మంగళగిరి: రాజధాని భూ సేకరణపై అధికార పార్టీ కొత్త ఎత్తుగడకు తెరలేపింది. రోజువారి కూలీలకు రూ.300 లు ఇచ్చి రైతులమని చెప్పించి టీడీపీ నాయకులు వారితో ధర్నాకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దర్శనమిచ్చింది. కూలీలకు డబ్బిచ్చి వారిని రైతులని నమ్మించే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. అంతే కాకుండా మరో అడుగు ముందుకేసి వారితో ఏకంగా భూ సేకరణకు మేం అనుకూలమే అని చెప్పించారు.
ఈ మేరకు కూలీలతో కలిసి టీడీపీ నాయకులు మంగళగిరిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. కాగా, ధర్నాలో పాల్గొన్న వారిని 'సాక్షి' ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ధర్నాలో పాల్గొంటే రూ. 300 లు ఇస్తారని చెబితే వచ్చామని కొందరు కూలీలు తెలిపారు. మాకు అసలు భూమి ఉంటే కదా భూసేకరణకు ఇవ్వడానికి అని ధర్నాలో పాల్గొన్న ఓ వ్యక్తి అనడం కొసమెరుపు.