీనియర్ పాత్రికేయులు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌తో ఫ్రీలాన్స్ జర్నలిస్టు సునీతా రెడ్డి చేసిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
 
 మీకు ప్రపంచంలోనే ప్రముఖ జర్నలిస్టుగా పేరుంది. డిగ్రీలేకున్నా ఆ రంగంలో అత్యున్నత శిఖరానికి ఎదిగారు. ఎలా సాధ్యం?
 నాకు జర్నలిజంలో డిగ్రీ లేదు కానీ నా సబ్జెక్ట్ హిస్టరీ. అది జర్నలిజంలో నాకు చాలా సాయపడింది. మేం గ్రామానికి వెళ్లి వారి గురించి రాసేటప్పుడు అక్కడి భూ సంబంధాలు,  యాజమాన్య పద్ధతులకు సంబంధించిన చరిత్ర చాలా అవసరం. ఆగస్టు 15 స్వాతంత్య్రం దినం. కానీ నేను విద్యార్థులకు పాఠం చెబుతుంటే ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల పేర్లలో ఒక్కటి కూడా వారికి గుర్తులేదు. ఇది విషాదకరం.
 
అంటే చరిత్రలో పట్టు సాధించటమనే ది జర్నలిజంలో కూడా మీకు బాగా పనికొచ్చిందంటారా?
 తప్పకుండా. జర్నలిజం అంటే నా దృష్టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. బ్యాచిలర్ విద్యార్థులకు నేను దీన్ని తీసుకోమని సూచించను.
 ఒకే. మీరు జర్నలిస్టుగా మొదట  కెరీర్ మొదలెట్టినప్పడు ఏ డిపార్ట్‌మెంటులో ప్రారంభించారు? తర్వాత మీరు రూరల్ ఎఫైర్స్‌లోకి ఎలా వచ్చారు?
 నా ప్రయాణం యునెటైడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యుఎన్‌ఐ) వార్తా సంస్థతో మొదలైంది. అది 1980 సెప్టెంబర్ 20. నా మొదటి షిఫ్టులోనే ఇరాన్ - ఇరాక్ యుద్ధం మొదలైంది. అక్కడ ట్రెయినీ సబ్ ఎడిటర్ గా కూర్చున్నాను. తొలి అనుభవం నాకు డెస్కులో వచ్చింది. అక్కడ నాకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత బ్లిట్జ్ వీక్లీలో చేరాను. ఆర్కే కరంజియా పత్రిక అది. యుఎన్‌ఐ నా జీవితంలో మలుపు అయినా కీలకమైన మలుపు కరంజియా సర్‌తో పనిచేయడం. అది రాజకీయాలకు బాగా ప్రాధాన్యమిచ్చే వార్తా పత్రిక.
 ఎప్పుడు చూసినా చాలా టెన్షన్. ఏదో ఒక కుంభకోణం బయట పెడతారు. శివసేన నుంచి దాడులు జరుగుతుంటాయి. ప్రతి వారం ఇదే పరిస్థితి.  కానీ కరంజియా గారు అద్భుతమైన సంపాదకులు. మాకు చాలా స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. మా వైఫల్యాలకు శిక్షించలేదు. అలాంటి వాతా వరణంలోనే దేన్నయినా చేయగలమనే ఆత్మవిశ్వాసం వస్తుంది. అలా బ్లిట్జ్‌లో పదిన్నర సంవత్సరాలు డిప్యూటీ చీఫ్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశాను.
 
అంటే మీకు అదొక మంచి అనుభవం అయి ఉంటుంది కదా?
 అవును. అద్భుతమైన అనుభవం. ప్రతిరోజూ ఏదో ఒకటి రాయటం, ప్రతిరోజూ ఒత్తిడి... పైగా ఆయనను కలవడానికి తరచు ప్రముఖులు వచ్చేవారు.... ముఖ్యమంత్రో, గవర్నరో, చీఫ్ జస్టిసో. అంటే మాకు నిత్యం అతి ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం వచ్చేది. అది కూడా ఒక అనుభవం. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో నేనొక ప్రయోగం చేశాను. గ్రామాల్లో కరువుపై రిపోర్డింగ్. నా రిపోర్టింగు సమయంలోనే నేను తీవ్రంగా నిరాశపడేవాడిని. కానీ అదే సమయంలో 91లో నాకు రెండు ఫ్రైజులొచ్చాయి. వాటిని నేను తీసుకోలేదు
 
ఎందుకనీ?
 చాలా నిరాశ. ఎందుకంటే నేను చేయాలనుకున్నది చేయలేదు. ఒక కథనం చెబుతాను. థానేలో ముఖాడ అనే గ్రామం ఉంది. అక్కడ ఒక 20, 30 మంది పిల్లలు ఆకలి, క్షుద్బాధతో చనిపోయారు. మేమందరం ఆ లోతట్టు ప్రాంతంలోకి వెళ్లి స్టోరీలు చేశాం. శక్తివంతమైన కథనాలు ఇచ్చాం. వాటికే బహుమతులొచ్చాయి. కానీ నేననుకున్నాను. ఇప్పుడు స్టోరీస్ చేసి ఫ్రైజులు తీసుకుంటున్నాం. పిల్లలు చనిపోయారు. మేం సకాలంలో ఆ కథనాలను చేసి ఉంటే, వారి మరణాలను ఆపి ఉండవచ్చు. పిల్లలు బతికి ఉండేవారు. ఆ బహుమతులను తీసుకుంటే వారి చావుతో నేను లబ్ధి పొందుతున్నట్లే అనుకున్నాను. అందుకే ఆ పని చేయలేదు. 1993 ఏప్రిల్‌లో బ్లిట్జ్ వదిలి టైమ్స్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్‌లో చేరాను. దేశంలోనే అతి పేద జిల్లాల్ల్లో ఒక్కో జిల్లాలో 24 నెలలు గడిపాము. తమిళనాడులో రెండు జిల్లాలున్నాయి. పుదుక్కోటై, రామనాడ్. ఒడిశాలో కోరాపుట్, కలహాండీ.

 అన్నీ వెనుకబడిన జిల్లాలే కదా?
 అతి పేద జిల్లాలవి. అయిదు రాష్ట్రాల్లో రెండు పేద జిల్లాలు. కానీ మేమనుకున్నట్లు పది జిల్లాలను మేం కవర్ చేసి ఉంటే మా పని ఫలితమిచ్చేది కాదు. ఎందుకంటే ఈ జిల్లాలన్నీ అత్యధికంగా వలసపోయే జిల్లాలు. ఉదాహరణకు కలహాండి తీసుకోండి. గ్రామంలోని అందరూ  ఇటుకబట్టీల్లో పనిచేయడానికి విజయనగరం వెళ్లిపోయారు.  
 ఎందుకంటే వారికి అక్కడ ఉపాధి లేదు. కనుకే నేను మరో విధమైన రిపోర్టింగ్ ప్రారంభించాను. వలస కార్మికుల గురించి రాసే రిపోర్టర్లకు నా రూల్ ఏమిటంటే... మీరు వలస కార్మికులతోపాటు కలిసి వెళ్లాలి. వాళ్లెక్కడ విడిది చేస్తే అక్కడే ఉండాలి. వారెక్కడ పడుకుంటారో అక్కడే పడుకోవాలి. అదంతా అనుభవించి రాయాలి. అవును.. అనుభవంతో రాయాలి.
 
మీరు ప్రచురించిన పుస్తకం ఎవ్రీ వన్ లవ్స్ ఎ గుడ్ డ్రాట్ కదా?
 అవును. ఎడిటర్లు కానీ, న్యూస్ పేపర్ చానల్ మేనేజ్‌మెంట్లు కానీ ఈ సబ్జెక్టుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. ఢిల్లీలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అని ఒక పరిశోధనా సంస్థ ఉంది. ఆ సంస్థ అధిపతి కూడా తెలుగాయనే. ఎన్. భాస్కరరావు. చాలా మంచి పర్యవేక్షణ చేస్తారు. ఆరు టాప్ టెలివిజన్ చానల్స్‌ని ఫ్రైమ్‌టైమ్‌లో మానిటర్ చేస్తారాయన. ఆరు టాప్ పత్రికల ఫ్రంట్, బ్యాక్ పేజీలను పరిశీలిస్తారు. దాన్ని చూస్తే ప్రధానమైన వార్తా పత్రికల ఫ్రంట్ పేజీలో 65 శాతం దాకా అంటే మూడింట రెండు వంతుల వార్తలు న్యూఢిల్లీ నుంచే వస్తుంటాయని తేలింది.
 
అంటే ఇంత పెద్ద దేశంలో ఒక చిన్న భాగం నుంచే అన్ని వార్తలా?
 అవును ఒక్క భాగంనుంచి... దాంట్లో కూడా దక్షిణ ఢిల్లీ రాజకీయ వర్గాలనుంచి! తర్వాత ముంబై. ఇక్కడ బాలీవుడ్, దలాల్ స్ట్రీట్ ఉన్నాయి. ఆర్థిక, వినోద రాజధాని. ముంబై నుంచి 10 నుంచి 11 శాతం వార్తలు వస్తాయి. తర్వాత చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వార్తలు వస్తాయి. గ్రామం ప్రాతిపదికన వార్తలు చూస్తే 0.23 శాతం మాత్రమే వార్తలు వచ్చేవి. నేషనల్ ప్రెస్ అని చెబుతారు. అర్ధశాతం గ్రామీణ వార్తలు కూడా వీటిలో రావు. ఇక వ్యవసాయ వార్తలు చూసుకుంటే 0.61 శాతం మాత్రమే వస్తాయి. క్రైమ్, వినోదం, రాజకీయాలు ఇవన్నీ 15, 20 శాతం ఉంటాయి.  గ్రామీణ వార్తలకు మీడియాలో ఎందుకంత తక్కువ చోటు ఇస్తున్నారంటే అది వారి రెవెన్యూ మోడల్ అన్నమాట. బాలీవుడ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ కు ఎక్కువ ఫోకస్ ఇస్తే ప్రకటనలు ఎక్కువగా వస్తాయని. వాళ్ల అంచనా అది. కానీ నా అంచనాలో ఆ మోడల్ ఇప్పుడు ఫెయిలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగానే ఎడ్వర్టయిజింగ్ రెవెన్యూ మోడల్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. నా అవగాహన ప్రకారం అది మరింత సంక్షోభంలో పడిపోతుంది.

ఏం చేయాలంటారు దీనికి?
మనకిప్పుడు బహు విధ మీడియా కావాలి (మల్టిప్లిసిటీ ఆఫ్ మీడియా). ఒకే పెద్ద న్యూస్ పేపర్ అనేది పనిచేయదు. జిల్లా పేపర్లు, లోకల్ పేపర్లు రావాలి. ఇంకా నా అంచనా ప్రకారం ఇది డిజిటల ప్లాట్ ఫామ్ లోకి వెళుతోంది. దీంట్లో యాక్సెస్ ఫ్రీ. ఇప్పుడు విద్యార్థులు ఎక్కువగా ఫోన్ మీదే న్యూస్ చూస్తున్నారు. అది కూడా ఫ్రీగా. మొబైల్ మీదే అన్నీ చూస్తున్నారు, చేస్తున్నారు. అంటే భవిష్యత్తు ఆ వైపు వెళుతోంది. కాని నేనేమనుకుంటు న్నానంటే ప్రింట్  మీడియాకు ఇప్పటికీ తనదైన పాత్ర ఉంది. మనం
 కూడా ప్రజలకు అవసరమైనవి చేసేలా మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. వారి నిజమైన సమస్యలేమిటో తెలుసుకోవాలి. వినోదం కూడా ఉండాలి.  ప్రతి పత్రికలో, చానల్లో ఉండాలి. కాదనడం లేదు. కానీ ఇప్పుడు అదే ఎక్కు వయిపోయింది.

 రైతుల ఆత్మహత్యల గురించి అధ్యయనం చేశారు. ప్రభుత్వానికి మీరు ఏవైనా సలహాలు, సూచనలు ఇచ్చారా?
 చాలా ప్రయత్నం జరిగింది. నా అవగాహనలో వ్యవసాయ సంక్షోభం అనేది విధానాల చోదక సంక్షోభం. వ్యవసాయంలో చాలా విధ్వంసం జరుగుతోంది. మహారాష్ట్రలో 1995 నుంచి 2014 వరకు 63 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడే ఔరంగాబాద్‌లో 150 మంది పారిశ్రామికవేత్తలు మెర్సిడెజ్ బెంజ్ వాహనాలను ఒకే రోజు కొనుక్కున్నారు. గిన్నెస్‌బుక్‌లో రికార్డు కావాలని ఇలా చేశారు. వీరికి అతితక్కువ వడ్డీతో రుణాలిచ్చారు. ఎస్‌బీఐ ఛైర్మన్ వీరికి అతి తక్కువ వడ్డీ 7 శాతంతో రుణా లిచ్చారు. కానీ రైతులకు ట్రాక్టర్ల కోసమిచ్చే రుణానికి 16 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎంత అన్యాయం? బంజారా మహిళా రైతు హీరాబాయ్ ఫకీరా రాథోడ్ కథనం నేను రాశాను. ఇంత వడ్డీతో 5 లక్షల 45 వేల రుణం తీసుకుని 9 లక్షలు తిరిగి చెల్లించి కూడా రుణ ఎగవేతదారుగా ముద్రపడింది. 16 శాతం వడ్డీ పెడితే ఎవరు చెల్లించగలరు.

 ఏపీలో రైతు రుణమాఫీపై చాలా చర్చ జరుగుతోంది. రైతు రుణాలను కూడా చాలా తక్కువమందికే ఇస్తున్నారు. దీనికి పరిష్కారమేమిటి?
 వీటన్నింటికీ పరిష్కారాలున్నాయి. రైతు రుణాల విషయంలో కూడా ప్రైవేట్ రంగానికే కీలక పాత్ర ఇస్తున్నారు. దీంతోఇంకా దోపిడీ జరుగుతుంది లేదా కమర్షియల్ అవుతుంది. ప్రభుత్వాల ప్లాన్ ఏమిటంటే ఇంకా ప్రైవేటీ కరించాలి. వ్యాపారీకరించాలి. ఉమ్మడి ఏపీ ఉదాహరణను తీసుకుంటే ఎల్‌ఐసీలో మూడు ప్రీమియంలు వరుసగా కట్టలేక వెనక్కు తగ్గిన రైతుల ప్రీమియం డబ్బు వెయ్యి కోట్ల రూపాయలు లాక్ అయిపోయింది. వారి పరిస్థితి బాగులేక కట్టలేక పోయారు. ఎల్‌ఐసీ పాలసీ చట్టంలో మార్పు చేసి వారి డబ్బు వారికి ఇప్పించాలని నేను పోరాడాను కానీ ఎవరూ పట్టించు కోలేదు. తెలంగాణ, ఏపీల్లో కౌలుదార్లకు ఏ హక్కులూ లేవు. భూమి పట్టాలు లేవు కాబట్టి ఎవరూ రుణాలు ఇవ్వరు. పంటలకు భీమా సౌకర్యాలు లేవు. కేరళలో ఇలాంటి వారి ప్రయోజనాలు కాపాడటానికి చాలా సౌకర్యాలు కల్పించారు. తెలుగు రాష్ట్రాల రైతులకు, ముఖ్యంగా కౌలుదార్లకు వ్యాపార పంటల విషయంలో రక్షణ కల్పించకపోతే సంక్షోభం ఎన్నటికీ పరిష్కారం కాదని ప్రభుత్వాలు గ్రహించాలి. కావలసిందల్లా తక్షణ చర్యలు చేపట్టడమే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement