గురుభ్యోనమః
గురువు గారికి నేను వీరాభిమానిని. ఆయనను తెగ పొగిడేవా డిని. ఆయన కొన్ని సినిమాలకు నేను రచయితను. ఆయనతో దెబ్బలాడేవాడిని. ఆయనకు నేను సన్నిహితుడిని. ఆయన భావో ద్వేగాలను పంచుకునేవాడిని. ప్రేమాభిషేకం గొప్ప సినిమా అని అంటే, ‘‘అది నేను ఆడుతూ పాడుతూ తీశానయ్యా. దేవదాసు మళ్లీ పుట్టాడు ప్రాణం పెట్టి తీశా, గొప్ప సినిమా’’ అనేవాడు. బొబ్బిలిపులి అదిరి పోయింది అంటే, విశ్వరూపం కూడా చాలా మంచి సినిమా అనే వాడు. తన ఆడిన సినిమాలకంటే, ఆడని సినిమాలను ఎక్కువ సొంతం చేసుకునేవారు. ఆదుర్తి సుబ్బారావు గారు గురువు గారి అభిమాన దర్శకుడు.
ఒక రకంగా ఆయనను ఫాలో అయ్యారు. ఆదుర్తి గారు అందరు కొత్త వాళ్ళతో తేనె మనసులు తీశారు. అది పెద్ద హిట్టు. గురువు గారు కూడా అందరు కొత్త వాళ్ళతో స్వర్గం–నరకం తీశారు. అదీ పెద్ద హిట్టు. ఆదుర్తిగారు ప్రయోగాత్మకంగా సుడిగుండాలు తీశారు. ఆడలా! గురువుగారు అలాంటిదే నీడ సినిమా తీశారు. ఆడింది!! అవి శంకరాభరణం సినిమా గొప్పగా ఆడుతున్న రోజులు. ఒకరోజు రాత్రి విజయవాడ స్టేషన్‌లో గురువుగారు... జనం గుమి గూడారు. గుంపులో నుంచి ఎవరో అరిచారు ‘‘రేయ్ చేతనైతే శంకరాభరణం లాంటి సినిమా తీయండ్రా!’’ గురువు గారు మద్రాస్ వెళ్లగానే తన బృందాన్ని పిలిచారు.
‘‘మనం శంకరా భరణం లాంటి సినిమా తీస్తున్నాం’’ అన్నారు. అదే మేఘ సందేశం! అది జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకొంది. చైనా ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లింది. అక్కడివాళ్లు ఆ సినిమాలో ఉన్న ఓ గొప్ప విశేషాన్ని బయటపెట్టారు. అదేంటంటే, ఆ సినిమాలో ట్రాలీ, క్రేన్, జూమ్ షాట్లు అస్సలు వాడలా, అన్నీ స్టడీ షాట్లే! మనవాళ్లకు ఆ విషయం అప్పటి దాక తెలీదు ‘‘నిజమా!’’ అని నోళ్లు వెళ్లబెట్టారు.
గురువుగారు షూటింగ్ స్పాట్‌కి వచ్చాకే డైలాగులు రాసే వారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ మేకప్‌తో రెడీగా ఉండేవారు. గురువు గారు వచ్చి టేప్ రికార్డర్‌లో డైలాగులు చెప్పేవారు. అసిస్టెంట్ డైరెక్టర్లు పేపర్ మీద పెట్టేవారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ ఓపిగ్గా వెయిట్ చేసేవాళ్లు. ఏఎన్‌ఆర్ అంటుండేవారు ‘‘డైరెక్టర్ గారు డైలాగులు వండడం ఇంకా పూర్తి కాలేదా? వండినంతవరకు సీన్ పేపర్ తీసుకురండి చేసుకుంటూ పోదాం.’’
బొబ్బిలిపులి క్లైమాక్స్ సీన్ షూటింగ్! ఎన్టీఆర్ రెడీ, సీన్ పేపర్ రెడీ, స్టార్ట్ చెయ్యడమే తరువాయి. గురువు గారు రామా రావు గారి దగ్గరకు వెళ్లారు ‘‘సార్! నాకు సీన్ నచ్చలా.’’ ‘‘అదేంటి మీరు రాసిందేగా’’ అన్నారాయన. ‘‘ఇంకా ఏదో కావా లనిపిస్తుంది. మళ్లీ రాస్తాను’’ అన్నారు గురువుగారు. ‘‘ఓకే’’ అన్నారు ఎన్టీఆర్. సెట్లో ఓ మూల వెళ్లి కూర్చోని రాయడం మొదలు పెట్టారు గురువుగారు. రెండు గంటల తరువాత గురువు గారు ఎన్టీఆర్‌కి కొత్తగా రాసిన సీన్ వినిపించారు. కళ్ళు మూసు కొని తదేకంగా విన్నారు ఎన్టీఆర్. ‘‘డైరెక్టర్ గారు! ఈ డైలాగులు మీ మాడ్యులేషన్‌లో రికార్డ్ చేసి ఇవ్వండి’’ అన్నారు.
ఆ టేప్ రికా ర్డర్‌ని తీసుకొని మెరీనా బీచ్‌కు వెళ్లారు. డైలాగులు ప్రాక్టీసు చేశారు. తిరిగి వచ్చారు.‘‘డైరెక్టర్ గారు మేం రెడీ’’ అన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టారు, నమ్మండి! ప్రతి షాట్ సింగిల్ టేక్! సాయంత్రానికి సీన్ ఫినిష్ అయిపోయింది. బొబ్బిలిపులి ఒక చరిత్ర! ఇదీ కోర్టు సీన్‌లో రామారావు గారి డైలాగుల చరిత్ర!!‘‘నా ఆయుష్షు 87 ఏళ్లు! నేను చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి’’ అనేవారు. ఒకదాని కోసం హాస్పిటల్‌కి వెళ్లారు, ఇంకొకటి జరిగింది. మహోన్నతవ్యక్తి మహాభినిష్క్రమణం జరిగి పోయింది. కళామతల్లి చేతిముద్ద ఆయన! కాలపురుషుడి పాద ముద్ర ఆయన! సినీ పుష్పక విమానంలో ఎంతమంది మహామహులైనా ఎక్కొచ్చు. కాని గురువు గారి స్థానం ఖాళీగానే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ భర్తీ చెయ్యలేరు! వామనుడు ముల్లోకాల మీద మూడు పాదాలు మోపాడు. గురువుగారు సినీ వామనుడు. రచన మీద, దర్శకత్వం మీద, నాయకత్వం మీద మూడు పాదాలు మోపారు!!
‘‘ఈ శతాబ్దం నాది’’ అన్నాడు శ్రీ శ్రీ. గురువు గారు అనలా! కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ శతాబ్దం ఆయనదే. నేను ఆయనతో చాలా ఏళ్లు సన్నిహితంగా ఉన్నా. చాలా రాత్రిళ్లు అలా ఆయన ఎదురుగా కూర్చుండేవాడిని. సినిమాలు, రాజకీయాలు, ఒకటేమిటి ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వింటుండేవాడిని. వెళ్తానని నాకు నేనుగా ఎప్పుడు లేవలా.‘‘సరే ఇక బయల్దేరు’’ అన్నాకే బయలుదేరేవాడిని. ఆయన చెబితేనే నేను బయలుదేరేవాడిని కదా, గురువు గారు నాకు చెప్పకుండా బయల్దేరిపోయాడేంటి? ఒకసారి అడిగాను. ‘‘గురువు గారు! నేను మీకు ఏమవు తాను?’’ ఆయనన్నారు ‘‘నమ్మకమైన నేస్తానివయ్యా’’.ఈ జన్మకిది చాలు!! కొన్నేళ్ళ క్రితం గురువు గారు తన పర్స నల్ డైరీని నాకు ఇచ్చారు. దాంట్లో ఆయన రాసిన నాలుగు మాటలు మనమందరం భద్రపరుచుకుందాం. ‘‘శెలవ్–కలుస్తా. మరు జన్మలో’’.
– రాజేంద్ర కుమార్, సినీ రచయిత