అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.
అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్‌ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.
శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.
దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.
లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.
రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం
Comments
Please login to add a commentAdd a comment