
రక్షకులే రాజ్యాంగేతర శక్తులైతే ఎలా?
దివికుమార్
‘చంద్రు’లు ఇద్దరూ తమ పనితనం మీద విదేశీ బహుళజాతి పెద్దలు పెట్టుకున్న అనుమానాలనూ, శంకలనూ ఒక్క ఎన్‌కౌంటర్ దెబ్బతో తొలగించినట్టయింది. నిరసనలూ, ఆందోళనలపై ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దని, శాంతి భద్రతల విషయంలో తమ సాయుధ సామర్థ్యాన్ని ఈ ఎన్‌కౌంటర్ల ద్వారా నిరూపించుకున్నారు.
మన రెండు కొత్త తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏప్రిల్ ఏడున వినిపించినవి పాత ఎన్‌కౌంటర్ కథలే. శేషాచలం అడవులలో 20 మంది తమిళ కూలీలూ, వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే దారిలో వికారుద్దీన్‌తో పాటు నలుగు రు ముస్లింలూ ఎన్‌కౌంటర్లలో చనిపోవడానికి సంబంధించిన కహానీలు అవి.
ఎర్రచందనం స్మగ్లర్లు (దాదాపు రెండు వందల మంది) అటవీ సంరక్షణా బృందానికి ఎదురుపడ్డారు. అదుపులోనికి తీసుకోవడానికి సిబ్బంది యత్నిస్తే, కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారు. ఆత్మరక్షణ కోసం సిబ్బంది కాల్పులు జరపగా 20 మంది కూలీలు చనిపో యారు. మిగిలినవారు దొరకలేదు. ఇదీ శేషాచలం ఎన్ కౌంటర్ కథనం. వికారుద్దీన్ అనే ‘మహా ఉగ్రవాది’ని వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా, సంకెళ్లతో ఉన్నప్పటికీ పోలీసుల తుపాకులు లాక్కుని దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు.
ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఇది తెలం గాణ పోలీసుల కథ. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధిపతి జస్టిస్ మార్కండేయ కట్జూ చెప్పిన మాట ఇక్కడ గుర్తుచేసుకో వాలి. ఎలాంటి ఎదురుకాల్పుల హత్య కేసులో అయినా ముందుగా చంపినవారి మీద హత్యానేరం (సెక్షన్ 302) నమోదు చేయవలసిందేనని కట్జూ అన్నారు. కాల్పులు ఆత్మరక్షణ కోసమే జరిగాయన్న సంగతి రుజువైనాక వారిని నిర్దోషులుగానూ, విధులను సక్రమంగా నిర్వ హించినవారిగా గుర్తించాలన్నారాయన. పోలీస్, రక్షణ సిబ్బంది ఆత్మరక్షణ కోసమే ఈ ఎన్‌కౌంటర్లు, అంటే హత్యలు చేయవలసి వచ్చిందని నమ్మేస్థితిలో ప్రజలే కాదు, ప్రైవేటుగా మాట్లాడితే ఏ అధికారీ, రాజకీయ నేత లేరు. ఎన్‌కౌంటర్లను రాజ్యాంగం కూడా ఒప్పు కోదు. కాబట్టే ప్రభుత్వాలే ఒక వంక చట్టబద్ధ సమర్థన చేస్తూనే, మరోవంక చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతూ అందుకు నైతిక మద్దతును కూడగట్టుకునేందుకు యత్ని స్తున్నాయి. శేషాచలం విషయంలో ఇది మరీ ఎక్కువ.
వికారుద్దీన్ తదితరులు ‘ఉగ్రవాదులు’ కనుక, అప్పటికి కొద్దికాలం ముందు సూర్యాపేట ప్రాంతాలలో గస్తీ పోలీసుల మీద ఎవరో ఉగ్రవాదులు దాడి చేసి ఒక పోలీసునూ, తరువాత ఒక ఎస్‌ఐ (సిద్ధయ్య)నూ బలి తీసుకున్నందుకు ప్రతీకారంగానే పోలీసు శాఖ ఈ హత్య లకు పాల్పడింది. కాగా, అటవీ సిబ్బంది, పోలీసుల మీద దాడులు జరిగినపుడు ఎవరూ ఖండించరేమిటన్న చౌకబారు వాదనను కొందరు మేధావులు సహా, వెంక య్యనాయుడు వంటి నాయకుని దాకా చేస్తున్నారు. పోలీసులు అతిక్రమించినపుడు ప్రజాసంఘాలు ఆందో ళన చేయకపోతే బాధితులకు న్యాయం ఎలా జరుగు తుంది? బలహీనులనూ, రాజ్యం బాధితులనూ పట్టిం చుకోకుంటే, నిరసనలూ ఆందోళనలూ లేకుండా న్యా యం జరిగిపోతుందని మనకు హామీ ఉందా? అలాం టి సందర్భాలలో పోలీసులు న్యాయమూర్తులమన్న తీరులో వ్యవహరించడం వల్ల, శిక్షలు విధించడం వల్ల న్యాయ వ్యవస్థను కొరుక్కుతిన్నట్టే అవుతుంది. ఈ సున్నిత విభజన రేఖ సామాన్యులకు తెలియకపోవచ్చు.
పాలక వర్గాలు, వాటి అనుకూల మీడియా తెలిసి కూడా న్యాయ వ్యవస్థను కబళిస్తున్న వారి గురించి ప్రజల దృష్టికి రాకుండా చేయడానికి యత్నిస్తున్నది. ఇప్పటి సంఘటనలలో ఇదే కీలకాంశం. ఎర్రచందనం ఎన్‌కౌం టర్‌ను కప్పిపుచ్చడానికీ, నిరసన లేకుండా చేయడానికీ అవకాశం తగ్గుతున్న కొద్దీ స్మగ్లింగ్ వార్తలను ముందుకు తెస్తున్నారు. కూలీలు కూడా స్మగ్లర్లేనన్న భావనను కల్పించి, ప్రజాధనాన్ని కాపాడడానికి, అలాంటి స్మగ్ల ర్లను చంపే హక్కు అటవీ సిబ్బందికి తప్పనిసరి అన్నట్టు కూడా వ్యూహకర్తలు ప్రచారంలో పెట్టారు. హంత కులకు, స్మగ్లర్లకు, ఉగ్రవాదులకు పౌర హక్కులేమిటని అంటున్నారు. కానీ ఈ స్మగ్లింగ్ వెనుక ఆంధ్ర, తమిళ నాడు అటవీ అధికారులు, పోలీసులు, మాఫియాలు, పాలక ముఠాల నాయకులు ఉన్నారని ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు.
ఏవో పనుల మీద వెళుతున్న తమిళ కూలీలను ఈ నెల ఆరున బస్సుల నుంచి దింపి, హింసించి; మరు నాడు శేషాచలం అడవులలో 20 మందినీ కాల్చివే శారనడానికి ప్రత్యక్ష పరోక్ష సాక్ష్యాలు ఉన్నాయి. శవాలు ఉన్నచోట చెట్లు లేవు. శవాల పక్కన పడేసిన దుంగల మీద తెల్ల రంగుతో లాటు నంబర్లు ఉన్నాయి. కొన్ని శవాల కాళ్లూ చేతులూ, వాటి వేళ్లూ తెగిపోయి ఉన్నా యి. శేఖర్ అనే కూలీ ఆరోజున బస్సులో ఆడవారి మధ్యన కూర్చోవడం వల్ల అతడిని పట్టించుకోలేదు. మిగిలిన వారిని దింపేశారు. వారిలో కొందరే మరు నాడు శేషాచలం అడవులలో శవాలై తేలారు.
కాగా, ‘చంద్రు’లు ఇద్దరూ తమ పనితనం మీద విదేశీ బహుళ జాతి పెద్దలు పెట్టుకున్న అనుమా నాలనూ, శంకలనూ ఒక్క ఎన్‌కౌంటర్ దెబ్బతో తొలగిం చినట్టయింది. నిరసనలూ, ఆందోళనలపై ఎలాంటి సం కోచం పెట్టుకోవద్దని, శాంతి భద్రతల విషయంలో తమ సాయుధ సామర్థ్యాన్ని ఈ ఎన్‌కౌంటర్ల ద్వారా నిరూపిం చుకున్నారు. పాట్నా హైకోర్టు నూరేళ్ల సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ‘ప్రజాప్రతినిధులు ప్రజాకర్షణకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నం పేరుతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కట్టడి చేయవలసిన బాధ్యత న్యాయవ్యవస్థ మీద ఉంది’ అన్నారు. ఈ మాటలను తెలుగు ప్రభుత్వాలు అన్వ యించి చూసుకోవడం అవసరం.
(వ్యాసకర్త జనసాహితి ప్రధాన కార్యదర్శి)
మొబైల్: 94401 67891