
భిల్వారా: రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో గల జహజ్‌పూర్‌లో జల్ఝులానీ ఏకాదశి ఊరేగింపులో రాళ్ల దాడి చోటుచేసుకుంది. కోట నుండి వస్తున్న పీతాంబర్ రాయ్ మహారాజ్ ఊరేగింపుపై ఒక మతపరమైన స్థలం వెలుపల రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, కొందరు యువకులు, బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు. రాళ్లదాడి అనంతరం ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జహజ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ ఘటన నేపధ్యంలో పలు దుకాణాలు మూతపడ్డాయి. పట్టణంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి షాపురా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ కన్వత్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ రాజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఏదైనా పండుగ నిర్వహించే ముందుగా ఇరు వర్గాల సమావేశం నిర్వహించాలని ఎస్‌డిఎం, పరిపాలనాధికారులకు సూచించారు. ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరుపుతున్నామన్నారు. సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment