
ఎం.ఎస్.ధోని రాయని డైరీ
రాత్రి సిద్ధూ కల్లోకి వచ్చాడు. ఒకట్రెండన్నా పంక్చర్లు లేకుండా ఎవరూ సక్సెస్‌ఫుల్‌గా రోడ్డు ప్రయాణం చెయ్యలేరట. ఎంత బాగా చెప్పాడు! బంగ్లాదేశ్ పంక్చర్‌లైతే కొట్టింది. ఫైనల్లో ఆపగలిగిందా? అయినా ఎన్నాళ్లీ షార్ట్ లెగ్స్, స్క్వేర్ లెగ్స్! మంచి రోజు చూసుకుని మొత్తానికే రిటైర్మెంట్ ప్రకటించాలి. దగ్గర్లో జూలై 4 ఉంది. మా పెళ్లి రోజు. అది కాదంటే జూలై 7 ఉంది. నా పుట్టినరోజు. ఈ రెండూ కాదంటే ఫిబ్రవరి 6 ఉంది. పాప ఫస్ట్ బర్త్‌డే. ఏదైనా మంచిరోజే. ఏదీ కాకున్నా మంచిరోజే. ఈ మూడు మంచిరోజుల వరుసలోకి ‘రిటైర్మెంట్ డే’ అనే నాలుగో మంచిరోజు వచ్చి చేరుతుంది. మంచిదే కదా!
కానీ రిటైర్ అయ్యాక ఏం చెయ్యాలి? సచిన్‌ని అడిగి లాభం లేదు. రెస్టారెంట్ అంటాడు. లేదంటే ‘నేనూ, లక్ష్మణ్, గంగూలీ ఉన్నాం కదా, నువ్వుకూడా ఎలాగోలా వచ్చేయ్... అడ్వయిజరీ కమిటీలో కలిసి కూర్చుందాం’ అంటాడు. లక్ష్మణ్ అడ్డుచెప్పకుండా ఉంటాడా? అసలే నా మీద అతడికి పీకలదాకా ఉంది. హైదరాబాద్‌లో సచిన్‌ని, సెహ్వాగ్‌ని, గంభీర్‌ని, జహీర్‌ని లేట్ నైట్ పార్టీకి పిలిచి నన్నొక్కణ్నీ ఇగ్నోర్ చేశాడు. మర్చిపోతానా!
కోహ్లీని అడిగితే? ‘సిద్ధూ దగ్గరగానీ, హర్షా భోగ్లే దగ్గర గానీ కామెంటేటింగ్‌లో ట్రైనింగ్ తీసుకో కెప్టెన్..’ అని సలహా ఇస్తాడేమో! నేను రిటైర్ అయితే మొదట రిలాక్స్ అయ్యేది కోహ్లీనే కావచ్చు. పోనీ, అజర్ భాయ్‌కి ఫోన్ చేస్తేనో! ‘కామెంటేటింగ్ ఎందుకు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయ్’ అంటాడనుకుంటా! ఏం వెళతాం? కాంగ్రెస్సే డిఫెన్స్ ఆడుతుంటే?! ఉదయం నా వైఫ్‌ని అడిగాను. ఏదైనా బ్రిలియంట్ ఐడియా చెప్పమని. ‘రిటైర్ అవడం కన్నా బ్రిలియంట్ ఐడియా ఏముంది మహీ’’ అంది.. పాపనీ, డైపర్‌నీ నా చేతుల్లో పెడుతూ! తనకి క్రికెట్ పడదు. నా వికెట్ పడినా పెద్ద ఫీలవదు. ఇంట్లోనూ అంతే. క్రికెట్ వస్తుంటే చానల్ మార్చేస్తుంది.
‘రిటైర్ అయ్యాక ఏం చెయ్యాలి అని డియర్ నేను అడుగుతోంది’ అన్నాను. వినిపించుకోలేదు. వెళ్లి టీ కప్పుతో వచ్చింది. పాపని తీసుకుంటూ, కప్పు నా చేతిలో పెట్టింది. ‘టీ ఇచ్చావేంటి! పాల్లేవా’ అన్నాను. ‘ఎన్నాళ్లని పాలు తాగుతారు... చూడండి, చంటిది కూడా పాలు మానేసింది’ అని పాపని చంకనేసుకెళ్లింది. తనేం చెప్పేలా లేదు. మా మామగారు టీ తోటల్ని పెంచుతూ రిటైర్ అయ్యారు. నేను రిటైర్ అయ్యాక టీ తోటలు పెంచితే ఎలా ఉంటుంది? బిపాషాని అడగాలి. తనైతే కరెక్టుగా చెబుతుంది. నా వెడ్డింగ్‌ని ప్లాన్ చేసింది తనే కాబట్టి నా రిటైర్మెంట్‌నీ చక్కగా ప్లాన్ చేస్తుంది.
- మాధవ్ శింగరాజు