బంగారు తెలంగాణకు ‘రహదారి’ | gateway to golden telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు ‘రహదారి’

Published Tue, Nov 4 2014 12:27 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

బంగారు తెలంగాణకు ‘రహదారి’ - Sakshi

బంగారు తెలంగాణకు ‘రహదారి’

దేశంలో 92,851 కి.మీ. జాతీయ రహదారులుండగా, తెలంగాణలో ఉన్నవి 2,616 కి.మీ. మాత్రమే. జాతీయ సగటు కన్నా ఇది చాలా తక్కువ. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యమిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రణాళికను సిద్ధం చేసి, తెలివిగా నిధులను రాబట్టుకోగలగాలి.
 
దేశ నాగరికతకు రోడ్లు అద్దం పడతాయని నానుడి. అది రాష్ట్రాలకూ వర్తి స్తుంది. తెలంగాణలోని రహదారుల అభివృద్ధికి ఒక్కొక్క జిల్లాకు రూ. వెయ్యి కోట్లు కేటాయిం చి, అద్దంలా మారుస్తామ ని ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖరరావు ఇటీవల ప్రకటించారు. హైదరాబా ద్‌లో మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తామని కూడా అన్నారు. రాష్ట్రంలోని రహదారుల స్థితిగతుల అధ్యయనం కోసం ప్రత్యేకించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు.

ఇవన్నీ రహదారుల అభివృద్ధిపై సీఎం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను సూచిస్తున్నాయి. కాబట్టి జిల్లాల్లోని రహదారుల దశ తిరుగుతుందని ఆశించవచ్చు. అయితే రాష్ట్రంలోని 4 వేల కిలోమీటర్ల రహదార్లను జాతీయ రహదారు లుగా గుర్తించే ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దానికి ఆమోదం సంపాదించడం కోసం తెలంగాణ సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. ఆ అంశం ప్రస్తావనకు రాకపోవడం విచారకరం.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 13వ షెడ్యూలు... తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు రోడ్ల అనుసంధానాన్ని మరింత పెంచేందుకు వీలుగా జాతీయ రహదారుల సంస్థ తగు చర్యలు తీసుకో వాలని స్పష్టంగా పేర్కొంది. అయినా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. రోడ్డు గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా 20 నుంచి 30 నిమిషాల్లోపు జాతీయ రహదారిని చేరుకునేలా రహదారులను నిర్మించాలని రాష్ట్ర సర్కారు కోరినా, కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు.  

ఒక రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా, వాణి జ్యపరంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన అత్యావశ్యకం. వాటిలో కీలకమైన రహదా రుల అభివృద్ధితోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యం. జాతీయ రహదార్లుగా గుర్తింపు అంటే... రెండు లేన్ల దారిని ముందుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. వాహనాల రద్దీని బట్టి ఆ తర్వాత దాన్ని నాలుగు లేన్లకు విస్తరిస్తారు. జాతీయ రహదా రులుగా కేంద్రం గుర్తింపే లభించకపోతే... ఇక వాటి అభివృద్ధి, విస్తరణ ఎప్పుడు జరిగేట్టు? దేశంలో 92, 851 కి.మీ. జాతీయ రహదారులు ఉండగా, అందులో తెలంగాణలో ఉన్నవి 2,616 కి.మీ. మాత్రమే (మరో 3,300 కి.మీ.ల రాష్ట్ర రహదార్లున్నాయి) జాతీయ సగటుకన్నా ఇది చాలా తక్కువ.  

తెలంగాణలో ప్రతి వంద చదరపు కి.మీ.లకు  2.36 కి.మీ. జాతీయ రహదారులే ఉన్నాయని అంచనా. అందుకే తొలిదశలో కనీసం 1,800 కి.మీ. మేరకయినా కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. వాహనాలపరంగా చూసినా ఇటీవలి కాలంలో రాష్ర్టంలో వాహనాల వినియోగం భారీగా పెరిగింది. గ్రామాల్లో కూడా ఇప్పుడు కార్లు, జీపులు, వగైరా వాహనాలు (సరుకు లు, ప్రయాణికుల రవాణా) పెరిగాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక ద్విచక్ర వాహనం ఉంటోంది. వాహనాల సంఖ్య భారీగా పెరుగుతున్నా, రహదారుల నిర్మా ణం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న ట్టుంటోంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహ దారిని నాలుగు లేన్ల మార్గంగా విస్తరించే పని 100 కి.మీ. మేరకైనా పూర్తి కాలేదు.

అలాగే ప్రాణాం తకంగా మారిన హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిలో కొంత భాగాన్నే నాలుగు లేన్లుగా విస్త రించారు. కరీంనగర్-వరంగల్, వరంగల్-ఖమ్మం, ఖమ్మం-నల్లగొండ, నల్లగొండ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-తాండూరు, తాండూరు-మెదక్, మెదక్-నిజామాబాద్, నిజామాబాద్-ఆదిలాబాద్, ఆదిలాబాద్-కరీంనగర్ రోడ్లను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నాలుగు లేన్ల రోడ్లుగా వృద్ధి చేయ డానికి నివేదికలు తయారయ్యాయి. హైదరాబా ద్-మెదక్, హైదరాబాద్-ఖమ్మం రహదారులు కూడా నాలుగు లేన్ల విస్తరణకు నోచుకోవడం లేదు.

ప్రతి జిల్లా కేంద్రం, ముఖ్య పట్టణాల నుంచి రాజ ధానికి నాలుగు లేదా ఆరు లేన్ల రహదార్ల నిర్మాణం కూడా ముఖ్యమైన అంశమే. యూపీఏ ప్రభుత్వం 189 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టి, రోజుకు సగటున 20 కిలోమీటర్ల చొప్పున జాతీయ రహదారులను నిర్మిస్తామని ఐదేళ్లలో ఆరు లక్షల కోట్ల వ్యయంతో 35 వేల కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను నిర్మిస్తామంటూ ఆర్భాటం చేసింది. చేతలకు వచ్చే సరికి రోజుకు 11 కి.మీ. నిర్మాణంతో నత్తనడక నడి చింది. జాతీయ రహదారుల సమగ్రాభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు అవసరమని అంచనా.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల రంగా నికి విస్తృత ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించింది, చిత్తశుద్ధితో ప్రణాళికా బద్ధంగా అందుకు కృషి చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 37,880 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అవసరాల దృష్ట్యా మౌలిక వసతిగా ప్రాధాన్యంగల రహదారుల అభివృద్ధికి సర్కారు ప్రణాళికను రచించుకోవాలి. రహదారుల అభివృద్ధికి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఇదే సరైన అదను. తెలివిగా నిధులను రాబట్టుకో గలగాలి.

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
కె.బాలకిషన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement