
కుమ్మక్కు కుట్ర ‘భూసేకరణ’
ఏబీకే ప్రసాద్,
సీనియర్ సంపాదకులు
తాజా భూసేకరణ ఆర్డినెన్సులు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని పంట భూముల్ని విడిచేసి పరిగలు ఏరుకు తినమని శాసిస్తున్నట్లు ఉన్నాయి! ఈ ఆర్డినెన్సులకు యూపీఏ ప్రభుత్వం నాంది పలికితే, బీజేపీ, టీడీపీ పాలకులు బలంగా తెర లేపారు! ఈ చట్టం అమలులోకి వస్తే ‘‘సామాజికంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసివస్తుందో’’ అంచనా వేయాలని చేసిన హెచ్చరికను కూడా మోదీ, బాబులు పట్టించుకోలేదంటే నిరంకుశ ధోరణులను, బ్యురోక్రాటిక్- టెక్నోక్రాటిక్ వ్యవస్థను మనకు అలవాటు చేయాలని వారు ఎంతగా ఉవ్విళ్లూరుతున్నారో అర్థమౌతోంది.
‘‘ప్రపంచీకరణ లేదా విదేశీ, స్వదేశీ గుత్త పెట్టుబడులకు అనుకూలంగా దేశీయార్థిక వ్యవస్థను మలచే సరళీకృత విధానాలను పాలకులు విస్తరించిన తరువాత దేశీయ సర్వసత్తాక ప్రతిపత్తిపైన, హక్కులపైన తీవ్రమైన ప్రభావం పడింది. సామ్రాజ్యవాద పాలకుల తాఖీదులను తలదాల్చడం వల్ల పాల కులు దేశీయ చట్టాలను అందుకు తగినట్టుగా మార్చేశారు. ఈ మార్పు కేంద్ర స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ వచ్చింది. ఫలితంగా సామ్రాజ్యవాద పాలనా సంస్కృతితో దేశీయ ప్రభుత్వాలు చెట్టపట్టాలు కట్టాయి. చివరికి దేశీయ రక్షణ, గూఢచార యంత్రాంగం కూడా అమెరికా-ఇజ్రాయెల్ పంచ మాంగ దళంతో పెనవేసుకుపోయే దశ వచ్చింది’’.
- అరవింద్, ‘‘గ్లోబలైజేషన్, యాన్ ఎటాక్ ఆన్ ఇండియన్ సావర్నిటీ’’ (2002)
ఈ పెనవేసుకుపోవటం కాంగ్రెస్ (యూపీఏ) హయాములో ఒక దశకు చేరి క్రమంగా విస్తరించింది. బీజేపీ (ఎన్‌డీఏ) కూటమి పాలనలో స్వదేశీ ఆర్థిక విధానం నినాదం చాటునే మరింతగా ఊడలు దించుకుంటోంది. నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి, అమెరికా అధ్యక్షుడు ఒబామాకు మధ్య కుదిరిన అనుమానాస్పద అణు ఒప్పందంలోని అస్పష్ట మైన క్లాజుతో ఈ బంధం బిగిసిపోయినట్టయింది. ఈ పూర్వరంగంలో భారత రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా, విదేశీ బహుళజాతి గుత్త పెట్టు బడు లకు, వాటిపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న దేశీయ గుత్త వర్గాలకు ఆశాజనకంగా భూస్వాధీన లేదా బలవంతపు భూసమీకరణ కేంద్ర ఆర్డినెన్స్ వచ్చింది. శాసనవేదికలలో ఏ పార్టీ అయినా ‘‘బ్రూట్ మెజారిటీ’’ (తిరుగు లేని సంఖ్యాబలం) సాధిస్తే దేశ ప్రజాబాహుళ్యానికి ఎంతగా మంచి సేవలం దించే అవకాశం ఉంటుందో అంతగానూ చెడుతలంపులకు రైతాంగ ప్రజలకు హానికరమైన శాసనాలను రూపొందించగల పాలనావ్యవస్థకు అవకాశమూ అంతే ఉంటుందని మరవరాదు.
ఆర్డినెన్స్‌ల కుమ్మక్కు
విచిత్రమేమంటే, ఏదో అటు కేంద్ర ప్రభుత్వమూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమూ కూడబలుక్కుని మరీ (విచిత్రమైన సంకీర్ణ హోదాలో ఉన్నం దున) అటూ ఇటూ కూడా ఆగమేఘాల మీద రైతాంగ వ్యతిరేకమైన ఆర్డినె న్సులు జారీ చేసి కూర్చున్నాయి. ఫలితంగా దేశవ్యాపితంగానే రైతాంగం తీవ్ర ఆందోళనకు మానసిక వేదనకు గురికావలసి వచ్చింది. పైగా ఇటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూసేకరణ / సమీకరణ ఆర్డినెన్స్, చట్టమూ చెక చెకా పూర్తి చేసుకున్న తరుణంలోనే కేంద్రం చట్టం కూడా సిద్ధమైంది. ‘రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) 2014’ చట్టానికి ముందు ఈ బాగోతం ఆర్డినెన్సు రూపంలో ఉండగా, తరువాత శాసనసభ ముద్రవేయించుకుని చట్టం అవతారం దాల్చింది. దీని తాలూకు తొలి నోటిఫికేషన్ డిసెంబర్ 30న (2014) వెలువడింది. కానీ గత కాంగ్రెస్ నేతృత్వ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టానికి 2013 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదం లభించింది. భూసేకరణలో, సమీకరణ తంతులో నష్టపోయే రైతాంగంలో నూటికి 80 మంది అనుమతిస్తేనే భూసేకరణ జరగా లని, ఇది రైతాంగ ప్రయోజనాల రక్షణకు అవశ్యమని ఆ చట్టంలో స్పష్టంగా ఉంది.
అంటే ప్రభుత్వం తన పనుల కోసం సహజంగా సేకరించుకునే భూమి వేరు, రాజధాని నిర్మాణం చాటున అన్ని నియమాలను ఉల్లంఘించి, రైతాంగ సహేతుక ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రైవేట్ రియల్ ఎస్టేట్, సంపన్న వర్గాల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆర్డినెన్సులు, చట్టాల మాటున బలవం తంగా వేలాది ఎకరాలను గుంజుకోజూడ్డం వేరు! కాంగ్రెస్ తెచ్చిన చట్టం కూడా పలు వర్గాల విమర్శలను ఎదుర్కొంది. ఆ చట్టం కింద జరిగిన భూసేక రణ వల్ల భూములు కోల్పోయిన రైతులకు చట్టం హామీ పడినట్టు సరసమైన నష్టపరిహారంగానీ, పునరావాసం గానీ, సురక్షితమైన ప్రాంతాలలో వారిని స్థిరపరచడం గానీ జరగలేదు. సామ్రాజ్యవాద వలస పాలకులు తమ మను గడ కోసం, రైతాంగ, వ్యవసాయ కార్మికుల్ని పీడించడం కోసం తెచ్చిన వలస చట్టాలనే దుమ్ముదులిపి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పాలకులు అనుసరిసు ్తన్నారు. అయితే మోదీ ప్రభుత్వం కూడా ఆ అడుగుజాడల్లోనే ఇంకొంచెం భరోసాతో లేదా బ్రూట్ మెజారిటీ అహంకారంతో మరింత ముందుకు సాగింది. బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో మైనారిటీలో ఉన్నందున ఆ చట్టం తేవటం కష్టసాధ్యమని దానికి తెలుసు. అయినా కూడా టీడీపీతో పీటముడిని కాపాడుకునేందుకు దాదాపు ఒకే సమయంలో, ఒక్కరోజు తేడాతో డిసెంబర్ 31 (2014)న గబగబా ఆర్డినెన్సును జారీ చేసింది.
‘తిలాపాపం తలా పిడికెడు’
నిజానికి వివిధ రాష్ట్రాల్లో రైతాంగ ప్రజలు కాంగ్రెస్ ఒరిజినల్‌గా రూపొందిం చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరిపిన ఫలితంగానే... భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, పూర్తి పునరావాసం కల్పించాలనే సవరణ చిట్టచివరికి చట్టంలోకి వచ్చి చేరింది! అయితే రైతాంగాన్ని ఏదో ఒక రూపంలో భారీ స్థాయిలో ‘బేదఖల్’ చేసే ప్రమాదం ఆ చట్టం రూపకల్పన దశలోనే వచ్చి చేరింది (డిస్పోసిషన్ విండ్ ఫాల్). ఈ రైతాంగ వ్యతిరేక వ్యాపార ధోరణి మాత్రం మారలేదు, మారదు! ఆ చట్టం పూర్తిగా అమలు లోకి వచ్చేలోగానే ఎన్నికల్లో కాంగ్రెస్ పతనమైంది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నాయకమ్మన్యులు ప్రధానంగా సంపన్న వర్గాలకే కొమ్ముకాస్తూ, వారి ప్రయో జనాల రక్షణకే బద్ధులైనవారు. అందువల్లనే ఊదర ద్వారా, ఎన్నికలలో దొంగ హామీలతో, అబద్ధాలతో నెట్టుకు రాగలుగుతున్నారు. ప్రతిఘటన ఎదురైన ప్పుడు ప్రజా సమస్యల నుంచి పక్కదారులు తొక్కుతూ, లేదా ఎదురు బొంకులు, బెదిరింపులతో పాలనను నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తు న్నారు. నెల, రెండు నెలల్లోగా స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న భారతీయ మోతు బరుల నల్లధనాన్ని దేశంలోకి రప్పిస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రగ ల్భాలు పలికిందే గాని కాలు ముందుకు కదపలేదు. అవినీతి భారతంలో అన్ని పార్టీలూ ‘తిలాపాపం తలా పిడికెడు’గా పంచుకుని శాశ్వతంగా మిగిలిపోయే మచ్చలే, మచ్చలే!
‘దొందూ దొందే’
తాజా భూసేకరణ ఆర్డినెన్సులు (2014) కూడా దేశానికి అన్నదాతలుగా, దేశ ఆహార భద్రతకు అభయహస్తంగా ఉన్న రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని పంట భూముల్ని విడిచేసి పరిగలు ఏరుకు తిని బతకండని శాసిస్తున్నట్లు ఉన్నాయి! ఎందుకంటే, రైతాంగాన్ని ఇబ్బందుల పాల్జేసేందుకు తలపెట్టిన ఆర్డినెన్సులకు ఒక మేరకు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తెర తీస్తే, బీజేపీ, టీడీపీ పాలకులు మరొక మార్గంలో బలంగా తెర లేపారు! మోదీ ఏ ‘మూడ్’లో ఉన్నాడో గాని లోక్‌సభలో చేసిన తాజా ప్రకటనలో (27.2.2015) ‘‘భూసేకరణ ఆర్డినెన్సు తెచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్‌ను ఎన్నికల్లో తిరస్కరించారన్న సంగతి’’ మరచిపోరాదంటూ ఈ బండసత్యాన్ని స్పష్టం చేశారు. రేపు బీజేపీకి జరగబోయేది కూడా అదేనని మరవరాదు! పైగా ‘‘మీరు (కాంగ్రెస్) చేసిన చట్టం లొసుగులు లేనిది కాదని, మార్పులకు అతీ తం కాదనీ మరవద్దు’’ అంటూ ఓ ‘పాయింటు’ లేవనెత్తానని తృప్తి పడ్డారు!
కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఆర్డినెన్సు కూడా తేలిగ్గా పార్లమెంటులో పాస్ అవ్వలేదని గుర్తు చూస్తూ ఆయన ‘‘ఆ చట్టం మా బీజేపీ మద్దతుతోనే ఆ నాడు పాసయింది’’ అని ఏకరువు పెట్టాడు! అంటే, ‘దొందూ దొందే’నని భావించమని ప్రజల్ని ఆయన కోరుతున్నాడా! ఆ చట్టాన్ని ‘‘మెరుగు పరచడానికే ఇప్పుడు మా ప్రయత్నమంతా’’ అని కూడా చెప్పారు! కాని, ‘మెరుగు’పడేది రియల్ ఎస్టేట్‌దారుల, కాంట్రాక్టర్ల, గుత్త పెట్టుబడిదారులే. అంతేగాని, ‘‘ఆర్చేవా? తీర్చేవా? అడుగునపడితే లేవదీసేవా’’ అని బేల మొగాలతో పంటా, కుంటా పోయి ఒగరుస్తున్న పేద, మధ్య తరగతి రైతులకూ, జీవనాధారమైన కూలీనాలీ కోల్పోయి వలసలకు సిద్ధమవుతున్న వ్యవసాయ కార్మికులకు పాలకులు చెప్పగల సమాధానమేమిటి?’’ తప్పించుకు తిరుగువాడు ధన్యుడ’’న్న సుమతీ శతకకారుడు సహితం తిరిగి సవరించుకోలేని సన్నివేశమిది! ఈ చట్టం అమలులోకి వస్తే (వచ్చేసింది), ‘‘సామాజికంగా ఎలాంటి పరిణామాలు ఉప్పతిల్లవగలవో, ఎదుర్కోవలసి వస్తుందో కూడా’’ అంచనా వేయాలని ఈ చట్టం ‘గుడ్డిలో మెల్ల’గాసూచన మాత్రంగా హెచ్చరించింది. దాన్ని కూడా మోదీ, చంద్రబాబులు పట్టించు కోలేదంటే నిరంకుశ పాలనా ధోరణులకు, ప్రజాస్వామ్య విరుద్ధమైన బ్యురోక్రాటిక్- టెక్నోక్రాటిక్ వ్యవస్థకు మనల్ని అలవాటు చేయాలని వారు ఉవ్విళ్లూరుతున్నారో అర్థమౌతోంది. అందువలన వేయి కళ్లతో కనిపెట్టి ఉండాలి! ప్రజల నిరంతర జాగరూకతే వారి రక్ష రేక!
(వ్యాసకర్త మొబైల్: 9848318414)