ప్రతి గ్రామానికీ రహదారి: తుమ్మల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాబోయే మూడేళ్లలో తెలంగాణలో రోడ్లు లేని గ్రామమే ఉండదని, ప్రతి గ్రామానికి మండల కేంద్రాన్ని, ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి అనుసంధానిస్తూ రోడ్లను నిర్మిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సత్తుపల్లిలో శుక్రవారం తనకు జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో రాబోయే నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో కరెంట్‌కు ఇబ్బంది ఉండదన్నారు. ఖమ్మం జిల్లాలో ఆరువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులను అందించే మహద్భాగ్యం ఖమ్మం జిల్లాకు దక్కుతుందని చెప్పారు.
పక్క రాష్ట్రంలో ఉన్న మచిలీపట్నం పోర్టును తెలంగాణ ప్రాంతానికి అనుసంధానం చేయడం ద్వారా జాతీయస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడేలా కృషి చేస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆసరా పథకంలో ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు. అర్హులందరికీ పెన్షన్‌లు అందజేస్తామని చెప్పారు. సభలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొండబాల కోటేశ్వరరావు, దిండిగల రాజేందర్, నూకల నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.