మహాకవి జాషువా చిరంజీవి
స్మరణ
అన్ని రాకపోకలు ఆగిపోయినప్పటికీ, వందకుపైగా జాషువా పాటలు పాడే బృందాలు వచ్చాయి. సత్యహరిశ్చంద్ర నాటకంలో ‘ఇచ్చోటనే...’ వంటి కాటిసీను పద్యాలు అన్ని వందలమంది పాడుతుంటే ఆశ్చర్యపోవడం మా వంతయింది.
జాషువా ఒక యుగకవి. జాతీయోద్యమ కాలంలో అనేక వైవిధ్యపూరితమైన వస్తువులను తీసుకుని పద్యాల్లో రాసి మెప్పించిన కవి. శ్రీశ్రీ మొదలుకొని కరుణశ్రీ దాకా ఎందరో వీరి వస్తువును, శైలిని స్వీకరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
వేమనవలె పద్యాలను తేట తెలుగులో రాసిన జాషువా తన ఆత్మకథను కూడా ‘నా కథ’ పేరుతో పద్యాల్లోనే రాశారు. శాసనమండలి సభ్యులుగా గౌరవించబడ్డారు. జాషువా గబ్బిలం కావ్యాన్ని ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఇంగ్లీషులోకి అనువదించారు.
సాహిత్య చరిత్రలో అనేక మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. శ్రీశ్రీ, విశ్వనాథల మధ్య చర్చ జరిపి జాషువాను దశాబ్దాల తరబడి వదిలివేశారు. దళిత ఉద్యమంతోపాటు ‘దరకమే’ ఐక్యవేదిక ఈ సాహిత్య చరిత్రలో జాషువాను మళ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఆ క్రమంలో ‘గబ్బిలం’ పేరుతో మేము దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక తరఫున మాసపత్రిక వెలువరించాము. అలా రాష్ట్రవ్యాప్తంగా జాషువాను ప్రచారం చేసిన తరువాతే వామపక్ష, స్త్రీవాద, అభ్యుదయవాద తదితర బృందాలు గుర్తించి ఏటా జాషువా జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నాయి.
1993లో గుంటూరు జిల్లా వినుకొండలో మాన్యశ్రీ కాన్షీరామ్ నిర్వహణలో జాషువా మేళా జరిగింది. ఎండ్లూరు సుధాకర్, నేను, నారగోని, మాష్టార్జీ మొదలైనవారు దాన్ని నిర్వహించడం జరిగింది. ఆగస్టులో నిర్వహించిన ఆ మేళాకు ఒకటి రెండు రోజుల ముందు భారీ వర్షాలలో ఎక్కడి రోడ్లు అక్కడ తెగిపోయాయి. అన్ని రాకపోకలు ఆగిపోయినప్పటికీ, వందకుపైగా జాషువా పాటలు పాడే బృందాలు వచ్చాయి. సత్యహరిశ్చంద్ర నాటకంలో ‘ఇచ్చోటనే...’ వంటి కాటిసీను పద్యాలు అన్ని వందలమంది పాడుతుంటే ఆశ్చర్యపోవడం మా వంతయింది. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయె, కవియు మరణించె ఒక తార గగనమెక్కె, రాజు నివసించు రాతి విగ్రహముల యందు, కవి నివసించె ప్రజల నాలుకయందు’ అని కవిని గురించి గొప్పగా వర్ణించిన సుకవి జాషువా.
‘వృద్ధవీరుడ, నీవయసెంత చెపుమ, తండ్రి మరణించియే నాల్గు తరములయ్యె...’ అంటూ భారతంలోని భీష్ముణ్ణి ఆయన ప్రశ్నించిన తీరు సాటిలేనిది. భవభూతి ‘ఉత్తర రామచరిత’, కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఒరవడిలో ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’, ‘క్రీస్తు చరిత్ర’ వంటి కావ్యాలలోని జాషువా కరుణరస శిల్పం గుండెను కదిలిస్తుంది.
ఒక్కొక పద్దియంబునకు ఒక్కొక నెత్తురుబొట్టు ప్రకారం పద్యవిద్యను పండించిన జాషువా తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు చిరంజీవి.
బి.ఎస్.రాములు, ఫోన్: 8331966987.