భయంనీడన సంక్షోభాన్ని ఎదుర్కోలేం! | PSainath Writes Guest Column On Crisis About Coronavirus | Sakshi
Sakshi News home page

భయంనీడన సంక్షోభాన్ని ఎదుర్కోలేం!

Published Sat, Mar 28 2020 12:33 AM | Last Updated on Mon, Mar 30 2020 10:56 PM

PSainath Writes Guest Column On Crisis About Coronavirus - Sakshi

ప్రపంచాన్ని ఆవరిస్తున్న కరోనా వైరస్‌ గురించి భయాందోళనలు రేకెత్తించి మనం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించలేం. మనదేశంలో ఏదీ సులభంగా అందుబాటులో ఉండని దిగువ తరగతి ప్రజల సమస్యలను తక్షణ ప్రాతిపదికన పరిష్కరించకపోతే స్వీయ నిర్బంధం ద్వారా కరోనాను అరికట్టడం భ్రమే అవుతుంది. నగరాలు, పట్టణాల్లో పనులు లేక లాక్‌ డౌన్‌ కారణంగా తిరిగి పల్లెబాట పడుతున్న లక్షలాది కార్మికుల, కూలీల ఆర్థిక, ఆరోగ్య అవసరాలను పట్టించుకంటే కొన్ని వారాల్లోనే దేశంలో కరోనా మృతులకు మించి ఇతరేతర మరణాలు అధికంగా నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు గ్రహించాలి. అంతే తప్ప సమాజం మొత్తాన్ని భయపెట్టి ముంచుకొచ్చిన సంక్షోభాన్ని నివారించలేం. ప్రస్తుత తరుణంలో అసమానతలు, ఆరోగ్యపరమైన న్యాయం వైపు మన చర్చలు కొనసాగాలి.

కరోనా వైరస్‌పై తన తొలి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పళ్లేలు, కుండలపై కొట్టడం ద్వారా దుష్టశక్తులను పారదోలాలని పిలుపునిచ్చారు. ఇక రెండో ప్రసంగంలో దేశప్రజలందరినీ భయాందోళనల్లో ముంచెత్తింది. అంతేతప్ప ప్రజలు ప్రత్యేకించి పేదలు రాబోయే వారాల్లో ఆహారం తదితర నిత్యావసర వస్తువులను ఎలా సంపాదించుకోవాలి అనే విషయం గురించి ప్రధాని తన ప్రసంగాల్లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. మధ్యతరగతి అయితే స్టోర్లు, మార్కెట్లలోకి వెళ్లి కావలసినవి తెచ్చుకున్నారు. పేదవారికి అలాంటి అవకాశం లేదు. మనదేశంలో పేదలకు ఏదీ సులభంగా అందుబాటులోకి రాదు. నగరాలను వదిలి గ్రామాలకు వలస పోయేవారికి, తోపుడు బళ్లపై అమ్ముకునేవారు, ఇంటిపనులు చేసేవారు, వ్యవసాయ కూలీలకు, రబీ పంట సకాలంలో నాటలేని రైతులకు, వలసపోతున్న లక్షలాది భారతీయులకు ఏదీ సులభంగా అందుబాటులో ఉండదు.

పైగా ఆర్థికమంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఒక్కో వ్యక్తికి ఇస్తున్న 5 కిలోల బియ్యానికి అదనంగా ఈ మూడునెలల కాలంలోమరో అయిదు కిలోల బియ్యం ఇస్తారు. అయితే ఈ అదనపు బియ్యం ఉచితంగా ఇస్తారా లేక వీటికీ పేదలు డబ్బు చెల్లిచాలా అనే విషయంలో స్పష్టత లేదు.  కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తున్నవి ఇప్పటికే అమలవుతున్న పథకాలకు సంబంధించినవే తప్ప దీనిలో కొత్తదనమేదీలేదు. ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ కూలీకి అదనంగా 20 రూపాయలు కలిపి ఇస్తారు. అయితే ఎన్ని రోజులు ఇలా ఇస్తారో తెలీటం లేదు. పైగా సామాజిక దూరం పాటిస్తూ కూలీలు ఏ పనులను చేస్తారు అనేది కూడా స్పష్టం కావడం లేదు. రాబోయే వారాల్లో ప్రజలు ఏ స్థాయిలో పనిచేస్తారు, వారి ఆరోగ్యం ఏమవుతుంది అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది. పని ఉన్నా లేకున్నా ప్రస్తుత సంక్షోభం కొనసాగినంతకాలం పనికి ఆహార పథకం కింద కూలీలకు రైతులకు రోజు కూలీలు తప్పక అందించాలి.

ఆర్థికమంత్రి ప్రకటించిన రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీలో కొత్త అంశాలేవీ? ఈ ప్యాకేజీలో ఎంత మొత్తం పాత పథకాలకు వర్తిస్తుందో. అంకెలను కలపడానికి అమల్లో ఉన్న పథకాలను తిరిగి డిజైన్‌ చేశారా? అన్నీ ప్రశ్నలే. ప్రకటిస్తున్న ఈ గణాంకాలు అత్యవసర పరిస్థితిలో చేసే సహాయం కింద భావించలేని విధంగా ఉంటున్నాయి. పైగా ఫించనుదారులు, వితంతువులు, దివ్యాంగులు వచ్చే మూడునెలల కాలంలో వెయ్యి రూపాయల మొత్తాన్ని ఒకేసారి పొందుతారా లేత రెండు సార్లు అందుకుంటారా? జనధన్‌ యోజన ఖాతాలు ఉన్న 20 కోట్లమందికి ఈ మూడునెలల కాలంలో నెలకు రూ.500లు లెక్కన వారి ఖాతాలో వేస్తారా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న రుణ మొత్తాన్ని తీసుకోవడమే దుస్వప్నంగా ఉన్న స్థితిలో స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితులను ఎలా పెంచుతారు? పైగా తమ గ్రామాలకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న లక్షలాదిమంది వలస కార్మికులకు ఈ ప్యాకేజీ ఏమేరకు సహాయం అందించనుంది?

సంక్షోభాల తాకిడికి సులువుగా గురయ్యే వారికి నిజంగా సామాజిక మద్దతు, లేదా ప్రణాళికలు అందుబాటులో ఉండడం మన దేశంలో చాలా కష్టసాధ్యం. పైగా తమకు ఏదోరకంగా పని ఇస్తున్న పట్టణాల్లో జనజీవితం స్తంభించిపోయిన స్థితుల్లో అధిక సంఖ్యలో వలస కార్మికులు గ్రామాలకు తరలివస్తున్నారని దేశంలోని పలు రాష్ట్రాలు నివేదిస్తున్నాయి. ఇలా గ్రామాలకు తిరిగి వస్తున్న వారు రవాణా సౌకర్యాలు రద్దవడంతో నడిచివస్తున్నారు. కొందరు సైకిళ్లలో ఇళ్లకు వెళుతున్నారు. రైళ్లు, బస్సులు, వ్యాన్లు నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణం మధ్యలోనే ఇరుక్కుపోతున్నారు. ఇది నిజంగా భయానక పరిస్థితిని తలపిస్తోంది. గుజరాత్‌లోని పట్టణాల నుంచి రాజస్థాన్‌ లోని తమ గ్రామాలకు నడిచివెళుతున్న వారిని, హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని మారుమూల గ్రామాలకు, ఢిల్లీనుంచి ఉత్తరప్రదేశ్, బిహార్‌ లోని  గ్రామాలకు, ముంబైనుంచి దేశంలోని పలు ప్రాంతాలకు నడిచివెళుతున్న భారీ సంఖ్యలోని ప్రజల గురించి తల్చుకుందాం. కాలినడకన వెళుతున్న వారికి తగిన సహాయం అందకపోతే తిండి, మంచినీళ్లకు కూడా నోచుకోని స్థితి తయారై ఉపద్రవం నెలకొంటుంది. ఇది డయేరియా, కలరా వంటి పాత వ్యాధులు విజృంభించడానికి వీలుంటుంది.

లాక్‌ డౌన్‌ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలయ్యేలోపు, అత్యవసర సేవలు అనేకమందికి అందుబాటులో లేకుండా పోతాయి. ఈ ఆర్థికపరమైన దుస్థితి కొనసాగేకొద్ది కరోనా వైరస్‌ మరణాల కంటే ఇతర వ్యాధుల బారిన పడి మరణించే వారి సంఖ్యే ఎక్కువైపోతుందని పీపుల్స్‌ హెల్త్‌ మూమెంట్‌ అంతర్జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్‌ టి. సుందరరామన్‌ హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు ఇలా పట్టణాలనుంచి గ్రామాలకు వెనక్కు వలస వస్తున్న వారి సమస్యను యుద్ధప్రాతిపదికన గుర్తించాల్సి ఉంది. కాగా, సుదూర ప్రాంతాలను కాలినడకన ప్రయాణించే శక్తి, సాహసం చేయలేని వారు పట్టణాల్లో ఇరుక్కుపోతే పరిశ్రమలు మూతబడిపోయిన స్థితిలో వారు ఎక్కడికి వెళతారు అనేది మరో పెద్ద సమస్య కానుంది. పైగా వీరికి రేషన్‌ కార్డులుండవు. ఇలాంటివారికి మీరు ఆహారం ఎలా అందిస్తారు?

ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం
వలసకార్మికులు, పనిమనుషులు, మురికివాడల్లో నివసించేవారు, ఇతర పేదవర్గాలే కరోనా నేపథ్యంలో ప్రమాదకారులని అందరూ భావిస్తున్నారు. తానీ వాస్తవానికి గతంలో సార్స్‌కి గానీ, ప్రస్తుతం కోవిడ్‌–19 వైరస్‌కి కానీ వాహకాలుగా ఉన్నవారు విమానాల్లో ప్రయాణించేవారే అన్నది స్పష్టం. దీన్ని గుర్తించకుండా పైన పేర్కొన్న అవాం ఛిత సామాజిక వర్గాలను తరిమేయడంద్వారా నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని మనం ప్రయత్నిస్తున్నాం. అయితే విమానాల్లో ప్రయాణించి వచ్చిన మన ఉన్నత వర్గాలు ఇప్పటికే నగరాల్లో ఉన్న వలస కూలీలు, తదితర పేద వర్గాలకు కరోనాను అంటించి ఉంటే పరిస్థితి ఏమిటి? వీరిలో కొందరైనా ఇప్పటికే గ్రామాలకు వలస వెళ్లి ఉంటే ఫలితం ఏమిటి? వలస కార్మికులు తిరిగి గ్రామాలకు వెళ్లాక వారు అక్కడ సాంప్రదాయికంగా ఉండే టీ స్టాళ్లు, దాబాలు తదితర పనులు చేయకతప్పదు. అక్కడే పడుకుంటారు కూడా. వీరి ద్వారా వైరస్‌ ఇతరులకు సోకదని గ్యారంటీ ఏమిటి? పైగా ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తే వైరస్‌ బారినుంచి తప్పించుకోవచ్చని మధ్యతరగతి వర్గాలు భావిస్తున్నాయి. ఒకమేరకు ఇది నిజం కావచ్చు. కానీ స్వీయ నిర్బంధం ద్వారా వచ్చి పడే ఆర్థిక దుస్థితి ప్రభావాల గురించి ఎవరూ దృష్టి పెట్టడం లేదు. పైగా సామాజిక దూరం అనేది మరో చరిత్రను గుర్తుకు తెస్తోంది. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం ఇలాంటి సామాజిక దూరాన్ని కులం రూపంలో మనం కనుగొన్నాం. మన స్వీయ నిర్బంధంలో వర్గం, కులం రెండూ చోటు చేసుకుని ఉన్నాయని మర్చిపోవద్దు.

ప్రస్తుతదుస్థితిలో మనం ఏం చేయగలం. అనేకమంది సామాజిక కార్యకర్తలు, మేధావులు  ప్రస్తుత సంక్షోభ పరిష్కారం గురంచి ఉత్తమ ఆలోచనలు అందించారు. కానీ నా అభిప్రాయం ప్రకారం కేరళ ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా ఉంటోంది. కేంద్రప్రభుత్వం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ఆహార గిడ్డంగుల్లో ఉన్న ఆరు కోట్ల టన్నుల అదనపు ఆహార నిల్వలను అత్యవసర ప్రాతిపదికన పంపిణీ చేయాలి. గ్రామాలకు తరలివెళుతున్న లక్షలాది వలసకార్మికులకు, పేదలకు తక్షణ సహాయం అందించాలి. ఇప్పుడు మూతపడిన పాఠశాలలు,కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్, భవంతులను వలసకూలీలకు, నిరాశ్రయులకు వసతి కేంద్రాలుగా మార్చివేయాలి. ప్రైవేట్‌ వైద్య కేంద్రాలను జాతీయం చేయడానికి కేంద్రం సంసిద్ధం కావాలి. ఆసుపత్రులను కరోనా చికిత్సా కేంద్రాలుగా మార్చాలి.

గత వారం స్పెయిన్‌ అన్ని ఆసుపత్రులను జాతీయం చేసిపడేసింది. లాభార్జన ధ్యేయంగా కలిగిన ప్రైవేట్‌ ఆసుపత్రులు కరోనా చికిత్సకు అంగీకరించవు. పేదలకు మూడునెలలపాటు ఉచిత రేషన్‌ ఇస్తామని ప్రకటించాలి. పనికి ఆహారం పథకం కింద గ్రామాల్లో కూలీలకు, పేదలకు రోజు కూలీలను మూడునెలలపాటు అందించాలి. నగర కూలీలకు నెలకు కనీసం రూ.6,000లు ఇదేకాలానికి అందించాలి. అదేసమయంలో కోవిడ్‌–19ని చరిత్రలోనే అసాధారణమైన ఘటన అనేకోణంలో మన చర్చలు కొనసాగితే మంచిది. ఈ సంధి దశను మనం ఏ వైపునకు పయనిద్దాం అనే కోణంలో ఉపయోగించుకుందాం. అసమానతలు, ఆరోగ్యపరమైన న్యాయం వైపు మన చర్చలు కొనసాగాలి.

వ్యాసకర్త : పి. సాయినాథ్‌
ఫౌండర్‌ ఎడిటర్, పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement