రహదారులకు మహర్దశ
- రాష్ట్రానికి 3 వేల కోట్ల కేంద్ర నిధులు
- బడ్జెట్ కేటాయింపులతో రోడ్ల విస్తరణ
- గతంలోకన్నా అదనంగా వెయ్యి కోట్లు
- తొలి ప్రాధాన్యతగా 6 రహదారుల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా వరాలేవీ లేనప్పటికీ జాతీయ రహదారుల అభివృద్ధికి మాత్రం సానుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టంలో కొత్త రహదారుల నిర్మాణం, పాత వాటి విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపు రూ. 3 వేల కోట్లు అందనున్నట్టు రోడ్లు, భవనాల శాఖఅంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ. వెయ్యి కోట్ల నిధులు అదనంగా రానున్నాయి. దీంతో రాష్ర్టంలోని రహదారులకు మహర్దశ పట్టనుంది.
ముఖ్యంగా వెయ్యి కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆరు మార్గాలను జాతీయ రహదారులుగా అభివృద్ధి పరచాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. ఇందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా వచ్చే కేంద్ర నిధులతో వాటికే ప్రాధాన్యమిచ్చి, తొలివిడతగా పనులు చేపట్టే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి 22 పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి.
చైనా తరహాలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉండటంతో తాజా బడ్జెట్‌లో నిధుల కే టాయింపులు పెరిగాయి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న లక్ష కిలోమీటర్ల రహదారులను పూర్తి చేయడంతోపాటు కొత్తగా మరో లక్ష కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో రోడ్లకు రూ. 42 వేల కోట్ల మేర కేటాయించారు. ఇది గతం కంటే దాదాపు రూ. 14 వేల కోట్లు అధికం. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో 4 శాతాన్ని రోడ్డు సెస్‌కు బదలాయించాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నందున నిధులకు లోటు ఉండ కపోవచ్చు. దీంతో నిధుల కేటాయింపుల్లో జాప్యం జరగబోదని జాతీయ రహదారుల విభాగం సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సెంట్రల్ రోడ్డు ఫండ్, ఎన్‌హెచ్‌డీపీ, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల కేటాయింపుల కింద తెలంగాణకు హీనపక్షంగా రూ. వెయ్యి కోట్ల మేర అధికంగా నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు.
ఈ రహదారులకే తొలి ప్రాధాన్యం..
1. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్స్‌వాడ-బోధన్,బాసర-భైంసా- జాతీయ రహదారి 61 (పాత జాతీయ రహదారి 222)తో అనుసంధానం
2. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు (మొయినాబాద్-చేవెళ్ల-మన్నెగూడ-కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు)
3. కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి-జడ్చర్ల
4. నిర్మల్ నుంచి జగిత్యాల వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ నుంచి ఎన్‌హెచ్ 61, ఎన్‌హెచ్ 63లతో అనుసంధానం
5. అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట
6. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం