క్రీనీడలలో భారత క్రికెట్
బీసీసీఐని సంస్కరించడానికి నియమించిన సీఓఏ అధికారాల పరిధి బోర్డు నిర్వహణలోని ప్రయోజనాల ఘర్షణలను సరిదిద్దడమే. కానీ గుహ ఉత్తరాలు క్రీడకారులకు, ప్రత్యేకించి పూర్వ క్రీడాకారులకు సంబంధించిన ఎన్నో పరస్పర ప్రయోజనాల ఘర్షణను వెలుగులోకి తెచ్చాయి. మన క్రికెట్‌కు సంబంధించిన మరో రంగంలోని, మరింత ఎక్కువ ముఖ్యమైన ప్రయోజనాల ఘర్షణ సైతం వెలుగులోకి వచ్చింది. క్రికెట్, డబ్బు, అధికారాల మధ్య కుమ్మక్కు అనే పాత కథే మరోసారి, మరో రకంగా పునరావృతం అవుతోందని తేలింది.
బోర్డ్ ఆఫ్ క్రికెట్ బోర్డును (బీసీసీఐ) సంస్కరించాలనే సదుద్దేశంతో సుప్రీం కోర్టు చేసిన ప్రయత్నం అతుకుల బొంతలా అనిపిస్తోంది ఎందుకు? అత్యంత వివేకవంతులు, సీనియర్లు అయిన న్యాయమూర్తుల ద్వారా సుప్రీం కోర్టు బెంచి గత రెండేళ్లుగా భారత క్రికెట్‌లో చురుగ్గా జోక్యం చేసుకుంటోంది. అయినాగానీ అది ఎవరో ఒక అసహనపు శస్త్ర చికిత్సా నిçపుణుడు నిలువునా కోసేసి ఆపరేషన్ బల్లపై అలాగే వదిలేసిన రోగిలాగా ఎందుకు కనిపిస్తోంది? అతి సుప్రసిద్ధులైన రిటైర్డ్ న్యాయమూర్తులు, క్రికెటర్లు, అధికారులు, కార్పొ రేట్ రంగంలో పనిచేస్తున్న ఒక ప్రముఖుడు, ఒక అగ్రశ్రేణి భారత క్రికెట్ చరి త్రకారుడు (రాజకీయ చరిత్రకారుడు కూడా) సేవలందిస్తున్నా అది అలాగే ఉన్నదెందుకు? ఆ రోగికి కుట్లు వేసేదెన్నడు?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కాపాడుకోవాల్సిన భారత క్రికెట్ జట్టు రేపు (ఆదివారం) ఇంగ్లండులో పాకి స్తాన్ జట్టుతో కీలకమైన మ్యాచ్‌లో తలపడనుంది. అయినాగానీ, మన జట్టు ఆ మ్యాచ్‌కు సన్నాహాలపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు జట్టు కోచ్, తది తర అంశాలపై బీసీసీఐ ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ కూర్చుంది ఎందుకు? భారత్ క్రికెట్ ఎన్నడూ లేనంత ఎక్కువగా నేడు చీలిపోయి కనిపి స్తోంది, ఎందుకు? అదే ఎన్నో విషయాలను చెబుతుంది.
ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలను నడపడానికి కోర్టులు నియమించిన సుప్ర సిద్ధ రిటైర్డ్ న్యాయమూర్తులలో ఒకరు.. తన సొంతవారికి ఇచ్చుకున్న ఉచిత పాస్‌ల గురించి, ఆ వ్యవహారంలో ఆయన కుమార్తె పాత్ర గురించి ప్రశ్నించిన ఒక రిపోర్టర్‌ను కోర్టు ధిక్కార నేరం కింద విచారిస్తానని బెదిరించిన విష యాన్ని చెప్పడం అతిశయోక్తి కాబోదు గానీ ప్రమాదకరం అవుతుంది. ఏడాది కంటే ముందు అటు మైదానంలోనూ ఇటు నిర్ణయాలు తీసుకునే బోర్డ్ రూం లోనూ కూడా ప్రపంచ క్రికెట్ శక్తిగా ఉన్న స్థానం నుంచి భారత క్రికెట్ నేడు బ్రహ్మాండమైన సంక్షోభానికి చేరిందనేది నిరాకరించలేని వాస్తవం. ఇక కోహ్లీ జట్టు నైపుణ్యం, ప్రేరణ మాత్రమే చాంపియన్స్ ట్రోఫీలో దాన్ని దరి చేర్చాలి.
గుహ బయటపెట్టిన లుకలుకలు
అయితే, డ్రెస్సింగ్ రూంలోని జట్టు, దాని నిర్వాహక సంస్థ కూడా చీలి పోయి ఉన్నాయి, ఐసీసీ బోర్డ్ రూంలో జగజ్జేతలాంటి ప్రముఖ స్థానంలో ఉండిన భారత్ నేడు తోక ఊపుకుంటూ నిలిచిన కుక్క పిల్లలా ఉందనేది వాస్తవం. ఇక బీసీసీఐ నిర్వహణకు, సంస్కరణల అమలుకు గౌరవనీయ సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) అంతర్గత విభేదాలతోనూ, బహు ప్రయోజనాల ఘర్షణతోనూ చీలిపోయి ఉంది. చరిత్ర కారుడూ, ప్రజాజీవితంలో ఉన్న ప్రముఖ మేధావి అయిన రామచంద్ర గుహ ధైర్యంగా అంతర్గతమైన లుకలుకలను బయటపెట్టే కార్యకర్త పాత్రను పోషిం చారు. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలన్నిటితో ఏకీభవించకపోయినా క్రికెట్ ప్రేమికులమైన మనం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంది.
స్పాట్–ఫిక్సింగ్ వివాదంతో నాలుగేళ్ల క్రితం క్రికెట్‌లో న్యాయవ్యవస్థ జోక్యం మొదలైంది. ఆ తదుపరి సంవత్సరాలలో ఇతర సమస్యలు కూడా తలెత్తడంతో ఆ జోక్యం పెరుగుతూ పోవడం కొనసాగింది. చివరికి గౌరవ నీయ న్యాయస్థానం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎమ్ లోథా నేతృత్వంలో రిటైరైన ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయ మూర్తుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 12 నెలలు కష్టించి కృషి చేసి, బీసీసీఐ పాలనా వ్యవహారాల తీరులో తీవ్ర మార్పులను సూచిస్తూ నివేదికను రూపొందించింది. 2016 అక్టోబర్ చివరికల్లా వాటిని అమలు చేయాలని కోర్టు బీసీసీఐని ఆదేశించింది. అది ఆదేశాలకు కట్టుబడక పోవడంతో, ఆచరణలో బోర్డ్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలకు ఉద్వాసన పలికింది.
రాయ్–లిమాయే ద్వయం లీల
ఆ తర్వాత అది లోథా కమిటీ సలహానుసారం సంస్క రణల అమలుకు హామీని కల్పించడానికి, ఈలోగా తాత్కాలికంగా బీసీసీఐని నియంత్రించడా నికి కమిటీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటర్లను (సీఓఏ) నియమించింది. అనుద్దేశపూర్వక పర్యవసానాల నియమం పనిచేయడం మొదలైంది అప్పుడే. బహుశా జస్టిస్ లోథా తనకున్న నమ్మకాన్ని బట్టే సీఓఏకు అధిపతిగా మాజీ కంప్ట్రోలర్ అండ్ జనరల్ వినోద్ రామ్‌ను నియమించి ఉంటారు. లోథా ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేస్తుండగా వివాదాస్పదమైన కేరళలోని సుసంపన్నమైన పద్మ నాభస్వామి ఆలయాన్ని కోర్టు నియమించిన పరి పాలనా కమిటీ పర్యవేక్షణ కింద ఉంచారు. దాని ఆర్థిక వ్యవహారాలను ఆడిట్ చేసే బాధ్యతలను రాయ్‌కు అప్పగించారు.
ఆ తర్వాత వివాదాస్పద మైన ఎమ్‌సీఐని (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) సంస్కరించడానికి నియమించిన కమిటీలో కూడా రాయ్‌కు స్థానం కల్పించారు. కాబట్టి తార్కికంగా సీఓఏకు నేతృత్వం వహిం చాల్సిందిగా ఆయన రాయ్‌నే ఎన్నుకున్నారని ఊహించవచ్చు. సీఓఏలోని మిగతా ముగ్గురు సభ్యులలో ఒకరు ముంబై కేంద్రంగా పనిచేసే ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌కు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయే. అదే కంపెనీకి రాయ్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు కాబట్టి, లిమాయేను ఆయనే ఎంపిక చేసి ఉండాలి. ఇక డయానా ఎదుల్జీ, గుహ ఎలా ఎంపిక అయ్యారో స్పష్టత లేదు. అయితే వారిద్దరూ వివాదరహి తులు లేదా వారం క్రితం వరకు వివా దరహితులుగానే ఉండేవారు.
సీఓఏ నాలుగు నెలలుగా బీసీసీఐపై పూర్తి అధికారాలతో పనిచేస్తోంది. అంతేకాదు, స్వల్పకాలిక సమాచారంతోనే సుప్రీం కోర్టు క్రికెట్ బెంచ్ దాన్ని కలుసుకోడానికి సుముఖంగా ఉంది. అయినా సీఓఏ లోథా కమిటీ సంస్కరణ లను అమలుచేయడంలో ఏ మేరకు విజయం సాధించిందో స్పష్టత లేదు. కోర్టు దానికి కాల పరిమితిని విధించలేదు కాబట్టి కొంతకాలం పాటూ బీసీసీఐని సీఓఏ నియంత్రిస్తోందో కూడా తెలియదు. ఈలోగా ప్రపంచ రంగస్థలిపై భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారాలలోని సంస్కరణలుగా పిలుస్తున్న రాబడి పంపిణీ, ఓటింగ్ ప్రమాణాలను అది వ్యతిరేకించనైనా లేకుపోయింది. మూడు పెద్ద తలకాయలకు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో కలిపి) నేతగా ఉన్న స్థానంలో ఉన్న భారత్ ఇంత వరకు ఓటమిని ఎరుగదు. అలాంటిది 13–1 తేడాతో అవమానకమైన ఓటమిని ఎదుర్కొంది. సీఓఏ పోరాడి ఓడటం కాదు, అసలు పోరాడనే లేదు. ఐసీసీ నియంత్రణ ఎంత పరిపూర్ణంగా, నిరం కుశంగా ఉందో తెలుసుకోవాలంటే... కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేయడం సహా ఎలాంటి చర్యా చేపట్టకుండా అది బీసీసీఐకి జారీ చేసిన ఉత్తరువుల పరంపరను చూడండి.
మన క్రికెట్ జట్టు ఇప్పుడు చీలిపోయింది. కెప్టెన్, కోచ్‌ల మధ్య యుద్ధం నడుస్తోంది. మినీ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా కోచ్ ఉద్యోగానికి దర ఖాస్తులను పిలిచారు. వీటన్నిటికి తోడు సీఓఏఏలోని ఒక ప్రముఖ సభ్యుడు తన కొన్ని ఉత్తరాలను బయటపెట్టారు. వాటిలో ఆయన కమిటీలోని తన సహచరులు అసమర్థతపైనా, సంస్కరణలను అమలుచేయంలోని వైఫల్యం పైనా పరోక్ష విమర్శలను సంధించారు. ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాల్సిన ఇద్దరు క్రీడాకారులు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అందరిలోకీ సీనియర్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోనీలపై అను మానపు నీడలు ముసిరేలా చేశారు.
అపరిమిత ప్రయోజనాల ఘర్షణ
సీఓఏ అధికారాల పరిధి బీసీసీఐ నిర్వహణలోని ప్రయోజనాల ఘర్షణ లను సరిదిద్దడమే. కానీ గుహ ఉత్తరాలు మన క్రికెట్ క్రీడకారులకు, ప్రత్యే కించి పూర్వ క్రీడాకారులకు సంబంధించిన ఎన్నో పరస్పర ప్రయోజనాల ఘర్షణను వెలుగులోకి తెచ్చాయి. న్యాయవ్యవస్థ చురుకైన పాత్ర వహిం చడం వల్ల కలిగిన అనుద్దేశపూర్వక పర్యవసానంగా భారత క్రికెట్‌కు సంబంధించిన మరో రంగంలోని ఘర్షణలు, మరింత ఎక్కువ ముఖ్యమైనవి వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా నియంత్రితమైన ఫైనాన్స్ మార్కెట్లు, బ్యాంకింగ్, అధికారవర్గ–కార్పొరేట్ వ్యవస్థలు, వాటి మధ్య అనుసంధానాలు బయ టపడ్డాయి. సీఏఓపైనే దృష్టిని కేంద్రీకరించడంవల్ల కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యంత శక్తివంతమైన బ్యాంకింగ్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణలు, పునర్వ్యవస్థీకరణకు అధిపతిగా ఉన్న రాయ్.. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కు ప్రమోటరైన ఐడీఎఫ్‌సీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు.
ఐడీ ఎఫ్‌సీ, ప్రభుత్వ బ్యాంకులకు పోటీదారు. అంతేకాదు, రాయ్ తన సీఈఓను సీఓఏలో తనకు సహాయకునిగా నియమించుకున్నారు! లిమాయేను నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు (ఎన్‌ఎస్‌ఈ) సీఈవోగా ఎంపిక చేశారు. దేశంలోని 80 శాతం స్టాక్ మార్కెట్ లావాదేవీలు దానిలోనే జరు గుతాయి. నెలల తరబడి దానికి అధిపతి లేరు. అయినా లిమాయే సీఓఏ సభ్యునిగా కొనసాగడం మానుకుంటే తప్ప మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెబీ బాధ్యతలను ఆయన చేపట్టలేరు.
బలీయమైన అధికారవర్గపు శక్తుల మద్దతుతో జరిగిన లిమాయే నియా మకంలో ఆయన ద్విపాత్రాభినయంలోని ప్రయోజనాల ఘర్షణను ప్రశ్నించిన సెబీ ధైర్యం ప్రశంసనీయం. ఆయన నేతృత్వం వహించాల్సిన సంస్థలో చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఒకటే లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఆయన రెండు పక్షాలలోనూ ఉండగలరా? దేశంలోని అతి ప్రధాన స్టాక్ ఎక్స్‌ఛేంజి సీఈఓకు బీసీసీఐ లాంటి వివాదాస్పద సంస్థను నడపడానికి సమయం ఉంటుందా? ఇక ఆయన ఐడీఎఫ్‌సీకి ఎంత సమయాన్ని కేటాయిం చగలుగుతారు? సెబీ స్పష్టతను కోరడం సమంజసమే. బీసీసీఐ ఆడిటింగ్ కాంట్రాక్టును ఎన్‌ఎస్‌ఈ డైరెక్టరు, ఎన్‌ఎస్‌ఈ సెలెక్ట్ కమిటీ సభ్యుని సొంత కంపెనీకి ఇచ్చారు. దాన్ని తర్వాత రద్దు చేశారు. రెండువారాల క్రితం లిమాయే తాను ఆగస్టులో సీఓఏ విధులను బయ టపడతానని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. మరో సభ్యుడు గుహ నిష్క్రమించారు కాబట్టి ఇక భారత క్రికెట్ ఎక్కడ నిలుస్తుంది? ఈలోగా ఎన్‌ఎస్‌ఈ అధిపతి లేకుండా ఉండాల్సిందేనా? క్రికెట్, డబ్బు, అధికారాల మధ్య కుమ్మక్కు అనే అదే కథ మరోసారి, మరో రకంగా పునరావృతం అవు తోంది. సీఓఏ విధులను చేపట్టి నప్పుడు రాయ్ తాను నైట్ వాచ్‌మెన్‌లా నిర్దిష్ట మైన పనికే పరిమితమౌన్నారు, బాగానే ఉంది. కానీ క్రికెట్ అధికారం పూర్తిగా వివశం చేసేస్తుంది.
twitter@shekargupta