P sainath
-
రైతుల చుట్టూ కాదు.. గుండెల్లో మేకులు
రైతుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ అహమే అడ్డొస్తోందని కార్పొరేట్ మీడియాకు, బీజేపీ శ్రేణుల్లో చాలామందికి కూడా తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు. సాగుచట్టాల పవిత్రత కాదు.. రాజు అసలు తప్పు చేయడు అనే అహమే దీనికి కారణం. తప్పులు అంగీకరించి వాటినుంచి బయటపడటం ఇక్కడ జరగదు. దేశంలోని ప్రతి ఒక్క రైతూ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వేరుపడిపోయినా సరే దేశాధినేతది తప్పు కానేకాదు. ఇదే నిజమని తెలుస్తున్నా అతిపెద్ద పత్రికల్లో ఏ ఒక్కటీ కనీసం గుసగుసల రూపంలో కూడా దీన్ని వ్యక్తం చేయడం లేదు. మనమెందుకు దీన్ని గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు. లక్షలాదిమంది మానవులకు విద్యుత్, నీరు అందకుండా చేయడం, తద్వారా వారిని తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడేయడం, పోలీసు, పారామిలటరీ బలగాలతో వారి చుట్టూ బ్యారికేడ్లు కట్టడం, ఎటూ పోనివ్వకుండా చేసి వారిని అత్యంత అనారోగ్య పరిస్థితుల్లోకి నెట్టడం, నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు జర్నలిస్టులు వెళ్లడం అసాధ్యమయ్యేలా కాంక్రీట్, ఐరన్ బ్యారికేడ్లు నిర్మించడం, చలి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి గత రెండు నెలలుగా 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం.. ఢిల్లీ శివార్లలో నెలకొంటున్న ఘోరపరిణామాల్లో ఇవి కొన్ని మాత్రమే.. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటివి జరిగితే అనాగరికమైవిగానూ, మానవ హక్కులపై పెనుదాడిగా కనిపించేవి. కానీ మన ప్రభుత్వం, కులీన పాలకవర్గం వీటికి మించిన సమస్యల్లో తలమునకలవుతున్నాయి. భూమ్మీద అతి గొప్ప దేశంమైన భారత్‌ను అప్రతిష్ట పాలుచేయడానికి, అవమానించడానికి ప్రయత్నిస్తున్న రిహానా, గ్రేటా థన్‌బెర్గ్ అనే భయంకరమైన అంతర్జాతీయ ఉగ్రవాదుల కుట్రను వమ్ము చేయడం ఎలా అనే విచికిత్సలో మనం కూరుకుపోతున్నాం మరి. ప్రతిరోజూ ఢిల్లీ శివార్లలో ప్రజాస్వామ్యాన్ని చీల్చిపడేస్తున్న ఇలాంటి పరిణామాలును వ్యవస్థానుకూల వర్గాలు కూడా అమోదించలేదని మీరు భావించవచ్చు. తాము తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదనీ మన మంత్రులకు తెలుసు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ ఈ చట్టాల రూపకల్పనలో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదు. చివరకు ప్రతిపక్షాలతో కానీ, పార్లమెంటులో కానీ దీనిపై చర్చించడానికి పూనుకోలేదు. కేంద్ర ప్రభుత్వాధినేత ఏ విషయంలోనూ కేబినెట్‌తో చర్చించిన పాపాన పోలేదు. పంజాబ్‌లో దాదాపు ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు రైతు నిరసనకారులుగా మారిపోయారు. కొందరు ఇప్పటికే వారిలో కలిసే ప్రక్రియలో ఉంటున్నారు. ఫిబ్రవరి 14న జరుగనున్న పట్టణ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడానికి కూడా బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. ఈలోగా పంజాబ్‌లోని ఒక తరం యువత మొత్తంగా వేరుపడిపోయింది. భవిష్యత్తులో దీని ప్రభావాలు తీవ్రాతితీవ్రంగా ఉండబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సాధించిన అతి గొప్ప విజయం ఇదేమరి. సాంప్రదాయికంగా ప్రత్యర్థులుగా ఉండే రైతులు, కమిషన్ ఏజెంట్లతో సహా విభిన్న సామాజిక శక్తులను భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏకం చేసింది. పైగా కేంద్రం సిక్కులను, హిందువులను, ముస్లింలను, జాట్స్‌ని, జాట్లు కానివారిని మాత్రమే కాకుండా కాప్ పంచాయితీలను, ఖాన్ మార్కెట్లలో పనిచేసేవారిని కూడా ఒకటిగా చేసేసింది. నిజంగానే ఇది ముచ్చట గొలిపే విషయం. అయితే ఇది పంజాబ్, హరియాణాకు మాత్రమే పరిమితమని కొన్ని ప్రశాంత స్వరాలు రెండునెలలుగా చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. తమాషా కలిగించే విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు గతంలో నియమించని ఒక కమిటీ పంజాబ్, హరియాణాలు భారత యూని యన్‌లో భాగమని చెప్పి ఉండటమే. కాబట్టి అక్కడేం జరిగినా అది మనందరినీ ప్రభావితం చేస్తుందని గ్రహించాలి. అయితే సంస్కరణలను ప్రతిఘటిస్తున్నది సంపన్న రైతులేనని కొందరు ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, గత ఎన్ఎస్ఎస్ సర్వే ప్రకారం పంజాబ్‌లో ఒక సగటు కుటుంబం ఆదాయం రూ. 18,059లు. ఒక్కో రైతు కుటుంబంలో కనీసం అయిదుగురు సభ్యులుంటారు. అంటే తలసరి నెలవారీ ఆదాయం రూ. 3,450 లు అన్నమాట. అంటే సంఘటిత రంగంలో అత్యంత తక్కువ వేతనం పొందే ఉద్యోగి కన్నా రైతుల తలసరి ఆదాయం తక్కువ అన్నమాట. హరియాణాలో ఒక్కో వ్యవసాయ కుటుంబంలో 5.9 మంది వ్యక్తులకు నెలవారీ ఆదాయం రూ. 14,434లు మాత్రమే. అంటే తలసరి రూ. 2,450లు మాత్రమే రైతు కుటుంబాలకు అందుతున్నాయి. అయితే ఇంత తక్కువ ఆదాయం కూడా చాలామంది భారతీయ రైతులకంటే అధిక స్థానంలో హరియాణా రైతులను ఉంచుతోంది. ఉదాహరణకు గుజరాత్ సగటు రైతుకుటుంబం ఆదాయం రూ. 7,926లు. ఇక్కడ కుటుంబంలో 5.2 మంది వ్యక్తులు ఉండొచ్చు. అంటే గుజరాత్ రైతు కుటుంబ తలసరి ఆదాయం రూ. 1,524లు మాత్రమే. భారతీయ రైతుకుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ. 6,426లు (తలసరి ఆదాయం రూ. 1,300లు). పైగా ఈ సగటు నెలవారీ లెక్కలు కూడా రైతులకు అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయ వనరులను కలిపే చెబుతుంటాయి. ఇక సంపన్నరైతులే నిరసన చేస్తున్నారనే వాదన అసంగతం. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు సెల్సియస్ డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలో ట్రాక్టర్ల ట్రాలీల్లో నిద్రిస్తున్నవారు, అయిదారు డిగ్రీల చలిలో స్నానం చేస్తున్నవారు.. ఈ భారతీయ సంపన్నరైతులు నా ప్రశంసలకు మరిం తగా నోచుకుంటున్నారు. వీరు మనం ఊహించిన దానికంటే కఠిన పరిస్థితులను తట్టుకోగలుగుతున్నారు. ఈలోగా రైతులతో చర్చించడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తనలో తాను చర్చించుకోవడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. నిరసన తెలుపుతున్న రైతులను బెదిరించడానికి, రెచ్చగొట్టడానికి చేసే ప్రతి ప్రయత్నమూ వారికి మద్దతునిచ్చే వారి సంఖ్యను పెంచుతోంది. రైతుల విశ్వసనీయతను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ప్రతి చర్యా వ్యవస్థానుకూల మీడియాలో గొప్పగా ప్రచారం పొందుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేక ఫలితాలను పొందుతోంది. భయపెట్టే అంశం ఏమిటంటే రైతులకు అధిక మద్దతు లభించే కొద్దీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా, పైశాచికంగా వారిపై దాడులు పెంచడానికి సిద్ధమైపోతోంది. రైతుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ అహమే అడ్డొస్తోందని కార్పొరేట్ మీడియాకు, బీజేపీ శ్రేణుల్లో చాలామందికి కూడా తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు. సాగుచట్టాల పవిత్రత కాదు.. రాజు అసలు తప్పు చేయడు అనే అహమే దీనికి కారణం. తప్పులు అంగీకరించి వాటినుంచి బయపడటం ఇక్కడ జరగదు. దేశంలోని ప్రతి ఒక్క రైతూ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వేరుపడిపోయినా సరే దేశాధినేతది తప్పు కానేకాదు. ఇదే నిజమని తెలుస్తున్నా అతిపెద్ద పత్రికల్లో ఏ ఒక్కటీ కనీసం గుసగుసల రూపంలో కూడా దీన్ని వ్యక్తం చేయడం లేదు. మనమెందుకు దీన్ని గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు. మనమెందుకు దీనిపై మాట్లాడకూడదు అంటూ రిహానా చేసిన ఆ ఏకవాక్య ప్రకటన ఏ ఒక్కపక్షాన్నీ బలపర్చలేదు. ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఇద్దరూ నేరుగా సాగు చట్టాలను బలపరుస్తూనే రైతులకు సేఫ్టీ యంత్రాంగాలను అందించాలని సన్నాయి నొక్కు నొక్కారు. పొగతాగే వారి సిగరెట్ ప్యాకెట్లపై ఉండే అధికారిక హెచ్చరికకు మించిన విలువ వారి అభిప్రాయాలకు ఉండదనుకోండి. మొత్తం మీద ఆ అమెరికన్ పాప్ సింగర్, ఒక 18 ఏళ్ల స్కూల్ గర్ల్ కమ్ పర్యావరణ కార్యకర్త ఇప్పుడు దేశానికే ప్రమాదకర వ్యక్తులైపోయారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే పనిలో మన ఢిల్లీ పోలీసులు మునిగిపోయారు. మన దేశంపై వీరు జరిపిన కుట్రకు అంతర్జాతీయ మూలాలనే కాకుండా గ్రహాంతరాల్లో మూలాలను కూడా వెతికి పట్టుకునే క్రమంలో ఢిల్లీ పోలీసులకు అవహేళనలు ఎదురైతే నేను దాంట్లో భాగమై ఉండను. పి. సాయినాథ్ వ్యాసకర్త పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సంస్థాపకులు (ది వైర్ సౌజన్యంతో) -
రైతుల వాదనకే మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్ పి.సాయినాథ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ఏ కమిటీలోనూ సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదని శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అధ్యయనం చేయడంతో పాటు, వారిని ఆందోళనల నుంచి విరమింపచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ కమిటీలో ఉండే సభ్యుల పేర్లలో తన పేరును సుప్రీంకోర్టు ప్రస్తావించడంపై సాయినాథ్ స్పందించారు. కమిటీ సభ్యుడిగా తన పేరు రావడంపై ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వం సంప్రదిస్తే.. కమిటీ ఏర్పాటు హేతుబద్ధతపై ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలుసుకుంటాను. కమిటీ ఉద్దేశం, లక్ష్యాలేమిటో కనుక్కుంటాను. కమిటీ ప్రాతినిధ్యం వివరాలు, ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసేదీ లేనిదీ కనుక్కుంటాను’ అని వివరించారు. రైతులు వెలిబుచ్చిన 14, 15 అభ్యంతరాల్లో 12 అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందంటేనే, చట్టాల్లో తీవ్ర లోపాలున్నాయని అర్థమవుతోందన్నారు. రైతులకు ఆల్ ఇండియా కిసాన్ సభ మద్దతు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతిస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రకటించింది. ఏఐకేఎస్ నాయకులు అజిత్ నవాలే, అశోక్ ధవాలే, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నేతలు డీఎం దరార్, సునీల్ మాలుసరె మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రకటన చేశారు. ‘రైతుల కష్టంతో కార్పొరేట్లు లాభాలు ఆర్జించేందుకే ఈ చట్టాలు ఉపయోగపడ్తాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులతో కలిసి డిసెంబర్ 21న ఢిల్లీకి బయల్దేరుతాం’ అని వెల్లడించారు. -
అన్నదాతలకే కాదు.. అందరికీ ముప్పే
నూతన వ్యవసాయ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహకులు తామే న్యాయస్థానా లుగా మారిపోతారు. న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. పెద్ద కార్పొరేట్లకూ, రైతులకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను తాజా చట్టాలు మరింతగా పెంచుతాయి. ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కులకోసం నిలబడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారికి, లేదా దీనికి సంబంధించిన మరే ఇతర వ్యక్తికి వ్యతిరేకంగా ఈ చట్టం కింద సదు ద్దేశంతో చేసిన, చేయాలను కున్న వాటి గురించి న్యాయ పరమైన ఫిర్యాదు, దావాలు ఉండవు.’’ రైతు ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్య చట్టం, 2020లోని 13వ భాగంలోని వాక్యాలు ఇవి. ఇప్పుడు కూడా ఈ కొత్త చట్టాలు రైతులను మాత్రమే ఉద్దేశించినవని మీరు అనుకుంటు న్నారా? సివిల్ సర్వీస్ ఉద్యోగులు నిర్వహించా ల్సిన న్యాయపరమైన బాధ్యతలకు వ్యతిరేకంగా దావా వేయడానికి మినహాయింపునిచ్చే చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఇది దాన్ని ఎన్నో రెట్లు మించిపోయింది. ‘సదుద్దేశంతో’ వాళ్లు ఏం చేసినా దానికి చట్టపర మైన మినహాయింపు ఇవ్వడం మరీ అతిశయం. ‘సదుద్దేశంతో’నే ఏదైనా నేరం చేసి వుంటే వాళ్లను కోర్టుకు ఈడ్వలేకపోవడమే కాదు, ఇతరత్రా వేరే విధమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేనంత రక్షణలో వారున్నారు. పొరపాటున మీరు ఈ అంశం వదిలేసివుంటే గనక, చట్టంలోని 15వ భాగం దాన్ని తిరిగి నొక్కి చెబు తుంది... ఈ అంశాలను విచారించే పరిధి ఏ సివిల్ న్యాయస్థానానికి కూడా లేదని. అసలు ఎవరీ చట్టపరంగా సవాలు చేయలేని, సదుద్దేశంతో పనులు చేసే ‘మరే ఇతర వ్యక్తి’? క్లూ: నిరసన తెలుపుతున్న రైతుల నినాదాల్లో దొర్లు తున్న బడా కార్పొరేట్ సామ్రాజ్యాధిపతులు పేర్లను వినడానికి ప్రయత్నించండి. ఇదంతా కూడా వ్యాపారాన్ని, చాలా చాలా పెద్ద వ్యాపారాన్ని సులభతరం చేయడంలో భాగంగా జరుగుతున్నది. ‘ఏ ఫిర్యాదు, వ్యాజ్యం లేదా మరే ఇతర న్యాయపరమైన చర్యలు ఉండవు’... వ్యాజ్యం వేయలేనిది రైతులు మాత్రమే కాదు, ఎవరూ వేయలేరు. ప్రజాహిత వ్యాజ్యాలకు కూడా ఇదే వర్తిస్తుంది. లాభాపేక్ష లేని గ్రూపులు, రైతు సంఘాలు, లేదా మంచో చెడో ఉద్దేశాలతో ఉన్న ఏ పౌరుడి జోక్యానికి కూడా ఇందులో వీలులేదు. అత్యవసర పరిస్థితి విధించిన 1975–77 కాలంలో తేలిగ్గా అన్ని ప్రాథమిక హక్కులు రద్దయి పోయాయి. మళ్లీ దాని తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు పౌరుడికి లేకుండా చేసిన విష యంలో ఈ చట్టాలు మరీ అతిశయపు మినహా యింపులు ఇచ్చేశాయి. ప్రతి భారతీయుడి మీద దీని ప్రభావం ఉంటుంది. ఇంకోరకంగా చెప్పాలంటే, ఈ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహ కులు తామే న్యాయస్థానాలుగా మారిపోతారు. వాస్తవంగా చెప్పాలంటే, న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. రైతులు మున్ముందు వ్యవహారం చేయాల్సిన పెద్ద కార్పొరేట్లకూ, రైతు లకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను ఇది మరింతగా పెంచుతుంది. దీనిమీద ఆందోళన చెందిన ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఇలా ప్రశ్నించింది: ‘‘పౌర పరిణామాలకు దారితీసే అవ కాశమున్న వివాదాల్లో పాలన, కార్యనిర్వహణకు సంబంధించిన యంత్రాంగానికి తీర్పునిచ్చే అధికా రాన్ని ఎలా ఇస్తారు?’’ ఈ న్యాయసంబంధ అధికారాలను కార్య నిర్వాహక యంత్రాంగానికి బదిలీ చేయడాన్ని ‘ప్రమాదకరం, మహాపరాధం’ అని ఢిల్లీ బార్ కౌన్సిల్ అభివర్ణించింది. న్యాయవృత్తి మీద చూపే ప్రభావం గురించి, ‘ఇది ప్రత్యేకించి జిల్లా న్యాయ స్థానాల విధులకు తీవ్రమైన హాని కలిగించడంతో పాటు న్యాయవాదుల ఉనికిని కూడా లేకుండా చేస్తుంది’ అని అభిప్రాయపడింది. ఇప్పుడుకూడా ఈ చట్టాలు కేవలం రైతులను ఉద్దేశించినవే నని అనుకుంటున్నారా? కార్యనిర్వాహక యంత్రాంగా నికి న్యాయపరమైన అధికారా లను బదిలీ చేయడం ఒప్పందా లకు సంబంధించిన చట్టంలో ఉంది. దీనిలోని 19వ భాగం ఏమంటుందంటే: సబ్ డివిజినల్ అధికారి, పునర్విచారణ జరిపే అధికారి ఈ చట్టం కింద పూర్తి సాధికారులై నిర్ణయించినదాన్ని నిలిపివేయ గలిగే అధికారం ఏ సివిల్ న్యాయ స్థానానికిగానీ మరే ఇతర అధికార యంత్రాంగానికి గానీ లేదు. ఈ వ్యవసాయ చట్టం లోని 19వ భాగపు సారాంశం... రాజ్యాంగపరమైన విచికిత్సకు హక్కు కల్పించే రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్‌ను కొట్టి పడేస్తోంది. ఆర్టికల్ 32ను రాజ్యాంగపు ప్రాథ మికమైన నిర్మాణంగా పరిగణిస్తారు. కచ్చితంగా ఈ ‘ప్రధాన స్రవంతి’ మీడియా (జనాభాలోని 70 శాతానికి సంబంధించిన అంశా లను విస్మరించేదానికి పెట్టిన చిత్రమైన పేరు)కు ఈ వ్యవసాయ చట్టాలవల్ల భారత ప్రజాస్వామ్యా నికి సంభవించే విపరిణామాల గురించి తెలిసే అవకాశం లేదు. కానీ ప్రజాహితం, ప్రజాస్వామ్యం కన్నా ఎక్కువగా వారిని లాభాపేక్ష నడిపిస్తుంది. ఇందులో ప్రయోజనాల వైరుధ్యం ఏమైనా ఉందా అనే అనుమానాలుంటే అవి వదిలించు కోండి. ఈ మీడియా సంస్థలు కూడా కార్పొరేషన్లే. దేశంలోని అతిపెద్ద కార్పొరేషన్ అధిపతి దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ యజమాని కూడా. చాలా కాలంగానే ఈ ఫోర్త్ ఎస్టేట్‌కూ, రియల్ ఎస్టేట్‌కూ మధ్య ఉన్న తేడా ఏమిటో చూపలేనట్టు అయి పోయింది. కార్పొరేషన్ ప్రయోజనాలను కాదని పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత లోతుగా ఈ ప్రధాన స్రవంతి మీడియా తన ప్రపం చంలో కూరుకు పోయివుంది. వారి పత్రికల్లో, చానళ్లలో రైతులను రాక్షసు లుగా చిత్రించడం జరుగుతోంది– ధనిక రైతులు, కేవలం పంజాబీయులు, ఖలిస్తానీలు, కపటులు, కాంగ్రెస్ దేశద్రోహులు, ఇట్లా ఎన్నో రకాలుగా ఎంతో ప్రతిభావంతంగా చూపుతూనేవున్నారు.కాకపోతే ఈ పెద్ద మీడియా సంస్థల సంపా దకీయాలు భిన్నమైన ఎత్తుగడ అనుసరిస్తాయి. మొసలి కన్నీళ్లు కారుస్తాయి. ప్రభుత్వం ఈ విష యంలో మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిందని చెబుతాయి. రైతుల మేలు కోరి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ ఆర్థికవేత్తలు, ప్రధానమంత్రి తెచ్చిన ఈ చట్టాలు చాలా అవ సరం, ఆచరించదగ్గవని చెబుతాయి. కానీ అవన్నీ వేసుకోని ఒక ప్రశ్న: ఇప్పుడే ఎందుకు? కార్మిక చట్టాలు కూడా ఇంత హడా వుడిగా ఎందుకు ముందుకు తెచ్చారు? ఎంతో శ్రద్ధ చూపాల్సిన వేయి అంశాలుండగా ఈ కోవిడ్ మహ మ్మారి సంక్షోభ సమయమే ఈ చట్టాలను తేవడా నికి ఎందుకు అనువైన సమయమని బీజేపీ భావిం చింది? కోవిడ్ వల్ల తీవ్రంగా దెబ్బతిని, చలనం కోల్పోయివున్న రైతులు, కార్మికులు ఏ రకంగానూ అర్థవంతమైన నిరసన చేయలేరని వాళ్ల అంచనా. కాబట్టి, ఇదే సరైన సమయం. అంటే సమూల సంస్కరణలను ముందుకు జరిపే ‘రెండో 1991 క్షణాన్ని’ వాళ్లు దర్శించారు. మంచి సంక్షోభాన్ని అస్సలు వృథా చేయొద్దని వాళ్లకు తెలుసు.2018 నవంబరులో లక్ష మందికి పైగా రైతులు ఢిల్లీలోని పార్లమెంట్ దగ్గర స్వామినాథన్ నివేదిక సిఫారసులను అమలు చేయాలని నిరసనకు దిగారు. అందులోని ముఖ్యాంశాలైన రుణమాఫీ, కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో కేవలం పంజాబ్ రైతులే లేరు, 22 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రైతులు ఉన్నారు.ఇప్పుడు కూడా ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కుల కోసం నిలబడ్డారు. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయుడు; పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడు పి. సాయినాథ్ -
భయంనీడన సంక్షోభాన్ని ఎదుర్కోలేం!
ప్రపంచాన్ని ఆవరిస్తున్న కరోనా వైరస్ గురించి భయాందోళనలు రేకెత్తించి మనం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించలేం. మనదేశంలో ఏదీ సులభంగా అందుబాటులో ఉండని దిగువ తరగతి ప్రజల సమస్యలను తక్షణ ప్రాతిపదికన పరిష్కరించకపోతే స్వీయ నిర్బంధం ద్వారా కరోనాను అరికట్టడం భ్రమే అవుతుంది. నగరాలు, పట్టణాల్లో పనులు లేక లాక్ డౌన్ కారణంగా తిరిగి పల్లెబాట పడుతున్న లక్షలాది కార్మికుల, కూలీల ఆర్థిక, ఆరోగ్య అవసరాలను పట్టించుకంటే కొన్ని వారాల్లోనే దేశంలో కరోనా మృతులకు మించి ఇతరేతర మరణాలు అధికంగా నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు గ్రహించాలి. అంతే తప్ప సమాజం మొత్తాన్ని భయపెట్టి ముంచుకొచ్చిన సంక్షోభాన్ని నివారించలేం. ప్రస్తుత తరుణంలో అసమానతలు, ఆరోగ్యపరమైన న్యాయం వైపు మన చర్చలు కొనసాగాలి. కరోనా వైరస్‌పై తన తొలి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పళ్లేలు, కుండలపై కొట్టడం ద్వారా దుష్టశక్తులను పారదోలాలని పిలుపునిచ్చారు. ఇక రెండో ప్రసంగంలో దేశప్రజలందరినీ భయాందోళనల్లో ముంచెత్తింది. అంతేతప్ప ప్రజలు ప్రత్యేకించి పేదలు రాబోయే వారాల్లో ఆహారం తదితర నిత్యావసర వస్తువులను ఎలా సంపాదించుకోవాలి అనే విషయం గురించి ప్రధాని తన ప్రసంగాల్లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. మధ్యతరగతి అయితే స్టోర్లు, మార్కెట్లలోకి వెళ్లి కావలసినవి తెచ్చుకున్నారు. పేదవారికి అలాంటి అవకాశం లేదు. మనదేశంలో పేదలకు ఏదీ సులభంగా అందుబాటులోకి రాదు. నగరాలను వదిలి గ్రామాలకు వలస పోయేవారికి, తోపుడు బళ్లపై అమ్ముకునేవారు, ఇంటిపనులు చేసేవారు, వ్యవసాయ కూలీలకు, రబీ పంట సకాలంలో నాటలేని రైతులకు, వలసపోతున్న లక్షలాది భారతీయులకు ఏదీ సులభంగా అందుబాటులో ఉండదు. పైగా ఆర్థికమంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఒక్కో వ్యక్తికి ఇస్తున్న 5 కిలోల బియ్యానికి అదనంగా ఈ మూడునెలల కాలంలోమరో అయిదు కిలోల బియ్యం ఇస్తారు. అయితే ఈ అదనపు బియ్యం ఉచితంగా ఇస్తారా లేక వీటికీ పేదలు డబ్బు చెల్లిచాలా అనే విషయంలో స్పష్టత లేదు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తున్నవి ఇప్పటికే అమలవుతున్న పథకాలకు సంబంధించినవే తప్ప దీనిలో కొత్తదనమేదీలేదు. ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ కూలీకి అదనంగా 20 రూపాయలు కలిపి ఇస్తారు. అయితే ఎన్ని రోజులు ఇలా ఇస్తారో తెలీటం లేదు. పైగా సామాజిక దూరం పాటిస్తూ కూలీలు ఏ పనులను చేస్తారు అనేది కూడా స్పష్టం కావడం లేదు. రాబోయే వారాల్లో ప్రజలు ఏ స్థాయిలో పనిచేస్తారు, వారి ఆరోగ్యం ఏమవుతుంది అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది. పని ఉన్నా లేకున్నా ప్రస్తుత సంక్షోభం కొనసాగినంతకాలం పనికి ఆహార పథకం కింద కూలీలకు రైతులకు రోజు కూలీలు తప్పక అందించాలి. ఆర్థికమంత్రి ప్రకటించిన రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీలో కొత్త అంశాలేవీ? ఈ ప్యాకేజీలో ఎంత మొత్తం పాత పథకాలకు వర్తిస్తుందో. అంకెలను కలపడానికి అమల్లో ఉన్న పథకాలను తిరిగి డిజైన్ చేశారా? అన్నీ ప్రశ్నలే. ప్రకటిస్తున్న ఈ గణాంకాలు అత్యవసర పరిస్థితిలో చేసే సహాయం కింద భావించలేని విధంగా ఉంటున్నాయి. పైగా ఫించనుదారులు, వితంతువులు, దివ్యాంగులు వచ్చే మూడునెలల కాలంలో వెయ్యి రూపాయల మొత్తాన్ని ఒకేసారి పొందుతారా లేత రెండు సార్లు అందుకుంటారా? జనధన్ యోజన ఖాతాలు ఉన్న 20 కోట్లమందికి ఈ మూడునెలల కాలంలో నెలకు రూ.500లు లెక్కన వారి ఖాతాలో వేస్తారా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న రుణ మొత్తాన్ని తీసుకోవడమే దుస్వప్నంగా ఉన్న స్థితిలో స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితులను ఎలా పెంచుతారు? పైగా తమ గ్రామాలకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న లక్షలాదిమంది వలస కార్మికులకు ఈ ప్యాకేజీ ఏమేరకు సహాయం అందించనుంది? సంక్షోభాల తాకిడికి సులువుగా గురయ్యే వారికి నిజంగా సామాజిక మద్దతు, లేదా ప్రణాళికలు అందుబాటులో ఉండడం మన దేశంలో చాలా కష్టసాధ్యం. పైగా తమకు ఏదోరకంగా పని ఇస్తున్న పట్టణాల్లో జనజీవితం స్తంభించిపోయిన స్థితుల్లో అధిక సంఖ్యలో వలస కార్మికులు గ్రామాలకు తరలివస్తున్నారని దేశంలోని పలు రాష్ట్రాలు నివేదిస్తున్నాయి. ఇలా గ్రామాలకు తిరిగి వస్తున్న వారు రవాణా సౌకర్యాలు రద్దవడంతో నడిచివస్తున్నారు. కొందరు సైకిళ్లలో ఇళ్లకు వెళుతున్నారు. రైళ్లు, బస్సులు, వ్యాన్లు నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణం మధ్యలోనే ఇరుక్కుపోతున్నారు. ఇది నిజంగా భయానక పరిస్థితిని తలపిస్తోంది. గుజరాత్‌లోని పట్టణాల నుంచి రాజస్థాన్ లోని తమ గ్రామాలకు నడిచివెళుతున్న వారిని, హైదరాబాద్ నుంచి తెలంగాణలోని మారుమూల గ్రామాలకు, ఢిల్లీనుంచి ఉత్తరప్రదేశ్, బిహార్ లోని గ్రామాలకు, ముంబైనుంచి దేశంలోని పలు ప్రాంతాలకు నడిచివెళుతున్న భారీ సంఖ్యలోని ప్రజల గురించి తల్చుకుందాం. కాలినడకన వెళుతున్న వారికి తగిన సహాయం అందకపోతే తిండి, మంచినీళ్లకు కూడా నోచుకోని స్థితి తయారై ఉపద్రవం నెలకొంటుంది. ఇది డయేరియా, కలరా వంటి పాత వ్యాధులు విజృంభించడానికి వీలుంటుంది. లాక్ డౌన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలయ్యేలోపు, అత్యవసర సేవలు అనేకమందికి అందుబాటులో లేకుండా పోతాయి. ఈ ఆర్థికపరమైన దుస్థితి కొనసాగేకొద్ది కరోనా వైరస్ మరణాల కంటే ఇతర వ్యాధుల బారిన పడి మరణించే వారి సంఖ్యే ఎక్కువైపోతుందని పీపుల్స్ హెల్త్ మూమెంట్ అంతర్జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ టి. సుందరరామన్ హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు ఇలా పట్టణాలనుంచి గ్రామాలకు వెనక్కు వలస వస్తున్న వారి సమస్యను యుద్ధప్రాతిపదికన గుర్తించాల్సి ఉంది. కాగా, సుదూర ప్రాంతాలను కాలినడకన ప్రయాణించే శక్తి, సాహసం చేయలేని వారు పట్టణాల్లో ఇరుక్కుపోతే పరిశ్రమలు మూతబడిపోయిన స్థితిలో వారు ఎక్కడికి వెళతారు అనేది మరో పెద్ద సమస్య కానుంది. పైగా వీరికి రేషన్ కార్డులుండవు. ఇలాంటివారికి మీరు ఆహారం ఎలా అందిస్తారు? ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం వలసకార్మికులు, పనిమనుషులు, మురికివాడల్లో నివసించేవారు, ఇతర పేదవర్గాలే కరోనా నేపథ్యంలో ప్రమాదకారులని అందరూ భావిస్తున్నారు. తానీ వాస్తవానికి గతంలో సార్స్‌కి గానీ, ప్రస్తుతం కోవిడ్–19 వైరస్‌కి కానీ వాహకాలుగా ఉన్నవారు విమానాల్లో ప్రయాణించేవారే అన్నది స్పష్టం. దీన్ని గుర్తించకుండా పైన పేర్కొన్న అవాం ఛిత సామాజిక వర్గాలను తరిమేయడంద్వారా నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని మనం ప్రయత్నిస్తున్నాం. అయితే విమానాల్లో ప్రయాణించి వచ్చిన మన ఉన్నత వర్గాలు ఇప్పటికే నగరాల్లో ఉన్న వలస కూలీలు, తదితర పేద వర్గాలకు కరోనాను అంటించి ఉంటే పరిస్థితి ఏమిటి? వీరిలో కొందరైనా ఇప్పటికే గ్రామాలకు వలస వెళ్లి ఉంటే ఫలితం ఏమిటి? వలస కార్మికులు తిరిగి గ్రామాలకు వెళ్లాక వారు అక్కడ సాంప్రదాయికంగా ఉండే టీ స్టాళ్లు, దాబాలు తదితర పనులు చేయకతప్పదు. అక్కడే పడుకుంటారు కూడా. వీరి ద్వారా వైరస్ ఇతరులకు సోకదని గ్యారంటీ ఏమిటి? పైగా ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తే వైరస్ బారినుంచి తప్పించుకోవచ్చని మధ్యతరగతి వర్గాలు భావిస్తున్నాయి. ఒకమేరకు ఇది నిజం కావచ్చు. కానీ స్వీయ నిర్బంధం ద్వారా వచ్చి పడే ఆర్థిక దుస్థితి ప్రభావాల గురించి ఎవరూ దృష్టి పెట్టడం లేదు. పైగా సామాజిక దూరం అనేది మరో చరిత్రను గుర్తుకు తెస్తోంది. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం ఇలాంటి సామాజిక దూరాన్ని కులం రూపంలో మనం కనుగొన్నాం. మన స్వీయ నిర్బంధంలో వర్గం, కులం రెండూ చోటు చేసుకుని ఉన్నాయని మర్చిపోవద్దు. ప్రస్తుతదుస్థితిలో మనం ఏం చేయగలం. అనేకమంది సామాజిక కార్యకర్తలు, మేధావులు ప్రస్తుత సంక్షోభ పరిష్కారం గురంచి ఉత్తమ ఆలోచనలు అందించారు. కానీ నా అభిప్రాయం ప్రకారం కేరళ ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా ఉంటోంది. కేంద్రప్రభుత్వం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ఆహార గిడ్డంగుల్లో ఉన్న ఆరు కోట్ల టన్నుల అదనపు ఆహార నిల్వలను అత్యవసర ప్రాతిపదికన పంపిణీ చేయాలి. గ్రామాలకు తరలివెళుతున్న లక్షలాది వలసకార్మికులకు, పేదలకు తక్షణ సహాయం అందించాలి. ఇప్పుడు మూతపడిన పాఠశాలలు,కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్, భవంతులను వలసకూలీలకు, నిరాశ్రయులకు వసతి కేంద్రాలుగా మార్చివేయాలి. ప్రైవేట్ వైద్య కేంద్రాలను జాతీయం చేయడానికి కేంద్రం సంసిద్ధం కావాలి. ఆసుపత్రులను కరోనా చికిత్సా కేంద్రాలుగా మార్చాలి. గత వారం స్పెయిన్ అన్ని ఆసుపత్రులను జాతీయం చేసిపడేసింది. లాభార్జన ధ్యేయంగా కలిగిన ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సకు అంగీకరించవు. పేదలకు మూడునెలలపాటు ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించాలి. పనికి ఆహారం పథకం కింద గ్రామాల్లో కూలీలకు, పేదలకు రోజు కూలీలను మూడునెలలపాటు అందించాలి. నగర కూలీలకు నెలకు కనీసం రూ.6,000లు ఇదేకాలానికి అందించాలి. అదేసమయంలో కోవిడ్–19ని చరిత్రలోనే అసాధారణమైన ఘటన అనేకోణంలో మన చర్చలు కొనసాగితే మంచిది. ఈ సంధి దశను మనం ఏ వైపునకు పయనిద్దాం అనే కోణంలో ఉపయోగించుకుందాం. అసమానతలు, ఆరోగ్యపరమైన న్యాయం వైపు మన చర్చలు కొనసాగాలి. వ్యాసకర్త : పి. సాయినాథ్ ఫౌండర్ ఎడిటర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా -
నిత్య సంక్షోభంలో సాగుబడి
దేశంలో రైతు ఆత్మహత్యలకు, వ్యవసాయ సంక్షోభానికి.. ప్రభుత్వ విధానాల అమలు లోపమే ప్రధాన కారణం అంటున్నారు పాలగుమ్మి సాయినాథ్. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి స్వామినాథన్ కమిటీ చేసిన విలువైన సూచనలను కూడా పక్కనబెట్టారనీ, ప్రభుత్వాలు వ్యవసాయాన్ని మరింతగా ప్రైవేటీకరించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయం పరిష్కారం కాని సంక్షోభంగానే మిగిలి పోనున్నదని ఆయన హెచ్చరిస్తున్నారు. సీనియర్ పాత్రికేయులు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్తో ఫ్రీలాన్స్ జర్నలిస్టు సునీతా రెడ్డి చేసిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... మీకు ప్రపంచంలోనే ప్రముఖ జర్నలిస్టుగా పేరుంది. డిగ్రీలేకున్నా ఆ రంగంలో అత్యున్నత శిఖరానికి ఎదిగారు. ఎలా సాధ్యం? నాకు జర్నలిజంలో డిగ్రీ లేదు కానీ నా సబ్జెక్ట్ హిస్టరీ. అది జర్నలిజంలో నాకు చాలా సాయపడింది. మేం గ్రామానికి వెళ్లి వారి గురించి రాసేటప్పుడు అక్కడి భూ సంబంధాలు, యాజమాన్య పద్ధతులకు సంబంధించిన చరిత్ర చాలా అవసరం. ఆగస్టు 15 స్వాతంత్య్రం దినం. కానీ నేను విద్యార్థులకు పాఠం చెబుతుంటే ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల పేర్లలో ఒక్కటి కూడా వారికి గుర్తులేదు. ఇది విషాదకరం. అంటే చరిత్రలో పట్టు సాధించటమనే ది జర్నలిజంలో కూడా మీకు బాగా పనికొచ్చిందంటారా? తప్పకుండా. జర్నలిజం అంటే నా దృష్టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. బ్యాచిలర్ విద్యార్థులకు నేను దీన్ని తీసుకోమని సూచించను. ఒకే. మీరు జర్నలిస్టుగా మొదట కెరీర్ మొదలెట్టినప్పడు ఏ డిపార్ట్మెంటులో ప్రారంభించారు? తర్వాత మీరు రూరల్ ఎఫైర్స్లోకి ఎలా వచ్చారు? నా ప్రయాణం యునెటైడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యుఎన్ఐ) వార్తా సంస్థతో మొదలైంది. అది 1980 సెప్టెంబర్ 20. నా మొదటి షిఫ్టులోనే ఇరాన్ - ఇరాక్ యుద్ధం మొదలైంది. అక్కడ ట్రెయినీ సబ్ ఎడిటర్ గా కూర్చున్నాను. తొలి అనుభవం నాకు డెస్కులో వచ్చింది. అక్కడ నాకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత బ్లిట్జ్ వీక్లీలో చేరాను. ఆర్కే కరంజియా పత్రిక అది. యుఎన్ఐ నా జీవితంలో మలుపు అయినా కీలకమైన మలుపు కరంజియా సర్‌తో పనిచేయడం. అది రాజకీయాలకు బాగా ప్రాధాన్యమిచ్చే వార్తా పత్రిక. ఎప్పుడు చూసినా చాలా టెన్షన్. ఏదో ఒక కుంభకోణం బయట పెడతారు. శివసేన నుంచి దాడులు జరుగుతుంటాయి. ప్రతి వారం ఇదే పరిస్థితి. కానీ కరంజియా గారు అద్భుతమైన సంపాదకులు. మాకు చాలా స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. మా వైఫల్యాలకు శిక్షించలేదు. అలాంటి వాతా వరణంలోనే దేన్నయినా చేయగలమనే ఆత్మవిశ్వాసం వస్తుంది. అలా బ్లిట్జ్‌లో పదిన్నర సంవత్సరాలు డిప్యూటీ చీఫ్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశాను. అంటే మీకు అదొక మంచి అనుభవం అయి ఉంటుంది కదా? అవును. అద్భుతమైన అనుభవం. ప్రతిరోజూ ఏదో ఒకటి రాయటం, ప్రతిరోజూ ఒత్తిడి... పైగా ఆయనను కలవడానికి తరచు ప్రముఖులు వచ్చేవారు.... ముఖ్యమంత్రో, గవర్నరో, చీఫ్ జస్టిసో. అంటే మాకు నిత్యం అతి ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం వచ్చేది. అది కూడా ఒక అనుభవం. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో నేనొక ప్రయోగం చేశాను. గ్రామాల్లో కరువుపై రిపోర్డింగ్. నా రిపోర్టింగు సమయంలోనే నేను తీవ్రంగా నిరాశపడేవాడిని. కానీ అదే సమయంలో 91లో నాకు రెండు ఫ్రైజులొచ్చాయి. వాటిని నేను తీసుకోలేదు ఎందుకనీ? చాలా నిరాశ. ఎందుకంటే నేను చేయాలనుకున్నది చేయలేదు. ఒక కథనం చెబుతాను. థానేలో ముఖాడ అనే గ్రామం ఉంది. అక్కడ ఒక 20, 30 మంది పిల్లలు ఆకలి, క్షుద్బాధతో చనిపోయారు. మేమందరం ఆ లోతట్టు ప్రాంతంలోకి వెళ్లి స్టోరీలు చేశాం. శక్తివంతమైన కథనాలు ఇచ్చాం. వాటికే బహుమతులొచ్చాయి. కానీ నేననుకున్నాను. ఇప్పుడు స్టోరీస్ చేసి ఫ్రైజులు తీసుకుంటున్నాం. పిల్లలు చనిపోయారు. మేం సకాలంలో ఆ కథనాలను చేసి ఉంటే, వారి మరణాలను ఆపి ఉండవచ్చు. పిల్లలు బతికి ఉండేవారు. ఆ బహుమతులను తీసుకుంటే వారి చావుతో నేను లబ్ధి పొందుతున్నట్లే అనుకున్నాను. అందుకే ఆ పని చేయలేదు. 1993 ఏప్రిల్‌లో బ్లిట్జ్ వదిలి టైమ్స్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్‌లో చేరాను. దేశంలోనే అతి పేద జిల్లాల్ల్లో ఒక్కో జిల్లాలో 24 నెలలు గడిపాము. తమిళనాడులో రెండు జిల్లాలున్నాయి. పుదుక్కోటై, రామనాడ్. ఒడిశాలో కోరాపుట్, కలహాండీ. అన్నీ వెనుకబడిన జిల్లాలే కదా? అతి పేద జిల్లాలవి. అయిదు రాష్ట్రాల్లో రెండు పేద జిల్లాలు. కానీ మేమనుకున్నట్లు పది జిల్లాలను మేం కవర్ చేసి ఉంటే మా పని ఫలితమిచ్చేది కాదు. ఎందుకంటే ఈ జిల్లాలన్నీ అత్యధికంగా వలసపోయే జిల్లాలు. ఉదాహరణకు కలహాండి తీసుకోండి. గ్రామంలోని అందరూ ఇటుకబట్టీల్లో పనిచేయడానికి విజయనగరం వెళ్లిపోయారు. ఎందుకంటే వారికి అక్కడ ఉపాధి లేదు. కనుకే నేను మరో విధమైన రిపోర్టింగ్ ప్రారంభించాను. వలస కార్మికుల గురించి రాసే రిపోర్టర్లకు నా రూల్ ఏమిటంటే... మీరు వలస కార్మికులతోపాటు కలిసి వెళ్లాలి. వాళ్లెక్కడ విడిది చేస్తే అక్కడే ఉండాలి. వారెక్కడ పడుకుంటారో అక్కడే పడుకోవాలి. అదంతా అనుభవించి రాయాలి. అవును.. అనుభవంతో రాయాలి. మీరు ప్రచురించిన పుస్తకం ఎవ్రీ వన్ లవ్స్ ఎ గుడ్ డ్రాట్ కదా? అవును. ఎడిటర్లు కానీ, న్యూస్ పేపర్ చానల్ మేనేజ్మెంట్లు కానీ ఈ సబ్జెక్టుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. ఢిల్లీలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అని ఒక పరిశోధనా సంస్థ ఉంది. ఆ సంస్థ అధిపతి కూడా తెలుగాయనే. ఎన్. భాస్కరరావు. చాలా మంచి పర్యవేక్షణ చేస్తారు. ఆరు టాప్ టెలివిజన్ చానల్స్‌ని ఫ్రైమ్టైమ్లో మానిటర్ చేస్తారాయన. ఆరు టాప్ పత్రికల ఫ్రంట్, బ్యాక్ పేజీలను పరిశీలిస్తారు. దాన్ని చూస్తే ప్రధానమైన వార్తా పత్రికల ఫ్రంట్ పేజీలో 65 శాతం దాకా అంటే మూడింట రెండు వంతుల వార్తలు న్యూఢిల్లీ నుంచే వస్తుంటాయని తేలింది. అంటే ఇంత పెద్ద దేశంలో ఒక చిన్న భాగం నుంచే అన్ని వార్తలా? అవును ఒక్క భాగంనుంచి... దాంట్లో కూడా దక్షిణ ఢిల్లీ రాజకీయ వర్గాలనుంచి! తర్వాత ముంబై. ఇక్కడ బాలీవుడ్, దలాల్ స్ట్రీట్ ఉన్నాయి. ఆర్థిక, వినోద రాజధాని. ముంబై నుంచి 10 నుంచి 11 శాతం వార్తలు వస్తాయి. తర్వాత చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వార్తలు వస్తాయి. గ్రామం ప్రాతిపదికన వార్తలు చూస్తే 0.23 శాతం మాత్రమే వార్తలు వచ్చేవి. నేషనల్ ప్రెస్ అని చెబుతారు. అర్ధశాతం గ్రామీణ వార్తలు కూడా వీటిలో రావు. ఇక వ్యవసాయ వార్తలు చూసుకుంటే 0.61 శాతం మాత్రమే వస్తాయి. క్రైమ్, వినోదం, రాజకీయాలు ఇవన్నీ 15, 20 శాతం ఉంటాయి. గ్రామీణ వార్తలకు మీడియాలో ఎందుకంత తక్కువ చోటు ఇస్తున్నారంటే అది వారి రెవెన్యూ మోడల్ అన్నమాట. బాలీవుడ్, ఎంటర్టెయిన్మెంట్ కు ఎక్కువ ఫోకస్ ఇస్తే ప్రకటనలు ఎక్కువగా వస్తాయని. వాళ్ల అంచనా అది. కానీ నా అంచనాలో ఆ మోడల్ ఇప్పుడు ఫెయిలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగానే ఎడ్వర్టయిజింగ్ రెవెన్యూ మోడల్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. నా అవగాహన ప్రకారం అది మరింత సంక్షోభంలో పడిపోతుంది. ఏం చేయాలంటారు దీనికి? మనకిప్పుడు బహు విధ మీడియా కావాలి (మల్టిప్లిసిటీ ఆఫ్ మీడియా). ఒకే పెద్ద న్యూస్ పేపర్ అనేది పనిచేయదు. జిల్లా పేపర్లు, లోకల్ పేపర్లు రావాలి. ఇంకా నా అంచనా ప్రకారం ఇది డిజిటల ప్లాట్ ఫామ్ లోకి వెళుతోంది. దీంట్లో యాక్సెస్ ఫ్రీ. ఇప్పుడు విద్యార్థులు ఎక్కువగా ఫోన్ మీదే న్యూస్ చూస్తున్నారు. అది కూడా ఫ్రీగా. మొబైల్ మీదే అన్నీ చూస్తున్నారు, చేస్తున్నారు. అంటే భవిష్యత్తు ఆ వైపు వెళుతోంది. కాని నేనేమనుకుంటు న్నానంటే ప్రింట్ మీడియాకు ఇప్పటికీ తనదైన పాత్ర ఉంది. మనం కూడా ప్రజలకు అవసరమైనవి చేసేలా మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. వారి నిజమైన సమస్యలేమిటో తెలుసుకోవాలి. వినోదం కూడా ఉండాలి. ప్రతి పత్రికలో, చానల్లో ఉండాలి. కాదనడం లేదు. కానీ ఇప్పుడు అదే ఎక్కు వయిపోయింది. రైతుల ఆత్మహత్యల గురించి అధ్యయనం చేశారు. ప్రభుత్వానికి మీరు ఏవైనా సలహాలు, సూచనలు ఇచ్చారా? చాలా ప్రయత్నం జరిగింది. నా అవగాహనలో వ్యవసాయ సంక్షోభం అనేది విధానాల చోదక సంక్షోభం. వ్యవసాయంలో చాలా విధ్వంసం జరుగుతోంది. మహారాష్ట్రలో 1995 నుంచి 2014 వరకు 63 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడే ఔరంగాబాద్‌లో 150 మంది పారిశ్రామికవేత్తలు మెర్సిడెజ్ బెంజ్ వాహనాలను ఒకే రోజు కొనుక్కున్నారు. గిన్నెస్‌బుక్‌లో రికార్డు కావాలని ఇలా చేశారు. వీరికి అతితక్కువ వడ్డీతో రుణాలిచ్చారు. ఎస్బీఐ ఛైర్మన్ వీరికి అతి తక్కువ వడ్డీ 7 శాతంతో రుణా లిచ్చారు. కానీ రైతులకు ట్రాక్టర్ల కోసమిచ్చే రుణానికి 16 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎంత అన్యాయం? బంజారా మహిళా రైతు హీరాబాయ్ ఫకీరా రాథోడ్ కథనం నేను రాశాను. ఇంత వడ్డీతో 5 లక్షల 45 వేల రుణం తీసుకుని 9 లక్షలు తిరిగి చెల్లించి కూడా రుణ ఎగవేతదారుగా ముద్రపడింది. 16 శాతం వడ్డీ పెడితే ఎవరు చెల్లించగలరు. ఏపీలో రైతు రుణమాఫీపై చాలా చర్చ జరుగుతోంది. రైతు రుణాలను కూడా చాలా తక్కువమందికే ఇస్తున్నారు. దీనికి పరిష్కారమేమిటి? వీటన్నింటికీ పరిష్కారాలున్నాయి. రైతు రుణాల విషయంలో కూడా ప్రైవేట్ రంగానికే కీలక పాత్ర ఇస్తున్నారు. దీంతోఇంకా దోపిడీ జరుగుతుంది లేదా కమర్షియల్ అవుతుంది. ప్రభుత్వాల ప్లాన్ ఏమిటంటే ఇంకా ప్రైవేటీ కరించాలి. వ్యాపారీకరించాలి. ఉమ్మడి ఏపీ ఉదాహరణను తీసుకుంటే ఎల్ఐసీలో మూడు ప్రీమియంలు వరుసగా కట్టలేక వెనక్కు తగ్గిన రైతుల ప్రీమియం డబ్బు వెయ్యి కోట్ల రూపాయలు లాక్ అయిపోయింది. వారి పరిస్థితి బాగులేక కట్టలేక పోయారు. ఎల్ఐసీ పాలసీ చట్టంలో మార్పు చేసి వారి డబ్బు వారికి ఇప్పించాలని నేను పోరాడాను కానీ ఎవరూ పట్టించు కోలేదు. తెలంగాణ, ఏపీల్లో కౌలుదార్లకు ఏ హక్కులూ లేవు. భూమి పట్టాలు లేవు కాబట్టి ఎవరూ రుణాలు ఇవ్వరు. పంటలకు భీమా సౌకర్యాలు లేవు. కేరళలో ఇలాంటి వారి ప్రయోజనాలు కాపాడటానికి చాలా సౌకర్యాలు కల్పించారు. తెలుగు రాష్ట్రాల రైతులకు, ముఖ్యంగా కౌలుదార్లకు వ్యాపార పంటల విషయంలో రక్షణ కల్పించకపోతే సంక్షోభం ఎన్నటికీ పరిష్కారం కాదని ప్రభుత్వాలు గ్రహించాలి. కావలసిందల్లా తక్షణ చర్యలు చేపట్టడమే.