
న్యూఢిల్లీ/ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్ పి.సాయినాథ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ఏ కమిటీలోనూ సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదని శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అధ్యయనం చేయడంతో పాటు, వారిని ఆందోళనల నుంచి విరమింపచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ కమిటీలో ఉండే సభ్యుల పేర్లలో తన పేరును సుప్రీంకోర్టు ప్రస్తావించడంపై సాయినాథ్ స్పందించారు. కమిటీ సభ్యుడిగా తన పేరు రావడంపై ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వం సంప్రదిస్తే.. కమిటీ ఏర్పాటు హేతుబద్ధతపై ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలుసుకుంటాను. కమిటీ ఉద్దేశం, లక్ష్యాలేమిటో కనుక్కుంటాను. కమిటీ ప్రాతినిధ్యం వివరాలు, ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసేదీ లేనిదీ కనుక్కుంటాను’ అని వివరించారు. రైతులు వెలిబుచ్చిన 14, 15 అభ్యంతరాల్లో 12 అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందంటేనే, చట్టాల్లో తీవ్ర లోపాలున్నాయని అర్థమవుతోందన్నారు.
రైతులకు ఆల్ ఇండియా కిసాన్ సభ మద్దతు
సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతిస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రకటించింది. ఏఐకేఎస్ నాయకులు అజిత్ నవాలే, అశోక్ ధవాలే, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నేతలు డీఎం దరార్, సునీల్ మాలుసరె మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రకటన చేశారు. ‘రైతుల కష్టంతో కార్పొరేట్లు లాభాలు ఆర్జించేందుకే ఈ చట్టాలు ఉపయోగపడ్తాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులతో కలిసి డిసెంబర్ 21న ఢిల్లీకి బయల్దేరుతాం’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment