అజ్ఞానమే నేటి జ్ఞానం | Gollapudi Maruti Rao article on topper scam | Sakshi
Sakshi News home page

అజ్ఞానమే నేటి జ్ఞానం

Published Thu, Jun 30 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

అజ్ఞానమే నేటి జ్ఞానం

అజ్ఞానమే నేటి జ్ఞానం

జీవన కాలమ్
ఈ దేశంలో అజ్ఞానానికి మరో ఆస్కారం లేదు. చచ్చినట్లు ప్రథమ స్థానంలో ఉండటమే. అవినీతి పెట్టుబడికి పుష్పించిన ‘అజ్ఞానం’ ఎప్పుడూ మీదికి ఎగబాకుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడెవరికీ జ్ఞానం అక్కరలేదు.
 
 చాలా సంవత్సరాల కిందట- ఒక పాత్రికే యుడు అనుకుంటాను- ఒక దుర్మార్గమైన పని చేశాడు. రాజకీయ నాయ కులలో విజ్ఞానాన్ని వెదకా లనే సాహసం చేశాడు. జన గణ మన ఎవరు రాశారు? అన్న ప్రశ్న వేశాడు. చాలామంది తెల్లమొహం వేశారు. కొందరు కష్టపడి, ప్రయత్నం చేసి ‘మహాత్మా గాంధీ’ అన్నారు. మరికొందరు తడువుకోకుండా ‘జవహ ర్లాల్ నెహ్రూ’ అన్నారు.  ఈ మధ్య బిహార్‌లో రాష్ట్రంలోకల్లా ప్రథమ స్థానంలో నిలబడిన విద్యార్థులు తీరా ప్రశ్నలు అడిగే సరికి- భయంకరమైన సమాధానాలు చెప్పారట. ప్రభుత్వం కోపం తెచ్చుకుని ఇలా ‘అజ్ఞానానికి’ పట్టం కట్టిన అందరినీ- విద్యార్థులతో సహా- అరెస్టులు చేయించింది. ఇది అన్యాయం అని మనవి చేస్తున్నాను.

అజ్ఞానం కొందరి జన్మహక్కు. దాన్ని ఏ జ్ఞానమూ రూపుమాపలేదు. ఈ విద్యార్థులు బిహార్ మంత్రివర్గంలో ఉండే అర్హతలను సంపాదించుకు న్నారని నితీశ్ కుమార్‌గారు గ్రహించాలి. వారి మంత్రి మండలిలో బొత్తిగా చదువులేనివారి దగ్గ ర్నుంచి, హైస్కూలు చదువు కూడా లేనివారు ఎందరో ఉన్నారు. నా ప్రశ్న: చదువులేనివారు ఉండటం మంచిదా? చదువు వచ్చిందని డిగ్రీలు ఉన్నవారు ఉండటం మంచిదా? ఏనాడయినా, ఏ పెద్దమనిషి అయినా లాలూప్రసాద్‌గారికి కానీ, రబ్రీదేవిగారికి కాని చదువు పరీక్షలు పెట్టే సాహసం చేశారా? బాబూ! మనది ప్రజాస్వామ్యం. అజ్ఞానం మన జన్మ హక్కు.

 రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన 17 ఏళ్ల అమ్మాయి రూబీరాయ్ పొలిటికల్ సైన్స్ అంటే వంటగదికి సంబంధించిన చదువు- అని వక్కా ణించింది. ఆవిడకి బిహార్ ముఖ్యమంత్రి అయ్యే హక్కు ఉన్నదని నా అభిప్రాయం. ఆ మధ్య- లాలూ గారి హయాంలో వారి సతీమణి వంటగదినుంచి సరాసరి ముఖ్యమంత్రి కుర్చీకి ప్రయాణం చేశారా లేదా? కొండంత ఉదాహరణ కళ్లముందే ఉన్న ఈ అమ్మాయి తప్పు చేసిందనడానికి ఎన్ని గుండెలు?  ఒకాయన (బిహార్) తన పన్నెండో తరగతి పరీక్షని రెండుసార్లు ఫెయిలయ్యాడు. మూడోసారి పరీక్ష రాసి మొదటి తరగతిలో పాసయ్యాడు. ఎలాగ? పరీక్షలో పాసయ్యే దగ్గర మార్గాన్ని కను గొన్నాడు కనుక. ఇంక అతను ఆగలేదు.

రెండుసార్లు  పరీక్షలో తప్పిన అమిత్ కుమార్ రాష్ట్రంలోకల్లా తల మానికంగా నిలిచే దగ్గర సూత్రాన్ని కనుగొన్నాడు. వెంటనే వారి తాతగారి పేరుమీద విషుంరాయ్ కాలే జీని ప్రారంభించాడు. బిహార్ పరీక్షల శాఖ ఉద్యో గుల్ని పట్టుకున్నాడు. అడ్డమయిన వాళ్లనీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే ‘దుకాణం’ ప్రారంభిం చాడు. అప్పటికి ఆయన వయస్సు- కేవలం 19 సంవత్సరాలు. ఇతను కేవలం 13 నెలల్లో ఎమ్.ఎ. డిగ్రీ చేజిక్కించుకున్నాడు. సంగీతంలో పీహెచ్‌డీ డిగ్రీని పుచ్చుకుని డాక్టరయ్యాడు.

ఇది ఎలా సాధ్యమయింది? తమరు సరిగ్గా ఊహించే ఉంటారు ఈ పాటికి. వీరికి లాలూప్రసాద్ గారితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. వారి అబ్బాయి- బొత్తిగా చదువులేని, ప్రస్తుత ఆరోగ్య మంత్రిగా ఉన్న తేజ్‌ప్రసాద్ యాదవ్‌గారితో సత్సం బంధాలు ఉన్నాయి. ఈ కాలేజీ మాత్రమే కాకుండా ఈ అమిత్ కుమార్‌గారికి మరి రెండు విద్యా సంస్థలు, ఒక హైస్కూలు ఉన్నాయి. చదువులో అవి నీతి కిందనుంచే ప్రారంభం కావాలని గ్రహించిన మేధావి ఈ అమిత్ కుమార్‌గారు. గత మూడు సంవకత్సరాలుగా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలి చిన వారంతా ఈ సంస్థవారే.

 ఈపాటికి 20 మంది ఉద్యోగులు- మొన్ననే బిహార్ స్కూలు ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ హరి హరనాథ్ ఝాతో సహా- అరెస్టు చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన పిల్లలు కూడా అరెస్టయ్యారు. చెత్తకుండీలో చెత్తని తింటున్న ఆవుదేం నేరం? పాపం. ఈ పిల్లలేం చేస్తారు? దమ్ముంటే- ఆ చెత్తకి కారణమయిన, చెత్తనే కోరుకుంటున్న ఆ పిల్లల తల్లిదండ్రుల్ని అరెస్టు చెయ్యండి.  ‘ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు?’ అని పోలీసులు రూబీరాయ్ అనే అమ్మాయిని అడిగారు.  ఆ పిల్ల కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘నువ్వు పరీక్ష రాయి. రిజల్టు సంగతి నేను చూసుకుంటాను’ అన్నా డట ఆమె నాన్న. ‘నాకు రెండో క్లాసు వస్తే చాలు అనుకున్నాను. నన్ను మొదటి స్థానంలో- రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపారు. నన్నేం చెయ్యమంటారు?’  అని వాపోయింది ఆ అమ్మాయి.

ఈ దేశంలో అజ్ఞానానికి మరో ఆస్కారం లేదు. చచ్చినట్లు ప్రథమ స్థానంలో ఉండటమే. అవినీతి పెట్టుబడికి పుష్పించిన ‘అజ్ఞానం’ ఎప్పుడూ మీదికి ఎగబాకుతుంది.  ఇంకా చెప్పాలంటే ఇప్పుడెవరికీ జ్ఞానం అక్కర లేదు. జ్ఞానం ఉన్నదనే లేబుల్ కావాలి. మార్కెట్లో ఆ లేబుల్‌కి మంచి గిరాకీ ఉంది. అందుకనే మన దేశంలో ఈ లేబుళ్లను గర్వంగా చెప్పుకునే ఎన్నో దుకాణాలు వెలిశాయి.
 


 గొల్లపూడి మారుతీరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement