రాజధర్మం తప్పుతూనే ఉంటారా? | mlc c. ramachandraiah article on Religious intolerance | Sakshi
Sakshi News home page

రాజధర్మం తప్పుతూనే ఉంటారా?

Published Wed, Nov 4 2015 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

రాజధర్మం తప్పుతూనే ఉంటారా?

రాజధర్మం తప్పుతూనే ఉంటారా?

చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. బీజేపీ వంటి పార్టీలు అధికా రంలో ఉంటే చరిత్ర మరింత వేగంగా పునరావృతం అవుతుంది. గుజరాత్ లోని గోధ్రాలో 2002లో జరిగిన మత ఘర్షణల్లో ముస్లిం మైనారిటీలు ఊచ కోతకు గురైనప్పుడు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తమ పార్టీకే చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని ‘రాజధర్మం పాటించు’ అని సూచించారు. ‘జరిగిన దారుణానికి నీ ఉదాసీనతే కారణం సుమా!’ అని అటల్‌జీ మోదీని పరోక్షంగా హెచ్చరించారన్నది నిష్ఠుర సత్యం. ఇప్పుడు నరేంద్రమోదీ... భారతదేశ ప్రధాని. ఆయన ‘రాజధర్మం’ తప్పుతున్నా హెచ్చరించేందుకు బీజేపీలో ‘అటల్ బిహారీ వాజ్‌పేయి’ వంటి రాజనీతిజ్ఞులు కనిపించడం లేదు. పైగా, మోదీయే ప్రతిపక్షాల అసహనానికి బలిపశువు అవుతున్నారంటూ... వింతవాదన లేవనెత్తే వెంకయ్యనాయుడు వంటి మాట కారి నాయకులు ప్రధాని మోదీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ క్రమంలో ప్రతిపక్షాలను, రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను సైతం విమర్శిస్తు న్నారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం గొప్పదనాన్ని, లౌకిక పునాదులపై నిర్మితమైన ప్రజాస్వామికవ్యవస్థ విలక్షణతను గుర్తుచేసే విధంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చేస్తే... వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేని సంఘ్ పరివార్ మేధావులు ఆయనకూ రాజ కీయాలు ఆపాదిస్తున్నారు.
 మతపర అసహనంపై ఆత్మావలోకనం ఏది?
 దేశంలో స్పష్టంగా కనిపిస్తున్న మతపర అసహనం హఠాత్తుగా ఎక్కడనుంచో ఊడిపడలేదు. బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సాధ్వీలు, సాధువులు వివిధ సందర్భాల్లో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే మొదలైంది. సామాజిక వేత్తలు దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యలు, అక్కడక్కడ రచయితల ముఖాలకు నల్లరంగు పూసిన సంఘటనలూ సమాజంలో భయాందోళనలు, అభద్రతాభావం పెంచాయి. ఈ పరిణామాల పట్ల కలత చెందిన ప్రముఖ రచయితలు, మేధావులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు... చివరకు వ్యాపార దిగ్గ జాలు సైతం పాలకపక్షం అనుసరిస్తున్న ‘మతపర అసహనం’ పట్ల నిరసన, ఆవేదన వ్యక్తం చేస్తుంటే జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామనే మాట బీజేపీ నేతల నుంచి రావడంలేదు. వారిలో ఆత్మావలోకనం ఏ కోశానా కనపడటం లేదు. ‘మతపర అసహనం’పై మాట్లాడే హక్కు అసలు కాంగ్రెస్ పార్టీకి లేదంటూ బీజేపీ అగ్రనేత ముప్పవరపు వెంకయ్యనాయుడు విమర్శిస్తున్నారు, జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి స్పందించే నైతిక హక్కు లేదని కాసేపు అనుకొందాం. కాని, జరుగుతున్న దారుణాలపై ప్రధానమంత్రిగా మోదీ స్పందించాలి కదా? ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగిన వెంటనే... ప్రధాన మంత్రి ట్వీట్ క్షణాల్లో వచ్చేస్తుంది. అభినందనలు, ఖండనలు, విమర్శలు... ఒకటనే మిటి? సర్వం... మోదీ ట్వీట్‌ల పరంపరలు నిరంతరం వెలువడతాయని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ... దేశంలో దారుణ సంఘటనలు జరుగు తుంటే... ట్వీట్ చేయ డానికి కూడా ఆయనకు సమయం లేదు. తన పార్టీ సహచరులు చేస్తున్న విషపూరిత వ్యాఖ్యలు ఆయనకు వినిపించవు. రచ యితల ముఖాలకు నల్లరంగు పూస్తున్న వికృత సంఘటనలు ఆయన దృష్టికి సోకడం లేదు.
కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే... ప్రస్తుతం దేశంలో నెలకొన్న మతపర అసహన వాతావరణం ఎవరి వల్ల ఏర్పడిందో తెలుస్తుంది. ‘‘మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ముస్లిం అయినప్పటికీ గొప్ప జాతీయవాది’’ అంటూ కేంద్ర మంత్రి రమేష్‌శర్మ చేసిన వ్యాఖ్య దేశంలో కలకలం సృష్టించింది. ఒక గొప్ప వ్యక్తిని దారుణంగా కించపర్చే వ్యాఖ్య అది. మరోవైపున ‘‘భారతదేశంలో ముస్లింలు జీవించాలంటే వారు గోమాంసం తినడం మానేయాలి’’ అని హరియాణా రాష్ట్ర బీజేపీ ముఖ్య మంత్రి మనోహర్ ఖట్టర్ వ్యాఖ్యానించారు.
 ఏం తినాలో ఎవరు నిర్ణయించాలి!
బీజేపీ నేతల భావజాల వైరుధ్యానికి ఓ చిన్న ఉదాహరణ. బిహార్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న నరేంద్రమోదీ, అమిత్‌షాలు తమ ప్రసంగాల్లో ‘స్వేచ్ఛ’ అనే పదాన్ని తరచుగా ఉపయోగించారు. ఎక్కడికెళ్లినా వారు ‘‘నితీష్, లాలూల మాయలో పడకండి... స్వేచ్ఛగా ఓటేయండి’’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ‘స్వేచ్ఛ’ను గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు మిగతా సమయాల్లో మాత్రం- ‘‘ప్రజలు ఏమి తినాలి? ఏమి కట్టుకోవాలి? ఏమి రాయాలో, ఎంత మంది పిల్లల్ని కనాలో’’ నిర్దేశిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. గోమాంసం తినేవారు అసలు హిందువులే కారంటూ హిందూ మతానికి నూతన భాష్యాలు చెప్పుకొస్తున్నారు. ‘బీఫ్’ తింటే తప్పులేదని చెప్పేవారు అసలు హిందువులే కారంటున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు స్వర్గీయ స్వామి రంగధానంద మాటలు గుర్తుతెచ్చుకోవాలి. ఆయన ఒక సందర్భంలో ‘ఎవరు హిందువు?’ అనే అంశంపై ఏమన్నారంటే ‘‘మీరు పుట్టుకతోనే హిందువు అయిపోరు. హిందువు కావాలంటే హిందూమతం ధర్మాల్ని ఆచరించాలి. హిందూమతం... సహనాన్ని బోధిస్తుంది. ఇతరుల పట్ల ప్రేమానురాగాల్ని చూపమంటుంది. ఇటువంటి విలువల్ని పాటిస్తేనే మిమ్మల్ని మీరు హిందు వుగా చెప్పుకోగలరు’’ అంటూ స్వామి రంగధానంద హిందూమతంలోని ఔన్నత్యాన్ని చెప్పారు. కాని... ఇప్పుడు బీజేపీలోని కొందరు హిందూమతం ఔన్నత్యాన్ని దెబ్బతీస్తూ... మరోపక్క తాము హిందూమత పరిరక్షకులుగా చిత్రీకరించుకొనే యత్నం చేస్తున్నారు.

ఎన్డీయే పాలనలో కనిపిస్తున్న విద్వేషపూరిత వాతావరణం పట్ల కవులు, రచయితలు, కళాకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తుంటే... ‘పరిస్థితి తీవ్రత’ను అర్థం చేసుకోకుండా వారందర్నీ కాంగ్రెస్ పార్టీ అనుకూల శక్తు లుగా, బీజేపీ వ్యతిరేక మూకలుగా పేర్కొంటున్నారు. ప్రముఖ రచయిత్రి నయనతార సెహగాల్ గొప్ప రచయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు విజేత. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు మేనకోడలు. కన్నడ రచయిత కల్బుర్గీ హత్య తర్వాత... నయనతార తన నిరసన వ్యక్తం చేస్తూ... తాను పొందిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగిచ్చేస్తున్నానంటూ ప్రకటించగానే ఆమెను కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలంటూ బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. అయితే నయనతార సెహగాల్... ఎమర్జెన్సీని గట్టిగా వ్యతిరేకించి... శ్రీమతి ఇందిరా గాంధీని తీవ్రంగా విమర్శించిన విషయం బహుశా చాలామంది బీజేపీ నేతలకు తెలిసి ఉండకపోవచ్చు.
 నిరసన గళాల్లో రాజకీయ ఉద్దేశాలా?
ఎన్డీయే పాలనపై మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు తెలియజేస్తున్న నిరసనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ‘‘తయారు చేయబడిన తిరుగు బాటు (మాన్యుఫాక్చర్డ్ రెబెల్లియన్)’’గా కొట్టిపారేస్తున్నారు. తిరుగుబాటు ఏ రూపంలో వ్యక్తం అయినా అది సహజసిద్ధంగా రావాల్సిందే తప్ప... తయారు చేస్తే నిలబడేది కాదని.. అరుణ్‌జైట్లీ వంటి మేధావికి తెలియదా? దేశంలో నెలకొన్న ఈ కలుషిత వాతావరణం ఆర్థిక రంగానికి చేటు కలిగి స్తుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ చేసిన హెచ్చరికల వెనుక ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, రాహుల్ బజాజ్, హర్ష గోయెంకా వంటి పారిశ్రామికవేత్తలు... దేశ ఆర్థిక రంగానికి ప్రస్తుతం నెలకొని ఉన్న పరిణామాలు చేటు కలిగిస్తాయంటూ ఆందోళన వ్యక్తపర్చడం స్వతహాగా చేసినవా? లేక వారి వెనుక ఎవరైనా ఉన్నారని అనుమానించ గలమా? చివరకు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ రాజన్ సైతం... దేశం అభివృద్ధి పథంలోకి దూసుకొని వెళ్లాలంటే సామరస్య వాతావరణం అవసరం అని స్పష్టం చేశారు. పైనుంచి కిందిస్థాయి వరకు బీజేపీ నేతల్లో అసహనం గూడుకట్టుకొని పోయింది. ఇచ్చిన హామీలు ఆచర ణలో కనిపించకపోవడంతో వివిధవర్గాల ప్రజల నుండి ఎదురవుతున్న ప్రశ్న లకు సమాధానం చెప్పుకోలేని ఆత్మరక్షణలో బీజేపీ నేతలు పడిపోయారు. అందుకే ఈ అసహనం. తాజాగా విజయవాడలో ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా’పై విద్యార్థి జేఏసీ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్పుడు వారిపై జరిగిన దాష్టీకం దారుణం. బీజేపీ నేతలు సృష్టిస్తున్న ఈ వికృత వాతావరణం తొలగిపోవాలంటే మరిన్ని చైతన్యవంతమైన గళాలు గట్టిగా వినిపించాల్సిందే. నిరసన వివిధ రూపాల్లో తెలియజెప్పాల్సిందే.
 
 -సి. రామచంద్రయ్య
 వ్యాసకర్త ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నేత, ఏపీ శాసనమండలి
 మొబైల్: 81063 15555

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement