
అర ఎకరం ‘అక్షయపాత్ర’!
చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ‘అన్నపూర్ణ’ భరోసా ఏడాది పొడవునా అందుబాటులో పౌష్టికాహారం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం! విజయనగరం జిల్లాలో సక్సెస్.. ఇతర రాష్ట్రాలకూ విస్తరింపజేసే యోచన
ఆకలి.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద హింస! మనిషి ముఖం మీద నవ్వును తుడిచేసే శక్తి ఒక్క ఆకలికే ఉంది. అపార పకృతి సంపద నిలయమై, అనాదిగా సంస్కృతి వికాస కేంద్రమైన ప్రాంతాన్ని కూడా ఒక్కసారిగా సోమా లియా, ఇథియోపియాల్లా మార్చగలదు. దేశాలకు దేశాలను క్షామాల్లో తగలేసి శవాల దిబ్బలను చేయగలదు. ఎన్ని హరిత విప్లవాలు వచ్చినా, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వేసినా ఆకలి సమస్య ఇంకా కాలుస్తూనే ఉంది. అసలు మనిషికి ఆయువంత సహజంగా అన్నం దొరకాలి. కానీ ఆకలి కోసం ఆరాటాలు, పోరాటాలేమిటి? కనిపించని శక్తు లేవో సహజ వనరులపై పట్టు బిగించి ప్రాథమిక అవసరై మెన ఆహారాన్ని అందని సరుకుగా మారుస్తున్నట్లనిపిస్తుంది.
జనాభాలో సగానికి పైగా పౌష్టికాహారం దొరక్క అలమటిస్తుండగా ఆకలి కేకలు మాన్పే చారిత్రక బాధ్యతను తలకెత్తుకుంది ‘అన్నపూర్ణ’ సాగు నమూనా. అరెకరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో చిన్న రైతు కుటుంబానికి సరిపడే ఆహారం అందించే లక్ష్యంతో ఈ ‘అన్నపూర్ణ’ విధానానికి రూపకల్పన జరిగింది. ‘అన్నపూర్ణ’ నమూనా పారినాయుడు మాస్టారు నాయకత్వంలో ‘జట్టు’ స్వచ్ఛంద సంస్థ రూపొందించింది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం తోటపల్లి కేంద్రంగా ‘ప్రకృతి ఆది దేవోభవ’ ఆశ్రమంలో అంకురించింది. ప్రకృతి సేద్యం ద్వారా ప్రతి రోజూ ఏదో ఒక పంట చేతికందిస్తూ.. ఒక కుటుంబానికి సరిపడే ఆహారంతో పాటు ప్రాథమిక అవసరాలకు సరిపడే ఆదాయాన్ని అందించడమే ఈ పద్ధతి లక్ష్యం. ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యం, రైతు సంక్షేమం ఒకదానితో ఒకటిగా కలగలసిన ‘అన్నపూర్ణ’ వ్యవసాయ విధానం డెబ్బై మందితో మొదలై.. ఇప్పుడు మూడు వేల మంది రైతుల జీవితాల్లో వెలుగుపూలు పూయిస్తోంది.
‘అన్నపూర్ణ’ సాగుతో ప్రతి రోజూ కూరగాయలు
ఒక బెడ్(మట్టి పరుపు) మీద ఉల్లి వేసుకుంటే.. రెండో మట్టి పరుపు మీద ఆకుకూరలు, మూడో మట్టి పరుపు మీద వంగ, తరువాత మరో రకం కూరగాయలు పండించాలి. కాల్వల వెంట మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు వేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఒక బెడ్‌లో పంటకు ఆశించిన పురుగు మరో మట్టి పరుపులో పంటకు సోకదు. ఈ పావెకరంలో ప్రతి రోజూ ఏదో ఒక కూరగాయ పంట చేతికి అందుతుంటుంది. పొలం చుట్టూరా బంతి, ఆముదం, అలసంద లాంటి పంటలు వేసుకుంటే.. ఎర పంటలుగా చీడపీడల నియంత్రణకు ఉపయోగపడతాయి. రోజు వారీ ఆహారం కోసం వేసుకున్న పంటలకు పావెకరం పోగా.. మిగిలిన పావు ఎకరంలో రేపటి కాలానికి ఉపయోగపడే ఆహారాన్ని పండించుకోవాలి. అంటే నిల్వ దినుసులన్నమాట. ఒక మట్టి పరుపులో మినుము, పెసర వంటి పప్పు దినుసులు, మరో మట్టి పరుపుపై వేరుశనగ, పొద్దుతిరుగుడు, శ్రీవరి, మెట్ట శ్రీవరి, జొన్న లాంటి పంటలు వేసుకోవాలి. ఇలా మూడు రకాల పంటలు మార్చి మార్చి వేసుకోవడం వలన సంవత్సరానికి సరిపడా పప్పులు, ధాన్యం, నూనె గింజలు కూడా పొందవచ్చు. ఇందులో పండ్ల మొక్కల మధ్య దూరం 36 అడుగులు ఉండడంతో నీడ సమస్య తలెత్తదు. ఏడాది పొడవునా కూరగాయ పంటలు వేసుకోవచ్చు. నీడ పడే ప్రాంతాల్లో పసుపు, అల్లం, అనాస, కంద వంటి పంటలు వేసుకోవాలి.
అదుపులో శత్రు కీటకాలు
ప్రతి బెడ్‌కు ఒక వైపు రక్షక పంట వేయడం వలన మిత్ర కీటకాల సంఖ్య పెరిగి శత్రు కీటకాలను అదుపులో ఉంచుతాయి. బంతి, చేమంతి వంటి ఎర పంటలు తెగుళ్లను చాలా వరకు నివారించడానికి ఉపయోగపడతాయి. మునగ, పప్పుజాతి మొక్కలు ఆకుల ద్వారా గాలిలోని నత్రజనిని గ్రహించి.. వేళ్ల ద్వారా ఇతర పంటలకు అందిస్తాయి. నాబార్డ్, ‘సెర్ప్’ తోడ్పాటుతో విజయనగరం జిల్లాలో ‘అన్న పూర్ణ’ ప్రకృతి సాగు విధానం ద్వారా ఇప్పటికే ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేల మంది రైతులు పంటలు పండిస్తున్నారు. నాటు పశువుల పేడ, మూత్రంతో సొంతంగా తయారు చేసు కున్న బీజామృతం, జీవామృతం, నీమాస్త్రంలను పంటలకు వాడుతున్నారు. మెట్ట భూముల్లో అర ఎకరం సాగుతో ఇంటి ఆహార అవసరాలు తీర్చుకుంటూనే 4-5 నెలల్లో సగటున రూ.30-50 వేలు, నీటివసతి ఉన్న భూముల్లో రూ. లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఆకలి లేని నాడు అసమా నతలుండవు. అసమానతల్లేని నాడు ఆగ్రహాలుండవు. సమతా స్వప్నానికి ‘అన్నపూర్ణ’ పాదులేసి నీరు పోస్తోంది!
- కె. క్రాంతికుమార్‌రెడ్డి (96032 14455)
స్వయంసమృద్ధే లక్ష్యం!
చిన్న/సన్నకారు రైతు కుటుంబానికి అర ఎకరం భూమిలో సహజాహారాన్ని, ఏడాది పొడవునా అందించే లక్ష్యంతో లోపరహితంగా ‘అన్నపూర్ణ’ ప్రకృతి వ్యవసాయ పద్ధతిని రూపొందించాం. ప్రతి కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆహార భద్రతను అందిస్తుంది. రోజువారీగా ఇల్లు గడవడానికి దేన్నీ కొనాల్సిన అవసరం లేకుండా.. స్వయంసమృద్ధి సాధించాలన్నదే మా లక్ష్యం.
- పారినాయుడు, ‘అన్నపూర్ణ’ రూపశిల్పి,
‘జట్టు’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు,
94401 64289, 89789 04990