Goods and Services Tax Bill
-
జీఎస్టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో గృహావసర ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనితో ‘పన్నులపరంగా ఉపశమనం లభించి, ఇంటింటా ఆనందం వచి్చందని‘ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడేళ్లయిన సందర్భంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆర్థిక శాఖ ఈ మేరకు పోస్ట్ చేసింది. జీఎస్టీకి పూర్వం అన్ప్యాక్డ్ గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ మొదలైన వాటిపై 2.5–4 శాతం పన్ను ఉండేదని, కొత్త విధానం అమల్లోకి వచ్చాక వాటిపై పన్నులు లేవని పేర్కొంది. అలాగే కాస్మెటిక్స్, రిస్ట్ వాచీలు, శానిటరీ ప్లాస్టిక్ వేర్, ఫరి్నచర్ మొదలైన వాటిపై రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక, 32 అంగుళాల వరకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు మొదలైన వాటిపై 31.3 శాతం పన్నుల భారం ఉండేదని .. కొత్త విధానం అమల్లోకి వచ్చాక ఇవి 18 శాతం శ్లాబ్‌లోకి వచ్చాయని పేర్కొంది. 2023–24లో రూ. 2 కోట్ల వరకు వార్షిక టర్నోవరు ఉన్న ట్యాక్స్‌పేయర్లకు రిటర్నులు దాఖలు చేయడం నుంచి మినహాయింపునివ్వడంతో చిన్న స్థాయి ట్యాక్స్‌పేయర్లకు నిబంధనల భారం తగ్గిందని వివరించింది. 17 రకాల స్థానిక పన్నులు, సెస్సుల స్థానంలో జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత నుంచి నిబంధనలను పాటించడంతో పాటు ట్యాక్స్‌పేయర్ల బేస్ కూడా గణనీయంగా పెరిగినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. 2018లో 1.05 కోట్లుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ల సంఖ్య 2024 ఏప్రిల్ నాటికి 1.46 కోట్లకు చేరినట్లు వివరించారు. -
పన్ను ఎవరు కట్టాలి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
ఈ సమావేశాల్లోనే జీఎస్టీ
బిల్లుకు ఆమోదం లభిస్తుందని మోదీ ఆశాభావం న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా గురువారం పార్లమెంటు వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అన్ని రాష్ట్రాలు సానుకూలంగా సహకరించినందున జీఎస్టీ బిల్లుకు ఈ సమావేశాల్లో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపట్ల సానుకూలంగా స్పందించాయి’ అని అన్నారు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయని నమ్ముతున్నాను. పేద ప్రజలకు సంబంధించిన సమస్యలపై దృష్టి కేంద్రీకృతం కానుంది’ అని మోదీ అన్నారు. కేంద్రం తొలుత సెంట్రల్ జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రాలు రాష్ట్ర జీఎస్టీ బిల్లులు ఆయా అసెంబ్లీల్లో ప్రవేశపెడతాయి.