దుశ్శాసన పర్వం! | gwalior hc judge sexual harassment additional-judge | Sakshi
Sakshi News home page

దుశ్శాసన పర్వం!

Published Mon, Aug 4 2014 11:41 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

gwalior hc judge sexual harassment additional-judge

ఈ జనారణ్యంలో ఆడపిల్లలను వేధించుకుతినే తోడేళ్లు ఫలానాచోటే కాచుక్కూర్చుంటాయనడానికి లేదు. అవి ఎక్కడైనా తారసపడొచ్చు. ఇల్లా, వీధి చివరి మూల మలుపా, నడిరోడ్డా, బస్సా, రైలా, స్కూలా, ఆఫీసా అన్న విచక్షణేమీ లేదు. ఈ జాబితాకు న్యాయదేవత కొలువుదీరిన పవిత్ర స్థలం కూడా మినహాయింపుకాదని తాజా ఉదంతం వెల్లడిస్తున్నది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను ఎన్నోసార్లు లైంగికంగా వేధించాడని, కించపరిచేలా మాట్లాడాడని, ఈ విషయంలో తన మొర ఆలకించేవారెవరూ లేరని నిర్ధారించుకున్నాక ఉద్యోగానికి రాజీనామా చేశానని గ్వాలియర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధాకు లేఖ రాశారు. ఈ లేఖ అందాక దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. మహిళా న్యాయమూర్తి ఆరోపణల్లో నిజమున్నదని తేలితే తగిన చర్య తీసుకుంటామని జస్టిస్ లోధా చెప్పారు. న్యాయ పీఠంపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారేమీ కాదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గంగూలీ, జస్టిస్ స్వతంత్ర కుమార్‌లు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఇద్దరు యువతులు ఆమధ్య ఆరోపించారు. వాటితో పోలిస్తే ఇప్పడు వెల్లడైన ఉదంతం చాలా అసాధారణమైనది. ఆ రెండు సందర్భాల్లోనూ యువతులు కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించినవారు. తమకు ఎదురైన అనుభవాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియనివారు. చెబితే ఏమవుతుందో, ఎటు దారితీస్తుందోనని అయోమయంలో ఉన్నవారు. అందువల్లే ఫిర్యాదుచేయడానికి వారు జంకారు. చాలా సమయం తీసుకున్నాకే ధైర్యం కూడగట్టుకోగలిగారు. ఇక్కడ బాధితురాలు స్వయానా న్యాయమూర్తి. పదిహేనే ళ్లపాటు న్యాయవాద వృత్తిలో పనిచేసి జిల్లా స్థాయి అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నవారు. పైగా లైంగిక వేధింపుల కేసుల్ని పరిశీలించే జిల్లా స్థాయి విశాక కమిటీ చైర్‌పర్సన్. ఆ స్థాయిలో ఉన్నవారికే లైంగిక వేధింపులు తప్పలేదంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్ధంచేసుకోవచ్చు. తమకు ఎక్కడా న్యాయం జరగలేదని భావించినప్పుడు బాధితులు చిట్టచివరిగా తలుపుతట్టేది న్యాయవ్యవస్థనే. అక్కడికెళ్తే తమకు తప్పక న్యాయం లభిస్తుందని ఈ దేశ ప్రజల్లో అత్యధికులు నమ్ముతారు. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయగలిగిన ప్రబుద్ధులు కూడా ఇందులో చేరారని తాజా ఉదంతం రుజువు చేస్తున్నది.

తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని హైకోర్టు న్యాయమూర్తి చెబుతున్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు కూడా సిద్ధమేనం టున్నారు. మహిళా న్యాయమూర్తిపట్ల ఆయన వ్యవహరించిన తీరుపై సాక్ష్యాధారాలుండకపోవచ్చు. ఒక శుభకార్యంలో కలిసినప్పుడు ‘నీ పనితీరు చాలా బాగుంది. అంతకన్నా నీ అందం మరింత బాగుం దంటూ ఆయన చేసిన దుర్వ్యాఖ్యకు ప్రత్యక్ష సాక్షులుండకపోవచ్చు. ‘ఐటెం సాంగ్’కు నృత్యం చేయమని ఒక న్యాయమూర్తి భార్యతో ఫోన్ చేయించిన ఉదంతానికీ ఆధారాలు దొరక్కపోవచ్చు. ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని అడిగినప్పుడు చుట్టూ ఎవరూ ఉండకపోవచ్చు. ‘నీ కెరీర్‌ను సర్వనాశనం చేస్తాన’ని హెచ్చరించి నప్పుడు కూడా ఎవరూ వినకపోయి ఉండొచ్చు. విన్నా ధైర్యంగా చెప్పడానికి ముందుకు రాకపోవచ్చు. కానీ, ఈ ఏడాది జనవరిలో రూపొందిన వార్షిక రహస్య నివేదిక ఆ మహిళా న్యాయమూర్తి పనితీరు ఎన్నదగినదని పేర్కొన్నది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెపై వేధింపుల పరంపర ఎందుకు ప్రారంభమైంది? ఏవో కారణాలు చూపి ఆమెను గ్వాలియర్ నుంచి మారుమూల ప్రాంతానికి ఎందుకు బదిలీచేయాల్సి వచ్చింది? దీనివల్ల తన పిల్లల చదువు దెబ్బతింటుందని, ఎనిమిది నెలల వ్యవధినిస్తే అక్కడకు వెళ్లేందుకు తాను సిద్ధమని చెప్పినా ఎందుకు వినిపించుకోలేదు? తన విషయంలో సదరు న్యాయమూర్తి అనవసర శ్రద్ధ కనబర్చడం మొదలుపెట్టాక కోర్టుకు అరగంట ముందుగా రావడం, గంట అదనంగా పనిచేయడం కొనసాగించానని, అయినా వేధింపులు తప్పలేదని ఆమె ఆరోపిస్తున్నారు.

న్యాయమూర్తి స్థానంలో ఉన్నవారే...సమాజంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న అసహాయ మహిళలకు ఆసరాగా ఉండాల్సినవారే అభద్రతా భావంతో, ఆత్మన్యూనతా భావంతో పనిచేసే పరిస్థితులుండటం విస్మయం కలిగిస్తుంది. చదువూ, సంస్కారమూ కొరవడినవారు మాత్రమే అవివేకంగా ప్రవర్తిస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఉన్నత చదువులు చదివినవారూ, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారూ ఇంత అధమాధమంగా వ్యవహరిస్తారని వర్తమాన పరిణామాలను గమనిస్తే అర్ధమవుతుంది. స్త్రీ-పురుష సమానత్వం విషయంలో మన దేశం ఎన్నో వర్ధమాన దేశాలతో పోల్చినా చాలా వెనకబడి ఉన్నదని ఆమధ్య ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక తెలిపింది. ఆడపిల్ల పుట్టింది మొదలుకొని పెరిగి పెద్దయ్యేవరకూ ఎన్నో రూపాల్లో వివక్షకు గురవుతున్నది. ఈ పరిస్థితిని మార్చడానికి న్యాయవ్యవస్థ కూడా తన వంతు కృషి చేస్తున్నది. ఈ ప్రయత్నాలకు సమాంతరంగా మహిళలను కించపరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, వారిలోని ప్రతిభాపాటవాలు సమాధయ్యేలా వ్యవహరిస్తున్న దుశ్శాసనులు పెరిగిపోతున్నారు. అలాంటివారు న్యాయవ్యవస్థలో సైతం చొరబడ్డారని ఇటీవలి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ఉదంతంలో మహిళా న్యాయమూర్తికి న్యాయం లభించేలా కృషిచేయడంతోపాటు ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన ఒక కమిటీని ఏర్పాటుచేసే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాలి. అంతకన్నా ముందు ఆమె గౌరవప్రదంగా తన ఉద్యోగం చేసుకునేందుకు తోడ్పడాలి.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement