నాకు నచ్చిన 5 పుస్తకాలు | my 5 Favorite books | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన 5 పుస్తకాలు

Published Mon, Jul 24 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

my 5 Favorite books

కొత్త శీర్షిక
చివరకు మిగిలేది:

ఇష్టమైన రచనల గురించి మాట్లాడేటప్పుడు మొదట పేర్కొనవలసినది బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’. మానసిక సంఘర్షణకూ, మానవయత్న వైఫల్యానికీ, మనిషిలో నిరంతరంగా కొనసాగే అన్వేషణకూ ఈ నవల అద్దంపడుతుంది. దయానిధి, కోమలి, అమృతం వంటి పాత్రలన్నీ గుర్తుంచుకోదగినవే. అమృతం పాత్రను మలచిన తీరు, ఆమెకూ దయానిధికీ మధ్య సంబంధాన్ని నడిపించిన విధానం ఎంతో ఆసక్తికరంగా తోస్తాయి. బుచ్చిబాబు శైలిలో ఉండే గాఢత, కథనంలో భాగంగా ఆయన చేసే వ్యాఖ్యల్లో నిండిన తాత్వికత మొదలైన వాటివల్ల ఈ నవలను ఎన్నిసార్లు చదివినా ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణాన్ని కనుగొన్న అనుభూతి కలుగుతుంది.

చిలకలు వాలిన చెట్టు:
కవిత్వం గురించీ, కవితలో వాడే పదచిత్రాల గురించీ, మొత్తంగా కవి ఏర్పరుచుకోవలసిన దృష్టి గురించీ ఒక నూతనమైన అవగాహన ఏర్పడటానికి దోహదపడిన పుస్తకం ఇస్మాయిల్‌ ‘చిలకలు వాలిన చెట్టు’. నిత్య జీవితంలో జరిగే సంఘటనల్లో కవిత్వాంశను ఎలా చూడాలి, సృష్టిలోని చరాచరాల మీద ఒక దయార్ద్ర దృష్టిని ఎలా అలవరుచుకోవాలి అన్నది ఇందులోని కవితలు చదివి నేర్చుకోవచ్చు. కవిత్వ రచన, అవగాహన గురించి ఇస్మాయిల్‌ రాసిన వ్యాసాలేవీ చదవక పోయినా, ఆయన కవితాత్మను అర్థం చేసుకోవటానికి ఈ కవితలు సరిపోతాయి. అనేక సందర్భాలలో ఈ కవితలలోని వాక్యాలను పదేపదే తలుచుకొంటూ ఉంటాను.

సాహిత్యంలో దృక్పథాలు:
సాహిత్య విమర్శను పరిశీలిస్తే, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా ఒక సమ్యక్‌ దృష్టితో ఆర్‌.ఎస్‌.సుదర్శనం రాసిన ‘సాహిత్యంలో దృక్పథాలు’ ఒక ప్రామాణికమైన విమర్శనా గ్రంథం. ఆయన స్వయంగా కవి, కథ/నవలా రచయిత కావటంతో కవుల, రచయితల అంతరంగాలను అర్థం చేసుకుని, ఆవిష్కరించటం ఆయనకు సాధ్యపడి ఉంటుంది. సాంప్రదాయక, ఆధునిక సాహిత్యంతో బాటు పాశ్చాత్య సాహిత్యం మీద ఆయనకున్న విశేష అవగాహన, సహజసిద్ధంగా ఆయనలో ఉన్న తాత్వికమైన ఆలోచనా ధోరణి ఈ వ్యాసాలకు గాఢతనీ పరిపూర్ణతనూ చేకూర్చాయి.

Anna Karenina:
నేనిష్టపడే ఇతరభాషా రచనలలో టాల్‌స్టాయ్‌ Anna Karenina ముఖ్యమైనది. ఈ నవల మొదటి వాక్యం దగ్గరనించి, చివరిలో అన్నా ఆత్మహత్య చేసుకునే సన్నివేశం వరకు ఉదాత్తమైన రచనా విలువలతో సాగుతుంది. ప్రియునిపై ప్రేమ, అనుమానం, కొడుకు మీద ప్రేమ, సమాజంలో తను పొందే అవమానం మొదలైనవాటితో నలిగిపోయే ఆమె మాససిక సంఘర్షణని గొప్పగా ఆవిష్కరిస్తుంది. నవల చదువుతున్నంతసేపూ అయిపోతోందని బాధపడుతూ చదివిన నవల ఇదొక్కటే.

Prince of Tides:
చివరిగా, ప్రసిద్ధ అమెరికన్‌ నవలాకారుడు Pat Conroy రాసిన Prince of Tidesఅనే నవల గురించి. కథనంలో, పాత్ర చిత్రణలో, హై డ్రామా నిండిన సన్నివేశాల్ని నిర్వహించటంలో, ఇంగ్లీషు భాషని ఒడుపుగా ఉపయోగించటంలో Conroy చూపించిన ప్రతిభ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ వ్యంగ్య సంభాషణలు జరిపే కథానాయకుడు, చండశాసనుడైన అతని తండ్రి, ఆత్మహత్యా ప్రయత్నం విఫలమై mental asylumలో చేర్చబడిన కవయిత్రి చెల్లెలు– ఇలా గుర్తుండిపోయే పాత్రలెన్నో ఇందులో తారసపడతాయి. మేముండే ప్రాంతంలో ఎక్కువగా అభిమానించే southern identityని ప్రతిబింబిస్తుంది. ఈ నవల విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాగా కూడా రూపొందింది. ఈయన అనుభవాలు చదివితే మంచి రచయితే కాదు, మంచి వ్యక్తి కూడాఅని తెలుస్తుంది.
విన్నకోట రవిశంకర్‌
rvinnako@yahoo.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement