ఈ సమావేశాల్లోనే జీఎస్టీ
బిల్లుకు ఆమోదం లభిస్తుందని మోదీ ఆశాభావం
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా గురువారం పార్లమెంటు వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అన్ని రాష్ట్రాలు సానుకూలంగా సహకరించినందున జీఎస్టీ బిల్లుకు ఈ సమావేశాల్లో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నాను.
అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపట్ల సానుకూలంగా స్పందించాయి’ అని అన్నారు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయని నమ్ముతున్నాను. పేద ప్రజలకు సంబంధించిన సమస్యలపై దృష్టి కేంద్రీకృతం కానుంది’ అని మోదీ అన్నారు. కేంద్రం తొలుత సెంట్రల్ జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రాలు రాష్ట్ర జీఎస్టీ బిల్లులు ఆయా అసెంబ్లీల్లో ప్రవేశపెడతాయి.