
శేషాచలం ఎన్ కౌంటర్ లో మరణించిన కూలీలు (ఫైల్ ఫొటో)
శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ పై విచారణను హైకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి ఏపీ, తమిళనాడు వైద్యాధికారులు.. ఐదుగురి మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఈ ఎన్కౌంటర్ పై గురువారం విచారించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ఫుల్‌బెంచ్ శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటనలపై గురువారం గంటన్నరకుపైగా విచారించింది.
కమిషన్‌లో జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ సి.జోసెఫ్‌లతోపాటు సభ్యుడు ఎస్సీ సిన్హా విచారణలో పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అటవీ-పోలీసు అధికారుల పూర్తి వివరాలు ఈ నెల 22లోపు సమర్పించాలంటూ 13న జారీచేసిన ఆదేశాలను ప్రస్తావించిన కమిషన్.. ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని తప్పుపట్టింది. ఏప్రిల్ 9న చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే.