Telangana roads
-
రోడ్లకు వాన దెబ్బ.. గాలికొదిలేసిన ప్రభుత్వం
గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ, అతి భారీ వానలతో వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. పలుచోట్ల నామ్కేవాస్తేగా పైపైన సాధారణ మరమ్మతులు చేసినా.. ఇటీవలి వర్షాలకు మరింతగా పాడయ్యాయి. చాలా చోట్ల గతుకులు, గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పైన తారు కొట్టుకుపోయి.. మట్టిరోడ్లలా మారిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వానాకాలం ముంచుకొస్తుండగా.. ఇప్పటికీ రోడ్ల మరమ్మతు అంశం కొలిక్కి రాలేదు. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్‌కు సంబంధించి నిర్ధారించుకున్న నిడివిలో కేవలం 20 శాతమే పూర్తయింది. వానాకాలం మొదలైతే పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్ తీరు ఇదీ.. మొత్తం ఎంపిక చేసిన రోడ్ల నిడివి: 6,617 కి.మీ. ఇందుకు మంజూరు చేసిన నిధులు: రూ.2,852 కోట్లు ఇప్పటివరకు పూర్తయిన రెన్యువల్: 1,400 కి.మీ. ఇంకా పనులు జరుగుతున్న రోడ్లు: 1,350 కి.మీ. పనులు ప్రారంభం కావాల్సిన నిడివి: 2,263 కి.మీ. టెండర్లు కూడా ఖరారు కాని రోడ్లు: 1,190 కి.మీ. భారీ వర్షాలు పడితే ఇబ్బందే.. గత రెండు వానాకాలాల్లో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర రోడ్లకు నష్టం జరిగినట్టు అంచనా. ఎప్పటికప్పుడే రోడ్లను మెరుగుపరిస్తే.. తదుపరి వరదకు అంతగా నష్టం ఉండదు. అదే మరమ్మతులు చేయని పక్షంలో.. మళ్లీ వరద పోటెత్తితే ఆ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రోడ్లను పూర్తిగా పునరుద్ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చు భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలుపెట్టినా.. 2021 వానాకాలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు దాదాపు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ.1,200 కోట్లు అవసరమని నిర్ధారించారు. 2021లో దెబ్బతిన్న రోడ్లను సకాలంలో బాగు చేయకపోవటంతో.. వాటి పటుత్వం తగ్గి 2022లో మరింతగా దెబ్బతిన్నాయి. అయినా సకాలంలో పునరుద్ధరణ చేపట్టలేదు. గతేడాది చివరలో రోడ్ల పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.2,852 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేసరికి ఫిబ్రవరి వచ్చేసింది. ఏప్రిల్ రెండో వారం నాటికి 20 శాతం పనులు పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత రెన్యూవల్స్.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లకు రెన్యూవల్స్ జరగాలి. అంటే పైన దెబ్బతిన్న తారు పూతను పూర్తిగా తొలగించి కొత్తగా వేయాలి. దీనికి భారీగా వ్యయం అవనున్నందున.. ఐదేళ్లకు బదులు కనీసం ఏడేళ్లకోసారి కొత్తగా వేసినా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసలు పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టలేదు. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఇప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు. 6,617 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించి.. వరదలతో దెబ్బతిన్న రోడ్లను ఇందులో చేర్చి పనులు ప్రారంభించారు. కానీ అనుమతులు, నిధుల విడుదలలో జాప్యంతో పనులు ఆలస్యంగా చేపట్టారు. మరో నెలలో వానాకాలం మొదలవుతుండటంతో.. గతంలో రోడ్లు మరింతగా పాడైపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జడ్చర్ల–వనపర్తి మధ్య బిజినేపల్లి ప్రాంతంలో రోడ్డు కనీస మరమ్మతులు కూడా లేక వానలకు దెబ్బతిని ఇలా గోతులమయంగా మారింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతుండటంతో గోతులు మరింత పెరిగి వాహన దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో బిజినేపల్లి–జడ్చర్ల మధ్య ప్రయాణ సమయం అరగంట అయితే... ఇప్పుడు గోతుల వల్ల గంటకుపైగా పడుతోంది. బిజినేపల్లి సమీపంలోని నల్లవాగుపై నిర్మిస్తున్న వంతెనపై రోడ్డుమీద రెండు చిన్న వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కన నిర్మించిన తాత్కాలిక రోడ్డు వానలకు పాడైపోయింది. ఇటీవల ఈ రోడ్డుమీద అదుపుతప్పిన ఓ టిప్పర్ కరెంటు స్తంభాన్ని ఢీకొంది. తెగిన కరెంటు వైరు ఆ పక్కగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉండటంతో.. బస్సులో ఉన్న 70 మంది పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. నల్గొండ జిల్లా యాద్గార్పల్లి– కేశవాపురం మధ్య ఉన్న సింగిల్ రోడ్డు కాస్తా భారీ వర్షాలకు ధ్వంసమైంది. వరదలతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే క్రమంలో ఇలా పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. -
తెలంగాణను నాశనం చేశారు..వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి.?
-
మంత్రులకు ‘నిధుల’ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రులకు ప్రభుత్వం ‘రోడ్ల’నజరానా ప్రకటించింది. వారు కావాలనుకున్న చోట రహదారుల నిర్మాణానికి వీలుగా ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల మేర ప్రత్యేక నిధుల కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి ఈ నిధులు అందిస్తారు. కార్పొరేషన్ ఈ నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటుంది. ప్రస్తుతానికి రూ.450 కోట్లు ఈ రూపంలో మంజూరు చేసేందుకు ప్రభు త్వం అంగీకరించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నిర్వహించిన సమీక్షలో దీనిపై చర్చించారు. నేతల ఒత్తిళ్లతో..: రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లు సరిగా లేవు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీంతో గ్రామాల్లోని రోడ్ల దుస్థితిపై ప్రజలు నేతలను నిలదీస్తున్నారు. ఆయా రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిందిగా నేతల నుంచి సీఎంపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రస్తుతానికి మంత్రుల నియోజకవర్గాల పరిధిలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. త్వరలోనే టెండర్లు..: మంత్రులు తాము కావాలనుకున్న రహదారులను ఎంపిక చేసి రోడ్లు భవనాల శాఖకు ప్రతి పాదనలు పంపుతారు. అధికారులు వాటిని పరిశీలించి డీపీఆర్‌లు రూపొందిస్తారు. తర్వాత మంత్రులకు ప్రత్యేకిం చిన నిధుల కింద టెండర్లు పిలిచి పనులు చేపడతారు. ఇక కొత్త కలెక్టరేట్ భవనాలు, ఎమ్మెల్యేల నివాస భవన సముదాయాల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, ఎన్హెచ్ఏఐకి కేటాయించిన ఆరు రోడ్ల నిర్మాణంలో జాప్యం తదితర అంశాలపైనా తుమ్మల సమీక్షించారు. -
రూ.10,800 కోట్లతో తెలంగాణలో రోడ్ల అభివృద్ధి
హైదరాబాద్: తెలంగాణలో 10,800 కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. బుధవారం తెలంగాణలో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో వివిధ దశల్లో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. నాణ్యతాలోపాలు ఉంటే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
తెలంగాణలో రోడ్లకు మహార్దశ!
-
రహదారులకు మహర్దశ
- రాష్ట్రానికి 3 వేల కోట్ల కేంద్ర నిధులు - బడ్జెట్ కేటాయింపులతో రోడ్ల విస్తరణ - గతంలోకన్నా అదనంగా వెయ్యి కోట్లు - తొలి ప్రాధాన్యతగా 6 రహదారుల అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పెద్దగా వరాలేవీ లేనప్పటికీ జాతీయ రహదారుల అభివృద్ధికి మాత్రం సానుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టంలో కొత్త రహదారుల నిర్మాణం, పాత వాటి విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపు రూ. 3 వేల కోట్లు అందనున్నట్టు రోడ్లు, భవనాల శాఖఅంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ. వెయ్యి కోట్ల నిధులు అదనంగా రానున్నాయి. దీంతో రాష్ర్టంలోని రహదారులకు మహర్దశ పట్టనుంది. ముఖ్యంగా వెయ్యి కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆరు మార్గాలను జాతీయ రహదారులుగా అభివృద్ధి పరచాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. ఇందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా వచ్చే కేంద్ర నిధులతో వాటికే ప్రాధాన్యమిచ్చి, తొలివిడతగా పనులు చేపట్టే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి 22 పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. చైనా తరహాలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉండటంతో తాజా బడ్జెట్లో నిధుల కే టాయింపులు పెరిగాయి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న లక్ష కిలోమీటర్ల రహదారులను పూర్తి చేయడంతోపాటు కొత్తగా మరో లక్ష కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో రోడ్లకు రూ. 42 వేల కోట్ల మేర కేటాయించారు. ఇది గతం కంటే దాదాపు రూ. 14 వేల కోట్లు అధికం. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో 4 శాతాన్ని రోడ్డు సెస్‌కు బదలాయించాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నందున నిధులకు లోటు ఉండ కపోవచ్చు. దీంతో నిధుల కేటాయింపుల్లో జాప్యం జరగబోదని జాతీయ రహదారుల విభాగం సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సెంట్రల్ రోడ్డు ఫండ్, ఎన్‌హెచ్‌డీపీ, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల కేటాయింపుల కింద తెలంగాణకు హీనపక్షంగా రూ. వెయ్యి కోట్ల మేర అధికంగా నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ రహదారులకే తొలి ప్రాధాన్యం.. 1. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్స్వాడ-బోధన్,బాసర-భైంసా- జాతీయ రహదారి 61 (పాత జాతీయ రహదారి 222)తో అనుసంధానం 2. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు (మొయినాబాద్-చేవెళ్ల-మన్నెగూడ-కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు) 3. కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి-జడ్చర్ల 4. నిర్మల్ నుంచి జగిత్యాల వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ నుంచి ఎన్‌హెచ్ 61, ఎన్‌హెచ్ 63లతో అనుసంధానం 5. అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట 6. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం -
'ట్రాఫిక్ సమస్యలేని నగరంగా హైదరాబాద్'
హైదరాబాద్: తెలంగాణ రహదారుల అభివృద్ధి కోసం రూ.14 వేల కోట్లు కేటాయించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. తమ రాష్ట్రం గుండా వెళుతున్న జాతీయ రహదారిని పొడిగించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. -
ప్రతి గ్రామానికీ రహదారి: తుమ్మల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాబోయే మూడేళ్లలో తెలంగాణలో రోడ్లు లేని గ్రామమే ఉండదని, ప్రతి గ్రామానికి మండల కేంద్రాన్ని, ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి అనుసంధానిస్తూ రోడ్లను నిర్మిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లిలో శుక్రవారం తనకు జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో రాబోయే నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో కరెంట్‌కు ఇబ్బంది ఉండదన్నారు. ఖమ్మం జిల్లాలో ఆరువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులను అందించే మహద్భాగ్యం ఖమ్మం జిల్లాకు దక్కుతుందని చెప్పారు. పక్క రాష్ట్రంలో ఉన్న మచిలీపట్నం పోర్టును తెలంగాణ ప్రాంతానికి అనుసంధానం చేయడం ద్వారా జాతీయస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడేలా కృషి చేస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆసరా పథకంలో ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు. అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. సభలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొండబాల కోటేశ్వరరావు, దిండిగల రాజేందర్, నూకల నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు ‘రహదారి’
దేశంలో 92,851 కి.మీ. జాతీయ రహదారులుండగా, తెలంగాణలో ఉన్నవి 2,616 కి.మీ. మాత్రమే. జాతీయ సగటు కన్నా ఇది చాలా తక్కువ. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యమిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రణాళికను సిద్ధం చేసి, తెలివిగా నిధులను రాబట్టుకోగలగాలి. దేశ నాగరికతకు రోడ్లు అద్దం పడతాయని నానుడి. అది రాష్ట్రాలకూ వర్తి స్తుంది. తెలంగాణలోని రహదారుల అభివృద్ధికి ఒక్కొక్క జిల్లాకు రూ. వెయ్యి కోట్లు కేటాయిం చి, అద్దంలా మారుస్తామ ని ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖరరావు ఇటీవల ప్రకటించారు. హైదరాబా ద్లో మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తామని కూడా అన్నారు. రాష్ట్రంలోని రహదారుల స్థితిగతుల అధ్యయనం కోసం ప్రత్యేకించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఇవన్నీ రహదారుల అభివృద్ధిపై సీఎం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను సూచిస్తున్నాయి. కాబట్టి జిల్లాల్లోని రహదారుల దశ తిరుగుతుందని ఆశించవచ్చు. అయితే రాష్ట్రంలోని 4 వేల కిలోమీటర్ల రహదార్లను జాతీయ రహదారు లుగా గుర్తించే ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దానికి ఆమోదం సంపాదించడం కోసం తెలంగాణ సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. ఆ అంశం ప్రస్తావనకు రాకపోవడం విచారకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 13వ షెడ్యూలు... తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు రోడ్ల అనుసంధానాన్ని మరింత పెంచేందుకు వీలుగా జాతీయ రహదారుల సంస్థ తగు చర్యలు తీసుకో వాలని స్పష్టంగా పేర్కొంది. అయినా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. రోడ్డు గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా 20 నుంచి 30 నిమిషాల్లోపు జాతీయ రహదారిని చేరుకునేలా రహదారులను నిర్మించాలని రాష్ట్ర సర్కారు కోరినా, కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఒక రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా, వాణి జ్యపరంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన అత్యావశ్యకం. వాటిలో కీలకమైన రహదా రుల అభివృద్ధితోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యం. జాతీయ రహదార్లుగా గుర్తింపు అంటే... రెండు లేన్ల దారిని ముందుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. వాహనాల రద్దీని బట్టి ఆ తర్వాత దాన్ని నాలుగు లేన్లకు విస్తరిస్తారు. జాతీయ రహదా రులుగా కేంద్రం గుర్తింపే లభించకపోతే... ఇక వాటి అభివృద్ధి, విస్తరణ ఎప్పుడు జరిగేట్టు? దేశంలో 92, 851 కి.మీ. జాతీయ రహదారులు ఉండగా, అందులో తెలంగాణలో ఉన్నవి 2,616 కి.మీ. మాత్రమే (మరో 3,300 కి.మీ.ల రాష్ట్ర రహదార్లున్నాయి) జాతీయ సగటుకన్నా ఇది చాలా తక్కువ. తెలంగాణలో ప్రతి వంద చదరపు కి.మీ.లకు 2.36 కి.మీ. జాతీయ రహదారులే ఉన్నాయని అంచనా. అందుకే తొలిదశలో కనీసం 1,800 కి.మీ. మేరకయినా కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. వాహనాలపరంగా చూసినా ఇటీవలి కాలంలో రాష్ర్టంలో వాహనాల వినియోగం భారీగా పెరిగింది. గ్రామాల్లో కూడా ఇప్పుడు కార్లు, జీపులు, వగైరా వాహనాలు (సరుకు లు, ప్రయాణికుల రవాణా) పెరిగాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక ద్విచక్ర వాహనం ఉంటోంది. వాహనాల సంఖ్య భారీగా పెరుగుతున్నా, రహదారుల నిర్మా ణం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న ట్టుంటోంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహ దారిని నాలుగు లేన్ల మార్గంగా విస్తరించే పని 100 కి.మీ. మేరకైనా పూర్తి కాలేదు. అలాగే ప్రాణాం తకంగా మారిన హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిలో కొంత భాగాన్నే నాలుగు లేన్లుగా విస్త రించారు. కరీంనగర్-వరంగల్, వరంగల్-ఖమ్మం, ఖమ్మం-నల్లగొండ, నల్లగొండ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-తాండూరు, తాండూరు-మెదక్, మెదక్-నిజామాబాద్, నిజామాబాద్-ఆదిలాబాద్, ఆదిలాబాద్-కరీంనగర్ రోడ్లను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నాలుగు లేన్ల రోడ్లుగా వృద్ధి చేయ డానికి నివేదికలు తయారయ్యాయి. హైదరాబా ద్-మెదక్, హైదరాబాద్-ఖమ్మం రహదారులు కూడా నాలుగు లేన్ల విస్తరణకు నోచుకోవడం లేదు. ప్రతి జిల్లా కేంద్రం, ముఖ్య పట్టణాల నుంచి రాజ ధానికి నాలుగు లేదా ఆరు లేన్ల రహదార్ల నిర్మాణం కూడా ముఖ్యమైన అంశమే. యూపీఏ ప్రభుత్వం 189 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టి, రోజుకు సగటున 20 కిలోమీటర్ల చొప్పున జాతీయ రహదారులను నిర్మిస్తామని ఐదేళ్లలో ఆరు లక్షల కోట్ల వ్యయంతో 35 వేల కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను నిర్మిస్తామంటూ ఆర్భాటం చేసింది. చేతలకు వచ్చే సరికి రోజుకు 11 కి.మీ. నిర్మాణంతో నత్తనడక నడి చింది. జాతీయ రహదారుల సమగ్రాభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు అవసరమని అంచనా. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల రంగా నికి విస్తృత ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించింది, చిత్తశుద్ధితో ప్రణాళికా బద్ధంగా అందుకు కృషి చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 37,880 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అవసరాల దృష్ట్యా మౌలిక వసతిగా ప్రాధాన్యంగల రహదారుల అభివృద్ధికి సర్కారు ప్రణాళికను రచించుకోవాలి. రహదారుల అభివృద్ధికి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఇదే సరైన అదను. తెలివిగా నిధులను రాబట్టుకో గలగాలి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) కె.బాలకిషన్‌రావు