మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ కొల్లాపూర్, వనపర్తి నియోజక వర్గాలలోని 65 గ్రామాలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీట మునిగిపోయి 34 సంవత్సరాలు గడచిపోయాయి. 1986లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి ఒక్కొక్క ప్రభుత్వోద్యోగం ఇచ్చేట్టుగా జీవో 98/68ని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి ముంపునకు ఆనాడు మొత్తం 11,200 ఇళ్లకు చెందిన 36,000 కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. గత మూడున్నర దశాబ్దాల్లో కుటుంబ పెద్దలు చాలా మంది మరణించారు. ఇల్లూ, వాకిళ్లు, ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాల సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడితేగా 153 మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి.
ఇంకా 2,000 మంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ పేర్లను ఉద్యోగం కొరకు నమోదు చేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వాసిత కుటుంబాల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం వ్లలనే నేటికీ ఆ జీవో అమలు కావడం లేదు. మరోవంక కర్నూలు జిల్లాలోని ముంపు గ్రామాల నిర్వాసితులు స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వోద్యోగాలను సంపాదించుకోగలిగారు. ఇకనైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు నిర్వాసితుల గోడును పట్టించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనైనా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందనుకుంటే అదీ నిరాశే అయింది. అందుకే గత 35 రోజులుగా శ్రీశైలంముంపు బాధితులు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నిర్వాసితుల గోడును పట్టించుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చొరవచేసి మూడున్నర దశాబ్దాల బాధితుల వ్యధను చల్లార్చాలని విజ్ఞప్తి. తక్షణమే జీవో 98/36 అమలుకు ఆదేశించి నేటికైనా బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.
( డాక్టర్ ఏ సిద్ధన్న, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా)
జీవో 98/68 అమలు చేయాలి
Published Mon, May 18 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement