మోదీకి అగ్నిపరీక్ష | Modi Government Faces Pressure on Land Ordinance as Budget Session | Sakshi
Sakshi News home page

మోదీకి అగ్నిపరీక్ష

Published Wed, Feb 25 2015 12:15 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

Modi Government Faces Pressure on Land Ordinance as Budget Session

భూసేకరణ చట్టం సవరణ బిల్లు  భూకంపం సృష్టించడంలో ఆశ్చర్యం లేదు. వ్యవసాయమే ప్రధాన  జీవనాధారమైన దేశంలో పరిశ్రమల కోసం, వాణిజ్యం కోసం వ్యవసాయ భూములు సేకరించడం అంత సులువు కాదు. భూసేకరణలో న్యాయమైన పరిహారం,  పునరావాసంలో పారదర్శకతకు హామీ ఇచ్చే చట్టం (రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ లాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ యాక్ట్, 2013) పూర్వపక్షం చేస్తూ మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ చట్టంలోని  పదవ సెక్షన్‌ను సవరించడం ద్వారా  రెండు ప్రధాన మైన రక్షణలను తొలగించడం అన్నదాతలలో అశాంతికి దారితీసింది.
 
 ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నెలకొల్పే పరిశ్రమల కోసం, వాణిజ్య సంస్థల కోసం భూములు సేకరించే క్రమంలో డెబ్బయ్ శాతం మంది యజమానులు అంగీకరిస్తేనే భూమిని సేకరించాలన్న నిబంధనను తొలగించారు (ప్రైవేటు సంస్థలు సేకరించాలంటే ఎనభై శాతం మంది యజమానులు ఒప్పుకోవాలి). వాస్తవానికి భూమి సేకరించ డానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే గ్రామసభలు నిర్వహించి వ్యవసాయదారుల ఆమోదం తీసుకోవాలి. పర్యావరణంపైన భూసేకరణ ప్రభావం ఎట్లా ఉంటుందో మదింపు (సోషల్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్) చేసిన తర్వా తనే, పర్యావరణానికి ఏ మాత్రం ప్రమాదం లేనట్టు ధ్రువీకరించుకున్న అనంతరమే వ్యవసాయ భూమి సేకరించాలన్న నిబంధనను సైతం ఆర్డినెన్స్  నీరు గార్చింది.
 
 ఫలితంగా రైతుల ఇష్టానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతంగానైనా భూమి సేకరించవచ్చునంటూ ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానే చట్టం తీసుకురావడానికి బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడం రాజకీయ సంక్షోభానికి దారితీస్తున్నది. యూపీఏ హయాంలో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‌పాల్ చట్టాన్ని తేవాలంటూ ఉద్యమించిన అన్నా హజారే తిరిగి జంతర్‌మంతర్‌లో ప్రత్యక్షమైనారు.. లోగడ యూపీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు బలపరి చాయి.
 
 ఇప్పుడు భూసేకరణ చట్టానికి తూట్లు పొడవడాన్ని విరోధిస్తూ అన్నా చేపట్టిన ఉద్యమానికి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నది. వాస్తవానికి భూసేకరణను కష్టతరం చేస్తూ,  తమ భూములపైన వ్యవసాయదారులకు తిరుగులేని అధికారం ఇస్తూ చట్టం చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రమేయం ఉంది. ఆర్డినెన్స్ స్థానే బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో పార్లమెంటుకు హాజరు కాకుండా ‘సెలవు’పైన రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పటికీ భూసేకరణ చట్టాన్ని నీరు గార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తోంది.
 
 
 అవినీతి వ్యతిరేక పోరాటంలో పట్టణ ప్రాంతాలలోని మధ్యతరగతి యువత ఆవేశపడి అన్నా ఉద్యమాన్ని హృదయ పూర్వకంగా సమర్థించింది. గ్రామీణ ప్రాంతా లకు చెందిన వ్యవసాయదారుల హక్కుల రక్షణ కోసం అదే అన్నా హజారే ఇప్పుడు ఉద్యమం చేసినా, పాదయాత్ర చేసినా మధ్యతరగతి ప్రజలు అంతగా స్పందిస్తారా అన్నది ప్రశ్న.
 
 ఎన్‌డీఏకు లోక్‌సభలో ఆధిక్యం ఉన్నప్పటికీ  రాజ్యసభలో తగినంత బలం లేదు. కనుక లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో సవరణ బిల్లు వీగిపోవడం తథ్యం. ఎగువ సభ, దిగువ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి వివాదాస్పద మైన బిల్లులకు ఆమోదం పొందాలని నరేంద్రమోదీ ప్రభుత్వం తలబోస్తున్నట్టున్నది. అది ఎంతవరకూ సాధ్యమో చూడాలి. భూసేకరణ చట్టం సవరణకు ప్రతికూలత కేవలం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాదు.
 
 స్వపక్షంలోనూ ఈ సవరణలను ప్రతిఘ టిస్తున్న రైతుబాంధవులున్నారు. అన్నాహజారే దీక్షాప్రాంగణలో భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజధాని నిర్మాణంకోసం భూసేకరణ చేయడంలో రైతుల అభీష్టాన్ని తుంగలో తొక్కుతున్న తెలుగుదేశం ప్రభుత్వంపైన మేథాపాట్కర్ నిప్పులు చెరిగారు. 2013నాటి చట్టం రూపకల్పనలో పాత్ర పోషించిన అరుణారాయ్ బిల్లును వ్యతిరేకిస్తు న్నారు.
 
 పార్లమెంటు సంయుక్త సభ నిర్వహించి లేదా ప్రతిపక్షాలను ఒప్పించి సవరణ బిల్లుకు ఆమోదం పొందినప్పటికీ సవరించిన చట్టాన్ని అమలు చేయడం కష్టం. 2013లో భూసేకరణ చట్టం తీసుకురావడంలో రాహుల్ గాంధీకీ, కాంగ్రెస్ పార్టీకీ రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చును కానీ వ్యవసాయ భూములను యథేచ్ఛగా పరిశ్రమలకూ, వ్యాపారాలకూ ధారాదత్తం చేసే రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకవలసిన అవసరం అప్పుడు దేశంలో ఉన్న మాట వాస్తవం.
 
 యూపీఏ సర్కార్ తెచ్చిన చట్టం రైతులకు పూర్తిగా అనుకూలమైనదీ, పరిశ్రమలకు వ్యతిరేకమైనదీ అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం జారీ చేయించిన ఆర్డినెన్స్, దాని స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లు రైతులకు పూర్తిగా వ్యతిరేకమైనదీ, పరిశ్రమలకు అనుకూలమైనదీ. రైతుల ప్రయోజనాలకూ, పారిశ్రామికీకరణకూ మధ్య వైరుధ్యం తలెత్తకుండా పాలకులు జాగ్రత్త వహించాలి. రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సంపద సృష్టించడానికి అవసరమైన సదుపాయాలను పరిశ్రమలకూ, వాణిజ్య సంస్థలకూ కల్పించవలసిన అవసరం ఉన్నది.
 
 రైతు వ్యతిరేక ముద్ర వేయించుకున్న ప్రభుత్వం కానీ పేదల పట్ల సానుభూతి లేదని పేరు తెచ్చుకున్న ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఎక్కువకాలం మనుగడ సాగించలేదు. ఆరేడేళ్ళ కిందట వ్యవసాయ భూము లను పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకోవడంపైన వివాదం చెలరేగిన సమయంలో వామపక్షవాదిగా పేరు తెచ్చుకున్న నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ సైతం మధ్యేమార్గాన్ని సూచించారు. సంపద సృష్టి అవసరమే. వ్యవసాయదారుల ప్రయోజ నాలను కాపాడవలసిందే. ఇందుకోసం పట్టుదలకు పోకుండా సామరస్యంతో వ్యవ హరించి రాజీమార్గం కనుక్కోవాలి. ఆర్థిక సంస్కరణల అమలులో మోదీ సర్కార్ ఎదుర్కొంటున్న మొదటి గడ్డు సమస్య ఇది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement