► శేషాచలం ఎన్‌కౌంటర్‌పై అంతర్మథనం
► హైకోర్టుకు అందిన రీపోస్టుమార్టం నివేదిక
► తొలి పోస్టుమార్టంతో నివేదిక ఏకీభవించేనా?
► తల పట్టుకుంటున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు
చిత్తూరు (అర్బన్): శేషాచలం అడవుల్లో ఈనెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌పై జిల్లా పోలీసు యంత్రాంగంలో ఉత్కంఠ మొదలైంది. ఎన్‌కౌంటర్‌లో 20 మంది కూలీలను పోలీసులు కాల్చిచంపడం, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు కూలీలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రీపోస్టుమార్టం నివేదిక బుధవారం న్యాయస్థానం వద్దకు సీల్డు కవర్‌లో చేరడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి విషయాలు వచ్చాయోనని పోలీసు బాసులు అంతర్మథనంలో ఉన్నారు.
చిత్రహింసలు పెట్టారని ఆరోపణ..
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తన భర్త శశికుమార్‌ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపారని భార్య మునియమ్మాల్ తొలుత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట్లో శశికుమార్ మృతదేహానికి మాత్రమే రీ పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇ చ్చింది. తర్వాత మురుగన్, మూర్తి, శివాజి, పెరుమాళ్, మునుస్వామి మృతదేహాలకు సైతం రీ పోస్టుమార్టం నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల చేతుల్లో మృతి చెందిన తమ భర్తల శరీరాలపై నిప్పుతో కాల్చిన గుర్తులు, కాళ్లూ, చేతులు కట్టేసి చిత్ర హిం సలు పెట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని మృతుల భార్యలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికితోడు కొందరు కూలీల మృతదేహాల్లో చేతివేళ్లు లేవని, మరికొందరికి శరీరంపై బలమైన ఆయుధంతో కోసిన గుర్తులు ఉన్నాయని మృతుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇప్పటికే చంద్రగిరి పోలీసులు ఎన్‌కౌంటర్‌లో పా ల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు.
నివేదికలో ఏముందో ?
హైకోర్టుకు బుధవారం అందజేసిన మృతుల రీ పోస్టుమార్టం నివేదిక, తొలుత జరిగిన పోస్టుమార్టం నివేదికతో సరిపోలుతుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత తిరుపతి రుయా వైద్యశాలలో మృతులకు జిల్లాకు చెందిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక ఇప్పటికే హైకోర్టులో ఉంది. తాజాగా ఉస్మానియా వైద్యులు నిర్వహించిన రీ పోస్టుమార్టం నివేదిక న్యాయస్థానానికి చేరింది. మొదటిసారి జరిపిన శవపరీక్షకు సంబంధించిన ఫోరెన్సిన్ నివేదిక ఇంకా న్యాయస్థానానికి అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ రెండు శవ పరీక్షల నివేదికను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయోనంటూ జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్ర ఉత్కంఠలో ఉంది.
ఖాకీల్లో టెన్షన్
Published Thu, Apr 23 2015 4:39 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement