‘హోదా’ఆంధ్రుల హక్కు | kolanukonda sivaji review on AP special status issue | Sakshi
Sakshi News home page

‘హోదా’ఆంధ్రుల హక్కు

Published Fri, Oct 16 2015 9:41 AM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

‘హోదా’ఆంధ్రుల హక్కు - Sakshi

‘హోదా’ఆంధ్రుల హక్కు

ప్రత్యేక హోదా సంజీవని కాదు కదా అంటూ బీజేపీ ప్రముఖుడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించడం వింతలలో కెల్లా వింత. ప్రత్యేక హోదా నిజంగా సంజీవనే కాదు, అంతేకంటే ఎక్కువే. ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారం, పార్లమెంటులో చర్చ, ఆ సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, మన రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు చేసిన గర్జనలు జనం అప్పుడే మరచి పోతారని భావించడం దారుణం. విభజన బిల్లును తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ గతి పట్టించారో వారికీ తెలుసు. తమను అధికార పీఠం మీదకు తెచ్చిన ఆ మలుపును గురించైనా వెంకయ్యనాయుడు వంటి నేతలకు బాగా గుర్తుండి ఉండాలి.

నేతలు మరచినా ప్రజలకు గుర్తుంది
ఇప్పటికి ఇరవై నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఆ చర్చ సందర్భంగా బీజేపీ అగ్రనాయకుడు, నాటి ప్రతిపక్ష నాయకుడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పది సంవత్సరాల పాటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ విషయం పార్లమెంట్ రికార్డుల్లో పదిలంగా ఉంది. తన ఒత్తిడి కారణంగానే అప్పటి ప్రధాని మన్మో హన్‌సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించారని వెంకయ్యనాయుడు ఊరూవాడా తిరిగి సన్మానాలు చేయించుకున్నారు కూడా. తన ఘనకీర్తిని పుస్తకాల్లో అచ్చువేయించుకున్నారు. అంతటితో ఆగకుండా ఎన్ని కల మేనిఫెస్టోలోనూ, ప్రచార సభల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని గట్టిగా వినిపించారు. అం దుకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు వంత పాడారు.

మాట మార్చిన నేతలు
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు 1.3 శాతం ఓట్ల తేడాతో భారీ రాజకీయలబ్ధి పొందాయి. అధికారం చేజిక్కగానే ఎన్నికల ముందు వారు మాట్లాడిన మాట లన్నీ నీటిమూటలు చేశారు. గదాఘాతం వంటి విభజనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ర్ట ప్రజల మనో భావాలను గాయపరిచే వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. పార్లమెంట్‌లో గొంతు చించుకుని రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పరిరక్షించాల్సిన బాధ్యత తనపైనే ఉందన్నట్లు వ్యవహరించిన వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అంటూ మాట్లాడడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ర్ట విభజనకు ముందు రెండు కళ్ల సిద్ధాంతం పాటించి, విభజన జరిగే వరకు కళ్లప్పగించి చూశారు. ఎన్నికల సమయంలో ‘యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఐదేళ్లు ప్రకటించింది. పరిశ్రమలకు అనుమతులు రావాలంటే రెండు, మూడేళ్లు పడుతుంది. నెలకొల్పే సమయానికి హోదా కాలపరిమితి ముగు స్తోంది. కాబట్టి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలి’ అంటూ ఊదరగొట్టారు. ఎన్నికలయ్యాక ‘ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుంది? కేంద్ర ప్రభుత్వం పథకాలు తప్ప ఏమీ రావంటూ’ చంద్రబాబు కూడా రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు.

అర్థంకాని మనోగతాలు
వీరి స్వరం ఇలా ఎందుకు మారిపోయిందో ఎవరికి అర్థం కాదు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలైనదంటూ మాట మార్చిన బీజేపీ, టీడీపీ నాయకుల మనోగతం ఆర్థిక నిపుణులకు అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబునాయుడు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రాష్ట్ర ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికా రంలో ఉన్న పదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఏ ఫార్ములా వినియోగించి రాష్ట్రాన్ని మోడల్‌గా తీర్చిదిద్దారో చంద్రబాబునాయుడు గుర్తించాలి.

బీజేపీతో పొత్తు ఉన్నంత మాత్రాన చంద్రబాబు ప్రతి అంశానికి మౌనం పాటించడం సరికాదు. మోదీని అంటకాగకుండా రాష్ర్ట ప్రయోజనాల కోసం ఎలాంటి శషభిషలు లేకుండా కేంద్రంతో తలపడాలి. బీజేపీతో చిరకాలంగా స్నేహం ఉన్నప్పటికీ మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న శివసేన ఢిల్లీ సర్కారుతో పోరాడుతున్న తీరును చంద్రబాబు గమనించాలి. అలా చేయకుండా ఓటుకు కోట్లు కేసు చార్జిషీటులో తన పేరు 22 సార్లు వచ్చేసరికి ‘బాంచన్ దొర ’ అంటూ కేంద్రం వద్ద మోకరిల్లడం సరికాదు.

విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా చంద్రబాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమీక్షలు, సమావే శాలు అంటూ తప్పించుకు తిరగడం ఎంతవరకు సబబు? ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తూ, తానే అభివృద్ధికి చిరునామా అని చాటుకోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు వెగటు కలిగి స్తోంది. ఢిల్లీ వెళ్లేసరికి ఈ దర్పం డీలాపడిపోతున్నది.

విపక్షానికి ఉన్న పట్టుదలైనా లేదు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తికాకుండానే జాతికి అంకితం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన పరువును తానే బజారుకీడ్చుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు చూపించిన తెగువ ముఖ్యమంత్రి చూపకపోవడం సిగ్గుచేటు. 69 మంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులున్న పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే, కేంద్ర మంత్రులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ దూతలను పంపి ప్రత్యేక హోదా కోసం తీసుకుంటున్న చర్యలు వివరించలేకపోవడం దురదృష్ట కరం. నాగా తీవ్రవాదులతో ఒప్పందాలు, మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపిన వారు ప్రతిపక్షనాయకుడి దీక్షను నిర్లక్ష్యం చేయడం దారుణం. పట్టనట్టుగా నటించ డం అప్రజాస్వామికం.

ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులనీ, నీతి ఆయోగ్ సిఫారసు చేయాలనీ చెప్పడం ప్రజలను అయోమ యానికి గురిచేయడమే. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనాలు ఏమిటో ఇప్పటికే ఆ హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాల్లో చూస్తున్నాం. వాటిని ప్రజలకు వివరించాలి. హోదాకూ, ప్యాకేజీకీ ఉన్న వ్యత్యాసం ఏమిటో స్పష్టం చేయాలి. హోదా కోసం ఆత్మబలి దానాలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదు. హోదాతో పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలు అందుతాయి. రాష్ట్రానికి 90 శాతం నిధులు గ్రాంటుగా వస్తాయి. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సీమాంధ్ర అభివృద్ధికి తన దగ్గర బ్లూప్రింట్ ఉందని చెప్పిన నరేంద్ర మోదీ వాటిని ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి.

విపరిణామాలకు బాధ్యత వారిదే
రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరక అసం తృప్తితో ఉన్న యువత పెడదారి పట్టినా, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా అందుకు కేంద్రమే బాధ్యత వహిం చాలి. ప్రత్యేక హోదా సంజీవనీ, సర్వరోగ నివారిణి అవునో కాదో నిరూపణ కావాలంటే అది ఇచ్చి చూడాలి. అంతేగానీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజ నాలను తాకట్టు పెట్టడం సరికాదు. ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికే చెందిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హోదా తెచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

పార్లమెంట్ సాక్షిగా తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని వెంకయ్య నాయుడు నిరూపించు కోవాలి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. భావితరాలు మీరు చేసిన ద్రోహాన్ని మరచిపోవడం సాధ్యం కాదు. ప్రత్యేక ఉద్యమంలో గొంతు కలిపి సాధించుకురాకపోతే బీజేపీ, టీడీపీలను అమరావతి శంకుస్థాపన కింద రాజకీయ సమాధి చేయడమే ఆంధ్ర ప్రజల ముందున్న కర్తవ్యం.

-కొలనుకొండ శివాజీ
(వ్యాసకర్త కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్, మొబైల్: 98662 00463)
ఈ మెయిల్: shivaji.kolanukonda@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement