కీలుబొమ్మలు రచయిత శతజయంతి సంచిక
స్మరణ
తెలుగులో వెలువడ్డ ఆరు ఉత్తమ నవలల్లో డాక్టర్ జి.వి.కృష్ణారావు ‘కీలుబొమ్మలు’ ఒకటి అనేవారట ఆచంట జానకిరామ్. కీలుబొమ్మలుతో పాటు పాపికొండలు, జఘన సుందరి, రాగరేఖలు నవలలూ రాశారు జి.వి.కె. (గవిని వెంకట కృష్ణారావు). ఆదర్శ శిఖరాలు, ప్రతిమ, బొమ్మ ఏడ్చింది వంటి నాటికలు, పద్యాలు, కథలు, విమర్శ వ్యాసాలు రాయడమే కాదు, ప్లేటో ‘రిపబ్లిక్’ను ‘ఆదర్శ రాజ్యం’ పేరిట తెలుగులోకి అనువదించారు. ఇమాన్యుయల్ కాంట్‌ను తెలుగులోకి తెచ్చారు. జీవీకే సాహిత్య సర్వస్వం ఏడు సంపుటాలుగా వెలువడింది! అలాంటి సాహిత్యకారుడి శతజయంతి(1914–2014) నివాళిగా వారి కుటుంబ సభ్యులు వెలువరించిన సంస్మరణ సంచిక ఇది.
ఇందులో, జీవీకే జీవిత విశేషాలు, ఆయన వ్యక్తిత్వం, మూర్తిమత్వంను పట్టించే ఎందరో ప్రముఖుల వ్యాసాలున్నాయి. ‘అటు అరిస్టాటిల్ కావ్యానుశాసనం, ప్లేటో రామణీయకత నుంచి కాంట్ పరతత్వవాదం వరకు, ఇటు భరతుని నాట్యశాస్త్రంతో మొదలు పెట్టి భామహ, ఉద్భట, భట్ట నాయక, భట్టు లోల్లట, ఆనందవర్ధన, ఇందు రాజ, అభినవగుప్త, క్షేమేంద్ర, మహిమ భట్ట, ముమ్మటుల దాకా భారతీయ రస సిద్ధాంతాలను ఔపోసన పట్టారు (జీవీకే)’ అంటారు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తెలుగు నవలాలోకంలో ‘సజ్జల్ సజ్జల్’ అని హేళన అయిన పాత్రగా నమోదైన జీవీకే అధ్యయనశీలతను చాటేలా!
డాక్టర్ జి.వి.కె. శత జయంతి సంచిక; ప్రధాన సంపాదకులు: కీ.శే. డాక్టర్ వెలగా వెంకటప్పయ్య; పేజీలు: 400(హార్డు బౌండు); వెల: 500; ప్రతులకు: వెలగా మానవేంద్ర, 4–22–27, వెలగా వెంకటప్పయ్య వీధి, ఐతానగరం, తెనాలి; ఫోన్: 08644–238335