సినీ హబ్ గా హైదరాబాద్
ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి: దాసరి
హైదరాబాద్: హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పారు. విదేశీ చిత్రాల నిర్మాణం కూడా జరిగేలా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో గురువారం నిర్వహించిన ఐఐఎఫ్‌టీసీ లొకేషన్స్ షో-2016ను దాసరి ప్రారంభించారు. పది దేశాలకు చెందిన పర్యాటక శాఖల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
దాసరి మాట్లాడుతూ... హైదరాబాద్‌లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ సినిమా నిర్మాణదారులను హైదరాబాద్‌కు రప్పించడం, ఇక్కడి లొకేషన్లను తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిత్రీకరణల కోసం మనవారు విదేశాలకు వెళ్లడం... అక్కడివారు ఇక్కడికి రావడం వల్ల సమన్వయం పెరిగి పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ సుప్రన్‌సేన్, ఐఐఎఫ్‌టీసీ డెరైక్టర్ హర్షద్ భగవత్ పాల్గొన్నారు. కెన్యా, నమీబియా, దక్షిణాఫ్రికా, ఫిజీ, స్పెయిన్, జర్మనీ, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో సినిమా లొకేషన్లను సదస్సులో ప్రదర్శించారు.