చినుకుదీవి
కవి: జి.వెంకటకృష్ణ; పేజీలు: 134; వెల: 100; ప్రతులకు: కవి, 87-1287-1, సోమిశెట్టి నగర్, కర్నూలు- 518002; ఫోన్: 8985034894
‘సహానుభూతితో రాసిన కవిత్వం కంటే స్వానుభూతితో రాసిన కవిత్వంలో సాంద్రత ఎక్కువుంది. ‘‘జిల్లేడు వనము లాంటి వెన్నెల’’ గురించి రాసినా, ‘‘కదిలొచ్చే బంగారు పంట లాంటి బిడ్డ’’ గురించి రాసినా, ‘‘భయం శరీరంలో విడుదలయ్యే రసాయనం- గుండె జారనీయొద్దు’’ అని తనకు తానే కాకుండా మనకందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా అన్నింటా పదాలు వాటంతటవే వచ్చిపడినట్టుగా ఉంటుంది. పార్కులో కాకుండా సహజమైన అడవిలో తిరిగినట్టుగా ఉంటుంది’.
వీరభద్ర విజయము
రచన: బమ్మెర పోతన; వ్యాఖ్యానం: కాశీభొట్ల సత్యనారాయణ; పేజీలు: 400; వెల: 225; ప్రతులకు: ఎస్.ఆర్. బుక్ లింక్స్, దానయ్య వీధి, మాచవరం, విజయవాడ-4; ఫోన్: 0866-2436959
‘వీరభద్ర విజయ గ్రంథాన్ని 1960లో కేవలం పద్యాలతో వావిళ్ల వారు ముద్రించారు’. అప్పట్నుంచీ పునఃముద్రణ జరగని ఈ ‘కావ్యంలోని పద్యాలకు తేలికగా అర్థమయ్యేలా భావాలందిస్తూ, వ్యాఖ్యానం కూడా చేర్చి’ కాశీభొట్ల సత్యనారాయణ ఈ పుస్తకాన్ని వెలువరించారు.
హార్ట్ టచింగ్ స్టోరీస్
అనువాదం: మల్లాది వెంకట కృష్ణమూర్తి; పేజీలు: 144; వెల: 125; ప్రతులకు: లిపి పబ్లికేషన్స్, గాంధీనగర్, హైదరాబాద్-80; ఫోన్: 9849022344
తన పుట్టినరోజుకు పాప ఇచ్చిన జడ పిన్నుల పాకెట్‌కు మురిసిపోయే తల్లి కథ... గ్రౌండ్‌ఫోర్లో బాత్రూమ్ కట్టివ్వమని భార్య ఎందుకు అడిగిందో ఎప్పటికో కాని అర్థంకాని భర్త కథ... ఇలాంటి 77 కథలున్నాయిందులో. ‘ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికాకి వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ‘ఫీల్ గుడ్’ కథలు మనసును తట్టేవి’.
నా రణం మరణం పైనే
కవి: డాక్టర్ సి.నారాయణరెడ్డి; పేజీలు: 212; వెల: 200; ప్రచురణ: సమున్నత్ ప్రచురణలు; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, 4-10435, బ్యాంక్ స్ట్రీట్, విజ్ఞాన్ భవన్, హైదరాబాద్-1.
‘నారాయణరెడ్డిగారు అనేక సంవత్సరాలుగా పుట్టినరోజును తమ కొత్త పుస్తకం పుట్టినరోజుగా జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయం ప్రకారం వారి జన్మదిన శుభసందర్భంగా (జూలై 29) వెలువ(డిన) సరికొత్త గ్రంథం ‘‘నా రణం మరణం పైనే’’. వస్తువైవిధ్యం, భావవైశిష్ట్యం, అభివ్యక్తిగరిమ సంతరించుకున్న 116 నూతన కవితల సంపుటి ఇది’.
ఆయుధం
రచన: టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి; పేజీలు: 264; వెల: 180; ప్రతులకు: రచయిత, 3-169-16, రామారావు కాలనీ, బాపూజీ మునిసిపల్ స్కూల్ ఏరియా, మదనపల్లె-517325; ఫోన్: 08571-221963
ఈ ‘నవలలో నడిచిన కథ 1940-2000 మధ్య దాదాపు అరవయి సంవత్సరముల కాలానికి పరిమితమైనది’. ‘ఆ రోజులలో పల్లె, గ్రామీణ ప్రజలు వారి జీవన విధానాలు, వృత్తులు ఎలావుండి ఎలా మార్పు చెందుతూ వచ్చాయో, ముఖ్యంగా యంత్ర వినియోగాలకు మునుపు వృత్తిపనులలో పని ఎంతటి శారీరక కష్టంతో కూడుకుని ఉండేదో దృశ్యమానం చెయ్యడానికి ఈ నవలలో ప్రయత్నం జరిగింది’.
చెమట పువ్వుల చెట్లు
వాళ్లకేం ఆశలుంటాయి
కొండోలొచ్చిన మబ్బుకొమ్మకు
కొన్ని చినుకు పూలుపూసి
నేల పొత్తిళ్లలో
జల్లులు జల్లులుగా కురవాలని...
వాళ్లకు పెద్దగా కలలేముంటాయి
బుసబుస పొంగిన భూమితల్లి
ఒళ్లోని పైరు శిశువుకు
తనివితీరా స్తన్యమిస్తున్నట్టు...
మహా అయితే
వాళ్లకు కోర్కెలేముంటాయి
ఫలసాయం పదిమందికీ చెంది
పల్లెలోగిలి పచ్చగా
నవ్వు మొఖంతో కళకళలాడాలని...
ఎందుకంటే వాళ్లు
మెతుకు రూపు కట్టడానికి
బతుకంతా ధారపోస్తున్న
చెమట పువ్వుల చెట్లు గనుక
- కొండి మల్లారెడ్డి
9441905525
కొత్త పుస్తకాలు
Published Mon, Sep 26 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement