కేరళలో ‘కంపెనీ’ రాజ్యం! | mahesh vijapurkar writes about kilambalam village of kerala | Sakshi
Sakshi News home page

కేరళలో ‘కంపెనీ’ రాజ్యం!

Published Mon, Nov 16 2015 9:25 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

కిళంబాలం గ్రామపంచాయతీ

కిళంబాలం గ్రామపంచాయతీ

అత్యున్నత ప్రగతి సూచికలను సాధించిన కేరళలో సైతం అభివృద్ధిపరంగా నేటికీ వెనుకబాటుతనం కొనసాగుతోంది..

సందర్భం
 
అత్యున్నత ప్రగతి సూచికలను సాధించిన కేరళలో సైతం అభివృద్ధిపరంగా నేటికీ వెనుకబాటుతనం కొనసాగుతోంది.  మరింత మెరుగైన పార్టీని లేదా కంపెనీని ప్రత్యామ్నాయంగా కిళంబాలం గ్రామం ఎంచుకోవడం దీని ప్రతిఫలనమే.
 
నరేంద్రమోదీ పరాజయాన్ని మినహాయిస్తే, బిహార్ ఎన్ని కల ఫలితాలు మరో లక్షణాన్ని కనబర్చాయి. అభివృద్ధికి సంకే తంగా ప్రజలు పిలుచుకునే నితీశ్‌కుమార్ కులతత్వ లాలూప్రసాద్ యాదవ్ పార్టీ కంటే తక్కువ స్థానాలు గెల్చుకున్నారు. పైగా మోసానికి ఫలితంగా లాలూ దోషిగా తీర్పుకు గురై, తన ఓటు హక్కును, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కూడా కోల్పోయినప్పటికీ తనకే అధిక స్థానాలు వచ్చాయి. ఈ దఫా గెలిచిన శాసన సభ్యులలో సగంమందిపై నేరారోపణలు ఉన్నాయి.

అదే సమయంలో, కేరళలో ఒక వినూత్న పరిణామం నెలకొంది. వెయ్యికోట్ల విలువైన కార్పొరేట్ కంపెనీ అన్నా-కిటెక్స్ (దుస్తుల తయారీ, ఎగుమతి సంస్థ) కిళక్కంబాళం గ్రామ పంచాయతిని తన అధీనంలోకి తెచ్చుకుంది. దీని ఆధ్వర్యంలోని ట్వంటీ20 ట్రస్టు ఈ గ్రామ పంచాయతీకి చెందిన అన్ని స్థానాలకు అభ్యర్థులను స్పాన్సర్ చేసింది. దాదాపు అన్ని స్థానాల్లో వీరే గెలిచారు. తర్వాత కంపెనీ ఏంచేసిందంటే ఈ గ్రామ పాలనా వ్యవస్థను రాజకీయంగా నియంత్రిస్తూ, తాత్కాలికంగా మాత్రమే అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది పనిచేసేలా అడ్డంకులు సృష్టించింది.

ఈ కంపెనీ గ్రామానికి సంబంధించిన నీటి వనరులను కలుషితం చేస్తోందని ఇదివరకటి గ్రామ పంచాయతీ ఆరోపించింది. ఈ వ్యవ హారం ఇప్పుడు న్యాయస్థానం పరిశీలనలో ఉంది. దీని ఫలితంగా కంపెనీ ఓటర్లను ప్రభావితం చేసి తనకు ఎదురు నిలుస్తున్న వారిని స్వాధీనపర్చుకుంది. ఇదంతా ఒకమేరకు చట్టబద్దంగానే జరిగినట్లు పైకి కనబడుతుంది. ఎంతమందికి, ఎంత మొత్తాన్ని పంచిపెట్టారన్నది ప్రపంచానికి ఏమాత్రం తెలియని వ్వకుండా ఇండియాలోని కార్పొరేట్ కంపెనీలు, వాణిజ్య సంస్థలు మన రాజకీయ నేతలకు, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తుంటాయి. మీకు ఆశ్రీత పెట్టుబడిదారీ విధానం అంటే తెలిసే ఉంటుంది.

ఒక గ్రామ పంచాయతీనే తన అధీనంలోకి తెచ్చుకోవడానికి కంపెనీ రెండేళ్లపాటు బహిరం గంగానే సమాయత్తమైంది. గ్రామంలో రహదారుల నిర్మాణానికి, నీటి సరఫరా కల్పనకు, ప్రత్యక్షంగా ఆరోగ్య సేవలందించడానికి, విద్యాపరమైన తోడ్పాటుకు కంపెనీ రెండేళ్లలో 28 కోట్ల రూపాయలు వెచ్చించింది. మీడియా వార్తల ప్రకారం, ఈ గ్రామ పంచాయతీ నాలుగేళ్లలో 22 కోట్లు ఖర్చుపెట్టింది. కంపెనీ తన ట్రస్టు అయిన ట్వంటీ20 ద్వారా గ్రామ పంచాయితీకి అందించిన సేవలకు ఏమాత్రం తగ్గకుండా ఇదివరకటి పంచాయతీలు కూడా తమకు ప్రయోజనాలు కలిగించాయన్న విషయాన్ని ఓటర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టీఐఎస్‌ఎస్) సంస్థ కేంద్ర ప్రభుత్వం కోసం నిర్వహించిన అధ్యయనం ప్రకారం అభివృద్ధి వైపుగా పథకాలు రచించి, అమలు చేసి, పర్యవేక్షించడం వైపుగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కేరళలోనే ఇలా జరగటం గమనార్హం. పైగా కేరళ పరిశ్రమలకు ఎర్రతివాచీ పరచని రాష్ట్రమని అందరికీ తెలుసు. ఇక్కడనుంచి ఎగుమతి అవుతున్న మానవ పెట్టుబడి ద్వారా (వలస కార్మికులు) దేశంలోకి రూపాయలు, దీరామ్‌లు, రియాల్స్‌తోపాటు డాలర్ల రూపంలో కూడా వస్తున్న విదేశీ మారక ద్రవ్యమే కేరళ ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటోంది.

రాజకీయనేతలకు తువ్వాలు పరిచి వారి నుంచి ప్రయోజనాలను కొనుక్కోవడానికి బదులుగా ఈ కంపెనీ తన హక్కుల కోసం లేచి నిలబడింది. అన్యా యంగా ఉంటోందని అది భావిస్తున్న రాజకీయ వ్యవస్థను అది ఎండగట్టదల్చుకుంది. కేరళలోని ప్రతి రాజకీయ పార్టీకి చెందిన స్థానిక నేతలు కిటెక్స్ ఎంటర్ ప్రైజెస్ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి అనుకూలంగా వ్యవహరించారు.

అలాగే ఉత్తర ప్రదేశ్‌లోని మరో గ్రామం కథ చూద్దాం. ఈ గ్రామంలో వాస్తవాధికారం గ్రామ వైద్యుడి చేతిలో ఉంటుంది. ఆయనది చట్ట వ్యతిరేక అధికారం. వెనుకబడిన కులానికి చెందిన తన సేవకు డిని ఆయన గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని చేశాడు. స్థానిక విద్యా బోర్డు ఎన్నికలను మోసపూరితంగా నిర్వహించారు. దీని ద్వారా వచ్చే ప్రయోజనాలను మాత్రం తన కుమారుడికి, మనవడికి సమానంగా పంచిపెట్టారు. ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం అంటే ఇదే. రాజకీయనేతలు ఏం చేస్తునారన్నది ప్రజలు పట్టించుకోరు. రెండు దశాబ్దాల క్రితం ఈ ఉదంతం దూరదర్శన్ టీవీలో హిందీ సీరియ ల్‌గా వచ్చింది.

రాజకీయ పార్టీలు, నేతలు మన ప్రగతికి నిజమైన ఉపకరణాలని, ప్రతి విషయంలోనూ వారి పాత్ర ప్రధానంగా ఉంటుందని ఇండియాలో మనం నమ్ము తుంటాం. తేడా అల్లా ఏమిటంటే ఓటర్లు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తుంటారు. తర్వాత అన్ని కాంట్రాక్టులూ రాజకీయ నేతలకు, వారి కుటుంబాలకు మాత్రమే దక్కుతుంటాయి.

కేరళలోని కిళంబాలం గ్రామ పంచాయతీ తనకు సహాయకారిగా లేదని భావించినందువల్లే కిటెక్స్ ఎంటర్‌ప్రైజెస్ ఆ పంచాయతీని రద్దు చేసి కొత్త అధికారిక వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించు కుంది. ఇక్కడే దాని ప్రయోజనం దాగి ఉంది. తనకు అనుకూలంగా ఉండే పాలనా వ్యవస్థను కలిగి ఉంటే పోలా అని అది భావించింది. ఇప్పుడు కంపెనీకి కావలసిన అవసరాలన్నీ దాని అధీనంలోని గ్రామ పంచాయతీ ఎజెండాలో ఉన్నాయి. రెండేళ్లపాటు కంపెనీ ట్రస్టు చేసిన సహాయ కార్యక్రమాల కారణం గా రాజకీయ దొరలు, యజమానుల కంటే ఈ కంపెనీయే మంచిదని భావించి గ్రామస్తులు దానికి ఓటేశారు. కాని ఇది సరైందేనా?

నిస్సందేహంగా ఇది ప్రగతికోసం ప్రజల ఆకాంక్షకు మరోరకం వ్యక్తీకరణే. ప్రజలకు ఉపయో గపడే పనులను చేపట్టటానికి బదులుగా భావజా లపరమైన విభజనపైనే మరింత దృష్టి పెడుతున్న రాజకీయ పక్షాల వైఖరికి ఇది చెంపపెట్టు లాంటిది. సామాజిక పరంగా అత్యున్నత ప్రగతి సూచికలను సాధించిన కేరళలో సైతం అభివృద్ధిపరంగా నేటికీ వెనుకబాటుతనం కొనసాగుతోంది. మరింత మెరు గైన పార్టీని లేదా కంపెనీని ప్రత్యామ్నాయంగా కిళం బాలం గ్రామం ఎంచుకోవడం దీని ప్రతిఫలనమే. ప్రధానంగా వామపక్ష రాష్ట్రంగా ఉండే కేరళ జనాభా లో కొద్ది భాగం ఇప్పుడు పెట్టుబడిదారులవైపు తిరుగుతూ దారితప్పుతూండటం విశేషం.
 
 -మహేష్ విజాపుర్కార్
 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement