అనుమతించకూడని క్రీడ ఇది | Justice Narasimhareddy writes on defections in political parties | Sakshi
Sakshi News home page

అనుమతించకూడని క్రీడ ఇది

Published Thu, Apr 6 2017 2:02 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

అనుమతించకూడని క్రీడ ఇది - Sakshi

అనుమతించకూడని క్రీడ ఇది

ముఖ్యమంత్రి చేత లేదా ఇతర మంత్రుల చేత గవర్నర్‌ చేయించే ప్రమాణ స్వీకారం ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు. కొన్ని దశాబ్దాల మథనం తరువాత ఈ సంప్రదాయానికి ఒక రూపు వచ్చింది. ప్రమాణ స్వీకారం చేయించే సభ్యుల పూర్వాపరాలు తెలుసుకోవడం గవర్నర్‌ విధియుక్త ధర్మం. కొన్ని సందర్భాలలో గవర్నర్‌ బాధ్యత కూడా. ఏమైనప్పటికీ ప్రతిపక్షానికి చెంది, ప్రమాణ స్వీకారం వేళకి కూడా అదే పార్టీలో కొనసాగుతున్న శాసనసభ్యుడిని మంత్రివర్గంలో చేర్చుకునే వెసులుబాటును ప్రపంచంలోని ఏ రాజ్యాంగమూ అధికార పక్షానికి కల్పించడం లేదు.

విచిత్రమైన, ఇంకా చెప్పాలంటే మున్నెన్నడూ ఎరుగని పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోను నెలకొని ఉంది. ఈ పరిస్థితిలో చాలా కోణాలు ఇమిడి ఉండడమే కాకుండా, అది భారత రాజ్యాంగంతో సన్నిహిత సంబంధం కూడా కలిగి ఉంది. అంతేకాదు, పూర్వం నుంచి అమలవుతున్న కొన్ని విలువలనూ, సంప్రదాయాలనూ ఆ పరిస్థితి కుదిపివేస్తున్నది. ప్రతి పక్షానికి చెందిన సభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించడం అలాంటి పరిస్థితిని సంకేతించేదేనని ఎవరైనా గ్రహించగలరు. ఈ మొత్తం వ్యవ హారంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. విపక్షం నుంచి వచ్చిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని తీవ్రంగా విమర్శించి, ఆ పద్ధతిని రాజకీయ దివాలాకోరుతనంగా అభివర్ణించినవారు మళ్లీ అదే విధానాన్ని పెద్ద ఎత్తున అనుసరించారు. ఈ పరిణామం సహజంగానే రాజకీయ, న్యాయ, సామాజిక, ఇతర రంగాలలో చర్చనీయాంశంగా మారింది.

రాజ్యాంగ నిబంధనల మేరకు మనం ఎంచుకున్న పార్లమెంటరీ ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు కీలకమైన చర్య. కేంద్రంలో అయినా, ఇటు రాష్ట్రాలలో అయినా ఇదే వర్తిస్తుంది. ప్రభుత్వాల ఏర్పాటులో రాష్ట్రపతి లేదా రాష్ట్రాల గవర్నర్లకు అప్పగించిన బాధ్యత కూడా కీలకమైనది. ఈ తరహా పెద్ద సంఘటనలు స్వాతంత్య్రం వచ్చిన రెండు మూడు దశాబ్దాల కాలంలో జరగ లేదు. తరువాత ఒకే పెద్ద పార్టీ గుత్తాధిపత్యం పతనమైన తరువాత ఈ సమస్య రెక్కలు విచ్చుకుంది. ఇదివరకు పరిపూర్ణమైన ప్రజా తీర్పు లభించని సందర్భంలోను, లేదా పార్టీలోనే విభేదాలు తలెత్తినప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తేది. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోను సంభవించిన పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధమైనది. ఇక్కడ రెండు సభలలోను పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితిని తీసుకువచ్చారు. వారి మెజారిటీకి ఢోకా లేని సమయంలో ఇదంతా జరగుతున్నది.

ఓటరు దృష్టి ప్రధానం
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై నెగ్గిన ఒక శాసనసభ్యుడికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో ఈ పరిస్థితికి శ్రీకారం చుట్టినట్టయింది. ఇలాంటి ఘటనలలో ఇదే మొదటిదని గుర్తించాలి. ఒక పార్టీ తరఫున సభకు ఎన్నిక కాకపోయినా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందులో సభ్యులు కావడం జరుగుతూ ఉంటుంది. ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకున్న సందర్భంలో లేదా ఆ సభ్యుడు తన శాసన సభ్యత్వానికీ, అప్పటి దాకా ఉన్న పార్టీకీ రాజీనామా చేసినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. రాజ్యాంగంలోని 75, 164 ఆర్టికల్స్‌ ఇచ్చిన వెసులు బాటుతో ఇలాంటి విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. చట్టసభలకు ఎన్నిక కాకున్నా మంత్రివర్గంలో సభ్యుడు కావడానికి అవి అనుమతిస్తున్నాయి. మంత్రిగా ఎన్నికై ఆరుమాసాల వరకు కొనసాగడానికి కూడా అవకాశం కల్పి స్తున్నాయి.

రాజకీయ పార్టీలు ప్రవచించిన సిద్ధాంతాల మేరకు, వాటి తాత్వికతల పునాదిగా ఎన్నికలు జరిగినప్పుడే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. విలక్షణమైన ఏ రాజకీయ పక్షమైనా  మొదట దేశం గురించి, రాష్ట్రాల గురించి తన వైఖరి ఏమిటో వెల్లడి స్తుంది. ఆ మేరకు తను నమ్మిన సిద్ధాంతం పునాదిగా దేశ, రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మార్గాలను ప్రకటిస్తుంది. ఆ విధంగానే ఆ పార్టీ సిద్ధాంతం ఆవిష్కృతమవుతుంది. దీనితో పాటు ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా, ఏ రాజకీయ పక్షమైనా అప్పటికి ఉన్న సమస్యల ఆధారంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తుంది. తన పార్టీ సిద్ధాంతాలతో పాటు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలను కూడా గౌరవించే వారినే ఆయా పార్టీలు తమ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఎంపిక చేస్తాయి. నీతినిజాయితీ కలిగిన ఏ అభ్యర్థి అయినా కూడా తన పార్టీ పట్ల విధేయుడిగా ఉంటారు. ఇక ఇలాంటి అభ్యర్థి పట్ల తన ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నప్పటికీ ఓటరు ఎన్నికల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఓటు వేస్తాడు.

ప్రజాతీర్పును మరచిపోవడం అనైతికమే
తనను చట్టసభకు పంపిన పార్టీని వీడిపోవడం అనేది ఆ అభ్యర్థి చేసే అత్యంత అనైతిక చర్య అవుతుంది. అయితే తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజకీయ పార్టీకీ, దాని సిద్ధాంతానికీ విధేయతతో ఉండడం కష్టమని భావిస్తే, అలాగే ప్రజా తీర్పు పట్ల అసంతృప్తి ఉంటే అలాంటి అభ్యర్థి తన పార్టీకి రాజీనామా చేయాలి. అలాగే ఆ పార్టీ ద్వారా తనకు లభించిన చట్టసభ సభ్వత్వానికి కూడా రాజీనామా చేయాలి. ఆపై తన అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాలి. ఇందుకు భిన్నంగా ఎలాంటి అడుగు వేసినా రాజకీయ పక్షాల వ్యవస్థనూ, అసలు ఎన్నికల ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేసినట్టే. విభేదాలు తలెత్తిన సందర్భాలలో వ్యక్తులు ఆయా పార్టీలను ఎలా విడిచి పెట్టారో తెలియచేసే సందర్భాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి. అందులో ఆచార్య నరేంద్ర దేవ్‌ ఉదాహరణ ఒకటి.

ఆయన సోషలిస్ట్‌ పార్టీ నుంచి చట్టసభకు ఎన్నికయ్యారు. విభేదాల కారణంగా పార్టీకే కాదు, ఆ పార్టీ ద్వారా తనకు సంక్రమించిన చట్టసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. తరు వాత ఉప ఎన్నిక జరిగింది. కానీ ఆ ఎన్నికలో ఆయన పోటీ చేసి పరాజయం పాలైనారు. అయినా ఆ ఎన్నికలో గెలిచిన వారి విజయం గురించి కంటే, నరేంద్రదేవ్‌ ఓటమినే ఇప్పటికీ చరిత్రాత్మకంగా, అత్యున్నత నైతిక ప్రమా ణాన్ని ఆవిష్కరించినదిగా రాజకీయ వర్గాలు పేర్కొంటూ ఉంటాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. అధికారం కోసం వ్యక్తులు అడ్డుదారులను ఎంచుకున్నప్పుడు మాత్రమే సమస్యలు తలెత్తుతాయి.

ఒక పార్టీకి జనంలో ఎలాంటి పేరు ఉన్నప్పటికీ పాలనకు సంబం ధించిన దాని శక్తి మాత్రం ఆ పార్టీ ద్వారా సభలోకి ప్రవేశించిన సభ్యుల సంఖ్య మీదే ఆధారపడి ఉంటుంది. టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన సభ్యులే ఆ పార్టీకి చట్టబద్ధమైన సంపద అవుతారు. అలాకాకుండా ఫిరాయింపులను ప్రోత్సహించి మరో పార్టీ సభ్యులను చేర్చుకుంటే వారు అక్రమ సంపదే అవుతారు. అంతకు ముందు వారు పని చేసిన పార్టీకీ, దాని ద్వారా లభించిన పదవికీ రాజీనామా ఇవ్వనంతవరకు వారు అలాంటి అక్రమ సంపదే. ఎవరైనా ఒక ఉద్యోగి అక్రమాస్తులు కలిగి ఉంటే అతడు శిక్షార్హుడు. కానీ అక్రమాస్తులు కలిగిన రాజకీయ పార్టీల పట్ల అందుకు భిన్నమైన వైఖరిని అనుసరించడంలో ఎలాంటి హేతువూ కనిపించదు. ఎందుకంటే ఆ ఇద్దరు సమాజం పట్ల బాధ్యత కలిగినవారే. కానీ అక్రమ మార్గాల ద్వారా ఒక ఉద్యోగి సంపాదించే భూమి లేదా భవనం వాటంతట అవే ఎలాంటి పాత్రను నిర్వహించలేవు. అదే రాజకీయ రంగంలో అయితే అక్రమ ఆస్తి, అంటే ఫిరాయింపుదారు రహస్య కుతంత్రం ద్వారా అలాంటి చట్ట వ్యతిరేక పాత్రను నిర్వహించడం జరుగుతుంది.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోని పరిణామాల పట్ల ఆత్రుతనీ, బాధనీ కలిగించేటట్టు చేస్తున్నదేమిటంటే– ఇలాంటి అవమానకర పరిణా మాలను అత్యున్నత రాజ్యాంగ సంస్థలు తమ చట్టబద్ధ అధికారాల ద్వారా, సరైన సమయంలో ఆపి ఉండవచ్చునన్న వారి భావనను వెల్లడించడానికి ప్రజలు సందేహించడం లేదు. మొదట– ఇది రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూలులోని నిబంధన అమలుకు సంబంధించినదని గమనించాలి. అందులో ప్రవచించిన అంశం ఎలాంటి సంధిగ్ధానికి అవకాశం లేనిది. ఆ షెడ్యూలులోని నిబంధనలు కోర్టుల ప్రమేయం లేకుండా చేసి, పార్ల మెంటును, స్పీకర్లను సంపూర్ణాధికారులను చేశాయి. సకాలంలో తీసుకున్న చర్య రాజ్యాంగబద్ధతకు శక్తిని ఇచ్చి, అందరికీ బలమైన సంకేతాన్ని అందించ గలుగుతుంది. అలా కాకుండా ఈ సమస్య తలెత్తినప్పుడు మరో కోణంతో పరిశీలిస్తే  ప్రజాతీర్పును, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని పరిహాసం చేయడానికి ‘మేనేజర్‌’లకు ధైర్యసాహసాలు సమకూర్చినట్టవుతుంది.

ప్రమాణ స్వీకారం ఆషామాషీ కాదు
రాజ్యాంగంలోని 164 షెడ్యూల్‌ ప్రకారం ముఖ్యమంత్రి చేత లేదా ఇతర మంత్రుల చేత గవర్నర్‌ చేయించే ప్రమాణ స్వీకారం  ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు. కొన్ని దశాబ్దాల మథనం తరువాత ఈ సంప్రదాయానికి ఒక రూపు వచ్చింది. ప్రమాణ స్వీకారం చేయించే సభ్యుల పూర్వాపరాలు తెలుసుకోవడం గవర్నర్‌ విధియుక్త ధర్మం. కొన్ని సందర్భాలలో గవర్నర్‌ బాధ్యత కూడా. ఏమైనప్పటికీ ప్రతిపక్షానికి చెంది, ప్రమాణ స్వీకారం వేళకి కూడా అదే పార్టీలో కొనసాగుతున్న శాసనసభ్యుడిని మంత్రివర్గంలో చేర్చు కునే వెసులుబాటును ప్రపంచంలోని ఏ రాజ్యాంగమూ అధికారపక్షానికి కల్పించడం లేదు. రాజ్యాంగం ఎడల గౌరవం లేనివారు, రాజనీతిశాస్త్ర మౌలిక సూత్రాల పట్ల పట్టింపు లేనివారు మాత్రమే ఇలాంటి అడ్డదారులకు పాల్పడతారు.

క్రీడాస్థలిలో గీసిన గీతలను మరుగు పరిస్తే, అసలు ఆ క్రీడ నిబంధనలే చెరిగిపోతాయి. అలాంటి చోట ఆడిన ఆటలో గెలిస్తే, ఆ విజయం ఔన్నత్యం ఎలాంటిదో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి విధానాలకు (నిజానికి అక్రమ పద్ధతులు) రిఫరీ అభ్యంతరం చెప్పకుంటే కేవలం ఆ క్రీడ మాత్రమే కాదు, ఆ సందర్భమే ప్రాధాన్యం కోల్పోతుంది. మరొక విషయం ఏమిటంటే–పేరు మోసిన మరింత పెద్ద ఆటగాడు నిస్సంకోచంగా నిబంధ నలను ఉల్లంఘిస్తే, అంతకు ముందే ఈ పనిచేసిన వారికి ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉండదు. మన మహాకావ్యం మహాభారతం ఇందుకు సంబం ధించిన ఒక ఉదాహరణ స్పష్టంగా చూపుతున్నది. అభిమన్యుడిని చంపడానికి కౌరవ పక్షంలోని అతిరథ మహారథులంతా రణనీతిని ఉల్లంఘిం చారు. అయితే వారందరికీ తరువాత అభిమన్యుడు ఎదుర్కొన్న పరిస్థితే ఎదురైంది. కానీ అందుకు నిరసన తెలిపే హక్కును వారు అప్పటికే కోల్పోయారు. దానితో అవమానకరంగా ఓడిపోయారు, లేదా మరణించారు. తమ లోపాలు, చర్యల ద్వారా రాజ్యాంగాన్ని అమలు చేసేవారు ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు అవకాశం కల్పిస్తే, వాటి ముందు రాజ్యాంగం ఎలా ఓడి పోయిందో చూసి ప్రజలు నిరాశతో నిట్టూర్చక తప్పదు. రెండో విషయం: అంతా అయి పోయిన తరువాత ఇక చేసేదేమీ ఉండదు.

జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి
పట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement