ఆకాశానికి నిచ్చెన అమరావతి
నరేంద్రమోదీ ప్రధానిగా మొదటి సంవత్సరం విదేశాలకు వెళ్ళిన సందర్భాలలో ప్రవాస భారతీయుల సభలలో మాట్లాడినప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను అక్రమార్కులంటూ, సూడో సెక్యులరిస్టు లంటూ ఘాటుగా విమర్శించేవారు. ఎవరి సలహా పాటించారో తెలియదు కానీ ఈ ధోరణి ఇప్పుడు కనిపించడం లేదు. కేసీఆర్ తెలంగాణ ప్రజల శక్తియుక్తులను కించబరుస్తూ ఎన్నడూ మాట్లాడలేదు. చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళి వచ్చిన ప్రతిసారీ ఇక్కడ ఉన్నవాళ్ళకి ఏమీ చేతకాదనీ, వారిలో ప్రతిభ శూన్యమనీ, విదేశీ సంస్థల సహకారంతోనే గొప్ప రాజధాని నగర నిర్మాణం సాధ్యమనీ చెబుతూ వచ్చారు. తాజాగా రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ‘మనవాళ్ళతో కూర్చుంటే మురికివాడలే నిర్మించగలం’, మహానగరాలు నిర్మించలేమంటూ తేల్చివేశారు.
తెలుగువారి జీవితాలపై ప్రస్తుతం ప్రభావం వేస్తున్న ముగ్గురు నాయకులూ- ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడూ, చంద్రశేఖర రావూ (కేసీఆర్)-కలల బేహారులే. కష్టభూయిష్టమైన వర్తమానం కంటే అంద మైన భవిష్యత్తును ఊహించుకొని భావిఫలాలు అప్పుడే చేతికి అందివచ్చినట్టు నమ్మకంగా మాట్లాడి అరచేతిలో స్వర్గం చూపించి ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్‌ను నిలుపుతానంటూ మోదీ ప్రకటిస్తే, కరీంనగర్‌ను లండన్ చేస్తానంటూ కేసీఆర్ వాగ్దానం చేస్తారు. అమరావతిని ప్రపంచంలోనే అతి గొప్ప నగరంగా-ఒక సింగపూర్‌గా, ఒక టోక్యోగా, ఒక ఆస్థానాగా-నిర్మిస్తానంటూ చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేస్తారు. ‘సబ్ కే సాథ్, సబ్ కా వికాస్’ నినాదం అమలు జరుగుతోందంటూ మోదీ, బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్ర తథ్యమంటూ కేసీఆర్, చంద్రబాబునాయుడూ ఘంటాపథంగా చెబుతారు.
మోదీని ప్రశ్నించి నవారు దేశద్రోహులు. కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించినవారు తెలంగాణ ద్రోహులు. చంద్రబాబును ఆక్షేపించినవారు అభివృద్ధి నిరోధకులు. ప్రైవేటురంగం, ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంపైన మోదీ కంటే చంద్రబాబు నాయుడికే నమ్మకం ఎక్కువ. స్విస్ చాలెంజ్ సరేసరి. కేసీఆర్‌కు ప్రభుత్వరంగంపైన విశ్వాసం ఇంకా ఉంది. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ భారీప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతారు. ఒకరు కాళేశ్వరం అంటే మరొకరు అమరావతి అంటారు. వేలకోట్లలోనే విహారం. నరేంద్రమోదీ ప్రధానిగా మొదటి సంవత్సరం విదేశాలకు వెళ్ళిన సందర్భాలలో ప్రవాసభారతీయుల సభలలో మాట్లాడిన ప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను అక్రమార్కులంటూ, సూడో సెక్యులరిస్టు లంటూ ఘాటుగా విమర్శించేవారు. ఎవరి సలహా పాటించారో తెలియదు కానీ ఈ ధోరణి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రవాసభారతీయులను ఉత్సాహపరచడంతో సరిపుచ్చుకుంటున్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజల శక్తియుక్తులను కించబరుస్తూ ఎన్నడూ మాట్లాడలేదు. చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళి వచ్చిన ప్రతిసారీ ఇక్కడ ఉన్నవాళ్ళకి ఏమీ చేతకాదనీ, వారిలో ప్రతిభ శూన్యమనీ, విదేశీ సంస్థల సహకారంతోనే గొప్ప రాజధాని నగర నిర్మాణం సాధ్యమనీ చెబుతూ వచ్చారు. తాజాగా రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ‘మనవాళ్ళతో కూర్చుంటే మురికివాడలే నిర్మించగలం’, మహానగరాలు నిర్మించలేమంటూ తేల్చివేశారు. ఈమధ్య ఆయన మాటలలో గందరగోళం కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నది.
సాక్షిమహరాజ్ మాటలు
‘కుటుంబ నియంత్రణను అప్పట్లో నేనే బాగా అమలు చేశాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రజలు ఎక్కువమంది పిల్లల్ని కనాలి. లేకపోతే మన రాష్ట్రం జపాన్‌లాగా యువతీయువకులు లేకుండా పోతుంది’ అంటూ చంద్ర బాబునాయుడు ఆ మధ్య ఉద్బోధించినప్పడు చాలా మంది తప్పు పట్టారు. సంఘ్‌పరివార్ మెప్పు కోసం చంద్రబాబునాయుడు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా కరరెడ్డి ధ్వజమెత్తారు. ఇటువంటి మాటలు సాక్షిమహరాజ్ మాట్లాడినా, చంద్ర బాబునాయుడు మాట్లాడినా దేశానికి అపకారం జరుగుతుందంటూ లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణ్ హెచ్చరించారు. సుధాకర్‌రెడ్డి, జేపీ ముఖ్యమంత్రిని అపార్థం చేసుకున్నట్టున్నారు.
రష్యాలోనూ, కజకిస్థాన్‌లోనూ కలిసినవారికి కూడా ముఖ్యమంత్రిని చూడ గానే హైదరాబాద్ గుర్తుకొచ్చిందట. ఆయనే చెబుతున్నారు. హైదరాబాద్ తానే కట్టానంటూ చంద్రబాబునాయుడు చాలాసార్లు చెప్పారు. కాదంటే ఆయనకు కోపం వస్తుంది కానీ ఈ మహానగరాన్ని నిర్మించింది వాస్తవానికి కులీకుతుబ్‌షా అని చరిత్ర చెబుతోంది. ఏ నగరమైనా క్రమంగా విస్తరిస్తుంది కానీ నిర్మాణ దశలోనే వేల ఎకరాలలో ఉండదని లండన్, చికాగో వంటి నగరాలతో పరి చయం ఉన్నవారు ఎవరైనా చెబుతారు. క్రీస్తు తర్వాత 43వ సంవత్సరంలో రోమన్లు లండన్ నగరాన్ని నిర్మించినప్పుడు దాని విస్తీర్ణం ఒక చదరపు మైలు కంటే తక్కువ. 17వ శతాబ్ది వరకూ అది చిన్న నగరంగానే ఉండేది. ఆ తర్వాత దాని వైశాల్యం క్రమంగా సుమారు 600 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ‘రోమ్ వజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే’ అని సామెత. రోమ్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన నగరం. దాని నిర్మాణం క్రీస్తు పూర్వం 625లో జరిగింది.
రోమ్ నగరాన్ని ఒక్క రోజులోనే కట్టలేదనే అర్థంతో పాటు ఏ ఘనకార్యం కూడా ఒకటి రెండు రోజులలోనో, సంవత్సరాలలోనో పూర్తి కాదని విస్తృతార్థం. ఆగ్రాలో యమునానదీ తీరంలో తాజమహల్ నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. మహారాణి ముంతాజ్‌మహల్ సంస్మరణార్థం షాజహాన్ చక్రవర్తి ఈ కట్టడాన్ని నిర్మించడం 1632లో ప్రారంభిస్తే అది 1654 నాటికి కానీ పూర్తికాలేదు. అమరావతి కూడా నిర్మించిన వెంటనే ప్రపంచ నగరాల సరసన చేరదు. చాలా సమయం పడుతుంది. అయితే, మహానగర నిర్మాణానికి పక్కా ప్రణాళిక కావాలి. పకడ్బందీ వ్యూహం అవసరం. అది ప్రస్తుతం ప్రజల అవసరాలకి సరిపోను ఉండాలి. భావి అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకోవాలి. అంతకు మించి ఆలోచించడం అనవసరం. అమరావతి నగరానికి చంద్రబాబునాయుడు ఊహించుకుంటున్న ‘విజన్’ పూర్తిగా అమలు జరగాలంటే ఒక జన్మ చాలదు.
హైదరాబాద్ నగరాన్ని నిర్మించినప్పుడు మహమ్మద్ కులీకుతుబ్ షా మూసీ నదిలో చేపలు వృద్ధి చెందినట్టే నగరంలో నివాసం ఉండే ప్రజలు వర్ధిల్లాలంటూ దేవుణ్ణి ప్రార్థించాడట. 7,420 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెన్నై నగరానికి ఆరు రెట్లు, సింగపూర్‌కు పది రెట్ల, లండన్‌కు 12 రెట్లు పెద్దదైన మహానగరాన్ని నిర్మించాలని సంకల్పించిన చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర రాజధాని జనాభా కూడా ఇబ్బడిముబ్బడిగా పెరగాలని కోరుకుంటున్నారు. లేకపోతే అంతటి విశాలమైన రాజధాని నగరం వెలవెలపోతుంది. ఒక్క రాజధానిలోనే కాదు.
కొత్త రాష్ట్రంలో మూడు మెగా సిటీలూ, పదకొండు స్మార్ట్ సిటీలూ, జిల్లాకి ఒకటి చొప్పున 13 విమానాశ్రయాలూ, 14 ఓడరేవులూ, 26 ప్రత్యేక ఆర్థిక మండళ్ళూ, స్టీల్ ప్లాంట్, ఐటీ హబ్‌లూ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌లూ, పెట్రోలియం ఇండస్ట్రియల్ రీజియన్, ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్, మిస్సైల్ పార్క్ వగైరా వసతులన్నీ నిర్మించాలన్న ముఖ్యమంత్రి మహాస్వప్నం సాకారమైతే? అన్ని విమానాశ్రయాల నుంచి విమానాలలో ప్రయాణం చేయడానికీ, ఓడరేవుల నుంచి ఎగుమతులు చేసే వస్తువులను ఉత్పత్తి చేయడానికీ, ఇతర అసాధారణ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడానికీ జనాభా విపరీతంగా పెరిగి తీరాలి. అందుకే ముఖ్యమంత్రి పిల్లల్ని ఎడాపెడా కనాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసి ఉంటారు. శక్తికిమించి పిల్లల్ని కన్నవారు ఏమైపోయినా సరే. ఒక గొప్ప రాజ దాని నిర్మించిన ఖ్యాతి తనకు రావాలి. చరిత్రలో తాను చిరస్థాయిగా నిలిచి పోవాలి. ఉత్తరోత్తరా ప్రజల నెత్తిన భారంపడినా ఆయనకి అభ్యంతరం లేదు.
విస్మయం కలిగించే వైఖరి
చంద్రబాబునాయుడి ఆలోచనా ధోరణిని చాలాకాలంగా గమనిస్తున్నవారికి సైతం రెండు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న పనులూ, చెబుతున్న మాటలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. 1995 నుంచి 2004 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడిలో ఉన్న సహనం, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇప్పుడు కనిపిం చడం లేదని ఆయన తరానికి చెందిన రాజకీయ నాయకులూ, జర్నలిస్టులూ, రాజకీయ పరిశీలకులూ అంటున్నారు. వీరిలో అత్యధికులు ఆయనను ఇదివరకు అభిమానించినవారే. అమరావతి నిర్మాణంకోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయా ణాలూ, ప్రతి విదేశీయానం అనంతరం ఆయన ప్రకటిస్తున్న నిర్ణయాలూ విస్మ యం కలిగిస్తున్నాయి.
రాజధాని నగరం కోసం ఇంతవరకూ సేకరించిన వేల ఎకరాల భూమి చాలదంటూ బందరు ఓడ రేవుకోసం, పరిశ్రమలకోసం, విద్యా సంస్థల కోసం మరి లక్ష ఎకరాలకు పైగా భూములను సేకరించాలని లక్ష్యంగా మంత్రివర్గం నిర్ణయించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కొత్త రాష్ట్రంలో ఇతర సమస్యలు ఏమీ లేనట్టూ, తీర్చవలసిన ప్రజల అవసరాలు ఏమీ లేనట్టూ ఒక్క రాజధాని కోసమే దేశాలు పట్టుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రిని ఎట్లా చూడాలి? అద్భుతమైన రాజధాని నిర్మించేందుకు తాను అహరహం తపిస్తూ శ్రమిస్తుంటే బాధ్యతారహితంగా విమర్శించడం ఏమిటంటూ ఆయన మీడి యాపైన ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ తర్వాత ఎక్కువసార్లు విదేశీయానం చేస్తున్న రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడే. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ సైతం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దేశానికి వెళ్ళి వస్తున్నారు. ఆస్థానాను సందర్శించమని మోదీనే చంద్రబాబునాయుడికి చెప్పారట. అమరావతి నిర్మా ణంకోసం తనను నిధులు అడగనంతవరకూ, ప్రత్యేక హోదాపైన పట్టుపట్టనం తవరకూ చంద్రబాబునాయుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశాధినేతలను అమరా వతికి అహ్వానించినా, పెట్టుబడులు పెట్టమంటూ ఎన్ని దేశాలకు చెందిన పారి శ్రామికవేత్తలకూ, వాణిజ్యవేత్తలకూ విజ్ఞప్తి చేసినా మోదీకి వీసమెత్తయినా అభ్యంతరం లేదు. గూగుల్‌లోకి వెడితే ప్రపంచంలో ఉన్న మహానగరాలన్నిటినీ చూడవచ్చు.
కానీ స్వయంగా చూసిన అనుభూతి రాదు కదా అని చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఇందులోని అంతరార్థం అర్థంచేసుకోలేని మీడియా ప్రతినిధులు మిడిమిడి జ్ఞానంతో తెలివితక్కువ రాతలు రాస్తున్నారని ఆయన చిరాకు.
తొమ్మిది సంవత్సాల పాటు 23 జిల్లాలున్న అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఈవోగా ఏలిన నేతకు పదమూడు జిల్లాల అర్ధరాజ్యాన్ని పరిపాలించాలంటే చిన్నతనంగా ఉండటం సహజం. అందుకే ఆయన చిన్న రాష్ట్రమైనా పెద్ద పనులు చేయాలనీ, ప్రజలకు ఎంతవరకూ అవసరమో అని ఆలోచించకుండా తన విజన్‌కూ, ఇగో స్థాయికీ తగినట్టు అమరావతిని అపూర్వమైన నగరంగా నిర్మించి తీరాలనీ, ఈ మహాక్రతువుకు అడ్డువచ్చిన రైతులనైనా, ప్రతిపక్షాలనైనా, హక్కుల కార్యకర్తలనైనా ఉపేక్షించకుండా పక్కకు నెట్టివేసి దృఢచిత్తంతో ముందుకు సాగిపోవాలనీ తలపోస్తున్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఖాతరు చేయకుండా కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్య సారవంతమైన భూము లలో అమరావతిని నిర్మించాలని సంకల్పించినప్పుడే ఇతర జిల్లాలకు అనేక వాగ్దానాలు చేశారు. కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థలు మినహా తక్కిన వాగ్దానాలు అమలు కావడానికి ఇంకా సమయం పడుతుంది.
దృష్టి మొత్తం అమరావతిపైనే కేంద్రీకరిస్తున్నారనీ, పెట్టుబడులను ఎక్కువగా అక్కడికే తర లించే ప్రయత్నం చేస్తున్నారనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. అవిభక్త రాష్ట్రంలో పాలకులు హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసి తక్కిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన తీరుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిపైనే మోజు చూపిస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ప్రగతి ఫలాలు తమ దాకా రావేమోనన్న భయసందేహాలు వ్యక్తం అవుతు న్నాయి. అసమ్మతినీ, అసంతృప్తినీ పట్టించుకునేందుకు నిరాకరిస్తే పాలకులతో పాటు ప్రజలూ నష్టపోతారు.
- కె.రామచంద్రమూర్తి
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్