కఠినమైన చట్టాలను తీసుకొచ్చినా మహిళలపై పదే పదే అత్యాచారాలు ఎందుకు కొనసాగుతున్నాయో తెలియాలంటే ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకున్న విషాద ఉదంతాన్ని గమనించాలి. బులంద్‌షహర్ ఏదో మారు మూల ప్రాంతం కాదు. రాత్రి వేళల్లో సైతం వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉండే ఘజియాబాద్-అలీగఢ్ జాతీయ రహదారిపై అది ఉంది. అలాం టిచోట అర్ధరాత్రి దాటాక బందిపోట్లు మాటుగాసి కారులో వెళ్తున్న కుటుంబాన్ని అడ్డగించి దారి మళ్లించి, వారిని తీవ్రంగా కొట్టి హింసించారు. బృందంలోని మహిళపైనా, ఆమె కుమార్తెపైనా సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారు. కుటుంబంలోని మగవాళ్లను చేతులు విరిచికట్టారు. ఈ దుర్మార్గమంతా రెండు గంటలు సాగింది. ఆ తర్వాత బాధితులు షాక్‌నుంచి తేరుకుని పోలీసుల సాయం కోసం ప్రయత్నించినా వీల్లేకపోయింది. చివరకు సన్నిహితులకు ఫోన్‌చేసి చెప్పి, వారిని పోలీస్ స్టేషన్‌కు పంపాకగానీ పోలీసుల జాడలేదు. దీన్నంతటినీ గమనిస్తే నేరగాళ్లు ఎందుకలా రెచ్చిపోతున్నారో, అత్యాచారాలకు ఎందుకు అడ్డుకట్ట పడటంలేదో అర్ధమవు తుంది. మూడేళ్లక్రితం ఢిల్లీ నగరంలో బస్సులో యువతిపై లైంగిక దాడి చేసి ఆమెను బలిగొన్నప్పుడు దేశమంతా ఆగ్రహంతో ఊగిపోయింది.
ఇలాంటి దుండ గాలను అరికట్టడానికి అత్యంత కఠినమైన చట్టం తీసుకురావాలన్న డిమాండు ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాలపై కదిలి జస్టిస్ జేఎస్ వర్మ నేతృ త్వంలో ముగ్గురితో కమిటీని ఏర్పాటుచేసి, అది చేసిన సిఫార్సులకు అనుగుణంగా సీపీసీ, సీఆర్‌పీసీ నిబంధనలను సవరించింది. నిర్భయ చట్టం పేరిట వాటన్నిటినీ పొందుపరిచింది. అయితే ఆ కమిటీ కేవలం కఠిన శిక్షల గురించి మాత్రమే మాట్లాడి ఊరుకోలేదు. తనకు అసంఖ్యాకంగా వచ్చిన అనేక సూచనలను అధ్య యనం చేసి విలువైన సిఫార్సులెన్నిటినో చేసింది. ఆ కమిటీ సిఫార్సుకు భిన్నంగా జువెనైల్ చట్టాన్ని సవరించారు. హేయమైన నేరాలకు పాల్పడిన సందర్భాల్లో జువెనైల్ వయో పరిమితిని సడలించే వీలు కల్పించారు. కానీ ఆ కమిటీ చేసిన విలువైన ఇతర సూచనల అమలుపై మాత్రం పాలకులు శ్రద్ధ పెట్టలేదు.
జస్టిస్ వర్మ కమిటీ మహిళల భద్రతకు సంబంధించి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పింది. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో, లేదో నిర్ణీత కాలవ్యవధిలో తనిఖీ నిర్వహిస్తూ ఉండాలన్నది. అలసత్వాన్ని ప్రదర్శించే సిబ్బం దిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్నది. బాధిత మహిళల విషయంలో పోలీసులు, ఆసుపత్రులు ఎంత సున్నితంగా వ్యవహరించాలో తెలిపింది. విద్యారం గంలో, ఎన్నికల వ్యవస్థలో ఎలాంటి మార్పులవసరమో చెప్పింది. అత్యవసర సమయాల్లో స్పందించడానికి ఏర్పాటు చేసే వ్యవస్థలెలా ఉండాలో సూచించింది. రాజకీయ రంగం నేరస్తులు పుట్టి విస్తరించడానికి ఎలా కారణమవుతున్నదో తెలిపి, దాన్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను పొందుపరిచింది. నేరస్తులకు సత్వరం శిక్షలుపడే విధానం అమలైతేనే నేరగాళ్లలో భయం ఉంటుందని చెప్పింది. ఇందులో ఏ ఒక్కటీ సరిగా అమలుకావడంలేదని వేరే చెప్పనవసరం లేదు. న్యాయ స్థానాల్లో యధాప్రకారం అత్యాచారం కేసులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంటు న్నాయి. నేరగాళ్లకు సులభంగా బెయిల్ వస్తోంది. బులంద్‌షహర్ ఉదంతంలో ఇప్పటికి అరెస్టయిన ముగ్గురూ కరుడుగట్టిన నేరాల్లో అరెస్టయి బెయిల్‌పై బయటి కొచ్చినవారు.
పోలీసుల అలసత్వం ఒక్కటే కాదు...ఆసుపత్రిలో వైద్యురాలు బాధి తులతో వ్యవహరించిన తీరు సైతం అమానుషంగా ఉంది. నిలువెల్లా నెత్తురో డుతూ, ఆ ఉదంతంవల్ల కలిగిన షాక్‌నుంచి తేరుకోలేని స్థితిలో వచ్చిన బాధితు లపై ఆమె విరుచుకుపడింది. ‘జరిగినదాన్ని మీరు కావాలని పెంచి చెబుతున్నార’ని దబాయించింది. అత్యాచారం కారణంగా బ్లీడింగ్ అవుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాలికను నోర్మూసుకోమని గద్దించింది. ఇదంతా చూశాక...జస్టిస్ వర్మ కమిటీ సూచనల విషయంలో పాలనా వ్యవస్థ చేసింది శూన్యమని అర్ధమవుతుంది. ఆ సూచనలను త్రికరణ శుద్ధిగా అమలు చేసి ఉంటే బులంద్‌షహర్ ఉదంతం నివారించడం సాధ్యమయ్యేదని తెలుస్తుంది. బులంద్‌షహర్ దరిదాపుల్లో రహదారిపై వీధి దీపాలుగానీ, పోలీసు పికెట్లుగానీ లేవు. గస్తీలో ఉన్న మొబైల్ పోలీస్ టీంలు దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాయో లేదో చూసేవారు లేరు. అత్యవసర సమయాల కోసం ఉద్దేశించిన ఫోన్ నంబర్లు అక్కరకు రావు. అందువల్లే ఈ ఉదంతం జరిగిన నాలుగురోజులకు అదే రాష్ట్రంలో మరో జాతీయ రహదారిపై ఉపాధ్యాయురాలిపై కారులో అత్యాచారానికి ఒడిగట్టారు.
మీడియా వ్యవహారశైలి, నేతల ప్రవర్తన సైతం సరిగాలేదని ఈ ఉదంతం వెల్లడించింది. ఒక ఆంగ్ల దినపత్రికలో ఇందుకు సంబంధించి వెలువడిన కథనం హృదయవిదారకంగా ఉంది. అత్యాచార బాధితుల గోప్యతను కాపాడాలని, వారి మనోభావాలను గౌరవించాలని మీడియాకుగానీ, నేతలకుగానీ అనిపించలేదు. బాధితుల ఇంటిముందు, ఇంట్లోనూ కెమెరాలు పెట్టి వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి, నేతల పరామర్శలను చూపడానికి మీడియా తహతహలాడింది. ‘ప్రత్యేకం’ పేరుతో ఒకరి తర్వాత మరొకరు వేసిన ప్రశ్నలే వేయడాన్ని జీర్ణించుకోలేక అవస్థ పడుతున్న కుటుంబ యజమాని...ఈ హడావుడితో కుమార్తె మానసిక ఆరోగ్యం తిరిగి దెబ్బతినడాన్ని చూసి అక్కడినుంచి కుటుంబంతో నిష్ర్కమించాడు. చుట్టుపక్కల అందరికీ తెలిసి తమను వింతగా చూడటమే కాక...ఎలాంటి సాయానికి ముందుకు రావడంలేదని అతను వాపోయాడు. బాధితులను అక్కున చేర్చుకుని, వారికి అన్నివిధాలా తోడ్పాటునందించి కోలుకోవడానికి తోడ్పడవలసిన వారంతా తమ ప్రవర్తనతో వారినే దోషులుగా మారుస్తున్నారు. జరిగిన గాయాన్ని మరిన్ని రెట్లు పెంచుతున్నారు. పాలనా యంత్రాంగం మొదలుకొని అన్ని స్థాయిల్లోనివారూ సక్రమంగా పనిచేయకపోతే ఏమవుతుందో బులంద్‌షహర్ ఉదంతం వెల్లడిస్తోంది. దీన్ని గమనించి సరిచేయవలసిన, చేసుకోవలసిన బాధ్యత అందరిదీ...ముఖ్యంగా పాలకులది!
ఈ దురంతాలు అరికట్టేదెలా?!
Published Thu, Aug 4 2016 12:04 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement